
నడక దారిలో-29
-శీలా సుభద్రా దేవి
జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ చదువు పూర్తిచేసుకుని మేలో పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండోసారి పుట్టిన పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి కుటుంబం విడిపోయి వేరు కాపురాలు అయ్యాయి. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం తర్వాత—
***
వీర్రాజు గారు ఉద్యోగానికి సెలవు పెట్టి వికాస్ అనే అడ్వర్టైజ్ ఆఫీసు పెట్టినా పెద్దగా సంపాదించినది ఏమీలేదు. ఆర్ట్ వర్క్ అంతా వీర్రాజుగారూ, బైట తిరిగి వర్క్ సంపాదించడమే కాక ఆర్థిక వ్యవహారాలు స్నేహితుడు రావు చూసుకుంటున్నారు. వర్క్ బాగానే వస్తోంది. వీర్రాజు గారికి డబ్బు అడగటం మొగమాటం కనుక స్నేహితుడు వెళ్ళి కలెక్ట్ చేస్తాడు. ‘ఢిల్లీ నుండి వచ్చేసాం ఇక్కడా ఇబ్బందులు తప్పలేదు’ అన్నట్లుగా స్నేహితుని కుటుంబం వాపోతుంటారు. వీర్రాజు గారికి అతన్ని పిలిపించి ఈ ఏజెన్సీ పెట్టటం పొరపాటు చేశానేమోననే అంతర్మధనం మొదలయ్యింది. అంతేగాక డబ్బు గోల్మాల్ అవుతున్నట్లు కొందరు మా ఆత్మీయులైన వారు చెప్పటం, ఆధారాలూ కనిపిస్తుండే సరికి స్నేహితుడిని ఖచ్చితంగా అడగలేక ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు ఆఫీసువాళ్ళు సెలవు పెట్టి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం పై మెమోలు పంపసాగారు. అయిదేళ్ళ సెలవు కాలం పూర్తి చేయాలని, లేదా వాలంటరీ పెట్టేయాలనే ఆలోచనలో సతమతం అయ్యారు. ఎప్పటిలాగే పురిటి సమయానికి అమ్మ వచ్చింది. నాకు నెలలు నిండి మంచి రంగు తో, దట్టమైన ఉంగరాల జుట్టుతో అందాల బాబు జన్మించాడు. పల్లవి కూడా ఆడుకోడానికి తమ్ముడు తోడు దొరికాడని మురిసిపోయింది. ఇంత వరకూ వీరి అన్నదమ్ములు అందరికీ ఆడపిల్లలు కావటంచేత కుటుంబానికి మొదటి మనవడు అని వీర్రాజు గారు ముచ్చట పడ్డారు. చైతన్య అని పేరు పెడదాం అన్నారు. మా మామయ్యకు డిప్యూటీ డైరెక్టర్ గా బాపట్ల నుండి హైదరాబాద్ కి బదిలీ అయ్యింది. అక్కయ్యకి బాపట్లలో సాహిత్యం, సమావేశాల్లోనే పోలాప్రగడ దంపతులతో స్నేహం ఉండేది. పోలాప్రగడ గారికి మలకపేట బ్రహ్మానంద కాలనీలో ఒక అపార్ట్మెంట్ ఉందని అది ప్రస్తుతం ఖాళీగా ఉందనీ, మీరు కావాలంటే అద్దెకు ఉండొచ్చని పోలా ప్రగడ దంపతులు చెప్పటంతో సంతోషంగా అందులో అద్దెకి దిగటానికి అక్కయ్య వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారంటేనే నాకు కొండంత ధైర్యం వచ్చింది.. వేసవి సెలవుల్లో చిన్నక్క పిల్లలిద్దరినీ తీసుకుని హైదరాబాద్ అక్కయ్య ఇంటికి వచ్చేది.వాళ్ళు వస్తే పల్లవికి సంబరం. అప్పుడప్పుడు రిక్షా మాట్లాడుకొని పల్లవిని, బాబుని తీసుకొని వెళ్ళే దాన్ని. ఇద్దరు అక్కయ్యల పిల్లలతో పల్లవి ఆడుకునేది. ఒక రోజు పిల్లల్ని తీసుకొని రేడియోలో పిల్లలు కార్యక్రమంలో పాటలు, పద్యాలూ పాడించే వాళ్ళం. అక్కయ్యా ఇంట్లో నేను ఓ రెండు రోజులు ఉండి పల్లవిని ఓ వారం రోజులు అక్కడే వదిలి వచ్చేసేదాన్ని. మా యింటికి కూడా చిన్నక్కనీ పిల్లల్ని రమ్మనేదాన్ని. కానీ ఆ పిల్లాడితో చేసుకోలేక పోతున్నావు. ఇక్కడ కలిసాము కదా అని అనేది. హైదరాబాద్ దూరదర్శన్ సాయంత్రం పూట తెలుగు కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఆ క్రమంలో ఆదివారాలు విజయావారి సినీమాలు వేస్తున్నారని తెలిసి పొరుగు ఇంట్లో ఉండే లలిత తనతో పల్లవిని అప్పుడప్పుడు పక్క కాంపౌండ్ ఉండే ఎవరింట్లోనో టీవీ ఉంటే తీసుకు వెళ్ళేది. లలితా, ఆంజనేయులు గారు ఇద్దరూ పల్లవిని బాగా చేరదీసే వారు. పల్లవి కూడా లలితత్తా అంటూ ఆమెతో కబుర్లు చెప్పేది. తర్వాత అక్కయ్యా వాళ్ళుకూడా టీవీ కొన్నారు. దాంతో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు దూరదర్శన్ కార్యక్రమాలు అబ్బురంగా చూసేవాళ్ళం. అక్కయ్యా వాళ్ళింట్లో కూడా మామూలుగా పూజలు చేయకపోయినా వినాయక చవితికి పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని మామామయ్య పూజ చేయించి కథ చెప్పేవాడు. ఆయన అంటే పిల్లలందరికీ చాలా ప్రేమ. కథలు చెప్పటం, సినిమాలూ, షికార్లు తిప్పటం చేసేవాడు. బాబుకి ఆరునెలలు దాటాయి. బోర్లా పడుతున్నాడు, కొద్దిగా పారాడ టానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు సాయంత్రం అకస్మాత్తుగా గుక్క పట్టి ఏడుస్తూ ఏడుస్తూ క్రమ క్రమంగా ఒళ్ళంతా నీలి రంగులోకి మారి స్మారకం లేనట్లుగా అయి పోయాడు. నాకు ఏం చేయాలో తోచక ఎత్తుకుని ఏడుస్తూ వాకిట్లోకి వచ్చాను. వాకిట్లో పిల్లలతో ఆడుకుంటున్న పల్లవి కూడా బిక్కమొహం తో దగ్గరకు వచ్చింది. కాంపౌండులోని నాలుగు కుటుంబాల వాళ్ళూ వచ్చి బాబు ముఖం మీద నీళ్ళు చల్లి కుదుపుతూ ఉంటే మెల్లమెల్లగా నీలి రంగు నుండి మామూలు అయ్యాడు. పక్కనే ఇంట్లో ఉన్న తోటి కోడలు తన పిల్లల్ని ఇంట్లోకి లాగి తలుపు వేసిందని లలిత తర్వాత చెప్పింది. ఎవరో దగ్గరలోనే ఉన్న వికాస్ ఆఫీసుకు పరిగెత్తి వీర్రాజుగారిని పిల్చుకు వచ్చారు. అప్పటికి తిరిగి బాబును ఇంట్లోకి తీసుకు వచ్చాను. వీర్రాజు గారు వచ్చి బాబునీ వొళ్ళోకి తీసుకుని కుదుపుతుంటే కళ్ళు తెరిచాడు. అప్పుడు తీరికగా మా తోటికోడలు వచ్చి పలకరించింది. అప్పటికైతే బాబు నార్మల్ గా అయ్యాడు కానీ అది మొదలుకొని తరుచూ ఏడుపు మొదలెట్టాడంటే గుక్క పెట్టటం, ఒళ్ళు నీలి రంగులోకి మారటం స్పృహ తప్పినట్లుగా కళ్ళు తేలేయటం ఇంచుమించుగా ప్రాణం పోయిందేమో అన్నట్లుగా వేలాడిపోవటం జరుగుతూ ఉండేది. ఇంక మాకు ఇల్లు, హాస్పిటల్, లేదా ఇల్లూ క్లినిక్ లకు తిరగటం ప్రారంభమైంది. నెలలు గడుస్తున్నా బాబు మెడని బలంగా నిలబెట్టలేక పోయేవాడు. కూర్చోలేక పోతున్నాడు.

జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద మంది కవయిత్రుల కవితల సంకలనం ” ముద్ర” కు డా.పి.భార్గవీరావు తో కలిసి సహసంపాదకత్వం వహించారు.ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసారు.
