
జీవితం అంచున -23 (యదార్థ గాథ)
(…Secondinnings never started)
-ఝాన్సీ కొప్పిశెట్టి
భక్తి అనే పదానికి నాకు నిజమైన అర్ధం తెలియదు…
ప్రపంచాన్ని నడిపించే ఒక సూపర్ నేచురల్ పవర్ కి దేవుడని పేరు పెట్టుకోవటం తప్ప.
ఆ దేవుడిని కష్టనష్టాల్లో ప్రార్ధించుకోవటం తప్ప.
ఆ రోజు GYDడయాగ్నొస్టిక్స్, పద్మారావునగర్లో అమ్మ వీసా మెడికల్స్ అప్పాయిం ట్మెంట్ దొరికింది. అంత క్రితం జరిగిన సైకియాట్రిస్ట్, న్యూరాలొజిస్ట్, కార్డియాలొజిస్ట్ ల ప్రత్యేక కన్సల్టేషన్ల విషయం బయల్పడకుండా, అమ్మకి వున్న కండిషన్స్ ఏవీ తెలియ నీయకుండా, వీసా మెడికల్స్ సక్సెస్ఫుల్ చేయమని ఆ దేవుడికి అర్జీ పెట్టుకున్నాను.
ముఖ్యంగా చెస్ట్ ఎక్స్రేలో తేడా తెలిసిపోతే మెడికల్స్ లో ఫెయిల్ అవటం ఖాయం.
మెడికల్ ఆఫీసర్ అమ్మతో కొంచం ఎక్కువ సేపు మాటాడినా కష్టమే.
మొదట నన్ను బయట వెయిట్ చేయమని అమ్మను మాత్రమే లోపలికి పిలిచారు. కాని తరువాత అమ్మ తను వాడుతున్న మందుల వివరాలు, పేర్లు చెప్పలేక పోయేసరికి నన్ను లోపలికి పిలవాల్సి వచ్చింది.
ప్రొద్దున పదకొండు గంటలకు ఇచ్చిన అప్పాయింట్మెంట్ అన్ని పరీక్షలు పూర్తయ్యేసరికి సాయంత్రం నాలుగు అయ్యింది. అమ్మ హైట్, వెయిట్, సైట్, యూరిన్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే వగైరాలన్నీ అయ్యేసరికి నాలో వీసా ఆశ అడుగంటిపోయింది. అమ్మ కున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి మెడికల్స్ గట్టెక్కటం కష్టమని నిర్ధారించుకున్నాను. ఈ లోపు ఆస్ట్రేలియా పెట్టిన ఆంక్షల కారణంగా ముప్పయి ఆరు వేల మంది ఆస్ట్రేలియా పౌరులు బయటి దేశాల్లో ఇరుక్కుపోయారని, ఒక్క భారతదేశం నుండే తొమ్మిది వేల ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలోకి అనుమతించమని దరఖాస్తులు పెట్టుకున్నారని వార్తలు ఊదరగొడుతున్నాయి. ముఖ్యంగా అనుమతి లేకుండా భారతదేశం నుండి ఆస్ట్రేలియా పౌరులు దేశంలో అడుగు పెడితే అరవై ఆరు వేల డాలర్ల జరిమానా లేదా ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తున్నారని తెలిసింది.
క్రమంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం పైన దేశ పౌరుల వత్తిడి ఎక్కువ అయి, అందిన దరఖాస్తుల సీనియారిటీని బట్టి ప్రభుత్వం రిపాట్రియేషన్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసింది. బయటి దేశాల నుండి వచ్చే ప్రయాణికులు ఎన్.టి. లో హొవార్డ్ స్ప్రింగ్స్ లో ఏర్పాటు చేసిన బసలో పద్నాలుగు రోజులు వుండి కోవిడ్ నెగెటివ్ అని నిర్ధారణ జరిగాక వారి వారి రాష్ట్రాలకు వెళ్ళాలి. నెలకు రెండో మూడో అతి తక్కువ ప్రయాణీకులతో, అత్యంత ఖరీదయిన టికెట్లతో, రిపాట్రియేషన్ ఫ్లైట్స్ మొదలయ్యాయి. టికెట్ భారీ వెల మాత్రమే కాకుండా పద్నాలుగు రోజుల హొవార్డ్ స్ప్రింగ్స్ వసతి ఖర్చులు కూడా భరించటం ఎంత వున్నవాడికీ సాధ్యం కాని పరిస్థితిలోనూ ఆ అవకాశం కోసం పౌరులు పడిగాపులు కాస్తున్నారు.
అమ్మాయి రోజురోజుకీ మారుతున్న ట్రావెల్ కాప్స్, కొద్దికొద్దిగా సడలింపుకి గురవు తున్న ఆస్ట్రేలియా దేశ నిబంధనలు, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అమ్మ వీసా కోసం ఎదురు చూడసాగింది. నేను పూర్తిగా వీసా ఆశ వదిలేసుకున్న సమయంలో నన్ను ఆశ్చర్యపరుస్తూ అమ్మకు సంవత్సరం వీసా గ్రాంట్ అయ్యింది.
ఇదివరకు కార్డియాలొజిస్ట్ అమ్మ గుండె బాగా ఎన్లార్జ్ అయ్యిందని కేవలం ఎక్స్రేతో చెప్పాడు. అతను ఏంజియోగ్రామ్ చేస్తే గాని పరిస్థితి ఏమిటన్నది ఖచ్చితంగా చెప్ప లేనని అన్నాక మెడికల్స్ లో అమ్మ చెస్ట్ ఎక్స్రే ఎలా ఓకే అయ్యింది నాకు అంతు చిక్కని ప్రశ్న. అసలు వీసా గ్రాంట్ కి క్రైటీరియా ఏమిటో…? మిరాకల్స్ డు హాప్పెన్..!
When we believe in supernatural power, we have tobe lieve in miracles.
*****
(సశేషం)

ఝాన్సీ కొప్పిశెట్టి గారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు, ఆంగ్ల భాషలలో డబుల్ MA, భవన్స్ నుండి IRPM డిప్లొమా చేసారు. ఆర్మీలో ముప్పై మూడేళ్ళ ఉద్యోగ నిర్వహణానంతరం స్వచ్చంద పదవీ విరమణ చేసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. వీరి సాహితీ ప్రస్థానం ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ వేగవంతంగా
సాగుతోంది. ‘అనాచ్చాదిత కథ’, ‘విరోధాభాస’, ‘అగ్ని పునీత’ అనే నవలలు, ‘గొంతు విప్పిన గువ్వ’ అనే అనుస్వనమాలిక, ‘చీకటి వెన్నెల’ అనే కథా సంపుటి,
‘ఆర్వీయం’ అనే చిత్ర కవితల దృశ్య మాలిక, ‘ఎడారి చినుకు’ అనే అనుభూతి కావ్యం వీరి సాహితీ పంటలు. నాటి ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుగారి ప్రశంసా పత్రం, అంపశయ్య నవీన్ తొలి నవలా పురస్కారం, గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం, నవలా రాణి బిరుదు ప్రదానం, తెన్నేటి హేమలత సాహితీ పురస్కారం, శ్రీ మక్కెన రామసుబ్బయ్య కథా పురస్కారం, కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం, HRC కథా పురస్కారం, నెచ్చెలి కథా పురస్కారం వీరి సాహితీ కృషికి లభించిన గుర్తింపులు. ప్రతిలిపి నుండి వీరి కథలకు అనేక బహుమతులు లభించాయి. వీరి కథలు, కవితలు తెలుగు వెలుగు, పాలపిట్ట, స్వాతి, ఆంధ్ర భూమి, సారంగ వంటి పలు పత్రికల్లో ప్రచురింపబడ్డాయి.
