
వసివాడిన ఆకులు
(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– శ్రీధర్ బాబు అవ్వారు
వీరులు పుట్టేదెల
దగ్ధమైన పౌరుషపు మసి దొర్లుతున్న వేళలో…
సడలి ఊగులాడుతున్నా
బిగుసుకోవాల్సిన నరాలిపుడు…
మారిపోయిందా అంతా…
మర్చిపోయామా… గత రుధిర ధారల చరిత
కలుగులో దాక్కుందా వీరత్వం.
ఇప్పుడు మ్యూజియంలో చిత్రాలై నవ్వుతున్నారు పోరుబాట సాగించిన ముందుతరం…
వేళ్ళు పిడికిళ్ళెలా అవుతాయి….!
అడుగు భయాందోళనల మడుగైనప్పుడు.
వెనుక వెనుకగా దాపెడుతున్నావుగా
వడలిపోయిన మెదడును మోస్తున్న తలను…
పిడికిలిని మరిచి
వసివాడిన ఆకులై మసిలాడుతున్నట్లే…
నాలుగు గోడల మధ్య సమాజాన్ని మరిపించి బందింపబడ్డ కాన్వెంట్ ముద్దుబిడ్డలు.
మత్తుగా జోగాడు తున్నారు
స్వార్ధపు కప్పలను మింగిన పాముల్లా….
చాన్నాళ్ళ క్రితం అనుకుంటా
ఎదుగుతున్న దశ
ఎలుగెత్తి అరిచేది అన్యాయమెదిరిస్తూ…
అంతా కనికట్టు…
ఏలుతున్న తలల నుండి ఎగజిమ్మిన
ఆలోచనలతో పేర్చిన శవ పేటిక…
ఇతర ఇంకేనాయకత్వం చెల్లదు
వారసత్వం తప్ప….
నడూవ్ గీసిన గీతలపైనే….
కాళ్ళు అదుపు తప్పితే తప్పదు కొరడా వేటు…
అయినా…
అసలు శవాలు ఎక్కడ కాళ్ళు కదిలిస్తాయి…!
కల అయినా ఒకటి కను కమ్మనిది.
బిగ్గరగా అరిచినట్లు…
చెయ్యెత్తి నినదించినట్లు..
చూపుడువేలు సూటిగా గుండెల్లోకి దిగ్గొట్టినట్లు.. మనసంతా సింధూరపు రంగు నింపుకున్నట్లు..
అదిగో అటుచూడు…
తీగలాంటి మొక్క ఒకటి తుఫాన్ గాలితో
యుద్ధం చేసి నిలదొక్కుకొని నిల్చుంది.
*****

