
ప్రతీరోజు ఆమె ఒక సూర్యోదయం
(నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)
– డా.కటుకోఝ్వల రమేష్
పొద్దు పొద్దున్నే
ఆమె నా ముందు వెచ్చని తేనీరవుతోంది
గుమ్మం ముందు వాలిన పేపర్ వైపు
నా రెండు కళ్ళూ సారిస్తానా…
పత్రికలో ఆమె
పదునైన అక్షరాల కొడవలి
మెరుగైన లక్షణాల పిడికిలి
కన్నీళ్ళు కాటుక కళ్ళల్లో దాచుకొని
కమ్మని వంటల విందవుతోంది
కాలం కదిలిపోవాలికదా అంటూ..
రాజీ తుపాకిని ఎత్తుకున్న సిపాయవుతోంది
లోపలి మనిషి బయటి మనిషీ అంటూ
సెటైర్ల సాహిత్య సివంగవుతోంది
ఆమె నాకు పాఠమో
నేను ఆమెకు గుణపాఠమో అర్థంకాదు
నేను బండి పై బడిబాట పట్టగానే
ఆమె కెమెరాకన్నుల్ని మనసుకు తగిలించుకొని
విపణిని వీక్షించే విహాంగమవుతోంది
నేను ఇల్లు చేరుకోగానే
ఆమె బరువెక్కిన సమాచార సంచవుతోంది
అలసిన నా దేహానికి
పలకరింపుల పాలను వొంపి
వార్తా పదబంధాల కోసం తనకుతానే
క్షీరసాగర మథనమవుతోంది
అక్షరాలే ఆమెకు ఆయుధం
అక్షరాలే ఆమెకు అమృతం
ఆశయాల అల్లికతో కుస్తీ
మానవత్వ మల్లికతో దోస్తీ
ఎప్పుడూ ఆమె వ్యాపకం చైతన్య కారకం
అప్పుడప్పుడూ ఈ అడవిలో
మృగాల చూపుల ఘర్షణలో ఎరుపెక్కి
ఆటుపోటుల సముద్రమవుతోంది
పరిపరి విధాల పరివ్యాప్తమవుతున్న
రేపటి నిజం కోసం నిజంగానే
ప్రసవ వేదనల మాతృకవుతోంది
నిద్రపట్టక నినాదాలను నెమరేసుకుంటూ..
తిమిరాలను రాత్రంతా చీల్చుకున్న నాకు
ప్రతిరోజు ఆమె ఒక సూర్యోదయం
*****

డా.కటుకోఝ్వల రమేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు (మం)లో 30-06-1969 లో పుట్టిన డాక్టర్.కటుకోఝ్వల రమేష్ వృత్తి రిత్యా ఉపాధ్యాయుడైనా ప్రవృత్తి రిత్యా కవి, విమర్శకులు. ప్రస్తుతం ఖమ్మం లో వుంటున్నారు. ఇంటర్ కళాశాల మ్యాగజైన్ లో తన కవిత “జాగృతి చేసేయ్” “మార్పు”కథానికల ప్రచురణతో ఆయన రచనా ప్రస్థానం మొదలయ్యింది. 1986లో స్రవంతి మాస పత్రికలో అన్యాయం పై నా యుద్దం..కవిత అచ్చయ్యింది.ఇప్పటి వరకూ వెయ్యికి పైగా పలు రచనలు పలు దిన,వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. 2018 లో “అగ్నిశిఖ”కవితా సంపుటి వెలువరించారు.దూరదర్శన్,ఆకాశవాణి కెంద్రాల నుంచి ఆయన కవితలు ప్రసారం అయ్యాయి. 2005 “నాయన” సంకలనం మొదలుకొని కవితా-2023 వరకూ పలు ప్రముఖ సంకలనాల్లో రమేష్ కవితలు చోటుచేసుకున్నాయి. ఈయన అగ్నిశిఖ సంపుటికి గిడుగు పురస్కారం, కవి రత్న జాతీయ పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో, కార్డ్ కథల్లోనూ రమేష్ రచనలు చోటుచేసు కున్నాయి. “కకోర” కలం పేరుతో అంతర్జాలంలో వీరు రాసిన “జిందగీ”రచనలు బహుళ ప్రచారం పొందాయి. బహుశా రమేష్ కవిత్యం monotony breck చేస్తుందేమో అంటారు కేంద్ర సాహిత్య అవార్డ్ గ్రహిత కె.శివారెడ్డి గారు. ప్రతీ కవిత్వ నగను అగ్నిపునీతం చేసి మనకు అందిస్తాడు రమేష్ అంటారు ప్రొఫెసర్ జయధీర్ తిర్మల్ రావు గారు. రసవిద్య బాగా తెలిసిన వారు కవి రమేష్ అంటాడు ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశొక్ తేజ. నిద్రమాని కవిత్వం కోసం పలువరించిన గొప్పకవి రమేష్ అంటాడు ప్రజాకవి గోరటి వెంకన్న. ఇలా ప్రముఖుల వాక్యాలు అయన కవిత్వాన్ని ప్రస్పుటం చెస్తుంది. వీరి కవితా రచనల్లో భావశిల్పం, అర్థ వైచిత్రి, శభ్ద వైచిత్రి, కొసమెరుపులు, చక్కటి చిక్కటి మెటాఫర్ లు ప్రత్యేక వస్తువు ఎంపికలు దర్శనమిస్తాయి.
