
చిత్రం-52
-గణేశ్వరరావు
‘పుష్పాలంకరణ’ కోసం అన్ని ప్రదేశాల్లో ప్రత్యేకంగా కొన్ని సంస్థలు ఉన్నాయి. . మీరు కోరుకున్న పద్ధతిలో పూలతో వేదికను …పెళ్ళి కూతుర్ని అలంకరిస్తారు, సందర్భానుసారంగా పూలతో ఏ అలంకరణ అయినా ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థల సృజనాత్మక శక్తికి పరిమితి లేదు, రక రకాల రంగు రంగుల పూలను ప్రత్యేకంగా ఏర్చి కూర్చి ఒక కొత్త అందాన్ని కళ్ళ ముందు నిలబెడతారు. నవ్యతతో అందరినీ అవి ఆకర్షిస్తాయి. పూలు చెట్టుకి అందాన్నిస్తాయి, కోసిన పూలను అలంకరిస్తూ ఈ సంస్థ వాటి అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. కవి ప్రసాదమూర్తి పూల బజారు చూసిన తన్మయత్వంతో ‘పూలమ్ముకొని బతికి పోయిన బావుండు’ ….’జ్ఞాపకాల జాజులు / మమకారాల మందారాలు / మమతల మల్లెలు .. కలల కనకాంబరాలు / చలాకీ ఊహల గులాబీలు / ముద్దు చూపుల ముద్దబంతులు / పాటల పారిజాతాలు / ఆశల సంపెగలు ..’అంటూ మనల్ని పూల స్వర్గంలోకి తీసుకెళతారు.ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని పూలతో అలంకరించింది అమెరికా లోని ఒక సంస్థే! ఆ అందాలరాశి అందాలు పూలు ద్విగుణీకృతం చేయడం లేదూ! అమ్మాయి వొళ్ళంతా గులాబీ రంగు ఎలా పరచుకుందో వేరే చెప్పాలా? ఇటువంటి కవితా వస్తువులూ, ఛాయా చిత్రాలు అందరినీ ఆకర్షించడానికి కారణం – వాటిలోని సున్నితమైన చిత్రణ, అవి కలిగించే భావోద్రేక స్థితి. మల్లెలు అనగానే వాటి తెల్లని రంగుతో పాటు వాటి సువాసన, మృదు స్పర్శ గుర్తుకు రావా? పదాలతో అలంకరిం చిన కవితో పాటు, పూలతో అలకరించిన designer ఊహా చమత్కారాన్ని మెచ్చుకోకుండా ఉండ గలమా!*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
