
అమృత కలశం
– శింగరాజు శ్రీనివాసరావు
అనాటమీలో తప్ప ఆవిర్భావంలో తేడా లేదు
పలక పట్టకముందే వివక్షకు తెరలేచి
చదువుకోవాలనే ఆశను ఆవిరిగా మార్చింది
లక్ష్మణరేఖల మధ్య బంధించబడిన బాల్యం
గుంజకు కట్టిన గాలిపటమై ఎగరలేక
నాలుగు గోడల మధ్య శిలువ వేసుకుంది
రేపటి పొద్దు జీవితానికి ముగ్గు పెడుతుందని
పరిచయం లేని బంగారు మొలతాడును తెచ్చి
పందిరిలో బందీని చేస్తే, మనసులో ఊహలు మసకెక్కాయి
ఇంటి పేరు ఎగిరిపోయి, ఇల్లాలు పురుడు పోసుకుంది
స్వేచ్ఛకు సంకెళ్ళు పెరిగిపోయి, తనను తానే మరిచిపోయి
మెట్టినింటి మణిదీపంగా తనను మలుచుకుంది
భ్రూణాల రక్షణ కోసం తన పక్షాలను పరచి
చివరకు జటాయువు కోసం తన రెక్కలను
కాల్చుకున్న సంపాతిలా మిగిలి పోయింది
సంప్రదాయపు కుంపట్ల మీద మదిలోని
ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు పొగచూరిపోయి
ఆమె తన ఉనికినే కోల్పోయే దశకు చేరింది
పరిస్థితులను బట్టి తన రూపాన్ని తనే మార్చుకుని
అందరికీ తలలో నాల్కలా కలిసిపోయిన మగువ
తను కాలుతూ సువాసనలను అందించే సాంబ్రాణి ధూపం
అపవిత్రత అంటని స్వచ్ఛమైన హిరణ్యం
సంసార వృక్ష పునాదుల శాశ్వతత్వం కోసం
భువికి భగవంతుడు పంపిన అమృత కలశం….
*****

నేను భారతీయ స్టేట్‌బ్యాంకులో డిప్యూటిమేనేజరుగా బాధ్యతలు నిర్వహించాను. పదవీ విరమణ అనంతరం సాహిత్యం మీద అభిలాషతో 2016 సంవత్సరం నుంచి కవితలు, కథలు వ్రాయడం మొదలుపెట్టాను. నా మొదటి కవితను మరియు మొదటి కథను ప్రచురించినది “ఆంధ్రభూమి వారపత్రిక”. మొదటిసారిగా “నేలతల్లి” కథకు ఆంధ్రభూమి దినపత్రికలో ద్వితీయ బహుమతి లభించింది. ఇప్పటి వరకు సుమారు 50 కథల పైగా వివిధ వార, మాస పత్రికలలోను, అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యాయి. అందులో 20 కథలకు బహుమతులు లభించాయి. రెండు వందల వరకు కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వాటిలో 30 కవితల వరకు బహుమతులు పొందాయి.
