
కనక నారాయణీయం -60
–పుట్టపర్తి నాగపద్మిని
నాకు బాల్యంలోనే సంగీతంతో గట్టి బంధం ఏర్పడింది. దానికి తోడు భక్తి తత్వం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది. సాహిత్యాన్వేషణ ఎటూ ఉంది. ఈ ముప్పేటల బంధం, నన్ను ఎప్పుడూ ఏవో కొత్త గొంతుకలతో అహ్వానిస్తూనే ఉంటుంది. నేను ఎక్కడ ఏ సాహిత్యాన్ని చదివినా, సంగీతపరంగా విన్నా, భక్తి తత్త్వ నేపథ్యంలో ఒడలు పులకరించేలా తన్మయత్వ భావనకు లోనైనా, నా అంతరంగంలో ఏదో ఘర్షణ మొదలవు తుంది. అటువంటి ఘర్షణలో, ఆ ఒత్తిడి నుంచే ఒక ప్రేరణ నేను పొందుతాను. ఇంత వరకూ నేను వ్రాసిన కావ్యాలన్నీ, పెనుగొండ లక్ష్మి నుంచీ, షాజీ, సిపాయి పితూరీ, సాక్షాత్కారము – యీ విధంగా, అన్నీ అటువంటి ప్రేరణ నుంచీ అప్రయత్నంగా ఆవిష్కరింపబడినవే! ఈ శివతాండవానికి ప్రేరణ, నేను తమిళనాడు, కేరళ, ఇంకా ఉత్తర భారతంలో తిరిగిన అనేక క్షేత్రాలు, వాటికి సంబంధించిన సాహిత్యం, ఇంకా ఆయా క్షేత్రాలకున్న అతి ప్రాచీనమైన వైశిష్ట్యం. చిదంబరంలోని రహస్యాత్మకత నన్ను వెన్నాడింది. ఋషీకేష్ లోని మహదేవ్ ఆలయం ఇంకా అక్కడి ప్రకృతి రమణీయకత నన్ను దిగ్భ్రాంతికి లోను చేసింది. శివ సాహిత్యం గురించి చెప్పనవసరమే లేదు. వీటన్నిటిలో నా భావాలు పూర్తి పరిపక్వత చెంది, శివతాండవావిష్కరణ జరిగిందేమోనని పిస్తుంది. చైతన్య స్వరూపుడైన పరమ శివుని విశ్వరూపం, ప్రకృతిలో ఏ విధంగా ప్రతిఫలించిందో, దానికి తోడు శివాలాస్యం, ఆ ఉధృతిని ఏ విధంగా సమతుల్యం చేసిందో, వీరిరువురి నాట్య కళాభినివేశం, సృష్టికి నిర్వచనంగా ఎలా ఆవిష్కరింప బడిందో కనులారా వీక్షించిన దేవతా సమూహం, ఏ విధంగా స్పందించిందో, చివర శివ కేశవుల అభిన్నత ఏ విధంగా చూపరుల మనస్సులను సమ్మోహితులను చేసిందో, నా ప్రయత్నమనేదే లేకుండా యీ విధంగా అక్షరాలలో సాక్షాత్కరించింది. ఇంతకు మునుపు చెప్పినట్లు, దీని కాయాన్ని కాస్త పెంచుదామని ఎంతగా ప్రయత్నించినా నావల్ల సాధ్యపడలేదు. కావ్య ప్రకాశకారుడంటాడు,’శక్తిర్నిపు
జహరసియ సింగాయ – ఉద్దరియ కండాఇ
భుజదండ ఢక్కవియ – కోదండ దంచాఇ
లంబంత మాయూర – పించోహ ణివస ఇహి
మసిధాఉ మండణ ఇ – పిత్తల విహూసణ ఇ
హాలు దద్దరిల్లిపోయిందా జలద గభీర వాక్ ప్రవాహానికి, కరతాళ ధ్వనులతో !!
చపలకాంత్ భట్టాచార్య గారి నుంచీ, పరిషద్ సభ్యులు, అక్కడ చేరిన తెలుగు సాహిత్యాభి మానులు అందరి కళ్ళలోనూ ఉత్కంఠ! మళ్ళీ పుట్టపర్తి గొంతు సవరించుకుని మొదలు పెట్టారు. ‘ప్రాకృతంలో పుష్పదంతుడనే మహాకవి వ్రాసిన జసహర చరివు అనే కావ్యంలోనిదీ వర్ణన. మారెమ్మ గుడి ముందు జాతర సమయంలోనిదీ వర్ణన. ఈ నడక నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆ నడకకు దగ్గరగా రగడ వృత్తంలో నా శివతాండవం సాగుతుంది. తలపైన చదలేటి యలలు దాండవమాడ
నలల త్రోపుడుల క్రొన్నెల పూవు గదలాడ
మొనసి ఫాలము పైన ముంగురులు చెరలాడ
కనుబొమ్మలో మధుర గమనములు నడయాడ… ఇలా పుట్టపర్తి కించిత్ నాట్యాన్ని కూడా జోడించి తన శివతాండవ గేయ కీర్తిని ఆలపిస్తూ ఉంటే, అక్కడి వారందరికీ కన్నులముందే కైలాసం సాక్షాత్కరించినట్టు అనుభవమైంది. ఒక విధమైన రసానుభూతి వెల్లువలో కొట్టుకుపోతున్న అనుభూతి. శరీరమంతా అనంద సముద్రంలో ఓలలాడుతున్నట్టు భావావేశ ఝరి. ఆనందమంటే ఇదే ఇదే అని చుట్టుపట్ల వాతావరణమంతా కోటి గొంతుకలతో ప్రతిధ్వనిస్తున్నట్టు! శ్రీ చపలకాంత్ భట్టాచార్య లేచి, పుట్టపర్తిని వాటేసుకున్నారు.’తెలుగు భాష ఎంత మధురమైనదో యీరోజు నాకు అర్థమైంది. గ్రాంధికమైన తెలుగు భాషకూ, సంస్కృతానికీ పెద్ద తేడా లేదని పుట్టపర్తి రచన ద్వారా తెలిసింది. ఆయన అచ్చ తెనుగులో వ్రాసిన భాగం కూడా వారి నాట్యాభినయం సాయంతో అర్థమైనట్టే అనిపించింది. అది లేకున్నా, వారి పఠనం శక్తివంతం కావటం వల్ల, అదేమిటో, పుట్టపర్తి చదివినదంతా నాకు అవగత మైపోయినట్టే భావన. అదే కవిత్వం శక్తి, నిజమైన శక్తి. ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారికి కృతజ్ఞతలు. మానవుడు, భాష, సాహిత్యం – వీటి కలయిక ఎంత అవసరమో, ఈ కలయిక ఎంత గొప్ప అద్భుతాలను సృష్టించగలదో, కవికీ, అతని పాఠకులకూ మాత్రమే తెలుస్తుంది. తెలుగు బెంగాలీ భాషలను దగ్గరగా చేర్చటంలో యీ పరిషత్తు కృషి కూడా అభినందనీయం. భవిష్యత్తులో ప్రముఖ సంస్థగా వెలుగొందగలదని నా నమ్మకం.’ ఇలా కలకత్తాలోనూ శివతాండవ నాట్యాభినయ ప్రదర్శనతో పుట్టపర్తి కీర్తి కాంతులు ఉత్తర భరత సాహిత్యాకాశాన మెరుపులు కురిపించాయి. సభ తరువాత, పుట్టపర్తి అభినందనల తీపి జ్ఞాపకాలతో కడపకు తిరుగుప్రయాణ మయ్యారు.
*****
(సశేషం)

సరస్వతీపుత్ర గా, చతుర్దశభాషా పరశేషభోగిగా చిరపరిచితులైన పుట్టపర్తి నారాయణాచార్యులవారు (1914 – 1990) , వారి ధర్మపత్ని, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సత్కార గ్రహీత శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ (1921 – 1983) దంపతుల కుమార్తెగా జన్మించటమే గొప్ప వరమనీ, ఆ ఇంటిపేరే గొప్ప బిరుదని నాగపద్మిని గారంటారు. విద్యార్హత – హిందీలో ఎం.ఏ ఎం.ఫిల్. పీహెచ్.డీ. తెలుగు ఎం.ఏ. జర్నలిజం, అనువాదకళ, టీవీ నిర్మాణకళలలో పీజీ డిప్లమోలు; ఆకాశవాణి, దూరదర్శన్ లలో ముప్పైఐదేళ్ళ ఉద్యోగ జీవితంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుధా ప్రశంసనీయమైన వందలాది కార్యక్రమాల నిర్వహణ; తెలుగు హిందీలలో యాభైదాకా పద్య, సాహితీ వ్యాస,కథ, నాటక, అనువాద రచనలు; తెలుగు విశ్వవిద్యాలయ, తమిళనాడు హిందీ అకాడెమీ, బిహార్ సాహిత్య సమ్మేళన్, గోఎంకా జాతీయ అనువాద పురస్కారాలూ, శ్రీయుత వైయస్. రాజశేఖర రెడ్డి, ఎన్.డ్.తివారీ,డా.రోశయ్య, డా. మృదులాసిన్ హా (ప్రస్తుత గోవా గవర్నర్) వంటి రాజకీయ ప్రముఖులచే సత్కారాలూ; తెలుగు రాష్ట్రాలలోనే కాక, ఖరగ్ పుర్, పాట్నా, చెన్నై, అమెరికాలో న్యూజెర్సీ, డల్లాస్, పెన్సిల్వేనియా, అట్లాంటా, వాషింగ్టన్ సాహిత్యసమావేశాల్లో ప్రసంగానంతర సత్కారాలు; . గత పదిహేనేళ్ళుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ప్రత్యక్ష ప్రసారాలలో హిందీ/తెలుగు వ్యాఖ్యాత. జయజయశంకర, శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ మొదలైన మాధ్యమాలలో యాభైకి పైగా ఆధ్యాత్మిక ప్రసంగాలు; అన్నిటికంటే మించి, పుట్టపర్తి వారి శతజయంతి (1914-2014)సందర్భంగా పుట్టపర్తి పద్య, కథ, నవల, అనువాద, విమర్శ సర్వస్వాల ప్రచురణ (నాలుగువేల పుటల బృహత్ ప్రచురణ).
