
ఎవరు గొడ్రాలు
(నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– నల్లు రమేష్
ఆమె మనసే కోమలం
రక్త మాంసాలు కాదు
పొరపాటున అబల అని నోరు జారకండి
నవ మాసాలు నవ్విపోతాయి
ఉడికిన మెతుకే కదా అని
నోరు లేని కుందేలును చేయకండి
గోరుముద్దలు నొచ్చుకుంటాయి
అమ్మ నాన్న తక్కెట్లో
నిర్ణయం నాన్నదైనా
అమ్మలో అమ్మను చిద్రం చేసి
నాన్న తేలిపోతుంటాడు
కాస్త నిజం గుండు మింగి సమానమవ్వండి
చదువు నదిలో
రెండు పదాలు మునక వేస్తే
అమ్మాయి పొడిగానే ఉంది
నదిలో ఎడారి గుణమింకా వీగిపోలేదు
ఒంటరి దారిలో
ఒళ్లంతా ముళ్ళు పోసి
కఠిన చట్టం చెప్పు కుట్టడం కాదు
పాదం ఏదైనా
పచ్చని స్నేహం నేర్పండి చాలు
ఓకే చెమట చుక్కపై
నడుము వంచిన జడకో న్యాయం
సవరించిన మీసానిదో న్యాయం
ఆకలికి కూడా
మగబుద్ధి ఇంకా పోలేదు
నేల… ఆకాశం….
ఆమె లేకపోతే ఏమైపోతాయో
ప్రపంచం కనలేని గొడ్రాళ్లే కదా!
*****
Please follow and like us:

నల్లు రమేష్ సెకండరీ గ్రేడ్ టీచర్. N.M. అగ్రహారం RH దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా. తల్లిదండ్రులు రమణమ్మ, మునిరత్నం. స్వగ్రామం పోలిరెడ్డి పాళెం.
ముద్రిత రచనలు
రమణీయ రత్నావళి నీతి శతకం
విష్ణు రూప వర్ణన శతకం
గురుదేవమ్ సాయి నాథమ్
అముద్రితాలు 500 పైగా కవితలు, కొన్ని నానీలు.
గుర్తింపు
ఎక్స్ రే ప్రధాన కవితా పురస్కారం
జాతీయ స్థాయి రంజనీ కుందుర్తి కవితా పురస్కారం
బండికల్లు వారి ప్రధాన కవితా పురస్కారం
జిల్లాస్థాయి ప్రధాన ఉగాది పురస్కారం
మరెన్నో నగదు బహుమతులు
మరెన్నో పత్రికా ప్రచురణలు
