
అప్రమత్తం ( కవిత)
-కందుకూరి శ్రీరాములు
అరచేతిని ఎంత తెరిపిద్దామనుకున్నా
తెరుచుకోదు
భయాన్ని గుప్పెట్లో నలిపేస్తుంటుంది
తిరుగుతుంటాం
మాట్లాడుతుంటాం
గదంతా వెలుతురున్నా
ఎక్కడో ఒక దగ్గర
ఓ మూల చీకటి చిటుక్కుమంటుంది
బుగులుపులుగు గదంతా తిరుగుతుంటుంది
ఎంతకీ తెల్లారనే తెల్లారదు
తెల్లారినట్టు భ్రమపడి
బాధపడుతుంటాం !
భయం నిశ్శబ్దంలో
అపశబ్దపు పదాలు ఆలోచనలో మెదులుతుంటాయి
ఏ చెరువు కట్ట తెగినట్టు ఉండదు
ఏ పురుగు కరిచినట్టు ఉండదు
శబ్దం వినని శబ్దం వినబడుతూ ఉంటుంది
ముందు జాగ్రత్తగానే డోర్ పెట్టేసే
వేసుకోవలసిన మందులు వేసుకొని పడుకుంటాం
వాటి పనేదో అవి చేసుకుంటూ పోతుంటాయి
మన పనేదో మనం చేసుకుంటూ పోతూనేవుండాలి
అదే కదా గుండెకు ఒకింత ధైర్యం !
గుండె చూడు
నిర్విరామంగా నడుస్తూనే ఉంటుంది
ఏదీ పట్టించుకోదు
మనమూ అలానే ఉండాలని అనుకుంటాం
జరగకూడదు జరుగుతుందేమో అని అప్రమత్తంగా ఉంటాం !
అపోహ పడటం మాత్రం ఒక వెర్రి లక్షణం !
అకస్మాత్తుగా తుపాకి కాల్చటానికి
ఎదురుగా ఎక్కుపెట్టాడనుకో
ధైర్యం తెచ్చుకొని కాల్చమని ఎదురు వెళ్ళు
కాల్చలేడు
ఎందుకింత మొండిగా
ముందుకు వస్తున్నాడని
ఎక్కుపెట్టిన వాడు
వెనక్కి తగ్గుతాడు
అప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి !
అప్రమత్తం కావాలి !!
*****

కందుకూరి శ్రీరాములు సిద్ధిపేట జిల్లా రావురూకల గ్రామంలో జన్మించారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ఇబ్రహీంపట్నం డిగ్రీకాలేజీలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. 1995లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును గెలుచుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా కవిత్వం అల్లుతున్నారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు, సి.నా.రె. కవితా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం వంటి అనేక అవార్డులు అందుకున్నారు.
వీరి కవితా సంపుటులు: దివిటీ (1974), వయోలిన్ రాగమో వసంత మేఘమో (1994), సందర్భం (2001), కవ్వం (2002), దహన కావ్యం (2003), పీఠభూమి (2005), వెన్నెల బలపం (2008), రావురూకల (2009), తెలంగాణ రథం(2013), అలుకు పిడుచ (2014).

బాగుంది సార్