జీవితం అంచున -14 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

అసలు గమ్యానికి ముందు మరో మజిలి.

అయినా అసలు గమ్యం అనుకుంటామే కాని, ఈ జీవి చేరాల్సిన తుది మజిలీకి ముందు తాత్కాలిక మజిలీలే ఇవన్నీ.

భూగోళం రెండో వైపెళ్ళినా మానసగోళంలో మార్పేమీ రాలేదు.

కుటుంబం మారినా అమ్మ పాత్రలో వైవిధ్యమేమీ లేదు.

‘నా’ అన్న వైయక్తికమెపుడూ భవబంధాల ముందు దిగదుడుపే కదా.

చిగురించి పుష్పించే కొమ్మలువృక్షానికెపుడూ వసంతమే.

ప్రదేశం మారిందే తప్ప మళ్ళీ ఆంగ్ల దేశమే… తిరిగి అదే పాశ్చాత్య సంస్కృతి.

ఇల్లు మారిందే తప్ప మళ్ళీ ప్రేగు బంధమే… మరో బిడ్డ పై అదే తరగని మమకారం.

‘అసలు’ బిడ్డల కన్నా మెండుగా మురిపించే ముద్దుల మూటలు గట్టే ‘వడ్డీ’ల మనవలు.

ఓ సారి నన్ను ఒక స్నేహితురాలు అడిగింది…

“ఆస్ట్రేలియాలో పెద్దమ్మాయి దగ్గర ఎక్కువగా వుంటావు… అమెరికాకి పెద్దగా వెళ్ళవు… నీకు పెద్దమ్మాయంటే ఎక్కువ ప్రేమా…” అని

మూర్ఖపు ప్రశ్న…!

వున్న రెండు కళ్ళల్లో ఏ కన్నంటే ఇష్టమంటే ఏం చెబుతాము ?

ప్రతి తల్లి సాధారణంగా పిల్లల పరిస్థితులను, వాళ్ళ అవసరాలను బట్టి ఎక్కడ తన ఉనికి అవసరమో అక్కడే వుండటానికి ప్రాముఖ్యతనిస్తుందే తప్ప తన సదుపాయం, సౌలభ్యం గురించి ఆలోచించదు. అదే అమ్మ ప్రేమంటే. అందుకే స్వలాభాపేక్ష లేని నిస్వార్ధ బే-షరతు ప్రేమను అమ్మ ప్రేమతో పోలుస్తారు.

ప్రత్యామ్నాయం లేని అమ్మతనంలో నేను మునిగి తేలుతున్నా ఎప్పుడెప్పుడు అమ్మని చూస్తానా అని ఎదురు చూస్తూనే వున్నాను.

నన్ను నేను పంచుకున్నా కొరత ఎపుడూ మిగిలే వుంటుంది.

నేను మరో రెండు ‘నేను’లు అయి తలా చోట వుండగలిగితే తప్పఈ మనసు దాహం తీరదేమో.!

చిన్నమ్మాయి వాళ్ళకు వెంటనే గృహ ప్రవేశ ముహూర్తాలు కుదరలేదు. ఇంత కాలానికి అమెరికా వచ్చి కనీసం గ్రహ ప్రవేశం అయ్యే వరకైనా ఆగక పోవటానికి మనస్కరించ లేదు.

అమ్మ మానసిక స్థితి రోజు రోజుకీ దిగజారిపోతోందని బంధువులు చెబుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా సీసీ టీవీ కెమెరాల్లో అమ్మను గమనిస్తున్నాను.

గురువారాలు క్రమం తప్పకుండా కాలేజీ జూమ్ మీట్ లు హాజరు అవుతున్నాను. జూమ్ మీట్లో నా ముగ్గురు స్నేహితులూ పలకరింపుగా నవ్వి చెయ్యి ఊపుతారు. నేను కాలేజీకి  బుధవారాలు ఎందుకు రావటం లేదని ప్రశ్నించటం కూడా అసభ్యత అని భావించే సంస్కారం వారిది.

బుధవారాలు క్లాసులో మా టీచర్ అస్సెస్మెంట్స్ కి సంబంధించిన ప్రశ్నలను వేయటం, విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టటం, సరైన సమాధానం పైన వివరణ ఇవ్వటం జరుగుతుంది. క్లాసులు మిస్ అవుతున్న కారణంగా నేను అస్సెస్మెంట్స్ కోసం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తోంది. అర్ధరాత్రుళ్ళ వరకూ చదువుకునే నన్ను చూసి చిన్నల్లుడు ఆశ్చర్యపోయేవాడు.

పైగా మా చిన్నమ్మాయితో “చదువు పైన మీ అమ్మకు వున్న శ్రద్దాసక్తులలో కనీసం పదో వంతు నీకున్నా బావుండేది” అంటుంటే నాకు ఇబ్బందిగా వుండేది.

Healthy body systems and medical terminology అనే అస్సెస్మెంట్స్ లో digestive system (జీర్ణ వ్యవస్థ), skeletal system (అస్థిపంజర వ్యవస్థ), Circulatory system (ప్రసరణ వ్యవస్థ) ల రేఖాచిత్రాలు వేయవలసి వుంది. రేఖాచిత్రాలు వేసి లేబులింగ్ చేయవచ్చు లేదా గూగుల్ నుండి లేబుల్డ్ రేఖాచిత్రాలు తీసుకుని జవాబులకు అటాచ్ చేయవచ్చు. అంతగా సాంకేతిక నైపుణ్యం లేని నాకు అస్సెస్మెంట్స్ లో అల్లుడు చాలా ఆత్మీయంగా సాయపడ్డాడు.

అమ్మాయి వుండే ప్రాంతంలో చాలా మంది ఇళ్ళ ముందూ, గుమ్మంలోనూ వాళ్ళ దేశ జెండాలు పాతి వున్నాయి. ఏమయినా స్వాతంత్య్ర దినోత్సవమా లేక జనతంత్ర దినోత్సవమా అందరి ఇళ్ళ ముందుఎందుకు జెండాలు పాతి వున్నాయని అల్లుడిని అడిగాను.

కొంత మంది ఆంగ్లేయులకు దేశభక్తి చాలా ఎక్కువని, గుండెల్లో భక్తంతా జెండా చేసి గుమ్మంలో గుచ్చుతారని చెప్పాడు.

పుట్టిన గడ్డను, పుట్టించిన అమ్మను వదిలిన నా చెవుల్లో ఎందుకో సీసం పోసినట్టు వినిపించాయి అల్లుడి మాటలు.

పుట్టగొడుగుల్లా పెరిగిపోయిన విదేశీయుల ఇళ్ళ మధ్య వాడి స్థానికతను చాటుకుని సంతృప్తి  పడుతున్న స్వదేశీయుడు ఆంగ్లేయుడు. స్వదేశంలో జల్లెడ పట్టినా ఆంగ్లేయు లు ఎందుకు ఉండరో అర్ధం చేసుకోలేని దేశద్రోహిని నేను.

ఒక అమ్మాయిని ఆస్ట్రేలియా ఇవ్వటం, మరో అమ్మాయిని అమెరికా పంపటమే ప్రెస్టేజీగా భావించిన సగటు దేశభక్తురాలిని నేను.

వలసపోయిన బిడ్డల వెనుకే సాగిపోయే గమ్యం లేని బాటసారిని.

కన్నతల్లిని దిక్కు లేని అనాధగా వదిలేసిన దౌర్భాగ్యురాలిని.

మనసులో మథనం ఎక్కువ కాసాగింది.

ఇండియాకి వెళ్ళే రోజులు లెక్కపెట్టుకుంటూ ఓ కంట అమ్మను గమనిస్తూ రోజులు బరువుగా ఈడ్చుకొస్తున్నాను.

ఒక రోజున “Empowerment of older people” నోట్స్ తయారు చేసుకుంటూ అమ్మను తలుచుకుంటూ యథాలాపంగా అమ్మకి ఫోను కలిపాను. ఒక్క రింగ్ కే ఫోను తీసే అమ్మ ఎంతకీ ఫోను తీయ లేదు. కంగారుగా మళ్ళీ మళ్ళీ కలిపాను. అటు నుండి స్పందన లేదు. వెంటనే కెమెరాల  వంక చూసి అమ్మ ఇంట్లో కనిపించిన సినారియోకి దిగ్భ్రాంతికి గురి అయ్యాను.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.