నడక దారిలో-27

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతిపత్రిక లో  శీలా వీర్రాజుగారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభా వివాహం జరిగింది. పరీక్షలుకాగానే హైదరాబాద్ లో కొత్తకాపురం, డిగ్రీ చదువు పూర్తిచేసుకుని మేలో పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. కొత్త కాపురం. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మా ఆడబడుచు, మరుదులు వివాహాలు జరిగాయి. కుటుంబం పెద్దదైంది. నేను రెండోసారి నెలతప్పాను.  తర్వాత—

***

         నాకు డెలివరీ సమయం దగ్గర పడేసరికి అమ్మని పిలిపించుకున్నాను. డెలివరీకి పుట్టింటికి వెళ్ళకుండా అమ్మనే నా దగ్గరకు పిలుచుకోవటాన్ని ఇంట్లో వాళ్ళంతా “మా అమ్మ అయితే ఇలా ఆడపిల్ల ఇంటికి వచ్చి పురుళ్ళు పోయదు” అని వేళాకోళంగా మాట్లాడేసరికి అమ్మ చాలా బాధ పడింది.
 
         నాకు డెలివరి అయింది. పాపాయి చాలా బలహీనంగా పుట్టింది. అందుచేత అయిదు రోజులు హాస్పటల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నా పల్లవికి వీర్రాజు గారే స్నానం పోసి హాస్పిటల్ కి తీసుకువస్తే హాస్పిటల్ బెడ్ మీదే కూర్చుని పాపకి తలదువ్వి జడలు వేసేదాన్ని. అమ్మ నన్ను, నా పరిస్థితిని చూసి దిగులు పడేది.
 
         డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చాక “మళ్ళీ ఆడపిల్లేనా” అంటూ నిరసన మాటలు విని బాధపడ్డాను. ఆర్థిక పరిస్థితి, చంటి పాప అనారోగ్యం దృష్ట్యా వేడుక చేయకుండా ఇరవైఒకటో రోజున చీరతో ఉయ్యాల కట్టి అక్షతలు వేసాము. ఇంట్లో వాళ్ళెవరూ అక్షతలు వేయటానికి కూడా రాలేదు. ఎవరితోనూ దుఃఖం పంచుకోలేక నాలోకి నేనే కుంగి పోయాను. అసలే ముళ్ళమీదున్నట్లు ఉందేమో ఆ పరిస్థితి చూసి నెలలోపునే అమ్మ “ఎక్కువ రోజులు నేను ఇక్కడ ఉండలేను. మీరే నాతో రండి” అని నన్ను పిల్లల్నీ తీసుకుని విజయనగరం ప్రయాణం పెట్టింది.
 
         విజయనగరం వచ్చాకైనా నిశ్చింతగా ఉండే పరిస్థితి లేకుండా చంటిపాపకి ఇమ్యూనిటీ లేక డయేరియా పట్టుకుంది. పల్లవికి కూడా తరుచూ జ్వరం వస్తుండేది. పిల్లల అనారోగ్యాలు నన్ను స్థిమితం లేకుండా చేసాయి.
 
         నెలరోజులపాటు చంటిపాపకి ఎన్నిరకాలుగా మందులు మార్చినా తగ్గలేదు. హాస్పటల్లో జాయిన్ చేసాము. అయినా చంటిపాప దక్కలేదు. అనవసరంగా ఇక్కడికి తెచ్చానా అని అమ్మ చాలా బాధ పడింది. పాప పోయిన విషయం తెలియగానే వీర్రాజు వచ్చారు. పల్లవికి తరుచూ జ్వరం రావటం మరింత బెంగ కలిగింది. మరి కొన్నాళ్ళు నాకు రెస్టు కోసం విజయనగరంలో ఉండమని అమ్మా వాళ్ళు అనటంతో ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు.
 
         ఆగష్టు పదిహేను స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా కొన్నాళ్ళుగా యువతరానికి సాహిత్యాభిరుచి కలిగించటానికి చిన్నన్నయ్య చైతన్య సాహితి అనే సంస్థని నిర్వహించే వాడు. అందులో జగన్నాథశర్మ, దాట్ల నారాయణమూర్తి రాజు, పతంజలి , ఎమ్.వి.వి. సూర్యనారాయణ మొదలైన వారంతా సభ్యులు. ఆ సంస్థ పేరిట అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేవాడు.
 
         చిన్నపాప పోయిన దుఃఖం నుండి నన్ను మరిపించటానికేమో తమ సంస్థ ద్వారా ఆగష్టు పదిహేను స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా కవిసమ్మేళనం ఏర్పాటు చేసాననీ నన్ను కూడా పాల్గొనమన్నాడు.
 
         చాసో అధ్వర్యంలో జరిగిన కవిసమ్మేళనంలో మొట్టమొదటి సారిగా అంతకు ముందు ఎప్పుడో రాసిన ఆకలి నృత్యం కవితను చదివాను. నాకు శారీరక, మానసిక ఒత్తిడులకు గానీ, దుఃఖానికి గానీ ఉపశమనాన్ని ఇచ్చేది సాహిత్యమే నని మరోసారి అప్పడే అనిపించింది.
 
         ఇద్దరు పిల్లలతో విజయనగరం వెళ్ళిన నేను ఒక పాపను పోగొట్టుకుని పల్లవిని మాత్రం తీసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాను. పులిమీద పుట్రలా పల్లవికి మాటిమాటికీ జ్వరం రావటం నాకు బెంగగా అయిపోయింది. మా ఇంట్లో ఉండే బంధువు పెద్దబాబు సహాయంతో పల్లవిని టెస్టులకు తీసుకు వెళ్ళాను. పిల్లలకు వచ్చే టీబీ చాలా తక్కువ ప్రమాణంలో ఉందని తెలిసింది. మూడునెలల పాటు రోజూ ఇంజక్షన్ ఇప్పించాలని బలమైన ఆహారం ఇవ్వాలని, ప్రమాదం ఏమీ లేదన్నారు డాక్టర్ .
 
         నాకు గుండె గుభేల్ మంది. వీర్రాజు గారికి టీబీ వచ్చి తగ్గింది కదా? దాని సూక్ష్మ అవశేషాలు ఏ మూలో ఉండి పిల్లకు వచ్చిందేమో. ఇంతమంది ఉన్న ఈ కుటుంబంలో ఈ పిల్లకి ప్రత్యేకంగా బలవర్థకమైన ఆహారం ఎలా పెట్టాలి?. ఇంట్లో వాళ్ళు ఎవరిమట్టుకు వాళ్ళు కొనుక్కున్నవి వాళ్ళవాళ్ళ గదుల్లో దాచుకు తింటున్నారు. పొరపాటునో అలవాటునో పల్లవి ఆడుకుంటూ వాళ్ళ గదుల వైపు వెళ్ళినా ఆ పిల్లచేతులో ఏమీ పెట్టటం లేదు. సరికదా చెయ్యి పట్టుకుని గదిబయటకు పంపేస్తే ఏడ్చుకుంటూ వచ్చేసేది. నేను గుడ్లలో నీళ్ళు కుక్కుకొని మౌనం వహించేదాన్ని. వీర్రాజుగారు మాత్రం ఏపళ్ళో, మిఠాయిలో ఏం తెచ్చినా వంటింట్లో అందరికీ అందుబాటులో పెట్టమనేవారు. ఇంకా పల్లవికి ఎలా పెట్టాలో అర్దం కాలేదు.
 
         పల్లవిని రోజూ స్కూల్ నుంచి వచ్చాక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి ఇంజక్షన్ వేయించే దాన్ని. ఆ పిల్ల కెవ్వుమంటే నా గుండె కలుక్కుమనేది. నా కళ్ళు చెరువు లయ్యేవి. మొత్తం మీద మూడు నెలలు కోర్సు పూర్తి అయ్యాక మెల్లిమెల్లిగా ఆరోగ్యం పుంజుకుంది పల్లవి.
 
         రోజులు గడుస్తున్నాయి. మా పెద్దతోటికోడలుకి నెలతప్పటం, నెలలు నిండి పురిటికి మద్రాసు వెళ్ళింది. పాపపుట్టాక మూడోనెలకి తిరిగి వచ్చింది.
 
         వీర్రాజు గారు ఎప్పటిలాగే సాయంత్రం మీటింగులకు వెళ్ళి ఆలస్యంగా రావటంతో, లేదా ఇంటికే ముఖచిత్రాలు కోసం వచ్చినవాళ్ళని కూర్చోబెట్టి పూర్తిచేసి ఇవ్వటమో చేసేవారు దాంతో రోజూ ఎప్పటిలాగే మా భోజనం తొమ్మిదో పదో అయ్యేది. పాపకి తొందరగా అన్నం తినిపించి కథలో కబుర్లో చెప్పి నిద్రపుచ్చేదాన్ని.
 
         రోజులాగే ఒకరాత్రి భోజనానికి కూర్చుని మంచినీళ్ళు తాగబోతే ఉప్పగా ఉన్నాయి. ఇంకో బిందెలోంచి తీస్తే అవీ అలాగే ఉన్నాయి. బిందె సరిగా కడగలేదేమో అడుగుకి ఉన్నాయి కదా అనుకున్నాను. మర్నాడు ఉదయమే మంచినీళ్ళు వచ్చే సమయానికి బిందెలు శుభ్రంగా తోమిపట్టాను.
 
         అయినా ఆ రాత్రీ నీళ్ళు ఉప్పగానే ఉన్నాయి. నాకు ఎందుకో అర్థం కాలేదు. రోజూ మేమిద్దరం ఆ ఉప్పు నీళ్ళు తాగటం జరుగుతోంది. మా తోటికోడళ్ళతో ఆ మాట అంటే మాకు బాగానే ఉన్నాయే అన్నారు.
 
         ఒకరోజు అనుకోకుండా బయటపడింది. మా తోటి కోడలు సాయంత్రం వాళ్ళ పాపకి ఉప్పుతో దిష్టి తీసి రెండు బిందెల్లో కలుపుతోంది. ఆలోపునే తోటి కోడళ్ళు ఇద్దరూ గిన్నెల్తో మంచినీళ్ళు తీసుకొని వాళ్ళవాళ్ళ గదులలోకి తీసుకుపోతున్నారు. నేను అది చూసి స్థంభించిపోయాను. ఇది ఏ కథల్లోనో, సినీమాల్లోనో చూస్తే నమ్మేదాన్ని కాదేమో. నిజానికీ ఈ దిష్టిలూ, తీయడాలను నమ్మను. 
 
         దిష్టి తీసి ఇంట్లో తాగే నీళ్ళలో కలపటం మొదటి తప్పు, వాళ్ళు మంచినీళ్ళు వాళ్ళ గదిలో పెట్టుకుని మా ఇద్దరినీ అవి తాగేలా చేయటం మరో తప్పు. మేము నమ్మకపోయినా వాళ్ళు నమ్ముతారు కదా దో‌షపూరితమైన ఆ నీళ్ళు తాగి మేమేమైనా పర్వాలేదని వాళ్ళ ఉద్దేశ్యమా? నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఈ విషయం ఆయనకి చెప్పి మీరు వాళ్ళని “అదేంపని అని” గట్టిగా అడగండి. అన్నాను. ఆయన అడగలేదు సరికదా “నువ్వూ ఒక తప్పేలాతో మనకి నీళ్ళు ముందే తీసి మనగదిలో పెట్టు ” అన్నారు కూల్ గా. నాకు మరింత కోపం వచ్చి ఈయనగారితో చెప్పే బదులు నేనే ఆ పని చేస్తే సరి అను కున్నాను. ఆ విధంగా కొన్నాళ్ళపాటు ఉప్పు కలిపిన నీళ్ళు తాగటం వలనే నేమో నలభైఏళ్ళు నిండకుండానే ఇద్దరికీ హైబీపీ వచ్చేసింది.
 
         వీర్రాజు గారు ఉద్యోగానికి అయిదేళ్ళు సెలవుపెట్టారు. ఢిల్లీ నుండి ఒక బాల్యమిత్రుడి కుటుంబాన్ని హైదరాబాద్ కి పిలిపించి ఆ మిత్రునితో కలిసి “వికాస్” పేరుతో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మొదలు పెట్టారు. దాంతో అందరి మనసుల్లో లుకలుకలు మొదలయ్యాయి. ఆయనకు రెగ్యులర్ గా వచ్చే జీతం పోతే ఆర్థికబాధ్యత తమ మీద పడుతుందని మిగతా వారికి భయం పట్టుకుంది. అన్నయ్యకి సంపాదన లేకపోతే ఇంకా ఇక్కడికి ఇంకేం వస్తాం అని పెద్దాడబడుచు వాపోయింది.
 
         ఈలోగా మరో తోటికోడలుకు అబార్షన్ కావటం దానికి ఇంట్లో పనిచేయాల్సి రావడం కారణంగా ఒకతగువు పెట్టుకొని వెళ్ళిపోయారు.
 
         ఏ తగువూ రాకుండా స్నేహంగా విడిపోతే బాగుండునని ఎంతగా అనుకున్నానో అది జరగలేదు. రెండుమూడు రోజులూ చాలా బాధ పడ్డాము.
 
         అక్కయ్య ఈ విషయం తెలిసి కొన్నిరోజులు విశ్రాంతి కోసం తన దగ్గరకి బాపట్ల రమ్మని రాసింది. ఆ ఉత్తరం వీర్రాజు గారికి చూపించి వెళ్తానన్నాను.అంతే కాకుండా “చిన్నతను ఎలాగూ విడిపోయాడు. ఈ ఇంట్లోనే రెండుభాగాలు చేసి కృష్ణ వాళ్ళ కుటుంబాన్ని కూడా విడిగా ఉండమని చెప్పండి. కావాలంటే వాళ్ళకి ప్రతీ నెలా ఎంతోకొంత ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మళ్ళీ తగువులు పడి విడిపోవటం నాకిష్టం లేదు. ఉన్నదాంతో నేను కుటుంబాన్ని సరిదిద్దుకోగలను. నేను వచ్చేలోగా ఈ పని చేయండి” అని ఖచ్చితంగానే చెప్పి పల్లవిని తీసుకుని బాపట్ల వెళ్ళాను.
 
         అక్కయ్య పిల్లలు శ్రీదేవీ, శర్వాణీలతో ఆటలూ, రోజూ పెద్దనాన్న గారితో బాపట్ల సముద్రతీరంలో ఆడుకోవటం వీటితో పల్లవి మళ్ళా చురుకుగా అయ్యింది. నేను అక్కడికి వెళ్ళాక మళ్ళా పుస్తకాలు చదవటం అక్కతో సాహిత్యం గురించి మాట్లాడుకోవటం వీటన్నిటితో నాకు కూడా శారీరకంగా, మానసికంగా విశ్రాంతి లభించి మళ్ళా కళ్ళలోకి జీవకళ వచ్చింది.
 
         అంతకు ముందు మేముండే రెండు చిన్న రూములు , వంటగదిలో మా మరిది కుటుంబాన్ని విడిగా ఉండమని ఆయన చెప్పారు. పార్టీషన్ చేసిన పెద్దహాలులోకి మా మంచం, వీర్రాజు గారి డ్రాయింగ్ టేబుల్, బుక్ షెల్ఫ్ మార్చేసి ఒక నెల తర్వాత వీర్రాజు గారు నన్ను తీసుకు వెళ్ళటానికి బాపట్ల వచ్చారు.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.