
కలంతో ఆమె నేను
(నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
-చిత్రాడ కిషోర్ కుమార్
ఆమె… నేను…
ఎలా ఉంటామో మాకే తెలియదు
కానీ ఆమె నన్ను చూస్తుంది
నేను కూడా ఆమెను చూస్తూనే ఉంటాను
చెట్లు చిగురిస్తున్నట్లు మాస్నేహమూ
కొత్త చిగురు తొడుగుతూనే ఉంది
కాలంతో మేమూ పరిగెడుతూనే ఉన్నాం
ఒకానొక కాలంలో
ఉత్తరాలలో కలుసుకునే వాళ్ళం
కబుర్లు కలబోసుకునే వాళ్ళం
బాధలు, బాధ్యతలు, వేడుకలూ
అన్నిమాటలూ మారాతల్లోనే…. అయినా
ఎన్నో తీపి గురుతులు
జ్ఞాపకాలుగా మా మనసుల్లో మిగిలేఉన్నాయి
ఇప్పుడు కాలం
కలుసుకునేంత దగ్గరకు చేర్చింది
ఆధునీకరణ అంతర్జాలప్రభావాలతో
మేమూ పోటీపడ్డాం
ఇప్పుడు చరవాణీలల్లో
ఉగాదులూ, ఉషస్సులూ, సందేశాలు… .అన్నీనూ
కలుసుకోవాలనిగాని చూసుకోవాలనిగాని
ఏనాడూ మాకు అనిపించలేదు
ఆ అవసరమూ రాలేదు
కానీ ఎదో తెలియని వెలితి
మదిలోకి చేరకుండానే
కాలంతో కరిగిపోతున్నాయి
ఒకప్పుడు ఒకర్నొకరం చూసుకోవాలని
అనిపించినా కలవలేకపోయాం
ఎందుకంటే ఆమె నేను చేరొకతీరం
కలంతోనే అన్నీ కలబోసుకునే మాకు
మళ్ళీ ఆ రోజులు రావని తెలిసినా
అలాంటి క్షణాల కోసం
కలంతో కాలాన్ని శాసిస్తూనే ఉన్నాం
ఒక తీరం నుండి ఆమె
మరో తీరం నుండి నేను
*****

చిత్రాడ కిషోర్ కుమార్ ఫిబ్రవరి 10వ తేదిన శ్రీకాకుళం జిల్లా బూరగాం గ్రామంలో శ్రీ రామారావు (విశ్రాంత ఉపాధ్యాయులు) కీ.శే.శ్రీమతి స్వరాజ్యలక్ష్మిలకు జన్మించారు. బాల్యం విద్యాభ్యాసం బూరగాం, సోంపేట, బారువాలలో పూర్తిచేసారు. తరువాత హైదరాబాద్ లో పలు ప్రయివేట్ సంస్థలలో ఉద్యోగం చేసారు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా
విజయవాడలో నివాసముంటున్నారు. 1989 నుంచి కవిత్వం రాస్తున్నారు. పలు సాహితీ సంస్థలచే కవితా పురస్కారాలు, సన్మాన సత్కారాలు అందుకున్నారు.
ఇప్పటివరకు ప్రచురణకు నోచుకున్న గ్రంథాలు: హృదయాలాపన-కవిత్వం (2014), మన భారత జెండా-దేశభక్తి గీతం (2017), రెండురంగులు రెండు తెరలు-నాటికల
సంపుటి (2021), నీరెండలు-కొటేషన్స్ (2022), నిశ్శబ్దస్వప్నం-కవిత్వం (2022).
