
కథా మధురం
ఆ‘పాత’ కథామృతం-24
ప్రేమలీల. బి
-డా. సిహెచ్. సుశీల
మధ్యతరగతి జీవితాలను గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా అర్ధం కానిది ఏదో ఉంది అనిపిస్తుంది. మనోవేదనలకి ఒక ఇంచ్ దగ్గరలో, మందహాసాలకి ఒక ఇంచ్ దూరంలో ఉంటాయి వారి జీవితాలు. కింది తరగతికి దిగజారలేక, పై తరగతికి ఎగరలేక, గొప్పవారి హంగూ ఆర్భాటాలు చూసి నిట్టూర్పులు విడుస్తూ లోలోపల ముడుచుకుపోతూ వుంటారు. ఉన్నదానితో తృప్తి పడలేరు, లేనిదాన్ని అందుకోలేరు. దాని వల్ల సతమతమై పోతూంటారు. కొందరైతే హ్యాపీగా ఉన్నట్లు పైపైన నటిస్తుంటారు. అలా నటించలేని వారు లోలోపల కుంగిపోతుంటారు. తరచి చూసుకుంటే, తమ కంటే అన్ని విధాలా తక్కువగా ఉన్నవారి వెతలను విశ్లేషించి చూసుకుంటే తమ కున్న శాంతిని గుర్తించ గలరు. ఆ శాంతిని గమనంలోకి తెచ్చుకోక, ఎంత అశాంతి పాలౌతున్నారో ఆలోచించి చూసుకుంటే తెలుసుకోగలుగుతారు.
భార్యాభర్తల్లో ఎవరైనా ఇలాంటి నైరాశ్యంలో మునిగినప్పుడు సహచరుల తోడ్పాటు చాలా అవసరం. వారి సాంత్వనతో మాత్రమే కోలుకోగలరు. ఆ తోడ్పాటు, అర్ధం చేసుకునే గుణం లేకపోతే ఆ ఇల్లు అశాంతి నిలయం అవుతుంది. ఇది ఒక కాలానికి సంబంధించినది కాదు. పూర్వ కాలంలో అయినా అంతే. ప్రస్తుత కాలంలో అయినా అంతే. కోరికలు, సౌఖ్యాలు తీరు తెన్నులు, స్ధాయిలో హెచ్చుతగ్గుల్లో మార్పు. అంతే.
కుటుంబాలు విచ్ఛిన్నమై పోవడానికి కారణం కూడ ఈ అసంతృప్తులే కారణం. అసంతృప్తి కి అనేక కారణాలుండగా, ముఖ్యమైనది మాత్రం ఆర్థిక పరమైనదే. దీని ఆధారంగా ఎన్నో కథలు, నవలలు వచ్చాయి.
ఈ సందర్భంగా –
” ఉన్నదానితోనే సరిపుచ్చుకుని జీవితం గడపాలి. ఎవరో సుఖ పడిపోతున్నారనీ, మనకు లేదనీ చింతింస్తుంటే జీవితం ఎలా గడుస్తుంది?’…
అనే కాప్షన్ తో – బి. ప్రేమలీల రాసిన ” దూరపు కొండలు నునుపు” ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక 1952, ఫిబ్రవరి 27 లో ప్రచురితమైన కథను మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.
దూరపు కొండలు నునుపు
గోపాలం ఒక ఆఫీసులో హెడ్ గుమస్తా. ఆఫీస్ పనితో సతమతమై పోయి ఇంటికి వస్తే, భార్య శాంత చిరునవ్వుతోను ఇద్దరు ముద్దుగారే బాబు పాపలతోను అతని బడలిక అంతా మాయమై మనసు ఉల్లాసభరితంగా అవుతుంది. పిల్లలతో కబుర్లు చెబుతూ సంతోషంగా ఉంటాడు.
కానీ తన బాల్య స్నేహితుడు రామారావు అంతగా తెలివితేటలు లేకపోయినా, ఎలాగో పరీక్షల్లో పాసై, పెద్ద ఉద్యోగస్తుడై, అచిరకాలంలోనే ఆఫీసరై, మంచి పలుకుబడి, ఆస్తి, ఇల్లు సంపాదించాడు. అతను తన ఊరికి ట్రాన్సర్ అయి వచ్చిన దగ్గరనుంచి గోపాలంకి మనశ్శాంతి కరువైంది. అతని హంగు ఆర్భాటం చూసి కృంగిపోసాగాడు. జీవిత యాత్రలో అడుగడుక్కి తనకు ఎదురయ్యే కష్టాలు, వాటిని ఎదుర్కోలేక సతమతమ వుతూ, జీవితం మీద విసిగిపోతూ తన్ను తాను నిందించుకోసాగాడు. ఏమిటి అలా ఉన్నారు అన్న భార్య శాంతతో తన ఆలోచనలు చెప్పాడు. చాలీచాలని జీతంతో ఇంటి వాడికి, పాలవాడికి, చాకలికి, షావుకారికి పోను జీతంలో మిగిలేదేముంది అన్నాడు దానికి శాంతి ” భగవంతుడు మనకు ఇచ్చినదేదో మనకి ఇచ్చాడు. ఉన్నదానితోనే సరిపుచ్చు కొని మన జీవితం గడపాలి. ఎవరో సుఖపడిపోతున్నారని మనకు లేదని చింతిస్తుంటే మన జీవితాలు మరింత దుర్భరమవుతాయి. సంతోషం లేకపోతే కృశించిపోతాం. మనకు ఎదురుగా కనపడే మానవులు ధరించే విలువైన సూట్ల వల్ల, ఖరీదైన చీరల వల్ల, వాళ్ళు తిరిగే కార్ల వల్ల వాళ్ళ విలువల్ని సంతోషాన్ని మనం కనిపెట్టలేం. వాళ్ళ వేషాలని బట్టి వాళ్ళు సంతోష జీవులని అనుకోకూడదు. పైకి ఎంత డాంబికంగా, సంతోషంగా, హోదా తో తిరుగుతున్నా – వాళ్ళ అంతరింగక జీవితం విచారాలతోనూ అశాంతితోనూ నిండి ఉంటుంది. నిజానికి ఆలోచిస్తే వాళ్ళ కన్నా మనలాంటి సామాన్య జీవితాలే ఎన్నో వేల రేట్లు నయం. దూరానికి కొండలు ఎంతో నునుపుగా అందంగా కనపడతాయి. దగ్గరికి వెళ్లి చూస్తే వాటి నిజ స్వరూపం ఎంత భయంకరంగా ఉంటుందో గోచరిస్తుంది ” అన్నది.
రామారావు ఉద్యోగంలో చేరిన తర్వాత అతనికి వెల్కమ్ పార్టీలతో, సందడితో గడిచిపోతుంటే, గోపాలం అతనితో అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నా తీరికగా మాట్లాడే సందర్భమే కుదరలేదు. అతని హడావుడినంతా గమనిస్తూ, అతని హోదా అతనికిచ్చే గౌరవం చూసి మనసులో ” అదృష్టవంతుడు ” అనుకోకుండా ఉండలేకపోయాడు కూడా.
ఒకరోజు అతనితో స్నేహంతో మాట్లాడాలని అతని బంగ్లాకి వెళ్ళాడు. అప్పుడే డాక్టర్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి కారెక్కుతున్నాడు. లోపలికి వెళ్ళాడు గోపాలం. ఇల్లంతా మనుషులతో నిండి, పిల్లల గోలలు, ఏడుపులు, ఆడవాళ్ళ కేకలతోనూ నిండి గొడవగా ఉంది. ఎవరికి జబ్బు చేసింది డాక్టర్ గారు వచ్చారు అని అడిగిన గోపాలానికి రామారావు చెప్పాడు – “మా ఇంటికి డాక్టర్ రాని రోజు లేదు మందు వాడని గంట లేదురా. నా భార్య ఇందిర అనారోగ్యవంతురాలు. ప్రతి నెల ఏదో ఒక జబ్బు నీరసము వస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ బంధువులు. తినేవాళ్లే తప్ప ఏడుస్తున్న పిల్లల్ని సమదాయించే వాళ్ళు లేరు. నేనే అన్నీ చూసుకోవాలి” అన్నాడు చాలా దిగులుగా. అంతేకాకుండా బంధువులు ఏదో ఒక సహాయం కోసం రొక్కం అడగటానికి వచ్చి ప్రాణాలు తీస్తూ ఉంటారని చెప్పాడు. గోపాలం ఆశ్చర్యపోయాడు. పైకి ఎంతో గొప్పవాళ్ళుగా ఉండే వీళ్ళకి ఇన్ని కష్టాలు ఉంటాయా! రోగాలు వస్తే చూసుకునే వాళ్ళు కూడా ఉండరా! అను కొన్నాడు. ఇంటికి వచ్చి బాబు పాప ఆరోగ్యంగా ఆనందంగా ఆడుకుంటుంటే హమ్మయ్య అనుకున్నాడు ప్రశాంతంగా.
ఒకరోజు ఆదివారం పాప పుట్టినరోజుకి ఉన్నంతలో శాంత ఏవో పిండి వంటలు చేస్తుంటే, పిల్లలు సరదాగా ఆడుకుంటుంటె గోపాలం ఆనందంగా చూస్తూ ఉన్నాడు. అంతలో రామారావు వచ్చాడు. శాంత కాఫీ ఇచ్చి వెళ్ళింది.
“చాలా సంతోషం రామం మా ఇంటికి వచ్చినందుకు” అన్నాడు గోపాలం. “అరగంట నుండి బయట చాటుగా నిల్చొని మీ సంతోషాన్ని చూస్తున్నాను రా. ఇక పట్టలేక వచ్చేసాను. మనసంతా చికాకుగా ఉందని నీతో కాసేపు మాట్లాడదామని వచ్చాను రా. నాలోని చికాకు అంతా ఏ మూలకో ఎగిరిపోయింది. గోపీ, నిజంగానే ఎంత అదృష్ట వంతుడివి! ఎవరికో గాని ఇలాంటి అదృష్టం దొరకదు. దేనికైనా పెట్టి పుట్టాలి” అన్నాడు. గోపాలం రామం వంక తెల్లబోయి చూశాడు. “అదేమిటి రామం అలా అంటావు నీ కన్నా అదృష్టవంతులు ఎవరు ఉంటారు” అన్నాడు. “నేనేదో సుఖపడిపోతున్నాను అని అనుకుంటున్నావు. నీకు కనపడింది వట్టి భ్రమ మాత్రమే. ఒట్టి రసహీనమైన, సంతోష రహితమైన, మొద్దు బారిన జీవితం నాది. రోగిష్టి భార్యతోను తెరిపిలేని ఆఫీసు గొడవల తోనూ, పిల్లల గోలతోనూ, పీల్చుకునే బంధువులతోనూ రోజులు గడుపుతున్నాను. ఒక సంతోషం లేదు ఆనందం లేదు. నాలాంటి జీవితం పగవాడికి కూడా వద్దు. సొసైటీలో నా హోదా చూసి, నా వేషాన్ని చూసి నువ్వు ఏదో ఊహిస్తున్నావు. నిజమైన సంతోషాన్ని సుఖ జీవితాన్ని ఈవేళ మీ ఇంట్లో నేను చూశాను” అన్నాడు.
రామారావు వెళ్లిపోయిన తర్వాత గోపాలం ఆలోచిస్తూ ఉండిపోయాడు. బయట అంతా ఆడంబరం, అధికారం, హోదాతో ఉన్న రామారావు ఇంట్లో రోగాలు, ఏడుపులు, గోలలు. దూరానికి కొండలు నునుపుగా కనబడతాయి అందంగా. దగ్గరికి వెళ్లి చూస్తే వాటి నిజమైన ఆకృతి ఎంత భయంకరంగా ఉంటుందో అని ఒకప్పుడు శాంత అన్న మాటలు అతనికి గుర్తు వచ్చింది. తన ఇంట్లో ఉన్న స్వర్గాన్ని జీవితంలో ఉన్న సంతోషాన్ని ఆనాడు అర్థం చేసుకోలేకపోయాడు. తన జీవితంలోని శాంతిని ఆనందాన్ని గుర్తించు కోకుండా ఇన్నాళ్లు తన దురదృష్టాన్ని గూర్చి చింతిస్తూ ఎవరో సుఖ పడిపోతున్నారని తనకు అదృష్టంలేదని పిచ్చి భ్రమతో హృదయాన్ని అసంతృప్తితో నింపుకున్నాడు కదా అనుకున్నాడు. నిజమైన సంతోషం ఆనందం ఎలా ఉంటాయో రామారావుకి అర్థం అయింది. తన జీవితానికి ఆనంద జ్యోతి వంటిది తన అర్థాంగి శాంత అని అర్థం చేసుకున్నాడు.
చాలా సాధారణమైన అందంతో ఉన్న స్త్రీ అయినా – సహనంతో, చిరునవ్వుతో ఉంటే ఆమె చుట్టూ వున్న పరిసరాలన్నీ ఆహ్లాదంగా ఉంటాయి. సంసారంలోని కష్ట నష్టాలను ఓర్పుతో ఎదుర్కొంటూ, ఉన్నంతలో సర్దుకుంటూ భర్తకు చేదోడుగా నిలబడితే ఎంత సంక్షోభాన్నైనా నిలవరించుకోవచ్చు అని ఈ కథలో రచయిత్రి చెప్పారు. పైపైన కనిపించే రామారావు హోదాను చూసి గోపాలం ఇన్ఫీరియారిటీతో కుంగిపోయాడు. కానీ శాంత అతనికి ధైర్యం చెప్పింది. ఉన్నంతలోనే ఆనందాన్ని వెదుక్కోవాలి అని ఓదార్చింది. రామారావు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గందరగోళ పరిస్థితులను చూసి నప్పుడు, రామారావు చెప్పిన ఆవేదనల్ని విన్నప్పుడు మాత్రమే తానెంత ప్రశాంత జీవనంలో ఉన్నాడో గ్రహించగలిగాడు. ” అదృష్టవంతుడు ” అని తను భావించిన రామారావు తననే “అదృష్టవంతుడు” అన్నప్పుడు కానీ తనకున్న భ్రమలు తొలిగి పోలేదు. సహనవంతురాలైన అర్ధాంగి శాంత, ఆరోగ్యవంతులైన పిల్లలిద్దరూ ఉన్న తన జీవితమే సంతోషప్రదం, ఆనందదాయకం అని గ్రహించాడు. రామారావు హోదాను చూసి గొప్పగా అనుకోవడం “దూరపు కొండలు నునుపు” వంటి భ్రమే అని తెలుసు కున్నాడు.
ఈ రచయిత్రి బి. ప్రేమలీల 1934 సెప్టెంబర్ 9 న తూర్పు గోదావరి జిల్లా తునిలో జన్మించారు. బి. యస్. సి., బి.ఇడి. చదివారు. హైస్కూల్ చదివే రోజుల నుండి రచనలు చేయడం ప్రారంభించారు. శరత్ సాహిత్యం, చలం సాహిత్యం, ఇంకా నవలా సాహిత్యాన్ని చాలా అభిమానించేవారు. భర్త శ్రీ యమ్. శేషారావు ఆమె రచనాసక్తిని ప్రోత్సహించేవారు. ప్రేమలీల గారి కథలు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, జ్యోతి, వనిత వంటి వార, పక్ష, మాస పత్రికలలో ప్రచురితమైనాయి.
*****
వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

ప్రొ. సిహెచ్. సుశీల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో సుదీర్ఘకాలం పనిచేసి, ప్రిన్సిపాల్ గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్ గా, ఎడిటర్ గా పని చేసారు.
జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనల పై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు.
వీరి నాన్నగారి పేరు మీద విమర్శారంగంలో కృషి చేస్తున్న వారికి కీ.శే. సిహెచ్. లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారాన్ని గత 3 సంవత్సరాలుగా అవార్డు ఇస్తున్నారు. వరుసగా గత మూడేళ్ళలో కడియాల రామ్మోహనరాయ్ , రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కె.పి. అశోక్ కుమార్ గార్లకు ఈ అవార్డుని అందజేశారు.
విద్యార్థినుల చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేసారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం, సాహిత్య విమర్శ రంగంలో “కవిసంధ్య ” ( శిఖామణి) అవార్డు, కిన్నెర ఆర్ట్స్ & కొవ్వలి అవార్డులు అందుకున్నారు.
అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష ( పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు.
రచనలు:
1.స్తీవాదం – పురుష రచయితలు
2. కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారి జీవిత చరిత్ర
3. విమర్శనాలోకనం ( విమర్శ వ్యాసాలు)
4. విమర్శ వీక్షణం ( విమర్శ వ్యాసాలు)
