జీవితం అంచున -13 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

పెద్దమ్మాయి దిగులు మొహంతో ఇంటికి వచ్చింది. నేను నా వరకే ఆలోచిస్తున్నాను కానీ, నేను లేకుండా ఏడాది పాప, ఇద్దరు స్కూలుకి వెళ్ళే పిల్లలతో రెండు స్వంత క్లినిక్స్ నడుపుతున్న అమ్మాయికెంత ఇబ్బంది. పైగా నేను ఒక నిర్ణీత సమయానికి తిరిగి వస్తానన్న ఆశ లేదు. వెళ్ళటం ఎంత కష్టమో ఈ పరిస్థితుల్లో తిరిగి ఈ నేల మీద అడుగు మోపటం కూడా అంతే కష్టం. అమ్మాయి వారానికి ఐదు రోజుల చప్పున నెలకు నాలుగు వేల డాలర్లు ఇచ్చి ఒక పంజాబీ ఆవిడను చంటిదాని కోసం పెట్టుకుంది. పిల్లలను స్కూలుకి ఇతరేతర వ్యాపకాలకు తీసుకుని వెళ్ళటానికి తన పని సమయాన్ని కుదించుకో వలసి వచ్చింది.

అమ్మాయికి ఇంటిలో ఇబ్బందుల కన్నా నా నర్సింగ్ కోర్సు అర్ధాంతరంగా ఆగి పోతుందేమోనన్న బాధ మరీ ఎక్కువగా వుంది. నా టిక్కెట్ల బుకింగ్ కన్నా ముందుగా CPR and First Aid Certification Course గురించి రెండు మూడు చోట్ల ఎంక్వయిరీ చేసింది. ఒక్క రోజులో నేర్పించి సర్టిఫికేట్ ఇచ్చే ప్రభుత్వ గుర్తింపు వున్న సంస్థలో  CPR and First Aid Certification Course నిమిత్తం నా పేరుని నమోదు చేసి ఐదు వందల డాలర్ల ఫీజు కట్టేసింది.

మూడు రోజుల వ్యవధిలో ఫస్ట్ ఎయిడ్ కోర్సు. ఆ మరుసటి రోజుకి నా అమెరికా టిక్కెట్లు బుక్ అయ్యాయి.

బయట ఏ ప్రైవేటు ఇన్స్టిట్యూట్ నుండి అయినా ఫస్ట్ ఎయిడ్ కోర్సు సర్టిఫికేట్ సబ్‌మిట్ చేసి కోర్సు ఆఖరులో రాగలిగితే నేను ప్లేస్మెంట్ చేసి కోర్సు పూర్తి చేయ గలుగుతానని తన ప్రయత్నం. ఎనిమిది నెలల గడువు వుంది సిములేషన్ ప్రాక్టికల్స్ కి ఆ పైన ప్లేస్మెంట్ కి. భగవంతుని దయ, నర్సింగ్ ప్రాప్తం వుంటే అమ్మతో సహా అప్పటికి తిరిగి రావాలి.

అనుమతిస్తే గిస్తే తిరిగి రావటానికి ఆస్ట్రేలియా నాకు ఇస్తుందేమో తప్ప టూరిస్ట్ గా అమ్మకు అనుమతి లభించటం కష్టం. అమ్మను వదిలి నేను రావటం జరుగదు. అటువంటప్పుడు నర్సింగ్ పూర్తి చేయటం కుదరదు. అయినా ఇన్ని ‘నో’ ల మధ్య ఎక్కడో రెపరెపలాడే సన్నటి చిగురాశ… ఫస్ట్ ఎయిడ్ కోర్సులో చేర్పించింది.

అనుకోని పయనం. కాలమెలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది కదా. కాలాలకతీత మైన జీవితమేదీ వుండదు.

నాలుగు రోజుల్లో అమెరికా ప్రయాణం. అక్కడి నుండి ఇండియాకి మళ్ళీ ఎప్పుడో…

సర్టిఫికేషన్ కోర్సు ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం ఆరు వరకూ ఏకధాటిగా జరిగింది. మధ్యలో లంచ్ కోసం అరగంట బ్రేక్ ఇచ్చారు. కోర్సులో అన్ని వయసుల వారు, ఉద్యోగస్తులు వున్నారు. ఇక్కడ మెడికల్ ఫీల్డులో, హెల్త్ ఇండస్ట్రీలో ఉద్యోగాలకు ఈ సర్టిఫికేట్ ఒక ప్రాధమిక అవసరం.

ప్రథమ చికిత్స (FirstAid) కోర్సులో ప్రధానాంశాలు…

-అత్యవసర పరిస్థితిని ఎలా సరిగ్గా అంచనా వేయాలి

-DRSABCD ప్రణాళికను అనువర్తించటం

-పెద్దలు మరియు శిశువుల పై CPR పద్ధతులు

-ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED)ని ఉపయోగించడం

-రక్తస్రావం, కాలిన గాయాలు మరియు పగుళ్ళకు ప్రథమ చికిత్సా విధానాలు.

-రకరకాల ఫ్రాక్చర్  లకు బ్యాండేజీ కట్టడంలో శిక్షణ

-అనాఫిలాక్సిస్, ఆస్తమా మరియు మూర్ఛలు వంటి వైద్య పరిస్థితులను నిర్వహించడం

-పాము/సాలీడు కాటు, విషాలు మరియు ఉక్కిరిబిక్కిరి చేయడం వంటి వైద్య పరమైన అత్యవసర పరిస్థితులను నిర్వహించడం

-సంక్రమణ నియంత్రణ విధానాలు

-తీవ్ర ఉష్ణోగ్రతలకు గురికావడాన్ని నిర్వహించడం

-కంటి & మృదు కణజాల గాయాలకు ప్రథమ చికిత్స అందించడం

-అనారోగ్యం మరియు గాయపడిన వారిని అంచనా వేయడం మరియు తరలిం చడం

-ప్రథమ చికిత్సకుని చట్టపరమైన బాధ్యతలు

-ప్రాథమిక అనాటమీ మరియు ఫిజియాలజీ

షాక్ మేనేజింగ్, వగైరాలన్నీ సంక్షిప్తంగా నేర్పించి, ప్రాక్టికల్ గా CPR మరియు ఫ్రాక్చర్లకు బ్యాండేజ్ కట్టించారు. అసెస్మెంట్ రాయించి సర్టిఫికేట్ అదే రోజున సాయంత్రం ఆరుకి ఇచ్చేసారు.

ఈ సర్టిఫికేట్ వాలిడిటీ ఒక సంవత్సరమే.

ఈ సర్టిఫికేషన్ కోర్సులో ముఖ్యమైనది CPR (Cardiopulmonary Resuscitation) తెలుగులో చెప్పాలంటే “గుండె పునః నిర్మాణం”

ఇది గుండె కొట్టుకోవడం ఆగిపోయిన వ్యక్తి ప్రాణాలను రక్షించడానికి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే పద్ధతి. ఇందులో బాధితుడి నోటిలోకి గాలిని ఊపిరితిత్తుల్లోకి బలవంతంగా పంపడం మరియు బాధితుడి ఛాతీ పై నొక్కడం ద్వారా శరీరంలో రక్తం ప్రవహిస్తుంది. CPR మరియు నోటి నుండి నోటి పునరుజ్జీవనం కోసం మ్యానికన్ లను (డమ్మీలు) వాడారు. మ్యానికన్లో డిస్పోజబుల్ ఎయిర్‌వేలు, ఊపిరితిత్తులు మరియు ఫేస్ కవర్‌లు ఉన్నాయి. ఇది శిక్షణ అనుభవాన్ని సాధ్యమైనంత ఖచ్చితమైనదిగా చేసింది.

అడల్ట్ మ్యానికన్ లు, బేబీ మ్యానికన్ ల పైన వేరువేరుగా శిక్షణ ఇచ్చారు.

అదే రోజున Firstaid సర్టిఫికేట్ ని స్కాన్ చేసి కాలేజీలో ఇచ్చేసి ఆస్ట్రేలియా నుండి అమెరికా విమానం ఎక్కేసాను. కళ్ళు మూసుకుని సీటుకి జారగిలపడ్డాను.

ఒక మజిలీ నుండి మరో మజిలీకి.

అటునుండి మరింకో మజిలీకి.

చివరాఖరి మజిలీకి చేరేదెన్నడో…

యేసుదాస్ పాట చరణాలు లీలగా మదిలో మెదిలాయి…

“ఓ బాటసారి

ఇది జీవిత రహదారి…

ఎంత దూరమో

ఏది అంతమో…

ఎవరూ ఎరుగని దారి ఇది

ఒకరికి స్వంతము కాదు ఇది…

కడుపు తీపికి రుజువేముంది

అంతకు మించిన నిజమేముంది…”

మానసిక అలసటతో నిద్రలోకి జారిపోయాను.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.