
ఎంతో కొంత మిగిలే వెలితివే (కవిత)
– శ్రీ సాహితి
నీవు నిరంతరం
ఏదో కోరికలా
ఏ పేరుతో పిలచుకున్నా
చెదరని అందంతో
గర్వపడే లోపలి లోకంలో
నాటు పడిన ఒక్క మాటగా
అర్దమెంత కోసినా
ఎంతో కొంత వెలితివే.
ఎంత కురిసినా
ముఖంలో మొలకెత్తని నిజానివే.
నీకేమీ కావాలో
తెలియకుండా తవ్వుకునే ప్రశ్నవే.
నాతో పని లేకుండా
ఏది అడగకుండానే
బాగా తెలిసిన ఇష్టాలతో
అన్నీ వేళలా అన్నీ చోట్ల…
నా లోపలే ఉంటావు
ఓ ప్రశ్నను ప్రేమగా మోస్తూ
నా కోసం వెతుకుతూ ఉంటావు.
నీవే చిరునామావని తెలియక….
*****

మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా నాన్నగారు పరిచయం చేసిన మహాకవి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం నా జీవితంలో ఓ గొప్ప మలుపు. క్రమంగా వచన కవిత్వము పట్ల అభిమానము కలిగి, నాకు తోచిన భావాలను వచనంలో వ్రాయడం అలవాటుగా మారింది.
