
కథా మధురం
ఆ‘పాత’ కథామృతం-19
శ్రీమతి పాకల చంద్రకాంతామణి
-డా. సిహెచ్. సుశీల
ఆ నాటి రచయిత్రులు కాలక్షేపం కోసం కథలు రాయలేదని గతంలో చెప్పు కున్నాం. తన చుట్టూ ఉన్న సమాజంలోని స్త్రీలలో చైతన్యం కలిగించడం వారి ప్రధాన ధ్యేయం. పురుషుల మనస్తత్వం, ప్రవర్తనలో మార్పును కూడా వారు ఆశించారు. అయితే ఉపన్యాసం లాగానో, ఉపదేశం లాగానో, కేవలం పత్రికలో పేరు చూసుకోవడానికో, పేరు ప్రఖ్యాతులు పొందాలన్న తపనతోనో రాయలేదని సూక్ష్మంగా పరిశీలిస్తే తెలుస్తుంది. అలాయైతే వారు తమతమ కుటుంబ ప్రస్తుతి, తమ వైభవం రికార్డు చేసి వుండేవారు. ఇప్పుడు వారి పేరు తప్ప మరే వివరాలు దొరకక మనం అన్వేషించే అవసరం ఉండేది కాదు.
ఇతివృత్తం, కథా శిల్పం, కథనశైలిలో పటిష్టంగా కథను రాయడమే కాక, మానసిక విశ్లేషణ, పరిస్థితుల వల్ల మారుతున్న బలహీన మనస్కులను వివరించే ప్రయత్నం చేశారు వారు. అలాంటి ఒక విశిష్టమైన కథ గృహలక్ష్మిలో 1937 ఆగస్టులో ప్రచురితమైంది –
దైవమేమి చేసినను మన మేలు కొరకే !
జనార్ధనరావుకి కూతురు పుట్టిన సమయంలోనే భార్య మరణించింది. రాధను అమ్మమ్మ, తాతయ్యలు తీసుకుని వెళ్ళి పెంచసాగారు. కొన్నాళ్ళకు జానార్ధనరావు సుబ్బలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు అమ్మమ్మ తాతయ్యలు మరణించడంతో రాధ తండ్రి వద్దకు చేరింది. సుబ్బలక్ష్మికి సవతి కూతురంటే ఎందుకో ద్వేషం. దానిని ప్రదర్శిస్తూ చిన్నపిల్లను నానా కష్టాల పాలు చేసేది. ఆ పాప చేతికి తన కుమారుడు రాముని ఇచ్చేది కాదు.
ఒకరోజు ప్రమాదవశాత్తు కాలుజారి ఆ పిల్లవాడు రాము బావిలో పడి మరణించాడు. అందరూ దుఃఖంలో మునిగిపోయారు. కానీ సుబ్బలక్ష్మి ఇదే సాకుగా, ఏడుస్తున్న రాధను రాత్రి 11 గంటల సమయంలో ఇంటి బైటకు తోసి తలుపు వేసుకుంది. తగిన పోషణ లేకపోయినా పదమూడేళ్ళ రాధ ముఖం కళ గలది. గత్యంతరం లేక ఆ అమావాస్య చీకటిలో దిక్కు తోచక నడుస్తూ వెళ్ళసాగింది.
రాత్రి ఒంటిగంట సమయంలో లాయర్ సుందరరావు తన స్నేహితుడిని కలిసి ఇంటికి చేరుకుంటున్న సమయంలో స్పృహ తప్పి పడివున్న రాధను చూసాడు. తన ఇంటిలోకి తీసుకుని వెళ్ళాడు. భార్య జానకమ్మకు అప్పగించాడు. ఆమె సపర్యలతో కాసేపటికి రాధకు మెలకువ వచ్చింది. కంగారు పడింది. జానకమ్మ ఓదార్చి ధైర్యం చెప్పడంతో తన పరిస్థితిని వివరించింది. ఆ భార్యాభర్తల సౌజన్యంతో మర్నాటి నుండి రాధ కోలుకోవడమే కాక, వారి ప్రోత్సాహంతో స్కూల్ లో చేరింది. సహజంగా తెలివి కలదగుటచే చురుకుగా చదువుకోసాగింది. వారి ఏకైక కుమారుడు కృష్ణారావు మెడిసిన్ పూర్తి చేసాడు. కాలక్రమేణా రాధ పట్ల అతడు అనురక్తుడు కావడం, పెద్దలూ సంతోషంతో ఒప్పుకోవడంతో వివాహం జరగింది, రాధ బ్రాహ్మణ కాంత, దిక్కులేని ఒంటరి అయినా, తమ అంతస్తుకి తూగక పోయినా, తాము కాపు కులస్తులు అయినా సుందరరావు జాతి బేధములు పాటింపక, సంఘ సంస్కరణాభిలాషతో ఈ “రాధాకృష్ణుల” “వర్ణాంతర వివాహం” చేసారని పత్రికల్లో ప్రకటింపబడింది.
ఈ కథ ఈరోజుల్లో మరీ అంత నవ్యమైనది కాకపోవచ్చు కానీ 1937 నాటికి దివ్యమై నదే. కేవలం ఒక సంఘటన, ఒక ప్రేమ, ఒక సంఘసంస్కర్త, ఒక పెళ్ళి మాత్రమే ఇతివృత్తం కాదు. రచయిత్రి ముగ్గురు స్త్రీలను, వారి మనస్తత్వాన్ని విశ్లేషణ గావించారు. ఏ కారణం లేకుండానే సవతి కూతుర్ని ద్వేషించే, చదువు సంస్కారం లేని, చాలా మామూలు స్త్రీ పాత్ర సుబ్బలక్ష్మి. తన కొడుకు ప్రమాదవశాత్తు బావిలో పడడం వల్లనే మరణించాడని పోలీసులు చెప్పినా వినని మూర్ఖత్వం. తాను భోరున ఏడుస్తూ, చుట్టు పక్కల వారు కూడా చిన్న పిల్లవాడి అకాల మరణానికి దుఃఖపడుతున్న సమయంలో కూడా తనలోని మాత్సర్యాన్ని దాచుకోలేక పోయింది. తమ్ముడి చావుకి ఏడుస్తున్న రాధ ది నాటకం అని అభాండం వేయగలిగింది. అసూయతో పిల్లవాడిని బావిలో తోసిందని గట్టిగా అరిచింది. అమ్మలక్కలు ఆశ్చర్యపోయి మెల్లగా లేచి వెళ్ళిపోయారు. “ఇది వెంటనే ఇంట్లోంచి బైటకు పోవాలి” అని రౌద్రరూపం దాల్చితే – “తెల్లారి వెళ్తుంది లే” అని నంగిగా గొణిగిన ఆమె భర్త, రాధ కన్నతండ్రి అయిన జనార్ధనరావు వెన్నెముక లేని అసమర్థుడు. రాధను బైటకు గెంటేసినా ఏమనలేని చేతకాని వాడు.
రెండో స్త్రీ జానకమ్మ. లాయర్ అయిన భర్త సుందరరావుకు తగిన ఇల్లాలు. .అభ్యుదయ భావాలు గల అతనికి అన్ని విధాలా సహకరించేది. స్వతహాగా కరుణా హృదయ. కనుకనే అర్ధరాత్రి స్పృహ లేని స్థితిలో ఉన్న రాధను భర్త ఇంట్లోకి తీసుకుని వస్తే సపర్యలు చేసింది. ఆమె దీనగాధను విని చలించిపోయింది. తమ ఇంటిలోనే ఉండమని ఆదరించింది. స్కూల్ లో చేర్పించి చదివించింది. మెడిసిన్ చదివిన తన కుమారుడు రాధ పట్ల ఆకర్షితుడైనాడని గ్రహించి వివాహానికి సమ్మతించింది.
ఇక ఈ కథలో కథానాయిక రాధ అమాయకురాలు. పుట్టగనే తల్లిని కోల్పోయి, అమ్మమ్మ పెంపకంలో ఉండవలసివచ్చింది. వారినీ కోల్పోయి, తండ్రి ఇంటికి చేరి, సవతి తల్లి తనను అకారణంగా ద్వేషించినా ఓర్చుకుంది. ఆమె కుమారుడు రాముని ప్రేమగా అభిమానించింది. అలాంటిది పిల్లవాడిని తనే బావిలోకి తోసిందని సుబ్బలక్ష్మి ఆరోపించడం, ఆ సమయంలో కన్నతండ్రి తనకు అండగా నిలవక పోవడం, సుబ్బలక్ష్మి నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి ఇంటి నుండి గెంటివేయడంతో నిస్సహాయంగా దుఃఖించడం తప్ప ఏం చేయలేక పోయింది. చీకటిలో కాలి పైన తేలు కుట్టడంతో స్పృహ తప్పి నేల పై పడిపోయింది. సుందరరావు , జానకమ్మల ఆదరణను దుర్వినియోగం చేసుకోక చక్కగా చదువుకుంది. తన అందం, చురుకుదనం వినయసంపన్నతతో డాక్టర్ కృష్ణారావుని వివాహమాడింది.
తనకు అడుగడుగునా దేముడు ఎన్ని కష్టాలు, సమస్యలు కల్పించినా చివరకు మంచే జరిగిందని తృప్తి పడింది రాధ. వివాహమైన మర్నాడు కృష్ణారావుతో ప్రశాంతంగా పలికింది – “దైవమేది గావించినను నది మన మేలు కొరకే కదా”!
విభిన్నమైన ముగ్గురు స్త్రీల వ్యక్థిత్వాలను అంతర్లీనంగా కథతో పాటు వెల్లడించిన గొప్ప రచయిత్రి శ్రీమతి పాకల చంద్రకాంతామణి రాసిన “తండ్రియా? తనయుడా?, ధైర్యము, సమయస్పూర్తి” అనే మూడు కథలు కథానిలయంలో లభ్యం.
“పాకాల చంద్రకాంతమణ వ్రాసిన కవిత “ప్రకృతి” మనోప్రవృత్తులను బట్టి ప్రకృతి కనబడుతుందని ఆమె భావించింది ” అంటారు విహంగ, మహిళా సాహిత్య పత్రికలో ఆచార్య కాత్యాయనీ విద్మహే.
సృష్టి లోని ప్రకృతి నే కాదు, పై కథలో స్త్రీల మనో ప్రవృత్తులను కూడా విశ్లేషిం చారు చంద్రకాంతమణి.
*****
వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

ప్రొ. సిహెచ్. సుశీల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో సుదీర్ఘకాలం పనిచేసి, ప్రిన్సిపాల్ గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్ గా, ఎడిటర్ గా పని చేసారు.
జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనల పై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు.
వీరి నాన్నగారి పేరు మీద విమర్శారంగంలో కృషి చేస్తున్న వారికి కీ.శే. సిహెచ్. లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారాన్ని గత 3 సంవత్సరాలుగా అవార్డు ఇస్తున్నారు. వరుసగా గత మూడేళ్ళలో కడియాల రామ్మోహనరాయ్ , రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కె.పి. అశోక్ కుమార్ గార్లకు ఈ అవార్డుని అందజేశారు.
విద్యార్థినుల చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేసారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం, సాహిత్య విమర్శ రంగంలో “కవిసంధ్య ” ( శిఖామణి) అవార్డు, కిన్నెర ఆర్ట్స్ & కొవ్వలి అవార్డులు అందుకున్నారు.
అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష ( పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు.
రచనలు:
1.స్తీవాదం – పురుష రచయితలు
2. కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారి జీవిత చరిత్ర
3. విమర్శనాలోకనం ( విమర్శ వ్యాసాలు)
4. విమర్శ వీక్షణం ( విమర్శ వ్యాసాలు)
