
చిత్రం-61
-గణేశ్వరరావు
ఇటాలియన్ ఐశ్వర్య వంతురాలు, అందకత్తె Marchesa Casati చిత్రం ఇది. దీనిని 1914 లో చిత్రించిన Giovanni Boldini, ‘Master of Swish’ గా అప్పటికే ప్రసిద్ధి చెందాడు. రంగుల పళ్లెం లో కుంచెను ముంచి, దానితో కాన్వాస్ పైన ఝళిపించినట్లు, అతి వేగవంతంగా బొమ్మను గీయడం అతని ప్రత్యేకత. మిరుమిట్లు గోలిపే ఆమె అందం మన కళ్ళను చెదరగొడుతుంది. ఆత్మాశ్రయ ధోరణిలో చిత్రించిన ఈ చిత్రంలో ఆమె అధునా తన రూపాన్ని, ఆడంబరాన్ని చిత్రకారుడు చూపిస్తాడు. ఒక నాట్య భంగిమలో కనిపి స్తుంది ఆమె. రెపరెపలాడుతున్న ఆమె దుస్తులు, ఆమె మొహం – నేపథ్యంలో మెరిసి పోతూ ఉంది, పాల రాతిలా తళుక్కుమంటున్న ఆమె శరీరం అత్యంత మనోహరంగా చిత్రించబడింది. లేత గులాబీ రంగులో మెరిసిపోతున్న ఆమె మొహం – దట్టమైన రంగుల్లో వేయబడ్డ నేపథ్యానికి భిన్నంగా ఉంది. వాస్తవికత కన్నా, ఒక మాయాజాల ప్రపంచం ఇందులో పరచుకుంది.
బోల్దిని ఆమె బొమ్మ గీసిన రెండు దశాబ్దాల తర్వాత అంతా మారిపోయింది. ఆమె అత్యంత క్షీణ దశకు చేరుకుంది. ఇప్పుడు ఆమె పారిస్ యొక్క నంబర్ 1 ఫ్యాషనబుల్ హోస్టెస్ కాదు. ఆమె తన గణనీయమైన సంపదను అంతా ఉపయోగించుకుంది, అంతే కాదు, 25 మిలియన్ డాలర్ల అప్పులు చేసింది, ఆమె తన ఆస్తులన్నింటినీ అమ్మవలసి వచ్చింది. ఆమె తన జీవితంలోని ఆఖరి దశ – చివరి పాతికేళ్ళు – లండన్ లోని ఒక చిన్న ఫ్లాట్ లో అజ్ఞాతంలో గడిపింది, అక్కడ 1957 లో మరణించింది . బ్రాంప్టన్ శ్మశానవాటికలో ఆమె సమాధిపై ఆమె పేరు కూడా తప్పుగా రాయబడింది ‘లూయిసా’ అని. అయితే ఆమె సమాధి మీద షేక్స్పియర్ ఉల్లేఖన ఉంది: ‘వయస్సు ఆమె మీద పడదు, వాడి పోనీయదు’. గియోవన్నీ బోల్డిని చిత్రం ఆ వాస్తవాన్ని గుర్తుచేస్తుంది, ఆమెని ‘నిత్య యవ్వని’ గానే చూపిస్తుంది. Giovanni తన వ్రుత్తి జీవితంలో రాణించాడు, పారిస్ లో 1931 లో మరణించాడు.
*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
