
అనుసృజన
తుమ్మ చెట్టు
హిందీ మూలం: మంజూషా మన్
తెలుగు అనువాదం: ఆర్. శాంత సుందరి
నా కిటికీ అవతల
మొలిచిందొక తుమ్మ చెట్టు
దాని ప్రతి కొమ్మా
ముళ్ళతో నిండి ఉన్నా
నాకెందుకో కనిపిస్తుంది ఆప్యాయంగా .
ఇది నాతోబాటే పెరిగి పెద్దదవటం
చూశాను.
ఆకురాలు కాలం వచ్చినప్పుడల్లా
దీని ముళ్ళకి
యౌవనం పొడసూపినప్పుడల్లా
ఆ ముళ్ళని చూసి
అందరి మనసులూ నిండిపోయేవి
ఏదో తెలీని భయంతో,
అందరూ దూరమైపోతూ ఉంటే
ఈ తుమ్మచెట్టుకి
దానిమీద నా మనసులో
ఉప్పొంగింది మరింత ప్రేమ
ఎందుకంటే ఈ కృత్రిమమైన ప్రపంచంలో
అందరూ
తమ ముళ్ళని
దాచిపెడతారు చాకచక్యంగా,
కప్పుకుంటారు
సున్నితత్త్వమనే దుప్పటిని
మనశ్శరీరాలని
ఎక్కువ గాయపరచింది
అలాంటి మనుషులే.
ఈ రెండు నాల్కల మనుషులకన్నా
నాకు నా తుమ్మచెట్టంటేనే
ఎక్కువ ప్రేమ
అది తన ముళ్ళని దాచుకోదు
మోసంచేసే మనుషుల్లా.
దీని ముళ్ళలో కూడా నాకు
కనిపిస్తుంది ఒక కోమలత్వం
కనిపిస్తుంది
ఒక నిజాయితీ.
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
