
ఆమె ఒక ప్రవాహం
-గవిడి శ్రీనివాస్
నీవు
నా ప్రపంచంలోకి
ఎప్పుడు సన్న సన్నగా అడుగులు
వేశావో తెలీదు కానీ
ఒక వెన్నెల వచ్చి తట్టినట్టు
ఒక వేకువ లేపి మనసిచ్చినట్టు
ఒక పూల తోట
అత్తరు వాసనలు నింపినట్టు
నా చుట్టూ తీయని పరిమళం నింపావు.
నాపై నీ కలల పిట్టలు వాలేవి
నాలో ఆరాధన వెలిగేది.
నడిచిన దూరాలు
ఎక్కిన కొండలు
గుండె లోతుల్లోంచి తడిచేసిన
దృశ్యాలు కళ్ళను తడుపుతూ
అలా కుదుపుతూ ఉండేవి.
కళ్ళలో వెలిగే దీపాలను చూసి
కన్నీళ్ళతో కౌగిళ్ళు
తడిసిపోయేవి.
ఆరుబయట
కాల్వవెంట పడవల్లో ప్రవహించాం.
ఎన్ని జ్ఞాపకాలు
కురుస్తున్నాయి.
ఆనాటి వెన్నెల ఆకాశాన్ని
దృశ్యాలుగా పరుస్తున్నాయి.
మనసుకి తోడు మాట
మాటే నీవైనపుడు
ప్రయాణం నీవనుకున్నపుడు
జలపాతాలు జాలువారాయి.
మబ్బులు మల్లెల్ని కురిసి పోయాయి.
తపించే మనిషి కోసం
పరితపించే మనసుకోసం
గుండె ఎంతగా కొట్టుకుందో కదా..
అయినా నీవు లేవు
నీ ప్రపంచం లేదు
కాలం వేగంగా పరుగులెత్తింది.
చెరపలేని అనుభవాల్ని అనుభూతుల్ని
ఈదుకుంటూ
జ్ఞాపకాల్లోకి ప్రవహిస్తూ
ఆమె
అలా నిశ్చలంగా వుంది….!
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
