జీవితం అంచున -19 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

అమ్మ పాలవాడు పాలు వేయటం మానేయటానికి కారణాలు ఆలోచిస్తోంది.

ఇప్పుడు అమ్మ దృష్టిలో నాతో సహా అందరూ అనుమానాస్పదులే…అందరూ శతృవులే. అమ్మకు చురకత్తుల్లాంటి కెమెరాల నిఘాలో తను శత్రు కూటమిలో చిక్కుకు పోయిన భావన.

పాలవాడు రాకపోవటానికి కారణం ఇంట్లో పెట్టిన కెమెరాలని అమ్మకి అనుమానం రాజుకుంది.

పాలవాడు రావటం మానేసాడని పాలు కాశి తెస్తున్నాడని నాకు ఫిర్యాదు చేసింది.

“పాలవాడికి కరోనా వచ్చిందట. అందుకే మానేసాడు. ఈ వయసులో నీకు కరోనా సోకితే కోలుకోవటం కష్టం. పది ఇళ్ళల్లో పాలు వేసే వాళ్ళకి, పైగా కరోనా సోకిన వాళ్ళకి ఎంత దూరంగా వుంటే అంత మంచిది..” అన్నాను పాపం పాలవాడికి లేని కరోనాను అంటగట్టి.

ఆ మాట విన్న అమ్మ దుఃఖం మరింత పెరిగిపోయింది.

అతనికి కరోనా వచ్చిందన్న కఠోరమైన మాటను తట్టుకోలేక అమ్మ చెప్పలేనంత మానసికోద్వేగానికి లోనయ్యింది.

కరోనాతో ఇబ్బంది పడుతూ అతను చికిత్స కోసం డబ్బుకి ఎంత అవస్థ పడుతున్నాడోనన్న దిగులు ఆమెకు అంతకంతకూ ఎక్కువయ్యింది.

ఏదో విధంగా పాలవాడికి అందచేయాలని పాతిక వేలు కట్టకట్టి పెట్టింది. తెలివిగా ఎవరికో వడ్డీకి అడిగాడు ఈ డబ్బు అతనికి అందచేయాలంటూ యాదమ్మని, వంట మనిషిని సాయం అడిగింది.

వారెవరూ ఆమె కోరికను మన్నించక పోవటంతో రాను రాను అమ్మకి అందరూ కలిసి తనను అతనికి దూరం చేయటానికి ఏదో కుట్ర పన్నుతున్నారన్న అనుమానం బల పడింది.

కాశీని కెమెరాలు తీయించేయమని వేధించసాగింది.

తనను చూడటానికి తరచూ వచ్చే మనుమలను కెమెరాలు తీసేయమని ప్రాధేయ పడింది.

“కెమెరాలు తీయించకపోతే నేను ఇల్లు మారిపోతాను. చుట్టూ గురి పెట్టిన తుపాకుల్లా ఈ కెమెరాల మధ్య నాకు స్వేచ్ఛలేని ఈ ఇంట్లో నేనుండలేను. ఈ ఇల్లు నాకు జైలులా వుంది” అంటూ రాద్దాంతం చేయటం మొదలు పెట్టింది.

ఎవ్వరూ తన మనసును అర్ధం చేసుకోవటం లేదని, తన గోడును వినిపించు కోవటం లేదని తను ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవటమొక్కటే మార్గమని నిర్ణయించు కుంది.

“మీరు వచ్చేవరకూ ఈ నాలుగు రోజులపాటు మీ కజిన్ కూతురిని పిలిపించండి. ఏదోటి మాటాడుతూ ఒక మనిషి తోడుగా వుంటే అమ్మకి మైండ్ కొంచం డైవర్ట్ అవుతుంది” అంటూకాశీ నాకు సలహా ఇచ్చాడు.

ఎన్ని విధాలుగా సముదాయించినా అమ్మ ససేమిరా అందుకు ఒప్పుకోలేదు.

పైగా అమ్మ “నీకు తెలియదయ్యా, ఆ పిల్ల అతను వచ్చినప్పుడు గుడ్లప్పగించి చూస్తుంది. అతను చాలా ఇబ్బంది పడి ఇంటికి రావటానికి మొహమాట పడుతున్నాడు. అందుకే పంపేసాను. మళ్ళీ ఈ మాట ఎవరి దగ్గరా అనకు” అని నమ్మిన బంటు కాశీకి రహస్యంగా చెప్పింది.

ఇంట్లో వున్న అమ్మాయిని అమ్మ వద్దని పంపించేశాక నా మాట మీద కాశీ మా ఇంట్లోనే హాలులో పడుకుంటున్నాడు.

అమ్మ ఆత్మ బంధువు తరచూ రావటం, తన కజిన్ కూతురు గుడ్లప్పగించి చూడటం, అతను ఇబ్బంది పడటం…. అమ్మ ఊహలన్నీ విన్న నేను చలించి పోయాను.

ఎప్పుడెప్పుడు అమ్మ దగ్గర వాలిపోదామా అని ఎదురుచూస్తున్నాను.

అతను రాకపోవటంలో నా హస్తం కూడా వుందని నాతో మాటాడటం మానేసింది అమ్మ. ఆమె ఫోనుకి పలికేది కాదు. అమ్మతో మాటాడకపోతే నాకు మహా నరకంలా వుండేది. నేను రోజూ వంటమనిషితో, యాదమ్మతో, కాశీతో, మాటాడి అమ్మ బాగోగులు తెలుసుకుంటూ, కెమెరాల్లో చూస్తూ వుండిపోయేదానిని.

ఈ మధ్య వంటమనిషితో తరచూ ఒక అతిథి భోజనానికి వస్తున్నాడంటూ ఇద్దరికి వంట చేయించటం మొదలెట్టిందటఅమ్మ. ఒక్క మనిషని మాటాడినంక ఇద్దరికి నేను వంట చేయనని వంటమనిషి మొరాయించింది. దానితో అమ్మ తన కోసం చేసిన పప్పు, కూరలు దాచి వుంచి తను పచ్చడి, పెరుగుతో భోజనం ముగిస్తోంది.

ఒక రోజున అమ్మను చూడటానికి వచ్చిన నా కజిన్ ఫ్రిడ్జిలో వున్న వారం రోజుల కూరలు చూసి వంట మనిషిని ఏమిటని ఆరా తీస్తే, “ఎవరో దోస్తు వస్తాడని అమ్మ తినుడు బంద్ చేసి కూరలన్నీ ఫ్రిడ్జిల దాపెడుతుంది” అని చెప్పింది.

అమ్మ మనోవ్యాధికి తోడు సరిగ్గా ఆహారం భుజించక శుష్కించిపోతున్నారని కాశీ చెప్పాడు.

ఆ ఉదయాన్నే అమ్మ కాశీతో “కాశీ, క్రితం రాత్రి, అర్ధరాత్రి వేళ మూడింటికి అతడు వచ్చాడు. నువ్వు హాలులో పడుకుని వుండటం కిటికీలో నుండి చూసి సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు”

ముగ్గ పండిన పసుపు పచ్చని మొహాన్ని నల్లగా మాడ్చుకుని బుంగ మూతితో చెప్పింది.

ఆ మాటలు విన్న కాశీకి అమ్మ తనను కూడా ఇక పైన ఇంట్లో పడుకోవద్దంటుందే మోనని అనుమానం వచ్చింది.

“అంతా మీ భ్రమేనమ్మా. లోపల దళసరి కిటికీ తెరలుండగా కిటికీ అద్దాల్లో నుండి నేనెలా కనిపిస్తానమ్మా అతనికి…” అన్నాడు కాశీ.

“అవును కదూ..” అంటూ సాలోచనగా గందరగోళంలో పడిపోయింది అమ్మ.

నా ఇండియా టిక్కెట్లు బుక్ అయ్యాయి. నేను వస్తున్నానని తెలియగానే అమ్మకి అతనితో తన ఏకాంతానికి భంగం వాటిల్లుతుందని చాలా ఉద్వేగానికి లోనయ్యింది.

యాదమ్మతో నేను వచ్చే లోపు తనకు వేరే ఇల్లు చూడమని హడావుడి చేయ సాగింది.

యాదమ్మ “నీ బిడ్డ నీ కోసం వస్తంటే నువ్వు పోతానంటవేందమ్మా. సొంత ఇల్లు ఇడిసి పెట్టి యాడికి పోతవు. ఒక్కదానివే ఎట్టుంటవు” అని అడిగింది.

“ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు వుండాలి యాదీ” అని ఖచ్చితంగా బదులు చెప్పింది అమ్మ.

“నువ్వు వేరే ఇంటికి పోతే నేను పనికి రాను” అంది యాదమ్మ అంతే ఖచ్చితంగా.

తన గోడు వినే, తన గురించి ఆలోచించే ఒక్క ప్రాణి యాదమ్మ పని మానేస్తే ఎలాగని చెప్పలేనంత వేదనకు గురయ్యింది అమ్మ.

అమ్మ ఒక రసాత్మక ఊహల పందిరి అల్లుకుని భ్రమల లోకంలో ఒక ట్రాన్స్ లో జీవిస్తోంది. ఆమె ఊహా సౌధానికి అంతరాయం కలిగించే నా రాక అమ్మకు ఇప్పుడు ఇష్టం లేదు.

నేను త్వరలో వచ్చేస్తున్నానని తెలిసిన అమ్మ మనసు చాలా అలజడిగా అల్లకల్లోలంగా వుంది.

ఆమె ఇల్లు మారిపోయే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది.

ఇలాంటి సినారియోలో నేను ఒక నర్సుగా ఎలా ప్రవర్తించాలో తెలుసుకోటానికి అలాంటి కేసులు సీరియస్సుగా రిఫర్ చేయటం మొదలెట్టాను.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.