
గాయం పాడిన గేయం
-గవిడి శ్రీనివాస్
ఉండుండీ
ఒక్కసారీ దుఃఖ దొంతరల్లోకి
జారిపోతాను.
ఎప్పటికప్పుడు
వ్యూహాలు పదును పెట్టడం
కన్నీటిని చెక్కడం
సుఖమయ ప్రయాణాలుగా మల్చడం.
లోతుగా జీవితాన్ని తరచిచూడటం
తడిమి చూడటం
ఒక లక్ష్యం వైపు దూసుకు పోవటం
నిరంతర శ్రమలోంచి
దారుల్ని వెలిగించటం
తృప్తిని ఆస్వాదిస్తూ అలా
అడుగులు సాగుతుంటాయి .
నిద్రలేని రాత్రుల్ని
గాయం పాడిన గేయం
ఓదార్చుతుంది .
మౌన ప్రపంచంలోంచి లేచి
భావాలు భాషిల్లుతుంటాయి .
ఇక్కడ విషాదమేమిటంటే
పరిగెత్తేవేగానికి
నన్ను నేను సమాధాన పరచుకోవడమే .
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
