
చిత్రం-58
-గణేశ్వరరావు
స్విస్ చిత్రకారిణి ఎస్తర్ హ్యూసర్ Esther Huser) మానసిక రోగ నిపుణురాలు, Nature’s painter of photorealism. తన అభిరుచి మేరకు realistic painting వైపు దృష్టి మరలించి పేరు పొందింది, అంతర్జాతీయ బహుమతులు అందుకొంది. అత్యంత సూక్ష్మ వివరాలతో, దిగ్భ్రమ కలిగించే అందాలతో సాధారణ వస్తువులను అసాధారణంగా చిత్రిస్తుంది, ఆమె రంగుల పళ్ళెంలో మహా అయితే 5 రంగులు ఉంటాయి.. వాటి తోనే ప్రకృతి సంపదలోని .. పూలూ, మొక్కలూ, చెట్లూ, కూరల సహజ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. మనం ఎవరూ గుర్తించని వివరాలు బయటకు తీసి చూపిస్తుంది. ఒక వస్తువుకున్న సాధారణ రూపాన్ని చిత్రించడం ఆమె అభిమతం కాదు, ఆ వస్తువులో ఎవరికీ కనిపించని, ఎవరూ చూడలేని అంశాలను బయటికి వెలిదీసి కళాత్మకంగా ప్రదర్శింప చేయడమే ఆమె లక్ష్యం. ఆమె కుంచె గీసిన ప్రతి వస్తువు అలా కొత్త అందాలని సంతరించుకుంటుంది. ఆమె వేసిన ఈ చిత్రాన్నే( Oil on alluminium) చూడండి. ఆమె ఎన్నుకున్న వస్తువు ‘కేబేజీ ‘! మనకు కూరల మార్కెట్లో తరచూ కనిపించేది .. అయితే దాన్ని ఎప్పుడైనా ఇలా పట్టి పట్టి చూసామా? అలా చూడాలని అనిపించిందా? దాన్ని పళ్ళెంలో కూరగానే చూసాం. ఇదే మనకూ – ఒక కళాకారుడికీ మధ్య ఉన్న తేడా ! ఎస్తర్ తోటల్లో, పంట పొలాల్లో నడవడానికి ఇష్టపడుతుంది. పంట చేతికి రావడం చూస్తుంది, పంట ఫలితాన్ని గమనిస్తుంది. కేబేజీ అని కొట్టి పారేయకుండా దాని వాసన .. దాని స్పర్శను ఆస్వాదిస్తుంది. అంతే కాదు, వాటిని తన బొమ్మలో పట్టుకుంటుంది, ఫోటో realism లో ఉన్న గొప్పతనం అదే.. ఆమె గీసిన బొమ్మ చూస్తుంటే నిజమైన కేబేజే అనిపిస్తుంది, object చుట్టూ గీసిన వివరాలు నొక్కి చెబుతాయి, కేబేజీ వాసన నాసికకు తాకుతుంది,. దాని తొడిమను తడుముతున్నట్టు అనిపిస్తుంది. అంతే కాదు, కాబేజీ పువ్వు మధ్యలో ఉన్న అరుణిమ, మచ్చలు దేనికి సంకేతం: ఒక వైకల్యానికి. (అధిక శాతం అమెరికన్ల ఒంటి మీద మచ్చలు ఉంటాయి, అమెరికన్ పై స్విస్ విసిరిన విసుర్లు !) కాయకూరల్ని ప్రతిభావంతంగా చిత్రించడంలో ఆమె సాధించిన విజయం ఇది, ఆమె ఎన్నుకున్న మార్గం ఇది!*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
