
కనక నారాయణీయం -64
–పుట్టపర్తి నాగపద్మిని
ఇటీవల ఆళ్ళగడ్డ రాజశేఖరా బుక్ డిపో ప్రింటర్ పరిచయమైనాడు. ఇంటికొచ్చి మరీ అడిగినాడు, ‘మీకు విజయనగర చరిత్రతో మంచి అనుబంధం ఉంది కదా! దాన్ని గురించి చారిత్రక నవల వ్రాయండి స్వామీ! మీరు బాగా పరిశోధన చేసినారు కదా! తాతాచార్యుల వంశస్తులు కూడా! మీరు వ్రాస్తే, ప్రింటు చేసేందుకు నేను రెడీ!’ అన్నాడు. తనకూ ఆ ప్రతిపాదన నచ్చింది. సరేనన్న తరువాత విచికిత్స. విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఎన్నెన్నో ఉత్కంఠభరితమైన కథలున్నయి. అసలు ఆ రాజ వంశాల మధ్య వైరుధ్యాల వల్లే పరాయి పాలకుల చొరబాటు వీలయిందనిపిస్తుంది. స్థాపన కాలం నుంచీ, నేలమట్టమయ్యేవరకూ ఎన్నెన్ని మలుపులు, కన్నీటి గాధలూ, త్యాగ చరితలూ! వాటిలో ఏది తన నవలకు పనికి వస్తుందో ఒక పట్టాన తేలటం లేదు. కిం కర్తవ్యం? అసలు విజయనగర సామ్రాజ్య స్థాపన, అంచెలంచెలుగా అభివృద్ధి, ముస్లిం పాలకుల కన్నుపడటం, వ్యాపారం పేరుతో ఇతర దేశాల చొరబాటు, అంత: కలహాలు, పరస్పర ద్వేషాలు, చివరికి సామ్రాజ్య పతనం – ఇవన్నీ పెద్దల ద్వారా కథలుగా వినటమే కాదు, కొన్ని శాసనాలను పరిశీలించటం, సీవెల్ ద్వారా వ్రాయబడి, 1900 లో ప్రచురిత మైన ఫర్ గాటన్ ఎంపైర్, బెంగళూరు సూర్యనారాయణ వ్రాసిన, 1905 లో ప్రచురితమైన నెవర్ టు బీ ఫర్ గాటన్ ఎంపైర్ చదివి కూడా తెలుసుకుంటుంటే, ఆనాటి వైభవం, ఈ నాడు దసరా దిబ్బగా నిరుత్తరంగా నిర్వేదంగా నిలబడి ఉన్న వైనం చూస్తే కడుపు కోత! అబూ అబ్దుల్లా ( ఐబిఎన్ బటుటా ) అనే మొరాకో యాత్రికుడు ఉత్తర ఆఫ్రికా, దక్షిణ యూరోప్, తూర్పు యూరోప్, మధ్య తూర్పు దేశాలు, ఇండియా ఉపఖండం, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, తూర్పు చైనా, యీ దేశాలన్నీ 30 సంవత్సరాలు తిరిగాడు. మొదటి హరిహర రాయలు కాలంలో ఇతను వచ్చాడట! తన అనుభవాలన్నీ రెహ్లా తుహ్ఫత్-అన్-నుజర్ ఫి గరైబ్ ఉల్-అమ్సార్ వా అజైబ్-ఉల్-అస్సార్ లో వ్రాసుకున్నా డట! నికొలో డి కాంటీ అనే ఇటాలియన్ వ్యాపారి బాగా చదువుకున్నవాడు. రెండవ దేవరాయల పరిపాలనా సమయంలో విజయనగరాన్ని సందర్శించాడట! ఇతను కూడ తన యాత్రానుభవాలను లాటిన్ భాషలో, ట్రావెల్స్ ఆఫ్ నికొలో కాంటీ అనే గ్రంధంలో భద్రపరచాడు. ఇతడు అద్భుతంగా విజయనగరాన్ని వర్ణించాడు. నికొలో డి కాంటీ అంచనా ప్రకారం విజయనగరం దాదాపు 60 మైళ్ళ విస్తీర్ణంలో, చక్కటి వ్యావసాయిక దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. పర్షియా దేశానికి చెందిన అబ్దుల్ రజాక్ గొప్ప పండితుడు కూడా! రెండవ దేవరాయ్లు కాలంలోనే ఇతడు కూడా విజయనగరాన్ని సందర్శించి, ఆశ్చర్యానందాలతో వెళ్ళి తన రాజు షా ముందు అక్కడి విషయాలన్నీ చెబితే ఆయన ఆజ్ఞాపించాడట, నీ యాత్రానుభవాలను పుస్తకరూపంలో వ్రాయి!’ అని ! ఆ విధంగా ‘ మత్లా’ అనే తన గ్రంథంలో, Sadain wa Majma ul Bahrain అనే విభాగంలో విజయనగర యాత్ర గురించి వివరంగా వ్రాశాడు! అబ్దుల్ రజాక్ ఏడు ప్రాకారాల విజయనగరాన్ని వర్ణించాడు. వ్యవసాయం, చేతి వృత్తులవాళ్ళు, సామాన్య కుటుంబాలు, ఆ తరువాతివన్నీ వ్యాపార కేంద్రాలుగా ఎప్పుడూ కిట కిటలాడుతూ ఉండేవట! విజయనగరంలో వీధుల్లో రత్నాలు రాసులుగా పోసి అమ్మటం చూసి, మాటలు రాలేదట అతనికి! అక్కడి భవనాల అందం వర్ణించటానికి అసాధ్యమంటాడతను! విశాలమైన వీధులతో అలంకరించుకుని నిలబడ్డ విజయనగరాన్ని, అక్కడి పరిపాలనను కూడ వేనోళ్ళ పొగిడాడు రజాక్. మూడవ ముహమ్మద్ పాలనలో నికిటిన్ అనే రష్యా యాత్రికుడు దక్షిణ భారతానికి వచ్చాడు కానీ బహమనీ రాజ్యం వరకే సందర్శించాడు, యెందుకో విజయనగరం వైపు రాలేదతను! లుడ్ వికో డి ఓర్థెమా అనే ఇటలీ వ్యాపారి ఈజిప్ట్, ఇండియా, సిరియాలలో పర్యటిం చాడు. ఒక క్రైస్తవుడిగా మక్కాను సందర్శించగలిగాడితను! బహుశా ప్రపంచం మొత్తానికి అటువంటి మొదటి వ్యక్తి ఇతడేనేమో! ఇతడు కూడ తన యాత్రానుభవాలను వ్రాశాడు కానీ విజయనగరం గురించి గొప్ప విశేషాలు లేవట! ఇక పోర్చుగీస్ రచయిత బర్బోసా. పోర్చుగీస్ ప్రభుత్వ ఉద్యొగి. ఒక విధంగా మళయాళం, పోర్చుగీస్ భాషల మధ్య దుబాసీ గా పనిచేసేవాడు. కృష్ణదేవ రాయల కాలంలో ఇతడు విజయనగరాన్ని సందర్శించాడు. ‘An account of countries bordering the Indian Ocean and their inhabitation’ అనే గ్రంథంలో కొన్ని విశేషాలు తెలుస్తాయి. డొమింగో పేస్ పోర్చుగీస్ వ్యాపారస్తుడు. ఇతడు కూడా కృష్ణదేవరాయల కాలంలో పర్యటించి, ఆనాటి హంపీ వైభవాన్ని సామాజిక జీవనాన్ని ఎంతో గొప్పగా వర్ణించాడు. Chronica des ris De Bisnaga అనే గ్రంథంలో రోం నగరంతో విజయనగరాన్ని పోల్చాడు పేస్. అక్కడి దేవాలయాలనూ, వ్యాపార కేంద్రాలనూ కూడ ఎంతో చక్కటి వివరాలతో వ్రాశాడు పేస్. అద్భుతమైన భవనాలను నిర్మాణ శైలినీ కూడా వివరించాడాయన! గుర్రాల వ్యాపారిగా భారత్ ను చేరుకున్నాడు న్యూనిజ్. పోర్చుగీస్ వ్యాపారి. అచ్యుత రాయల కాలంలో విజయనగరంలో మూడేళ్ళు ఉన్నాడట! అనేకానేక వివరాలను భద్రపరచాడు న్యూనిజ్. రాజ్యస్థాపన, పాలకులు, వివిధ వంశాలవారు, వీరిలో యుద్ధాలు, దక్ఖినీ సుల్తానులతో విరోధం, ఒరిస్సా రాజులతో ఘర్షణలు, విజయ నగర సాంస్కృతిక వైభవం, స్త్రీల అలంకారాలు, రాజ కుటుంబాల వ్యవహర శైలి – ఇవన్నీ బాగా గమనించి, వ్రాశాడంటే, ఆనాటి సామాజిక జీవితంలో ఎంత బాగా కలిసిపోయి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు కదా!! ఫెడెరిచ్ అనే ఇటలీ వ్యాపారస్తుడు, విజయనగర పతనం తరువాత, అక్కడికి వెళ్ళాడు. జన జీవనం సాగుతున్నా, భయాందోళనల మధ్యే బ్రతుకుతున్నారనీ, పులులు ఇతర కౄర జంతువులు వీధుల్లోకి వచ్చి, తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుందనీ వ్రాశాడట! ఈ వివరాలన్నీ చదువుతూ ఉంటే, ఆ రోజుల్లో తాను కూడా తిరుగాడినట్టూ, ఆ పరిసరాలతో తనకూ ఏదో బంధమున్నట్టూ అనిపిస్తుంది పుట్టపర్తికి! ఇప్పుడు నవలగా వ్రాయాలంటే ఎప్పటి కథను తీసుకోవాలో మరి? బహమనీ సుల్తాన్ ముహమ్మద్ షా క్రీ.శ. 1366 లో విజయనగరాన్ని ఏ విధంగా ఆక్రమించుకోవాలా అని తెగ ఎదురు చూస్తున్నాడట! మాలిక్ సైయ్యద్ ఘోరీ అనే తన ఉద్యోగిని పిలిచి, ‘తన దగ్గరికి వచ్చిన గాయనీ గాయకుల బృందానికి అప్పటి విజయ నగరరాజు బుక్క రాయలు పారితోషికం చెల్లించాలని ఒక సందేశం వ్రాసి పంపించమని ఆజ్ఞాపించాడట! ‘మా రాజు ఏదో మైకంలో ఉండి యీ పని నాకు చెప్పాడు మా రాజు,, విజయనగరానికీ, ఇక్కడి గాయక బృందానికీ సంబంధమేమిటి? ఈ పని నాకు ఎందుకు అప్పజెప్పాడ’నుకుని ఆయన పంపలేదట! మరుసటి రోజు షా అడిగాడు, సందేశం పంపావా? అని! మౌనంగా ఉన్న ఘోరీని చెడ తిట్టి వెంటనే పంపమన్నాడట! రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు, వెంఠనే ఘోరీ, రాజు ఆజ్ఞను ఆదేశాన్ని బుక్కరాయలుకు పంపాడు. బుక్కరాయలీ సందేశాన్ని చూసి అగ్గి మీద గుగ్గిలమైపోయి, ఆ వార్త తెచ్చిన భటుణ్ణి, గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించి, తిప్పి షా దగ్గరికి పంపాడు, ఇదే నా సమాధానం అని! ఇలా మొదలైన ఘర్షణలు, కొన్ని పదుల వత్సరాలు కొనసాగి, అనేక పరిణామాల తరువాత, మొదటి బుక్కరాయలు, గోవా, ఒడీషా,మలబార్, జాఫ్నా, వరకూ వశపరచు కుని, వాళ్ళను తనకు సామంతులుగా చేసుకుని పరిపాలిస్తూ 1379 లో చనిపోయాడు. అంటే విజయనగర సామ్రాజ్యం, పడమర తీర ప్రాంతం నుండీ, ఒడీషా వరకూ ఇటు రామేశ్వరం వరకూ కూడా విస్తరించిందన్నమాట! వీర కంపరాయలు, బుక్కరాయల పుత్ర రత్నం. తన శౌర్య ప్రతాపాలతో శత్రువు లకు దడ పుట్టించిన వాడు. మరకత నగరాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించాడు.అతని జీవితంలోని మలుపుల గురించి వ్రాద్దామా? మధురా విజయమన్న పేరుతో, ఆయన అర్ధాంగి గంగా దేవి కావ్యమే వ్రాసింది కదా!! కంపన కాలం క్రీ.శ.1296 నాటి శాసనాలు కూడా మదరాసు ప్రెసిడెన్సీ, మైసురు ప్రాంతాల్లో చాలా దొరికాయట! ఇక రెండవ హరిహర రాయల పరిపాలనా కాలంలోనూ, ఘర్షణలు తప్పలేదు. అదటుంచి, కళాపోషణ, సాహిత్య పోషణ బాగానే జరిగాయట! ఒక జైన కవి వేదాల మీద గొప్ప కృషి చేశాడట! ‘వైదిక మార్గ స్థాపనాచార్య ‘ అని బిరుదును కూడా ఇచ్చాడట రాజు అతనికి! క్రీ.శ. 1404 లో యీ హరిహర రాయలు చనిపోయాక, కుటుంబ కలహల వల్ల, కొన్ని సంవత్సరాలు, రెండవ బుక్క రాయలు పాలించాడు. గోవా ఇతని సమయం లోనే చేజారిపోయింది. క్రీ.శ. 1406 లో రెండవ హరిహర రాయలు కుమారుడు మొదటి దేవరాయలు సిం హాసనాన్ని అధిష్టించాడు. పర్షియన్ చరిత్ర కారుడు ఫెరిస్తా ఆనాటి సంఘటనలను పుస్తకానికెక్కించాడు. ఇతని కాలంలో ఆనాటి ఆంధ్ర, తెలంగాణా ప్రాంతమంతా ఇతని పాలనలోకి వచ్చిందట! వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందట! తుంగభద్ర నదికి ఏనుగుల సాయంతో ఆనకట్ట కూడా ఎర్పడిందట! అక్కడి నుంచీ విజయనగరం హంపీకి 24 మైళ్ళదాకా కాలువ తవ్వించి, త్రాగు నీరు తెప్పించే ఏర్పాటు కూడా చేశాడట! నికొలో కౌంటీ వ్రాతల ప్రకారం ఇతని సమయంలోనే విజయ నగర సామ్రాజ్యం, బాగా విస్తరించిందట! కళలకు కళా, కాంతీ వచ్చాయి! సైన్యమూ అభివృద్ధి చెందింది! ఇంతలో దేవరాయల జీవితంలోని ఒక ప్రణయ పుట!
*****
(సశేషం)

సరస్వతీపుత్ర గా, చతుర్దశభాషా పరశేషభోగిగా చిరపరిచితులైన పుట్టపర్తి నారాయణాచార్యులవారు (1914 – 1990) , వారి ధర్మపత్ని, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సత్కార గ్రహీత శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ (1921 – 1983) దంపతుల కుమార్తెగా జన్మించటమే గొప్ప వరమనీ, ఆ ఇంటిపేరే గొప్ప బిరుదని నాగపద్మిని గారంటారు. విద్యార్హత – హిందీలో ఎం.ఏ ఎం.ఫిల్. పీహెచ్.డీ. తెలుగు ఎం.ఏ. జర్నలిజం, అనువాదకళ, టీవీ నిర్మాణకళలలో పీజీ డిప్లమోలు; ఆకాశవాణి, దూరదర్శన్ లలో ముప్పైఐదేళ్ళ ఉద్యోగ జీవితంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుధా ప్రశంసనీయమైన వందలాది కార్యక్రమాల నిర్వహణ; తెలుగు హిందీలలో యాభైదాకా పద్య, సాహితీ వ్యాస,కథ, నాటక, అనువాద రచనలు; తెలుగు విశ్వవిద్యాలయ, తమిళనాడు హిందీ అకాడెమీ, బిహార్ సాహిత్య సమ్మేళన్, గోఎంకా జాతీయ అనువాద పురస్కారాలూ, శ్రీయుత వైయస్. రాజశేఖర రెడ్డి, ఎన్.డ్.తివారీ,డా.రోశయ్య, డా. మృదులాసిన్ హా (ప్రస్తుత గోవా గవర్నర్) వంటి రాజకీయ ప్రముఖులచే సత్కారాలూ; తెలుగు రాష్ట్రాలలోనే కాక, ఖరగ్ పుర్, పాట్నా, చెన్నై, అమెరికాలో న్యూజెర్సీ, డల్లాస్, పెన్సిల్వేనియా, అట్లాంటా, వాషింగ్టన్ సాహిత్యసమావేశాల్లో ప్రసంగానంతర సత్కారాలు; . గత పదిహేనేళ్ళుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ప్రత్యక్ష ప్రసారాలలో హిందీ/తెలుగు వ్యాఖ్యాత. జయజయశంకర, శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ మొదలైన మాధ్యమాలలో యాభైకి పైగా ఆధ్యాత్మిక ప్రసంగాలు; అన్నిటికంటే మించి, పుట్టపర్తి వారి శతజయంతి (1914-2014)సందర్భంగా పుట్టపర్తి పద్య, కథ, నవల, అనువాద, విమర్శ సర్వస్వాల ప్రచురణ (నాలుగువేల పుటల బృహత్ ప్రచురణ).
