
చిత్రం-47
-గణేశ్వరరావు
అమెరికన్ చిత్రకారిణి ఐరిన్ (Irene Georgopoulon) వస్తువుల సమూహాన్ని, మూర్తి చిత్రాలను పాస్టెల్ రంగుల్లో చిత్రిస్తుంది. పాస్టెల్ రంగుల మాధ్యమంకు మాయాజాలం ఉంది, అది వెలుతురును ప్రతిబింబచేస్తూ, చిత్రం యొక్క ఉపరితల కాంతిని ప్రసరించే టట్లు చేయగలదు. తనకు నచ్చిన వస్తువులను ఐరిన్ సొంతంగా సేకరిస్తుంది, తన సృజనాత్మక శక్తి కి వాటి నుంచి స్ఫూర్తి పొందుతుంది. అత్యంత సామాన్యమైన వస్తువు లను ప్రకాశవంతమైన మూర్తి ( స్టిల్ లైఫ్) చిత్రాలుగా రూపొందిస్తుంది. వ్యక్తుల రూప చిత్రాల పట్ల ఆమెకు ఎంతో ఆసక్తి. తన చిత్రాలలో వారి భావోద్వేగ క్షణాలని ప్రతిబింబ చేస్తుంది. తన కళ్ళకు నచ్చి, హృదయానికి పట్టిచ్చే ఏ వస్తువు కనిపించినా, ఆమె తన కుంచెను వెంటనే రంగుల్లో ముంచి చిత్ర రచనకు పూనుకుంటుంది. వస్తువుల పై కదులుతున్న వెలుగు నీడలు ఆమెను అమితంగా ఆకర్షిస్తాయి, వాటిని తన రంగులతో కాన్వాస్ పై బంధించడానికి ఆమె ఇష్టపడతారు – ముఖ్యంగా చలన వేగంలో ఉన్న వస్తువులు, అవి కలిగించే భ్రమ! ఉదాహరణకి .. నీటిలోని గులక రాళ్ళు.. చిరు చేపలు.. నత్త గుల్లలు .. .. అలాటి వస్తువుల బొమ్మలు ఆమె అసంఖ్యాకంగా వేసింది. వాస్తవికతకు ఆమె ప్రాధాన్యతను ఇస్తుంది. తన చిత్రాలలో ప్రతి చిన్న విషయాన్ని పట్టించు కుంటుంది. తన ప్రతిభ కనబరుస్తుంది. ఈ చిత్రాన్నే చూడండి. కావాలనే వ్యక్తి మొహం అర్థ భాగాన్నే చిత్రించడంలో అంతరార్థం లేదా? చిత్రించిన వ్యక్తి కంటి వైపు దృష్టి సారించండి, కంటిలోని మెరుపు గుర్తించండి. కంటి కింద ఉన్న ముడతలు గమనించండి, అవి అతని హావభావాలను చెప్పకనే చెబుతున్నాయి. అతని తెల్లని గడ్డంలోని ఒక్కొక్క వెంట్రుక చిత్రించిన తీరు చూడండి. ఐరిన్ చతురతను వేరే విడమర్చి చెప్పనక్కరలేదు కదా! *****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
