
కథా మధురం
ఆ‘పాత’ కథామృతం-11
ఆచంట శారదాదేవి
-డా. సిహెచ్. సుశీల
స్త్రీలు కలం పట్టిన నాటి నుండి కూడా ‘ స్త్రీ పురుష సంబంధాలలోని అసమాన తలు’ గురించి అవగాహనతో రాసినట్టే స్పష్టమవుతోంది. భర్త ఎలాంటి వాడైనా అతన్ని భరించడం, పూజించడమే ‘సతీ ధర్మం’ వంటి కథలు కొన్ని వచ్చినా, ‘ స్త్రీ కి మెదడు ఉంటుంది, హృదయం ఉంటుంది, ఆలోచనలు అభిరుచులు ఉంటాయి’ అన్న స్పృహ తో రాసిన కథలే ఎక్కువ. భావుకత, ప్రకృతి సౌందర్యారాధన పురుషుని హక్కు అనీ, స్త్రీ వంటింట్లో మగ్గిపోవాలనీ, కుటుంబమే సమస్త ప్రపంచంగా భావించాలని ప్రబోధించే కథలు ఒకటీ అరా తప్ప ఎక్కువలేవు. కుటుంబం, సమాజం, సంప్రదాయాలను అనుసరిస్తూ, పెళ్ళి అనే బంధానికి విలువనిస్తూ, పిల్లల పెంపకం బాధ్యతను స్వీకరించినా తమ ‘మనసు’ కు ప్రాధాన్య మిచ్చారు. సామాన్య మధ్యతరగతి స్త్రీ అంతరంగాన్ని ప్రతిబింబించే కథలు ఎక్కువగా రాసిన రచయిత్రి “శ్రీమతి ఆచంట శారదాదేవి”. 1922 లో విజయవాడలో జన్మించిన శారదాదేవి 1944 లో ఆచంట జానకీరామ్ ను వివాహమాడారు. తెలుగులో ఎం.ఏ. పట్టాను పొందారు. ఇంగ్లీష్ ఎం.ఏ చదివారు కానీ పరీక్ష రాయలేదు. హిందీలో విశారద డిప్లొమా పొందారు. సంస్కృతం, సంగీతంలో పరిజ్ఞాన ముంది. 1945 నుండి కథలు ప్రారంభించిన ఆమె 1994 వరకూ దాదాపు యాభై ఏళ్ళపాటు రచనా వ్యాసంగం కొనసాగించారు. ఒక్క రోజు
“అప్పుడే తెల్లవారుతూంది. కిటికీలో నుంచి ఒక్క వెలుగు కిరణం శాంత ముఖం మీద పడింది. శాంతకు మెలకువ వచ్చింది”- అంటూ కథ మొదలౌతుంది.
శాంత మనసుకు ప్రతి వేకువా గోరంత ఆశను కలిగిస్తుంది. తనకున్న చిన్న చిన్న కోరికలు – మల్లెతోటకు వెళ్ళాలనీ, వీణ వాయించుకోవాలనీ, మనసారా పాటలు పాడుకో వాలనీ … ఆశపడుతుంది.
కానీ మధురమైన ఊహలతో నిద్రలేచి, నిశ్శబ్దంగా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిం చాలనుకుంటే, తన చుట్టూ రణగొణ ధ్వనులు. పనమ్మాయి కూరలమ్మితో పోట్లాడు తున్నట్టు బేరాలాడడంతో మొదలౌతుంది విసుగు. రోజులాగానే పతిదేవుడు తన షేవింగ్ రేజర్ కోసం వెదుకుతూ గట్టి గట్టిగా అరవడంతో మధుర స్వప్నం నుండి అమాంతం నేల పై పడినట్లు అనిపిస్తుంది. తర్వాత కోర్టుకు బయలుదేరుతూ జేబు రుమాలు కోసం వెదుకుతూ అలమారలోని బట్టలన్నిటినీ లాగి కింద పోగులు పెడుతుంటే ఉసూరుమని పించింది. మనసు మాత్రం తోటకు వెళ్ళాలనీ, పుస్తకం చదువుకోవాలనీ ఉన్నా ప్లీడర్ గారు “నా చెప్పులేవీ” అని ఎప్పటిలా వెదుక్కుంటూ విసుక్కుంటూ ఉంటే మౌనంగా ఉండి పోయింది. ప్లీడర్ గారు ఫెడేలు మని తలుపు వేసి వెళ్ళిపోయారు. హమ్మయ్య అనుకొని తేరిపార చూస్తే –
‘ఇల్లంతా అరణ్యంలాగా ఉన్నది. చుట్టూ ఇస్త్రీ బట్టలు, మాసిన బట్టలు, పుస్తకాలు, న్యూస్ పేపర్లు మధ్యన చతికిలబడింది. అవన్నీ తనను చూసి నవ్వుతున్నట్లు ఉంది. తనకు నవ్వు వచ్చింది. ఏదో కోర్ట్ అనీ, ఆఫీస్ అనీ ఉండబట్టే సరిపోయింది, కానీ ఈ మగవాళ్ళు 24 గంటలు ఇంట్లోనే ఉండేట్లయితే…!”
ఇల్లంతా సర్దుకుంది.
పొద్దున పూట మల్లెలు విచ్చుకుని తోట ఎంత బాగుంటుందో! అనుకుంది. మల్లె పూలతో ఆమెది అంతులేని స్నేహం. ఒక్క గంటసేపైనా ఈ కలవరాన్నంతా మరచి తోట లో విశ్రాంతిగా ఉండాలనుకునే లోపలే బాబుకు జ్వరం. కంగారుగా డాక్టర్ కి కబురు పెట్టింది. డాక్టర్ వచ్చి, చూసి, ముందు ఇచ్చి వెళ్ళాడు.
శాంత కుర్చీలో కూలబడింది.
ఎంత ప్రయత్నించినా ఈ బంధన నుండి తప్పించుకోలేదా తను!
ఈ సమస్య కాకపోతే – మరోటి.
కొళాయి గొట్టం విరిగిపోవచ్చు, స్టోర్ రూం తలుపు బిగుసుకు పోవచ్చు, పిల్లి వచ్చి పాలు తాగి పోవచ్చు, ఏదో వెండి గిన్నో మరేదో కనబడకపోవచ్చు… రోజూ ఏదో ఒక ఆటంకం.
రోజూ అనుకున్నా తోటకు వెళ్ళలేదు, పుస్తకం చదవలేదు. ఇవన్నీ చిన్న సమస్యలే కానీ ఆమె చిన్న కోరికలకు కళ్ళెం వేస్తాయి. రోజు గడిచిపోతుంది. రాత్రి అవుతుంది. వెన్నెల వస్తుంది.
“శాంత డాబా మీద నక్షత్రాలు చూస్తూ పడుకుంది. తెల్లవార్లూ అల్లాగే చందమామ నూ, నక్షత్రాలనూ చూస్తూ గడపగలదు. రోజూ చూస్తున్నా వీటి ఆకర్షణ తగ్గదు. అబ్బా ఈ వెన్నెల ఎంత హాయిగా ఉంది! నీలి పట్టుచీర మీద జరీ పువ్వుల్లాగా ఈ నక్షత్రాలెంత బాగున్నాయి! …”
ఆమె భావుకత్వాన్ని ఛేదిస్తూ “ఇక్కడున్నావా ” అంటూ పతిదేవుడు ఏతెంచాడు. ‘బాబుకి జ్వరం తగ్గిందా’ అని పరామర్శించాడు. ‘పొద్దున అనవసరంగా విసుక్కున్నాను’ అన్నాడు పరమ శాంత మూర్తిలా. “రేపటి నుంచి ఒక్క మాటైనా అనను” అంటూ ఒట్టు కూడా వేసాడు.
రేపు.
ఈ రాత్రి తెల్లవారుతుంది..
ఈరోజు చేయలేని పనులన్నీ రేపు చేయవచ్చు. ఆ ఆశతో ఆమె మనసు తృప్తి పడింది. ‘రేపు’ వస్తుంది అనే ఆశతో ఆమె ప్రతిరోజూ గడుపుతోంది.
***
శారదాదేవి రాసిన చాలా కథల్లో భార్యాభర్తల మధ్య సామరస్యం లేకపోయినా స్త్రీ పాత్రలు “రాజీ” పడడమే కనిపిస్తుంది. పగడాలు, పారిపోయిన చిలుక, నిద్ర లేని రాత్రి, ఏమి అదృష్టం వంటి కథల్లో దాంపత్య జీవితంలోని సమస్యలను చిత్రించినా స్త్రీలు ఎదిరించడం కానీ, ప్రశ్నించడం కానీ, విసుక్కోవడం కానీ కనపడదు. తనున్న పరిస్థితి నుండి, భర్త మూర్ఖత్వం నుండి మార్పు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం ఏమీ చేయరు. నాటి కుటుంబ , సమాజ పరిస్థితులకు అనుగుణంగా ‘సర్దుకుపోవడమే’ జరుగు తుంది. కానీ ఆ పాత్రల్లో ఆత్మశోధన, తీవ్రమైన ఆలోచనా స్రవంతి, ప్రకృతి ఆస్వాదన, భావుకత, అనుభూతి అద్భుతంగా చిత్రించారు శారదాదేవి. సమస్యల మధ్య సతమత మవుతూ, మానసిక సంఘర్షణకులోనైనా బయటకు చెప్పుకోలేక అతి సున్నిత మనస్కు లుగా కనబడతారు.
1954 నుండి 1977 వరకూ తిరుపతి పద్మావతి కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేసిన ఆచంట శారదాదేవి గారు తన కథల్లో దాదాపు అన్ని స్త్రీ పాత్రలనీ ఉద్యోగినిలా చిత్రించక పోవడం ఆశ్చర్యమే.
ఆమె కథలను సునిశితంగా పరిశీలించిన ప్రముఖ రచయిత్రి పి. సత్యవతి గారి మాటల్లో –
“ప్రకృతి ఆస్వాదన, సంగీతం పట్ల అభిరుచి, ఎవరినీ నొప్పించని సున్నితత్వం, ఉన్న పరిస్థితుల్లోనే ఏదో ఒక ఉప శాంతిని కనుక్కొని జీవితాన్ని నడుపుకోవటం, కొంత మానసిక విశ్లేషణ ఈమె రచనల్లో ముఖ్యాంశాలుగా ఉంటాయి. స్త్రీల జీవితాలలో జెండర్ పాత్రని గుర్తించటం ఉన్నా దాన్ని ఎదిరించలేని పాత్రలు, ప్రేమ, ఆరాధనలకు ప్రాముఖ్యం, లోకం పోకడ, కొన్ని తాత్వికమైన ఆలోచనలను, అనుభవాలను హాయిగా చదువుకుపోయే లలితమైన శైలిలో రాస్తారు”.
నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక లో ఆచంట శారదాదేవి గారి గురించి రాస్తూ ప్రొ. కిన్నెర శ్రీదేవి అంటారు –
“ప్రకృతి లోని ప్రతి కదలిక ఆమె కు చాలా ఇష్టం. అందుకే తన పాత్రల ఆలోచనలకు వీటన్నింటినీ నేపథ్యాలుగా తన కథల్లో మలుచుకున్నారు. స్త్రీల జీవితాల్లోని వెలితిని గుర్తించారు. కానీ దాన్ని ఎదిరించలేని పాత్రలు…, ప్రేమ, ఆరాధనలకే తన కథల్లో ఎక్కువ ప్రాముఖ్యమిస్తారు. లోకం పోకడల వల్ల స్త్రీలు కోల్పోతున్న స్పేస్ పట్ల తాత్విక మైన ఆలోచనలు, వాటి తాలూకు అనుభవాలను హాయిగా సామాన్య పాఠకుడు సైతం చదువగలిగిన లలితమైన శైలిలో రాసారు”.
ఇంటిచాకిరిని గుర్తించడం, భావుకతను మనసులో నింపుకోవడం – అన్న ఆలోచనే నాటి స్త్రీ లలో, కథా పాత్రల్లో ‘కొత్తదనం’. ఈ మాత్రం మార్పుకి సంతోషించాల్సిందే.
*****
వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

ప్రొ. సిహెచ్. సుశీల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో సుదీర్ఘకాలం పనిచేసి, ప్రిన్సిపాల్ గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్ గా, ఎడిటర్ గా పని చేసారు.
జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనల పై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు.
వీరి నాన్నగారి పేరు మీద విమర్శారంగంలో కృషి చేస్తున్న వారికి కీ.శే. సిహెచ్. లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారాన్ని గత 3 సంవత్సరాలుగా అవార్డు ఇస్తున్నారు. వరుసగా గత మూడేళ్ళలో కడియాల రామ్మోహనరాయ్ , రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కె.పి. అశోక్ కుమార్ గార్లకు ఈ అవార్డుని అందజేశారు.
విద్యార్థినుల చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేసారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం, సాహిత్య విమర్శ రంగంలో “కవిసంధ్య ” ( శిఖామణి) అవార్డు, కిన్నెర ఆర్ట్స్ & కొవ్వలి అవార్డులు అందుకున్నారు.
అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష ( పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు.
రచనలు:
1.స్తీవాదం – పురుష రచయితలు
2. కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారి జీవిత చరిత్ర
3. విమర్శనాలోకనం ( విమర్శ వ్యాసాలు)
4. విమర్శ వీక్షణం ( విమర్శ వ్యాసాలు)
