
ఈ తరం నడక – 13
జస్ట్ ఏ హౌస్ వైఫ్
-రూపరుక్మిణి
కపట ప్రపంచానికో బ్రేకప్
సరళత, గాఢత, మృదుత్వం, చిక్కటి అభి వ్యక్తి, చిగురించే ఆకాంక్షలు, మెలిపెట్టే పెంకితనంలోని ప్రేమను సమున్నతంగా, గౌరవంగా అందుకోవాలనే తపన, చుట్టూ ఆవరించిన ఆవరణలో ఉన్న వాస్తవాలపై విముక్త భావాల వెల్లువ, అణిచివేయబడిన ఆలోచనలకు రూపం ఇవ్వాలన్న ఆశ కనిపిస్తాయి కవిత కవిత్వంలో….
సొంతగడ్డకి దూరంగా ఉండి, తన ఊరు మనుషులకి దూరమైపోయినప్పుడు కలిగే స్వదేశీ ప్రేమలో ఏ మనిషిని చూసినా తన ప్రాంతం వారైతే ఉప్పొంగే ఆత్మీయతలో నిత్యం ఓలాలాడే ఓ ప్రేమ వాక్యం కవిత. ఇన్నింటి మధ్య కవిత మనసెరిగి మక్కువగా స్నేహం కుదుర్చుకుంది మాత్రం సాహిత్యంతోనే అనిపించింది కవిత కవిత్వాన్ని చూస్తే.
ప్రశ్న ఎక్కడైతే ఉద్భవిస్తుందో అక్కడే విప్లవం మొదలవుతుంది అంటారు. అలాగే ఉంటుంది కవిత కవిత్వంలోని ఆలోచన తనలోని అనేక ప్రశ్నలకు సమాధానం అవుతూ స్త్రీగా ఉనికిని కోల్పోకుండా ఉండే ఒక స్వరం కోరుకుంటుంది తాను.
బంధాలు బలహీనులని చేయకూడదని, ‘మార్పు’ తనకోసం తనని తాను బలపరుచుకునే వ్యక్తిగా మారాల్సిన అస్తిత్వ ధోరణికి ముగింపు వాక్యము అవ్వాలని ఈ కవితని మలుస్తుంది. ఒక స్త్రీ తన రూపాన్ని తన కుటుంబం కోసం ఎన్ని రకాలుగా మలుచు కుంటుందో చెప్తున్నప్పుడు, ఓ ఆడపిల్ల చుట్టూ ఉన్న ప్రపంచం ఊసరవెల్లిలా ఎన్ని రంగులు మార్చుకుంటుందో వారి ఆలోచనలకు అనుగుణంగా ఎలా మారమంటుందో చెప్పే సందర్భంలో….
“మారి మారి మర బొమ్మనయ్యాను” అంటూనే…
“ కాసింత ప్రేమ కోసం శిశిరపు ఆకల్లే రాలిపోయాను”, /గుండెల్లో పూలు నాటడం తప్ప కలుపు మొక్కలేరే విద్య నాకబ్బలేదు.”
ఇలా కవితా వాక్యాలను చూస్తే స్త్రీ అస్తిత్వ ధోరణిలో ఎదురవుతున్న వాస్తవాలను వ్యతిరేకిస్తూ విసిగి వేసారాను అని అసహనాన్ని ప్రకటించడం కనిపిస్తుంది.
జస్ట్ ఎ హౌస్ వైఫ్ అంటూ టైటిల్ కవితలో…
“ కలిసి చిగురించలేని కుదురులోంచి నేలరాలడం నాకభ్యంతరం లేదు.”
అన్న వాక్యంతో స్త్రీ స్వతంత్ర ఆలోచనను, అస్తిత్వాన్ని కోల్పోకూడదు, అవసరమైతే ఆ బాధించే బంధం నుండి వేరుపడైనా స్వేచ్ఛగా జీవించాలనే ఆకాంక్షను తెలుపుతుంది. ఆధునిక భావజాలానికి ప్రతీకగా నిలబడుతుంది.
ఓ ఆడపిల్ల జీవితాన్ని నదితో పోల్చి “గోదారమ్మ నీది నా దారేనా..?
నీలోనూ నిత్య తుఫాను చెలరేగుతుందా..? ఎందరు బురద చిమ్మినా మౌనంగా మారి / నాలాగే సముద్రంలో కలిసిపోగలవా..? అంటూ నదిని ఓ ఆడపిల్ల జీవితంగా చూపిస్తుంది. ఈ ప్రతీక కవిత్వం రాసేవారు తప్పనిసరిగా వాడే ప్రతీకే అయినా, కవిత కవిత్వం లో ఓ కొత్త సాంత్వన వాక్యం మనకు ఎదురవుతుంది.
ఒకానొక సందర్భంలో తన గురించి తానే రాసుకుంటూ రూపాంతరం కవితలో అసలు సిసలు అయినా స్త్రీ సహజ లక్షణం ఎదగడం అంటే తన సమస్యల కొలనులో నుండి తానే బయటకు మార్గాన్ని అన్వేషించడం అంటూ ఆ అన్వేషణలో భాగంగానే ఆడపిల్లలు “ పరిమళించి, పరిణవించాలని” కోరుకుంటుంది.
తరాలుగా సాంప్రదాయాల నీడలో జరిగే పెళ్లి తంతుల్లో నిత్యాగ్నిహోత్రాన్ని చిత్రిస్తూ “శాంతంగా ఉంటే కుదరదు /సహనం సరిపోవట్లేదు / కోపం వస్తే గాని తప్పేటట్లు లేదు” అంటుంది.
ప్రతి ఆడపిల్ల తనలోని తనని కాపాడుకునే శక్తి సమకూర్చుకోవాలని కోరుకుంటుంది. మూసలో బతుకీడ్చడం సరికాదని చెప్తుంది. ఓ ఆడపిల్లగా ఎన్ని గడ్డు కాలాలు దాటి వచ్చిన తల్లి అయినా మళ్లీ పిల్లలకు పెళ్లి చేసి అదే అనుభవంలోకి నెడుతూ ఈ సాంప్రదాయాల చట్రంలో కట్టివేస్తున్నామని తల్లడిల్లుతుంది.
మధ్య వయసు సమస్యను చర్చిస్తూ ఆలోచనల ముళ్ళ గులాబీని పరిచి చూపిస్తుంది.
“ఏ సరంగు పాటలో పడవనై ఊగిపోతానో / నడి వయసు తుఫాను రాత్రి జ్ఞాపకాలు మాత్రమే తోడు / ఎప్పుడు ఏకాంతం ఎందుకు బళ్ళు మంటుందో నీకు మాత్రమే తెలుసు.”
అంటూ మనసు గాయాల గాలివాటాన్ని పరిచయం చేస్తూ ఈ గాయాల ఉప్పెనల్లో అసలు రంగు వెలిసిపోయి తేలిపోయి పారిపోయాను నన్ను నేను కోల్పోయా అంటూ ఆవేదన చెందుతుంది.
ఇందులో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన ఒక సందర్భం ఉంది. అది కవిత కవిత్వం అయ్యే సందర్భాన్ని చెప్తూ “ప్రతీ కాగితంపై నేను నాటుకున్న సంపెంగ చెట్టువి, / పట్టని కత్తి, డాలువి, /………., నన్ను విజయతీరం చేర్చావో, సమూలంగా విధ్వంసం చేశావో.., వివశనయ్యాను.” అంటూ తనలోని తనని, సహజ ప్రతిబింబాన్ని, ప్రతిబింబించేలా చేస్తుంది. ఇలా కవిత్వం అయ్యే సందర్భాన్ని ఎంతో ప్రేమగా ఆహ్వానించడాన్ని మనకు తన ప్రతి అక్షర రూపంలో కనిపిస్తుంది.
స్త్రీ తన సమయాన్ని ఎన్నింటిని కోల్పోవలసి వస్తుందో అన్ని ఆలోచనలను ‘లోలకం’ కవితలో రాస్తూ
“అస్తిత్వాన్ని దహిస్తున్న దారిలో కాసిన్ని మెత్తటి పూలను పరుచుకోనీ” / నియమ నిబంధనల గడియారంలో నుండి బయటకు దూకనివ్వ”మని కోరుకుంటుంది.
“గాజు పూల నేరుకున్న నేలని నేను, ముళ్ళతో మాలలు అల్లుకొని మనసులో తురుముకున్నా.” అనే కవిత్వ పాదాలను చూసినప్పుడు కవిత మనసులోని మృదుత్వం తన కవితల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
తన కవిత్వంలోని విరోధభాస ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలలో సాంప్రదాయాలని పూర్తిగా ఖండించదు. అలా అని సాంప్రదాయ చట్రంలో బతకడాన్ని సమర్థించదు. కుటుంబ ప్రేమ ఎంత ముఖ్యమో స్త్రీకి అస్తిత్వం కాపాడుకోవడం అంత ముఖ్యమని తెలుసుకున్నానని అమాయకంగా చెప్తూనే “ఎన్ని సమస్యలు వచ్చినా పరువు ప్రతిష్టల మధ్య అలంకారం చేస్తే తలలూపే గంగిరెద్దుల”వడాన్ని వ్యతిరేకిస్తుంది. కొత్త దారిని వెతకాలి అంటుంది. కానీ విభేదించదు. అభద్రతను ప్రశ్నిస్తుంది కానీ ఖండించదు.
అమ్మతనంలోని ఒంటరితనం పట్ల ఆవేదన చెందుతుంది, అమ్మతనం అమ్మని ఎలా ఓడిస్తుందో ఆ అమ్మతనంలో ఓ స్త్రీ తనకి తానే ఎలా విలన్ గా కోరికల్ని చంపుకోమంటుందో చెప్పి అంత మృదుత్వం నా కంటలేదు అని చెప్తుంది. కానీ
“అద్దం వెనక దాచిన అస్తిత్వం / బూడిద పాలైన పన్నీటి వాసనలతో పోల్చుతూ, ఆడపిల్లగా బ్రతకడంలోని కష్టాన్ని గుర్తు చేస్తూ దుఃఖపు లోయల్లోకి జారిపోగలము జాగ్రత్త పడమని హెచ్చరిస్తుంది.
“సీతాకోకలుగా మలుస్తామని బంగారు వలలో పడేస్తుందీ సాంప్రదాయం.
……. అస్తిత్వాన్ని కమ్మిన చిమ్మ చీకట్లలో నుంచి బయటపడి / బూడిదల నుండి పైకెగిసిన ఫీనిక్స్ పక్షులమవుదాం.” అనే ఆకాంక్షను తెలియజేస్తుంది.
కవిత కవిత్వం అంతా ఇలా మృదువైన సుతిమెత్తని పదాల అల్లికలతో ప్రశ్నలను సంధిస్తూ సమాధానాలను వెతుకుతూ మన మనసుని అల్లుకుంటుంది. సహజమైన పదసంపదలతో అలరిస్తుంది.
భవిష్యత్తులో కూడా తన సహజత్వాన్ని కోల్పోకుండా నూతన అభివ్యక్తి కోసం ఎదురుచూస్తూ….
కవిత తొలి కవితా సంపుటి “జస్ట్ ఏ హౌస్ వైఫ్”కు అభినందనలు.
*****

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.