
సంపూర్ణం…!
-గవిడి శ్రీనివాస్
దాహాలు అసంపూర్ణంగానే
ఆరంభమౌతాయి.
ఆలోచనల సంఘర్షణలోంచి
ఒక దారి తళుక్కున మెరుస్తుంది.
ఒక లక్ష్యం
నిద్రలేని క్షణాల్ని వేలాడదీస్తుంది.
జీవితం
ఒక్కో పాదముద్రను చెక్కుతూ
నిరాడంబరంగా
విజయానికో చిరునవ్వు
విసురుకుంటూ ముందుకు పోతుంది.
ప్రతి క్షణమూ తిరిగిరానిదే.
ఇక్కడ ఛేదించాల్సినవి
చేయాల్సినవి కొన్ని వుంటాయి.
అలా అలా సంతోషాల్ని
లిఖిస్తూ కాస్త ముందుకు జరగాలి.
అసంపూర్ణం నుంచి సంపూర్ణానికి
ఒక్కో అడుగు తొడుగుతూ
ఒక్కో మైలురాయి లో చిహ్నాల్ని
కొన్ని తీపి గురుతులు గా నిలిపి
సంపూర్ణ ప్రయాణం గా
ప్రయత్నాల్ని మలచుకోవడం లోనే వుంది.
జీవితపు గెలుపు రహస్యం.
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
