
దరి చేరని వసంతం !!
-ఇందు చంద్రన్
అతనో వసంత కాలపు అతిథి !
ఎండుటాకుల మధ్య చిగురిస్తూ పుట్టుకొస్తుంటాడు.
ఓ వైపు వేసవి మంటలు
మరో వైపు గడ్డ కట్టే చలి…
రెండు కలగలిసే సంధ్యా సమయాన కనిపిస్తాడు.
అప్పుడుపుడూ కలల్లోనూ,
కొన్ని సార్లు నిజంగాను కనిపిస్తుంటాడు.
వెచ్చని సూర్య కిరణాలు తాకినప్పుడో,
చలికి బిగుసుకు పోయినప్పుడో
ఏదైనా తింటూ పొలమారినప్పుడో
అద్దంలో అందంగా చూసుకున్నపుడో గుర్తొస్తాడు.
అనుకోని అతిథిలా !
ఆకలి, దప్పికల్లాగే అతని మీద ప్రేమా…
సహజంగా సృష్టించిన ప్రకృతిలాగే అతనూ…
రూపాలు మారిపోతుంటాయి
ఋతువులు మారుతుంటాయి,
వసంతాలు మళ్ళీ వస్తుంటాయి…
వాటితో పాటుగా అతనూ వస్తుంటాడు !
*****
Please follow and like us:

ఇందు చంద్రన్ స్వస్థలం చిత్తూరు జిల్లా. బి టెక్ పూర్తి చేసుకుని ఐటీ లో ఉద్యోగం చేస్తున్నాను. కథలు , కవితలు చదవడం అంటే ఇష్టం. ఆ ఇష్టంతో సరదాగా రాయటానికి ప్రయత్నిస్తున్నాను.
