
చిత్రం-46
-గణేశ్వరరావు
మనసులో మాట ముందు చెప్తాను. ఈ ఫోటో నా కెంతో నచ్చింది, దాని నేపథ్యం నచ్చింది, ఫోటోగ్రాఫర్ కనబరచిన సాంకేతిక నైపుణ్యం నచ్చింది. మెక్సికో నుంచి ఒక పత్రిక వస్తుంది. అందులో అలౌకికమైన డిజిటల్ ఫోటోలు ఉంటాయి, స్వాప్నిక జగత్తులోకి తీసుకెళ్తాయి. ఫోటోల క్రిందనిచ్చే వ్యాఖ్యలు ఆ ఫోటో లకు ఏ మాత్రం తీసిపోవు. ఉదాహరణకు దీన్ని తీసుకోండి… ‘నీటిలో అమ్మాయి… ఆమె మంచు గడ్డ అయిపో తున్నా.. పరిసరాలను పట్టించుకోడం లేదు.. నీలి కనుల వన్నెల జవరాలు ఎవరు? దివి నుండి నీటిలో పడ్డ దేవతా? నా వైపే కళ్ళప్పగించి చూస్తున్నట్టు నాకనిపిస్తుంది., నా కన్నీళ్లు ఆగవు, వరదలా ప్రవహిస్తాయి., నీటి ఉపరితలం చెదిరి పోతుంది, దానితో ఆమె ప్రతిబింబం కూడా …సుడులు సుడులుగా తిరుగుతున్న అలల మధ్య ఆమె రూపం మారి పోతుంది, హఠాత్తుగా ఒక రాక్షసి ప్రత్యక్షమవుతుంది.. కోరల్లాటి దంతాలు, నోట్లోంచి ముందుకూ వెనుకకూ కదలాడే రంపంలాటి నాలుక… నన్ను అందుకోడానికి దూసు కొస్తున్న పులి పంజాల్లా వున్న ఆమె చేతులు. .. ఒక్క క్షణం భయంతో గడ్డకట్టుకొని పోయాను,, నా రెండు చేతులతో నీటి అలలను దబదబా బాదాను… అలల సుడులలో ఆమె. ఏమైంది? మాయమైంది.. ఏమో, కొలనులో అలలు ప్రశాంతంగా మారి ఆ జలకన్య నాకు మళ్ళీ కనిపించదా ! ఈ సారి ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాను.., ఆమె ప్రేమను పొందుతాను.. ‘ ఆ కలల రాణి కాళికగా మారిన ఫోటో ఆ పత్రికలో వుందో లేదో నేను వెతకలేదు.మీరూ ఆ రాకాసి ఫోటో కావాలని కోరుకోరు కదా! ఈ ఫోటోలో మోడల్ పేరు క్లాడియా లోజనో. ఫోటో తీసింది జుడాస్ బెర్రా., కథనం మెక్సికన్ పత్రికా సంపాదకుడిది, ఈ పత్రికలోని చిత్రాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి కనుక దానికి సమయోచితంగా ‘Haunted Magazine’ అని పేరు పెట్టారు. ఇలాటి పత్రికలు కూడా ఉన్నాయని తెలియబరచడమే నా ఉద్దేశ్యం!*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
