జీవితం అంచున -20 (యదార్థ గాథ)
(…Secondinnings never started)
-ఝాన్సీ కొప్పిశెట్టి 
అమ్మ అలిగింది.
          కరోనా సోకితే అల్లకల్లోలమెంతోగాని అమ్మ అలిగితే నా మనసంతా అతలాకుతలం అయిపోతోంది. అసలు నాకేమీ నచ్చటం లేదు. నా భావాన్ని మీకు చెప్పటానికి నా భాషాపటిమ చాలటం లేదు.
          ఎప్పుడూ శాశించే అమ్మ, నేను ప్రశ్నించానని అలిగింది.
          ఫోనులో ఎంత పిలిచినా పలకదు. ఒంటరిగా వుంటే మోగే ఫోను వంక అభావపు చూపు చూస్తుంది. పక్కన మరెవరయినా వుంటే వాళ్ళను ఫోను తీయమంటుంది.
          అమ్మ తన మౌనంతో శిక్షిస్తోంది.
          ఎన్నో వేల మైళ్ళ దూరపు నా పలకరింపుకు బదులియ్యదు.
          పేగు తెంచుకు పుట్టిన మరో బిడ్డ ఎటూ తెగతెంపులు చేసుకుంది.
          ఆధారమవుతాడనుకున్న మగబిడ్డ ముందే కాటికి చేరిపోయాడు.
          అసలేమీ కాని అవకాశవాదుల ప్రేమ కోసం వెంపర్లాడుతుంది.
          వంటరితనం ఎంత నరకమో నాకు తెలుసు. అలాగని పాల డెలివరీ పిల్లాడు మనవాడైపోడు కదా…
          షేక్ హ్యాండ్ నిషిద్దమైన కరోనా కాలమిది. పది ఇళ్ళల్లో పాల ప్యాకెట్లు వేసే పిల్లాడిని కౌగిలించుకుని ఏడిస్తే సాంత్వనం ఏమో గాని కరోనా కౌగిలించుకోవటం మటుకు ఖాయం. అమ్మది కరోనాకు అనువైన ఆరోగ్యం, వయసు.
          వద్దని వారించి ప్రశ్నించానని అమ్మ అలిగింది.
          అమ్మతో మాటాడి రెండు రోజులయ్యింది
          ఇరవై నాలుగు గంటల్లో సూర్యుడు ఉదయించకపొతే తెల్లవారదు.
          నలభై ఎనిమిది గంటలుగా చీకట్లో అల్లల్లాడిపోతున్నాను.
          చంద్రుని పలకరింపు లేకపోతే కలువ వికసించదు.
          వెన్నెలసోన కోసం చకోర పక్షిలా పరితపిస్తున్నాను.
          అమ్మ నన్ను పరీక్షిస్తుందో
          తనను తాను శిక్షించుకుంటుందో తెలియదు.
          కాశీ ఫోను నుండో యాదమ్మ ఫోను నుండో అమ్మతో మాటాడే ప్రయత్నం చేసాను. కాని అమ్మ అసలు ఫోను చేతుల్లోకి కూడా తీసుకోలేదు. నాకు తిండి సయించటం లేదు.
          దిక్కుతోచక నా కజిన్ సిస్టర్ కి ఫోను చేసి నా గోడు వెళ్ళబోసుకున్నాను. తను నన్ను ఓదార్చి అమ్మతో మాటాడించే పూచీ తనదని ప్రమాణం చేసి వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళింది. తన పద్దతిలో ప్రేమగా అమ్మకు నచ్చచెప్పి సముదాయించి ఫోను కలిపి నాతో మాటాడమని ఇచ్చింది.
          మా అమ్మకు నాకు మధ్య రాయబారం కావలసి రావటం ఎంత దౌర్భాగ్యం..?
          అమ్మ గొంతు వినాలన్న ఆశతో చెవిలో ఫోనుతో ఆ క్షణం నా ఉద్వేగం మీరెవరూ అసలు ఊహించలేరు. గుండె గొంతులోకి తన్నుకొచ్చింది.
          గుండె తడితో గద్గదమైన నా మాటలకు అమ్మ నుండి పొడి పొడి ఉ..ఊ…లే తప్ప సరైన సమాధానాలు లేవు.
          అయినా ఎవరన్నారు పొడి పొడి మాటల్లో ప్రేముండదని…
          అమ్మ నిస్పృహలో వచ్చే పొడి జవాబులు తడితడిగా నా హృదిని తడిమాయి.
          వయసు పైబడిన చాదస్తంలో అన్నిటినీ పదే పదే చెప్పే అమ్మ, చరవాణిలో నా పలకరింపుకు పలుకే బంగారంగా మూగబోయినా ఆ మౌనంలోనే నా మనసు సేద తీరింది.
          మా ఇద్దరి మధ్యా నిశ్శబ్దం రాజ్యమేలింది. అయినాఆమె మౌనం నాకెన్నో చెప్పకనే చెప్పింది.
          ఎలా వున్నావన్న నా ప్రశ్నకు ఆమె కుశలమేనన్న జవాబునన్ను నిలువునా నీరు చేసేసింది. ఆమె ఒంటరిగా వర్షించే వేదన ‘నీ పిల్లల మధ్య నువ్వున్నావుగా’ అని వెటకరించినట్టనిపించింది.
          భోజనమయ్యిందా అనడిగితే కొట్టే ‘ఊ..’లో వెక్కిళ్ళు వినిపించాయి.
          నా గొంతులో ఏదో అడ్డు పడినట్టయ్యింది. గొంతు పూడిపోయింది. నేను మాటాడను. ఆమే మాటాడదు. లైను మాత్రం కట్టవదు. మౌనంగా చెవిలో ఫోనులతో చెరో పక్క మేము.
          మౌనంలో మాటలు వ్యక్తం చేయలేని అనేకానేక భావాలు.
          మొత్తానికి అమ్మ మాటాడింది.
          మరుసటి రోజే ఇండియాకి ప్రయాణమయ్యాను.
          మళ్ళీ ప్రయాణం. భూగోళ దిశదశా వర్తనం… .ఎడతెగని జీవనయానం.
          ఎప్పటిలాగే అసంతృప్త పయనం.
          ఎయిర్పోర్ట్లో పిల్లలు చేయూపుతుంటే వదిలి వెళ్ళే పాశాల దుఃఖం మోస్తూ, కలవ బోయే బంధాల ఆనందాన్ని ఊహిస్తూ, దుఃఖ్ఖాన్ని ఆనందం సంతులనం చేసేస్తుంటే నిర్లిప్తంగా విమానం ఎక్కాను.
          కొంత నిర్వేదాన్ని మోస్తూ, కొంత ఉత్సాహాన్ని అతికించుకుంటూ, భవబంధాల ప్రభావం గ్రహిస్తూ, తాపత్రయాన్ని అనునయపరుస్తూ సీటుకి వీపు ఆన్చి కళ్ళు మూసు కున్నాను.
          కళ్ళ ముందు అమ్మ బొమ్మ కదలాడింది.
*****
(సశేషం)