
సంఘర్షణ లోంచి
-గవిడి శ్రీనివాస్
కోర్కెలు ఎక్కిపెట్టే బాణాలు
ఎడారి జీవిత ప్రయాణానికి కొలువులౌతాయి.
ఇవి ఎప్పటికీ తడి తడిగా
ఆనందాల్ని విరబూయలేవు.
మనకు మనమే
ఇనుప కంచెలు వేసుకుని
అసంతృప్తి తీరాలని వెంబడిస్తున్నాం.
ప్రకృతి జీవి కదా
స్వేఛ్చా విహంగాల పై
కలలను అద్దుకుని బతికేది.
ఎన్ని రెక్కలు కట్టుకు ఎగిరినా
బాధను శ్వాసిస్తే
ఏ కాలం ఏం చెబుతుంది.
ప్రశ్నించు
సమాధానం మొలకెత్తించు
లోలోపల అగ్ని గోళాలని రగిలించు.
ఎప్పుడు గొంతు విప్పాలో
ఎప్పుడు మౌనం వహించాలో
అనుభవం నేర్పిన పాఠాలలోంచి
పరిమళించాలి కదా మనం.
మొక్కని నులిమి ఆలోచనల మధ్య
చెట్టుగా మారటం
పది మందికి నీడ నివ్వటం
సవాలుతో సహవాసం చేయటం లాంటిదే .
అనేక సంఘర్షణల్లోంచి
మొలకెత్తడం
ఆలోచించడం
ప్రకృతిలా వికశించటంలోనే వుంది జీవితం.
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.

“అనేక సంఘర్షణల్లోంచి
మొలకెత్తడం
ఆలోచించడం
ప్రకృతిలా వికశించటంలోనే వుంది జీవితం.”
కవితకు అద్భుతమైన ముగింపు , ముక్తాయింపు.
మీరు ఈ కవిత ఏ ప్రక్రియ లో రాసారు