నారి సారించిన నవల-40

                      -కాత్యాయనీ విద్మహే

అనంతం నవల బెంగుళూరుకు గవర్నర్ గా వెళ్తున్న మూర్తిగారి వెంట రాజీ సిమ్లా నుండి బయలుదేరి ఢిల్లీ రావటం దగ్గర ప్రారంభం అవుతుంది. ఢిల్లీలో హిమాచల్ భవన్ లో విడిది. రాజ్యసభ సభ్యురాలు ధనశ్రీ, సాంగ్ అండ్ డ్రామా విభాగం నుండి కుముద్ ఆమెతో పాటు సుశీల వస్తారు గవర్నరుగారిని కలవటానికి. సుశీల మంచి గాయని అని రాజీ పోస్టులో పనిచేస్తున్నదని, వనజ బంధువర్గంలోనిది. రాజ్యసభ సెక్రటేరియట్ అధికారులు వచ్చిపోయారు. సాయంత్రం విమానానికి బెంగుళూరు వెళుతున్న గవర్నర్ దంపతులతో పాటు రవికాంత్ కూడా ప్రయాణం అయ్యాడు. రాజభవన్ చేరుకొనటంతో రాజీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. రాజభవన్ వ్యవహారాలు చూసే డిప్యూటీ సెక్రటరీ జానకితో కలిసి రాజీ రాజభవన్ లోపల, చుట్టూ చేసిన పర్యటన యొక్క విపుల  వర్ణన పాఠకులను కూడా ఆ పర్యటనలో భాగం చేసి గొప్ప అనుభూతిని పొందేట్లు చేస్తుంది.

గవర్నర్ గారి భార్య వనజకు హిమాచల్ ప్రదేశ్ వైద్యంతో చెయ్యి స్వాధీనంలోకి రాగా లేచి నడవగలిగిన స్థితికి రావటం కోసం కాళ్ళకు బెంగుళూరులో ఆ వైద్యాన్ని కొనసాగించే ఏర్పాట్లు చూడటం, నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా ఉత్సాహంగా ఉంచేందుకు తనో కాకపోతే జానకినో ఆమెను కనిపెట్టుకొని ఉండేట్లు శ్రద్ధ తీసుకొనటం, గవర్నర్ దంపతుల కు అనుకూలంగా వంటలు ఉండేట్లు పర్యవేక్షించటం, రాజభవన్ మరమ్మత్తు పనులను చేపట్టటం, అందగింపచేసే కొత్త నిర్మాణాలు చేయించటం, అధికారులతో, విదేశీ ప్రతినిధులతో సమావేశాలు, విందులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, రెడ్ క్రాస్ శాఖలను ప్రతి జిల్లాలో బలోపేతం చేయటం, గవర్నర్ పర్యటనల పర్యవేక్షణ మొదలైనవి గవర్నర్ ఆంతరంగిక కార్యదర్శిగా నిబద్ధతతో ఆమె చేసిన పనులు. ఇదంతా గవర్నర్ విధులకు, రాజభవన్ పాలనా వ్యవస్థకు సంబంధించిన సమాచార సర్వస్వం.

దీనిని నవలగా మార్చిన మానవ సంబంధాల సూత్రం రాజీకి వనజ పట్ల , రవికాంత్ పట్ల కలిగిన అనుకంపమే. సంపన్న కుటుంబీకురాలు, సౌందర్యవతి, విద్యావతి, ప్రేమించే భర్త, ఆయనకు అత్యున్నత అధికార హోదా ఉండి కూడా ప్రమాదంలో కొడుకును కోల్పోయి, కాళ్ళుచేతులు చచ్చుబడి తన పై తాను జాలి పడుతూ, నిరాశ నిస్పృహలకు లోనవుతూ నిస్సహాయ దుఃఖంలో ఉన్న వనజకు గవర్నర్ భార్య అని బాధ్యతగా సేవలు అందించటం మాత్రమే కాక రాజీ అనుక్షణం తన ఆలోచనను , సృజనను ఆమెకు నైతిక ధైర్యాన్ని ఇయ్యటానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచటానికి ఉపయోగించటంలో పని చేసింది అవ్యాజమైన ఆ కరుణే. రాజీకి సహజంగా నిర్మాణం ఇష్టం. రాజభవన్ నిర్మాణ పనులు చేపట్టటమే కాదు వ్యక్తినిర్మాణం కూడా ఆమె అభ్యాసకళ. తల్లి, తమ్ముడి చేతిలో తన చేయి పెట్టి మరణిస్తే అది పెళ్ళి కాదు అని మామయ్య చేసిన నిర్ణయం ఆమెను లో లోపల ఎక్కడో గాయపరిచింది. ఆ క్షణంలో కలిగిన ఒంటరి భావన నుండి బయటపడి తనను తాను నిలబెట్టుకొనటానికి ఆమె అసహాయశూరురాలిగా చేసిన ప్రయాణం అంతా ఆమె వ్యక్తిత్వ నిర్మాణ కౌశల లక్షణమే.   పెళ్లయి పిల్లలున్న అనంత్ తో ప్రేమను గురించి కానీ, విదేశంలో తన పై జరిగిన అత్యాచారం గురించి కానీ అవమాన కరమని కృంగిపోకుండా, వాటిని సహజ మానవ చర్య ప్రతిచర్యలుగా స్వీకరించ గలిగిన గుండెనిబ్బరం సంపాదించుకొనటమైనా, కరుణాకర్ స్నేహితురాలు అన్న కారణంగా ఎమర్జన్సీ సమయంలో రహస్య విచారణకు, హింసకు గురికావటం గురించి వలపోస్తూ బ్రతుకు దుర్భరం చేసుకోకుండా ఉద్యోగ జీవితంలో కొత్త కొత్త పదవులు చేపడుతూ సవాళ్ళను ఎదుర్కొంటూ తన శక్తి సామర్ధ్యాలను నిరూపించు కొంటూ, ప్రతిచోటా తన ముద్రను వెయ్యటం కానీ అందులో భాగాలే. ఇదంతా తనతో తాను, తనలో తాను చేసిన యుద్ధపు విజయమే. బహుశా ఈ కారణం వల్లనే  ఆమెకు కష్టంలో ఉన్నవాళ్లకు ఆసరాగా నిలబడవలసిన అవసరం గురించిన అవగాహన ఒక విలువగా అందివచ్చి ఉంటుంది. రవికాంత్ అన్నట్లు అనుక్షణం తనను తాను రక్షించు కొనటానికి  కాఠిన్యం ఆమె కప్పుకున్న కవచం అనుకున్నా ఆమె ఆంతర్యం కరుణా మయం. ఆ కరుణా లక్షణం వల్లనే తనపట్ల అపచారం చేసిన ఎవరిపట్లా కోపం ఆమెలో వేరూనుకో లేదు. అందరినీ దయగా క్షమించేసింది. ఆ కరుణాలక్షణం వల్లనే వనజకు   చేయి స్వాధీనానికి వస్తే  సంతోషపడిపోయింది. ఆమె కాలును బాగుచేయించి నడిపించటానికి ఆత్రుతపడింది. వనజ మానసికంగా శారీరకంగా పునర్నిర్మాణం చెందు తుంటే క్షణక్షణం ఆ అభివృద్ధిని చూసి ఆనందించింది. ఆమె ఆరోగ్యం కోసం రవికాంత్ ఆరోగ్యం కూడా ఆమెకు అక్కర అయింది.

రవికాంత్ వనజకు పెదతల్లి కొడుకు. ఆత్మీయ స్నేహితుడు. మూర్తిని తాను ప్రేమించిన విషయం అతనికే చెప్పింది. మూర్తికి అతను స్నేహితుడు కూడా కావటంతో వాళ్ళ పెళ్ళికి అతనే పెద్ద అయినాడు. కులాంతర వివాహమని తల్లిదండ్రులు తిరస్కరించిన సమయాన వాళ్లకు అండగా నిలబడ్డాడు.యాక్సిడెంట్ లో కొడుకును కోల్పోయి, కాళ్ళూ చేతులూ చచ్చుబడి నిరాశ నిస్పృహలతో ఉన్న వనజకు ధైర్యం ఇచ్చాడు. ఆమెకు బలమైన వ్యక్తిత్వం కల తోడు ఉంటే కోలుకొంటుందని రాజీని గవర్నర్ అయిన మూర్తికి ఆంతరంగిక కార్యదర్శిగా ఉండటానికి ఒప్పించాడు. వనజ పట్ల అతనికి ఉన్న ఆత్మీయ సంబంధం అది. అందుకే వనజకు అతను అపురూపం. బెంగుళూరులో  గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయటానికి వెళ్తున్న మూర్తి దంపతుల వెంట అతను కూడా ఉండటం ఆ అపురూప బంధం వల్లనే.

ఒకప్పుడు పార్లమెంటులో అధికార పక్షంలో ఉండి ప్రాభవం నెరిపిన రవికాంత్ రాష్ట్ర రాజకీయాలలోకి రావటం ఇష్టం లేక ఖాళీగా ఉన్న సమయం అది. అలా ఉండటం హాయిగా ఉందంటూ “ కొన్నాళ్ళు గవర్నర్ గారి అతిథిగా, కొన్నాళ్ళు నా భార్యామణి అతిథిగా కాలం గడిపేస్తే పోలా …. మరీ విసుగొచ్చినప్పుడు సోమసుందరి పరిశ్వంగంలో గడిచిపోతుంది హాయిగా” అంటాడు. ఆ మాటలలోని ఒంటరితనం, కాఠిన్యం వనజను నొప్పించాయి. నిన్ను నువ్వు నాశనం చేసుకొంటున్నావ్ అని ఏడ్చినంత పనిచేసింది. ఆమె స్పందన  చూసాక  రాజీ అతనితో ప్రత్యేకంగా మాట్లాడాలని అనుకొన్నది. మాట్లాడింది. వనజ కాలు సరిచేయటానికి మర్నాటి నుండి ప్రారంభమయ్యే వైద్యం సరైన ఫలితం ఇయ్యాలంటే ఆమెకు మనశ్శాంతి అవసరమని అతని తాగుడు ఆమె మనః శాంతిని హరిస్తుందని అందువల్ల తాగటం  తగ్గించుకోమని సూచించింది. వనజలో అప్పుడప్పుడు తలెత్తే అధికార అహం తనకు కష్టం కలిగించేదే అయినా దానిని మనసు లో ఉంచుకొనకుండా ఆమె ఆరోగ్యం కుదుటపడటానికి చిత్తశుద్ధితో పని చేసే రాజీని నడిపించినది కరుణ సూత్రమే. కరుణ వల్ల రాజీ వ్యక్తిత్వంలో వచ్చిన పరిణితి రవికాంత్ కోసం ఆమెను దుఃఖించేట్లు చేసింది.

రవికాంత్ రాజీకి కొత్తవాడేమీ కాదు. ఢిల్లీలో సాంగ్ అండ్ డ్రామా శాఖ ఉద్యోగంలో ఉండగానే తన మేనమామ స్నేహితుడుగా పరిచయం చేసుకొని అప్పడప్పుడు ఇంటికి వచ్చి పోతుండేవాడే. ఎమర్జన్సీ చీకటి రోజులలో తన విడుదలకు అతను పూనుకొని పనిచేయటమూ తెలుసు. తన ఉద్యోగ జీవితపు ప్రతి మలుపులో శ్రేయోభిలాషిగా అతనిచ్చిన ప్రోద్బలమూ తెలుసు. తనపట్ల అతని ఆకర్షణ ఆమెకు అర్థం అవుతూనే ఉంది. దూరంగా పెట్టె ప్రయత్నమూ చేసింది. గవర్నర్ ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన అయిదేళ్ల  కాలంలో వనజకు అన్నగా రాజభవన్ కు తరచు అతిథిగా వచ్చి ఉండే క్రమమంలో వనజకు రవికి ఉన్న సోదర స్నేహ సంబంధం గమనిస్తూ అతనిని సన్నిహితంగా పరిశీలిస్తూ వచ్చిన రాజీకి అతని పట్ల హృదయపు ఏ మూలనో పొడ చూపిన దయా బీజం ఆమెకు తెలియకుండానే మొలకెత్తి విస్తరించటం జరిగింది. అక్కగారి మనశ్శాంతి కోసం తాగడం తగ్గించమని కోరిన తరువాత ఒక సందర్భంలో అతని ముఖం చూసి అతని ఒంట్లో బాగున్నట్టు లేదని గ్రహించి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించమని హెచ్చరించింది. రాజకీయాలలో చురుకుగా లేకపోవటం వల్ల ఏమీ తోచక ఎక్కువగా తాగుతున్నాడేమో అది అతని అనారోగ్య హేతువేమో అన్న అనుమానాన్ని అతని ముందు వ్యక్తం చేసింది కూడా. వనజా రవికాంత్ లను మరిచి పోయి తన పని సంగతి ముందు చూసుకోవాలి అని రాజీ అనుకొనటంలో వారిద్దరూ ఆమె ఆలోచనలను ఎంతగా ఆక్రమించుకొన్నారో తెలుస్తుంది.

రవికాంత్ రాజ్యసభ సభ్యుడై వనజ దగ్గరకు వచ్చేటప్పటికి అతని ముఖంలో పూర్వపు కళ తగ్గటం గమనించింది రాజీ . తాగుడు మరీ ఎక్కువైనట్లుంది అని అనుకొంది కూడా. మళ్ళీ సారి అతను వచ్చేటప్పటికి అతని ఆరోగ్యం ఏమీ బాగున్నట్లు లేదు అన్న నిర్ధారణకు వచ్చింది. డొక్కలో పోటుతో బాధపడుతున్నాడు అంటే డాక్టర్ ను పిలిపిస్తే కిడ్నీలో రాళ్లు ఉండవచ్చని డాక్టర్ అనుమానం వ్యక్తం చేసాడు. పరీక్షలు జరిపితే లివర్ కాస్త పాడైనట్లు తెలిసింది. మిగిలిన పరీక్షలు ఢిల్లీ వెళ్ళాకో , హైదరాబాద్ వెళ్ళాకో చేయించుకోవచ్చు అంటూ హాస్పిటల్ నుండి వచ్చేసిన రవికాంత్ ఇదంతా వనజకు తెలియటం ఆమె ఆరోగ్యానికి అంత మంచిది కాదని రాజీకి చెప్తాడు. ఏమీ లేదు కాస్త సోమపానం తగ్గించమన్నారు అని వనజను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆమె భర్త ఏమై పోతున్నాడో పట్టించుకోకుండా పిల్లలు, డబ్బు అంటూ రవికాంత్ ను మరిచిపోయిన భార్య సరోజను తిట్టటం మొదలు పెట్టింది. తన దగ్గరకు వచ్చి ఉండటానికి అహం అడ్డువస్తే అతను మరెవరినైనా చేసుకొన్నా తనకేమీ అభ్యంతరం లేదని ఆమె అన్నమాటను ప్రస్తావిస్తూ సరోజను నిందించింది. రవికాంత్ భార్య ప్రస్తావన ఇంతకు పూర్వభాగాలలో వచ్చినా ఆమె ప్రత్యక్షంగా  కనబడేది ఈ భాగంలోనే.

రవికాంత్ పరిస్థితి సీరియస్ గానే ఉందని , అంత తొందరగా మందులకు తగ్గే జబ్బు కాదని తెలిసిన గవర్నర్ వెంటనే  సరోజను అక్కడకు పిలిపించకుండా ఉండలేక పోయాడు. ఆమెతో వనజ ఘర్షణ పడుతుంటే అతను తన ఆరోగ్యం సంగతి చూసుకో లేనంతటి పసివాడా అన్నది సరోజ వాదన. రాజకీయాలు తప్ప భార్యాపిల్లలు పట్టని అతని ప్రవర్తన పై ఆమె ఫిర్యాదులు ఆమెవి. పరిశ్రమల నిర్వహణ బాధ్యత పెద్ద కొడుకుకి అప్పగించి రావటానికి మూడు నెలలు పడుతుందని అప్పుడువచ్చి అతని సంగతి చూసుకొంటానని చెప్పి వెళ్ళింది ఆమె. ఆ ఘర్షణాత్మక సందర్భంలో రాజీ ఇంటికి వచ్చిన రవికాంత్  లివర్ దెబ్బతిన్న విషయం తనకు తెలుసనీ ఎప్పుడో ఒకప్పుడు తప్పని చావుకు తెలిసి తానుసిద్ధమవుతున్నానంటూ నవ్వుతూ చెప్తుంటే రాజీ కళ్ళల్లో నీళ్లు  తిరగటం గమనించాడు అతను “ఫరవాలేదు. నేను చచ్చిపోతే మీరూ రెండు కన్నీటిబొట్లు రాలుస్తారని నమ్మకం కలిగింది” అని అతను వెళ్ళిపోయాక రాజీ భోరున ఏడ్చిందంటే అచ్చమైన కరుణ, మానవత్వం మేల్కొన్న లక్షణం వల్లనే.

రవికాంత్ అనారోగ్యం కలిగిస్తున్న ఆందోళనతో గవర్నర్ రాజీని పిలిచి మాట్లాడుతూ తనకంటే నాలుగేళ్లు చిన్నవాడైన రవికాంత్ తనను తాను నాశనం చేసుకొనటం గురించి బాధపడుతూ అందుకు కారణం సరోజ ఒక్కతే కాకపోవచ్చు అంటూనే వనజ ఆమెనే కారణంగా చూపిస్తున్న సంగతి ప్రస్తావించాడు. అదే ఆయన అభిప్రాయం కూడా అన్నట్లు ఉన్నాయి “భార్య దగ్గరుండి చూసుకోకపోతే భర్త దురలవాట్లకు లోనయ్యే అవకాశం ఉంది. తన ఒంటరితనాన్ని మరిచిపోవటానికి తాగుడు మొదలు పెట్టి ఉంటాడు” అని ఆయన అన్న మాటలు. రవికాంత్ తెలిసినట్లుగా సరోజ తనకు తెలిసిన వ్యక్తి కాకపోయినా , రవికాంత్ జబ్బు పట్ల తనకు ఎంత దుఃఖం ఉన్నా “ ఇంతకంటే  ఒంటరితనంతో బాధపడే స్త్రీలున్నారు. వాళ్ళిలా దిగజారిపోరు. నిజానికి పురుషుడుకంటే స్త్రీయే ధైర్యంగా ఎదుర్కొంటుంది గడ్డు పరిస్థితుల్ని” అని  చెప్పగల అనుభవం , దృక్పథం ఆమెది.

మృత్యు ముఖంలో ఉండి కూడా ఫోనులోనైనా ప్రత్యక్షంగానైనా రవికాంత్ మాట్లాడే తీరు రాజీని దుఃఖపు వెల్లువలో ముంచేస్తూనే ఉంటుంది. ఈ క్రమమంలో ఆమె అతనిని తన ప్రాణస్నేహితుడిగా సంభావించే స్థితికి రావటం ఆమె చిత్థవృత్తిలో వచ్చిన ఒక పరిణామం. బెంగుళూరు నుండి గవర్నర్ పదవి ముగిసి హైదరాబాదుకు గవర్నర్ దంపతులతో పాటు వచ్చిన రాజీ మళ్ళీ తన పూర్వపు రాజ్యసభ కార్యాలయ ఉద్యోగంలో చేరటానికి ఢిల్లీకి విమానంలో బయలుదేరటంతో ఈ నవల ముగుస్తుంది. రాజీ తరువాతి జీవితం ఎలా ఉంటుంది? రవికాంత్ ఎంతకాలం బతుకుతాడు? రవికాంత్ అనుకున్నట్లు  శీతాకాలపు సమావేశాలకు హాజరవుతాడా? మొదలైన ప్రశ్నలకు సమాధానంగా మళ్ళీ రాజీ జీవిత గమనాన్ని నిరూపిస్తూ మరొక నవల వ్రాయవచ్చు. కానీ జీవితం మానవ ఆశలు, ఆకాంక్షలు, ఆకర్షణలు, ఆదర్శాలు, ప్రేమలు, ద్వేషాలు, మమతలు, మాయలు, సంవేదనలు,సంఘర్షణలు, స్థిత ప్రజ్ఞత మొదలైన అనేకానేక స్థితులలో భావోద్వేగాలతో  అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ జీవిత సత్యాన్ని సూచించటమే అనంతం నవల ముగింపులోని అర్ధం.

రాజీతో మొదలైన నవలా చతుష్టయం దీనితో ముగిసింది. కుటుంబజీవితం అనేది లేకుండా నాలుగు నవలలకు ఇతివృత్తాన్ని సామజిక రాజకీయ ఉద్యోగజీవిత సంబంధా లలో స్వతంత్ర వ్యక్తులుగా నిలబడటానికి, తమను తాము నిరూపించు కొనటానికి అతి సహజంగా  స్త్రీలు చేసే ప్రయత్నాలను, సాధించే విజయాలను నిరూపిస్తూ ఇలాంటి నవలలు వ్రాయటం విఎస్ రమాదేవి తప్ప మరొకరు చేసినట్లు కనబడదు.

రమాదేవి నవలలో చివరిది సంసారసాగరాలు. 2006 జులై చతుర నవలగా అది ప్రచురితం అయింది. రచయిత పరిచయంలో ఆమె తెలుగులో 13 నవలలు ప్రచురించినట్లు ఉంది. సంసారసాగరాలుతో కలిపి పది నవలలు మాత్రమే లెక్కకు వస్తున్నాయి.

ఈ నవల కూడా  స్త్రీ కేంద్రకమైనదే. ఇద్దరు స్త్రీలు – ఒకరు వేదవల్లి చదువుకొని భర్త తో సమానంగా సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన స్త్రీ. అమెరికాలో కూడా కంపెనీ వుంది. ఇద్దరు పిల్లలు అక్కడే చదువుకొంటున్నారు. మరొకరు కాత్యాయని పెద్దగా చదువుకోలేదు. సిమెంట్ కంపెనీలో మేనేజరుగా ఉన్న భర్త సంపాదనతో ముగ్గురు పిల్లలు గల కుటుంబాన్ని నిర్వహించటమే ఏకైక జీవితాశయంగా బ్రతుకుతున్న స్త్రీ. కాత్యాయని ప్రోద్బలంతో ఆమె భర్త గోపాలకృష్ణ కొడుకు ఉద్యోగ విషయమై మాట్లాడటానికి  మిత్రా మైత్రా సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని ని కలవటానికి వెళ్లి అతని భార్య వేదవల్లి ని కలిసి మాట్లాడటం, ఆమెను కాలేజీ చదువుల కాలం నాటి స్నేహితురాలిగా గుర్తించి ఆనందపడటం దగ్గర నవల మొదలవుతుంది. అందం లేదని , కట్నం తేలేదని అత్త ఆడబిడ్డలు పెట్టిన పోరుని తలచుకొంటూ అసంతృప్తికి ఆవేదనకు గురి అవుతుండటం భర్త , పిల్లలు ఏమీ తెలియనివాళ్ళని, వాళ్ళ అవసరాలు అన్నీ తానే కనిపెట్టుకొని చూడాలనుకొనటం, చూస్తుండటం వల్లనే వాళ్ళు ఆ మాత్రం ప్రయోజకులయ్యారని అనుకొనటం కాత్యాయని స్వభావం. ఇల్లే ఇలలో స్వర్గమని , దానిని స్వర్గంగా చేసే బాధ్యత స్త్రీది అని , అందుకు ఆమె తనను తాను అరగదీసుకొనే ఆరవ చాకిరీకి సిద్ధంగా ఉండాలని బోధించే సంస్కృతీ సంప్రదాయాల శిక్షణలో అలవడిన స్వభావం అది. ఇల్లే ప్రపంచం అయిన స్త్రీ ఆ ఇంటికి తాను బందీ కావటమే కాక ఇంట్లో ఎవరైనా తన జీవిత పరిధిని దాటి కొత్త మార్గంలో పోతున్నారన్న అనుమానం వస్తేనే బెంబేలెత్తి పోతుంది. తనకు అవమానం, అన్యాయం జరిగినట్లు బాధపడుతుంది. అలాంటి  కాత్యాయని ముగ్గురు పిల్లలు ఉద్యోగాల ఎంపిక, సహచరుల ఎంపిక తమ చేతుల్లోకి తీసుకొంటున్న క్రమంలో పిల్లల ప్రపంచం నుండి విముక్తమవుతూ మహిళా మండలి సభ్యురాలై సామాజిక జీవితంలోకి విస్తరించటాన్ని చిత్రించింది ఈ నవల.

చదువుకొని ఉద్యోగాలు చేస్తూ తమకంటూ ప్రత్యేక ఆస్థిత్వాన్ని అభివృద్ధి చేసుకొన్న  స్త్రీలు ఇల్లు పిల్లలే లోకంగా బతికే స్త్రీలవలె సంసార జీవితంలో వచ్చే సంఘర్షణల వల్ల అభద్రతో బెంగటిల్లి పోరని సమస్యను వస్తుగతంగా అర్ధం చేసుకొని ఆత్మగౌరవానికి భంగం కలగని రీతిలో పరిష్కరించుకొంటారని వేదవల్లి ద్వారా నిరూపించే ప్రయత్నం చేసింది రమాదేవి ఈ నవలలో. భర్తకు చిత్రకారిణి అయిన రేచల్ కు మధ్య ఏర్పడిన సంబంధాన్ని వాళ్ళిద్దరి కోణం నుండి అర్ధం చేసుకొని, ఆమోదించి ఇద్దరు పిల్లలను తండ్రి ప్రేమకు దూరం చేయటం అన్యాయంగా భావించి విడాకులు లేకుండానే అతనితో వైవాహిక భాగస్వామ్యాన్ని రద్దుచేసుకొని వ్యాపార భాగస్వామ్యాన్ని, స్నేహ సంబంధాన్ని కొనసాగించిన వేదవల్లిని సాధికార మహిళగా సూచించింది. సాటి మనుషులను సానుభూతితో అర్ధం చేసుకోగల సున్నిత మానవీయ సంస్పందన  కుటుంబానికి బయట మనుషులతో సంబంధాలు, సామాజిక జీవితం సంసారసాగరాలు తరించటానికి సాధనాలు అవుతాయని సూచించింది ఈ నవల ద్వారా.

స్త్రీల నవలల పరిధి వంటిల్లు , కుటుంబం అన్న అపవాదును తిప్పికొట్టిన నవలా రచయితగా విఎస్ రమాదేవికి తెలుగునవలా సాహిత్యంలో విశిష్ట స్థానం ఉంది.

*****

(ఇంకా వుంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.