ఒకజ్యోతి మరోజ్యోతికి

-ఆదూరి హైమావతి 

         ఆ రోజు ఏప్రిల్ ఫస్ట్. పవిత్రమ్మ తెల్లారక ముందే లేచింది. కాలకృత్యాలు ముగించి కాఫీ కప్పు పట్టుకుని బాల్కనీలో కూర్చుంది. ఆమెభర్త పరమేశ్వర్రావు మార్నింగ్ వాక్ కోసం లేచాడు. లేచి ఆయనకూ ఒక కప్పు కాఫీ కలిపి ఇచ్చింది. ఆదివారం కనుక మిగతా వారంతా అప్పుడే లేవరు. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.

         “ఏం పవిత్రా! నాతో మార్నింగ్ వాక్ కు వస్తావా! ఈ రోజు ఆదివారం ! అంతా అప్పుడే లేవరు కదా” అని అడిగాడు.

         “ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కదండీ!  మర్చిపోయారా!” “ఏప్రిల్ ఫస్ట్ ఐతే ఏం పవిత్రా మార్నింగ్ వాక్ కెళ్ళకూడదా!”

         “అయ్యో ! అదికాదండీ! ఈ రోజు  ఏప్రిల్ ఫస్ట్ “

         ” ఔను ఏప్రిల్ ఫస్ట్   ఐతే ఏమైందీ?”      

         ” అయ్యో! ఈ రోజు శివాని వస్తుంది కదండీ!ట్రైనింగ్ ఐపోయి!”

         “ఓహ్ అదా! చంపేశావ్, ఇంకేంటో అనుకున్నా! ఐతే ఏం శివాని వచ్చేసరికి పదన్నా ఔతుంది. రైల్ దిగాలా, మనింటికి రావాలా! రైళ్ళు వేళకెక్కడ నడుస్తున్నాయి పవిత్రా!”

         ” పోనీలెండి, మీరెళ్ళిరండి , నేను ఈ లోగా స్నానం అదీ చేసేస్తాను”  

         ” రైల్ దిగి మనింటికి రాక ఎక్కడికెళుతుంది పవిత్రా ! శివాని కోసం ఎదురుచూస్తూ   ఇలాగే వుంటావా!”

         ” మీరెళ్ళి వద్దురూ..”అంటూ కాఫీకప్పులు అందుకుని , మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లోనికి నడిచింది పవిత్రమ్మ.

         ఆమె మనసంతా శివానితో నిండివుంది. ఎప్పుడెప్పుడు శివానీ వస్తుందా ఎప్పుడెప్పుడు ఆమెను చూద్దామాని మనస్సు వువ్విళ్ళూరుతున్నది. ఎలా వుందో, ఏమో అని మనస్సు శివానీ ఆలోచనతో నిండి పోయింది, అప్పుడే చూసి ఎంతో కాలమైనట్లుంది ఆమెకు. 

***                           

         “పెద్దమ్మొగోరండా! మీ సీరా ఇటుపడేయండా, జాడించి ఆరేత్తాను” నూతి దగ్గర నుంచీ కేకేసింది పనమ్మాయి పార్వతి.

         “నా చెయ్యి వీలుగా లేదే వచ్చి తీసుకెళ్ళు ” అంటూ అదేస్వరం తో చెప్పింది పెద్దమ్మ పవిత్రమ్మ.

         “ఏంటమ్మొగోరూ! రోజంతా పని సేత్తనే వుంట్రు, కొంచేపు కూర్చోలేరాం డా!”అంటూ పార్వతి పెద్దమ్మగారి దగ్గర కొచ్చింది.

         పార్వతిని చూడగానే పవిత్రమ్మ వంటింటి గుమ్మంవద్దే ఆపి,” ఏమే పార్వతీ నీకెన్ని మార్లు చెప్పానే తిని పనిచేయమని. ఇంద ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుని పని పూర్తిచేయి.” అంటూ నాలుగిడ్లీలు , కొబ్బరి చట్నీవున్న ప్లేటు అందించింది.

         “ఏంటమ్మొగోరూ సెయ్యీలులేదని పిల్సి  టిపినీ ఎడతారా! పనెయ్యేక తినేద్దునుగదాండా!” అంటూ ప్లేటు అందుకుని గుమ్మం వద్దే కూర్చుని ఇడ్లీ తుంచి , చట్నీలో అద్దుకుని నోట్లో పెట్టుకుంది.

         “మీ సేతుల్లో అమురుతముందండా !పెద్దమ్మొగోరా! ఇడిలి ఇంకేడతిన్నా ఇంత కమ్మం గుండదండా!” అంటూ గబగబా తినేయసాగింది.  “ఇంద ఈ రెండూ కూడా తినేయి. మిగిలినాయ్!”అంటూ పవిత్రమ్మ పార్వతి ప్లేట్లో మరి రెండు ఇడ్లీలు పెట్టి , చట్నీ వేసింది.

         “పెద్దమ్మొగోరా! మీ రునం తీరదండా! కడుపు సూసి ఎడతారు.సల్లం గుండండమ్మా! మాలాంటోల్లని సూసేటికి” అంటూ కళ్ళ నిండానీరు నింపుకుంది.

         “ఏంటే పార్వతీ ! పిచ్చా ఏమే! పనిచేసే వాళ్ళకే గదే పెట్టాలి? నీవు వచ్చి ఉదయం నుంచీ ఇంత ఇల్లు శుభ్రంచేసి ఇందరి బట్టలూ ఆరేసి , పెరడంతా శుభ్రం చేసి  ఎన్ని పనులు చేస్తున్నావ్! ఇల్లు ఇంత అందంగా వుందంటే అదంతా నీవల్లే కదే పార్వతీ! కప్పు తెచ్చుకో కాఫీపోస్తా.?” 

         ” పెద్దమ్మొగోరా! ఇన్నిడిలీలూ తిని కడుపు నిండి పోయేనండా, ఆనకా తాగతాలేండా!” అంటూ లేచి నూతి దగ్గర కెళ్ళింది పార్వతి. 

         “సరి సరి. ఇడిలీ లేంటే పార్వతీ! ఎన్ని మార్లు చెప్పానే! ఇడ్లీ ఇడ్లీ అన మని. ఏదీ ఒక్క మారు అనూ” నూతి దగ్గర కొచ్చి , తన బట్టలు వుతకను పార్వతికి ఇచ్చి అంది పవిత్రమ్మ.  

         “ఏదో లేండమ్మగోరా!”అంటూ తప్పించుకోబోయిన పార్వతిని “కాదు కాస్త మంచి భాష నేర్చుకోవే పార్వతీ ! ఈ రోజుల్లో మీ వాళ్లంతా ఎంత స్టైల్గా వుంటున్నారు ! ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సెల్ ఫోన్లు వాడుతున్నారు. నీవేమో ఇంకా పాతకాలం లాగానే మాట్లాడుతావు. ఈ రోజు నుంచీ నీకు రోజుకో మాట నేర్పుతాను సరా! “

         “వుండండమ్మొగోరా ! నాకేటికి! ఎట్టా మాటాడితేనేమమ్మగోరా! మీరున్నరు నన్ను సూసేటికి.”

         “అదికాదే పార్వతీ!  ప్రయత్నించాలే నాకు రాదనికూర్చుంటే ఎలా! ‘కృషితో నాస్థి దుర్భిక్షం ‘అని  రోజుకోమాట నేర్చుకో నా మాట విను “

         ” ఐనా మాలాంటోల్లకెట్టా సదువొత్తదండా! అది మీలాంటో ల్లిల్లల్లో  పుట్టినొల్లకే కదండా!”అంది పార్వతి.

         “పార్వతీ! నీకెంత చెప్పినా అర్ధం కాదే! సరేకానీ ఈ రోజు నేను కొన్ని విత్తనాలు నాటాలనుకుంటున్నాను, నీ చేతిలో పనయ్యా క చెప్పు. విత్తనాలు తెస్తాను” అంటూ వంటపనిలో పడింది ఆమె. పార్వతికి మరో గంట పడుతుంది బట్టలారేసి పెరడు చిమ్మను, ‘ఈలోగా వంటచేసేసు కుంటే సరి ‘ అనుకున్నారావిడ. 

         పవిత్రమ్మ ఇంట్లో పెళ్ళిళైన ఇద్దరు కొడుకులూ, భార్యా బిడ్దలతోనూ, పెళ్ళిచేసుకోని ఆమె మరిది, తల చెడిన ఆడ పడుచూ అంతా ఆ ఇంట్లోనే మొదటి నుంచీ వుండేవారు. అంతా ఉదయం టిఫిన్లు తినేసి వెళ్ళి , మధ్యాహ్నాలు ఆఫీసు క్యాంటీన్లో లంచ్ చేసేసి సాయంత్రం ఐదు తర్వా త ఒక్కోరూ ఇంటికి వస్తారు. భర్త రిటైరయ్యాక ఏదో ప్రైవేటు కంపెనీలో కాలక్షేపానికి ఉద్యోగంలో చేరాడు.

         ఉదయం ఆ యింట పెళ్ళిసందడే! అందరికీ టిఫిన్లూ, కాఫీలూ, టీలూ, పాలూ ,ఇలా ఎవరికి కావల్సినవి వారికి చేతికి అందిస్తుంది ఆమె. ఆమె కూడా స్కూల్ టీచరుగా పని చేసి పదేళ్ళ క్రితం విస్రాంతి పొంది ప్రస్తుతం ఆదర్శ మహిళగా ఇల్లు చక్కబెడు తున్నారు. మధ్యాహ్నం తన కొక్కర్తేకే లంచ్, దేవునికి చేయి చూపను ఏదో ఒక కూరో, పప్పో చేసుకుంటుంది. సాయంకాలం ఎవరొచ్చినపుడు వారికి రాగానే కమ్మని స్నాక్ అందిస్తుంది. అలాంటి ఉమ్మడి కుటుంబంలో  పార్వతి పని చేయను గతేడాది కుదిరింది. ఆమెకు తమ ఇంట్లో సర్వెంట్ క్వార్టర్స్ ఇచ్చారు వుండను.

         పార్వతి చాలాచురుకైన పిల్ల. ఒక్కమారు పని ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పేస్తే చేసేస్తుంటుంది. చాలా తక్కువ మాట్లాడుతూ వుంటుంది. అందరిపట్లా చాలా గౌరవంగా వుంటుంది. లేచింది మొదలు చలాకీగా తిరిగేస్తూ ఎవరికి కావాల్సినవి వారికి అందిస్తూ స్వంత ఇల్లులాగా పని చేసుకు పోతుంటుంది.   

         మధ్యాహ్నం తాను తిని, పార్వతికీ కడుపునిండా ఇంత పెడితే తిని కబుర్లు చెప్పి వెళ్ళి తనూ కాస్తంత విశ్రాంతి తీసుకుని, మూడింటికే వచ్చి పనిలో వాలుతుంది పార్వతి. 

         పార్వతి పనయ్యాక పవిత్రమ్మని పిలవగా, ఆమె చాలా విత్తనాలు తెచ్చి, తానూ పార్వతితో కలిసి త్రవ్వి అన్నీ పార్వతి చేత నాటించారు. నీరు పోశారు. అలా రోజూ  నీరుపోయడం మొక్కల్ని చూట్టం, పార్వతికి మధ్యాహ్నం ఇద్దరి భోజనాలూ అయ్యాక  ఒక్కోమాట తెలుగు, ఆంగ్లంలోనూ నేర్పడం మొదలెట్టారావిడ. పార్వతికి బలవంతపు మాఘస్నానంలా ఐంది. ఐనా పవిత్రమ్మంటే వున్న భయభక్తుల వల్ల తప్పనిసరై నేర్చుకోసాగింది.

         ఆరోజు మొక్కలను చూస్తూ నీళ్ళుపోస్తున్న పార్వతి దగ్గర కొచ్చి “చూశావా! పార్వతీ! నీవు పెట్టిన విత్తులెలా మొలిచాయో! చూడూ మొదట విత్తనం విడిపోయి రెండాకులు వచ్చాయా! అది మెల్లిగా పెరుగుతూ ఒక్కో ఆకూ వేస్తున్నది. మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయి. అటు వైపు కూరపాదులు చూడూ ఎలా తీగలు వస్తున్నాయో!”  అంది పవిత్రమ్మ.

         “అమ్మగారండీ! ఇటు వైపు వేసిన మొక్కలు ఎందుకు సరిగా పెరగడం లేదండీ!” అని అడిగింది పార్వతి. ఆమె మాటలు నాగరికం అవుతుండటం గమనించిన పవిత్రమ్మ ముఖం దివిటీలా వెలిగింది. సంతోషాన్ని మనస్సులోనే దాచుకుని “పార్వతీ! మొక్కలు పెరగను ఎండ, నేలలో బలం, అంటే ఎరువు, తగినంత నీరూ అవి ఎదిగేప్పుడు పక్కకు పడకుండా  మనం కర్రలు కట్టాం కదా! అటువైపు వేసిన పొట్ల, బీర, కాకర, చిక్కుడు పాదులకు ఏం చేశామూ? పందిరిపెట్టాం, అందుకే అవి గబగబా పై పైకి పాకుతున్నాయి. ఇటు దక్షిణంపక్క వేసిన వాటికి ఎండ తగలక అవి సరిగా పెరగడం లేదు. మన పెద్ద పూలచెట్ల నీడా, కరివేప చెట్టు నీడా వాటిమీద పడుతున్నది. ఇహ మనం పడమర వేసిన వాటికి ఎండెక్కువై వాడిపోతున్నా యి, తూర్పు వైపు, ఉత్తరం వైపూ వేసిన మొక్కలు చక్కగా పెరుగుతున్నాయి. మొక్క పెరగాలంటే  తగినంత ఎండ, నీరు, నేలలో సారం వుండాలి, వాటిని సరిగా సంరక్షించాలి. అలాగే చదువు రావాలంటే, శ్రధ్ధ, ఓపిక, నేర్చుకోవాలనే తపనా ఉండాలి. చూడూ ఈ రెండు నెలల్లోనే నీ మాటలెలా నాగరికంగా మారాయో! చదువు మా కుటుంబం, నీ కుటుంబం అని వుండదు పార్వతీ!  శ్రధ్ధ, పట్టుదల ముఖ్యం, చూడూ నీ చేత బి.ఏ పాస్ చేయిస్తాను, నా మాట వింటూ కాస్తంత శ్రధ్ధ పెట్టు చాలు. నీవు చాలా తెలివైన దానివి. చక్కగా మాట్లాడుతున్నావు. తప్పక ఉద్యోగంలో చేరతావు, దర్జాగా బతుకుతావు ” అంటూ ప్రోత్సాహకరంగా మాట్లాడారావిడ. పార్వతి ముఖం వెలిగిపోయింది తారాజువ్వలాగా. చదువుపట్ల శ్రధ్ధ పెరిగి పార్వతి పనంతా గబగబా చేసేసి పవిత్రమ్మ దగ్గర కూర్చుని రాయడం, చదవడం తెలుగు, ఆంగ్లమూ, లెక్కలూ అన్నీ వడివడిగా నేర్వసాగింది. ఆమె ప్రజ్ఞ బయటపడి పవిత్రమ్మనే ఆశ్చర్యపరచాయి. అలా రోజులు నడుస్తున్నాయి.

         కాలస్వరూపుడైన దైవం అన్నీ గమనిస్తూ సాగుతున్నాడు. గంటలు, రోజులుగా, వారాలుగా, నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి. పార్వతి చకచకా వ్రాయనూ, చదవనూ నేర్చింది. గణితంలో దిట్ట ఐంది.

         ఇంట్లోవారితో పవిత్రమ్మ ప్రోత్సాహంతో ఆంగ్లంలో మాట్లాడ సాగింది. అంతా  ఆశ్చర్యపోయారు.”ఏంటీ! పార్వతీ ! ఆర్ యు టాకింగ్ ఇన్ ఇంగ్లీష్! “అని పవిత్రమ్మ భర్త పరమేశ్వర్రావూ, కొడుకులూ, కోడళ్ళూ ఇంటిల్లిపాదీ పార్వతిలో వచ్చిన మార్పుకు , నాగరీకపు మాటలకూ  ఆశ్చర్యపోయారు. పవిత్రమ్మ ట్రైనింగ్ ను మెచ్చుకున్నారు. పవిత్రమ్మ పార్వతిచేత ఇంటిపని చేయించనన్నాక పార్వతి తనకు తెలిసిన మరో మనిషిని ఇంట్లోపనికి ఏర్పాటు చేసింది. పవిత్రమ్మ కొని తెచ్చిన అందమైన చీరలు కట్టుకోడం నేర్చుకుంది. పార్వతిని ఎవ్వ రూ గుర్తించలేనట్లు తయారైంది. అసలే మంచి  శారీర ఛ్చాయ, దానికి తగ్గట్లు కట్టు, బొట్టు, జుట్టుల్లో మార్పు రావటాన ఎవ్వరూ పాత పార్వతంటే నమ్మేలా లేదు. మొదటి నుండీ వినయమే ఆమె భూషణం, అందుకే సరస్వతీమాత కరుణ లభించింది. ‘ఫరవాలేదు దాటగలదు’ అనుకున్నాక  పవిత్రమ్మ పార్వతి చేత బి.ఏ. కట్టించింది ప్రైవేటుగా. భేషుగ్గా పాసైంది. నాజూకుగా తయారైంది. పార్వతి బీ.ఏ పట్టా పొందింది. మంచి మార్కులు కూడా వచ్చాయి. దానితో ఆగకుండా పవిత్రమ్మ పార్వతిచేత రాత్రింబవళ్ళూ చదివించి పోటీ పరీక్షలకు వ్రాయించింది. పార్వతి  గ్రేడ్ టూ కు సెలెక్టై  ట్రైనింగ్ కోసం వెళ్ళింది. 

***

         పవిత్రమ్మ స్నానంచేసి పూజపూర్తి చేసుకుని హారతి ఇస్తుండగా డోర్ బెల్ మోగింది. గబగబా హారతి పళ్ళెంతోనే వెళ్ళి తలుపుతీసింది. ఎదురుగా నాజూకుగా, బొమ్మలా నిల్చునున్న శివానీనీ చూసి ఆశ్చర్య పోయింది. శివానీ వంగి పవిత్రమ్మ పాదాలకు నమస్కరించింది.

         “నీ కోసమే ఉదయం నుంచీ ఎదురు చూస్తున్నాను శివానీ! ఎంత బావున్నావ్!”

         “అమ్మా నన్ను మీరు ‘పార్వతీ’ అనే పిలవండి. నన్ను ఈ ఊరిట్రెజరీ ఆఫీసుకే ఆఫీసర్ గా వేశారమ్మా! మీ దీవెనలు అందుకుని మంచి రోజు మీరుచెప్తే డ్యూటీలో చేరుతాను “అంటూ క్రింద కూర్చోబోయిన పార్వతిని చేత్తో లేపి సోఫాలో కూర్చోబెట్టింది పవిత్రమ్మ. పక్కనే కూర్చుని  ” పార్వతీ! నీవిపుడు పాత పార్వతివి కావు, శివానీవి. అందుకే నీ పేరు మార్చి రాయించాను, ఈ కొత్త పేరుతో కొత్త జీవనం ఆదర్శంగా గడుపుతూ మరి కొందరికి మార్గదర్శివి కావాలి.” అంది.

         “అమ్మా! ఇది మీరు తీర్చిదిద్దిన జీవితం, అంట్ల గిన్నెలు తోముకుంటూ , బట్టలు ఉతుక్కుంటూ జీవించాల్సిన నన్ను ఇలా చదువు చెప్పించి, ఆంగ్లం నేర్పించి , నవ నాగరికంగా మార్చి, ఈ రోజు మంచి ఉద్యోగం కూడా చేసుకునేలాగా తీర్చిదిద్దిన, మీరు నాకు మరో జన్మనిచ్చిన తల్లి. నా జీవన జ్యోతి. మీరే నా దేవత అమ్మా!” అంటూ ఉద్వేగంగా పాదాల మీద తలపెట్టిన పార్వతిని, అదే శివానీని దీవిస్తూ ఉండి పోయింది పవిత్రమ్మ. ‘ ఒకజ్యోతి మరొకజ్యోతిని వెలిగించాలి. వెలుగు పంచాలి.’

***** 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.