
కోడి ఉబలాటం
-కందేపి రాణి ప్రసాద్
అదొక కోళ్ళ ఫారమ్. వందల కోళ్ళు గుంపులుగా బతుకుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా లైట్ల వెలుతురుతోనే ఉంటాయి. ఇనుప తీగలు అల్లిన జాలీలలో ఒక దాని మీద ఒకటి మీద పడేలా ఉంటున్నాయి. చిన్న జాలీలో రెండు మూడు కోళ్ళు ఉంటాయి. ఒక కోడి రెక్కలు విప్పు కుందామంటే ఖాళీ ఉండదు. అటొక అడుగు కదపాలన్నా కదప లేవు. ఒక రకంగా చెప్పాలంటే జైలు జీవితమే.
కోళ్ళు రాత్రింబవళ్ళూ తినటమూ, నీళ్ళు తాగటమూ తప్ప వేరే పనేమీ లేదు. బయట ఉన్న కోళ్ళయితే ఇల్లిల్లూ తిరుగుతూ అన్నం మెతుకులూ, ఎండు మిరపకా యలూ ఏరుకుని తింటుంటాయి. కొన్ని కోళ్ళు తన పిల్లల్ని వెంటేసుకుని తిప్పుతూ ఎలా తినాలో పిల్లలకు నేర్పిస్తూంటాయి. కానీ ఫామ్ లో ఉండే వాటికి ఏ ఆనందాలూ ఉండవు. చదువుల పేరుతో హాస్టళ్ళలో ఇరుక్కు పోయిన పిల్లలే గుర్తు వస్తారు. తిండి పెట్టటం, పుస్తకాలు చేతికివ్వటం తప్ప వేరే ఏ పనీ ఉండదు. ఇక్కడ కోళ్ళకు కూడా దాణా పెట్టటం, గుడ్లు, మాంసం అమ్ముకోవటం తప్ప ఏ పనీ లేదు.
ఆ కోళ్ళ ఫారమ్ లో రెండు కోడి పిల్లలు ఉండేవి. చింకీ, పింకీ అని వాటి పేర్లు రోజు చింకీ, పింకీ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఈ కోళ్ళ ఫారం దాటి ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు కాబట్టి బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలని ఆశ పడేవి కానీ ఆ కోరిక తీరదు అని బాధ పడేవి.
ఒక రోజు కోళ్ళ పారంకు ఈ ఊర్లో నుంచి కొత్త వ్యక్తులు వచ్చారు. ఆ వ్యక్తులు ఒక ఆటో తీసుకుని వచ్చారు. అందులో కోళ్ళ గంపులు పెట్టుకుని వచ్చారు. కోళ్ళ ఫారం అంతా తిరిగి కొన్ని కోళ్ళను తీసుకుని వెళ్ళారు.
ఈ విషయమంతా చింకీ, పింకీ గమనిస్తున్నాయి. ఎందుకు ఆ కోళ్ళను మాత్రమే తీసుకెళ్ళరని ఆలోచిస్తున్నాయి చింకీ అడిగింది. పింకీ! వచ్చిన వాళ్ళు వెతికి వెతికి మరీ కొన్ని కోళ్ళను మాత్రమే తీసుకు వెళ్ళారేమిటి? ఆశ్చర్యంగా చూస్తూ తిరిగింది.
“ఆ సంగతి ఏమో గానీ ఆటో ఊరి వైపుకు వెళుతుంటే నాకు చూస్తూనే ఉండాలన్పిం చింది. మనం ఎప్పుడూ బయట ప్రపంచం, చూడలేదు కదా! మనల్ని అలా బయటకు ఎప్పుడు తీసుకేళతారో” అని నిట్టూరుస్తూ అన్నది.
నిజమే పింకీ! నాక్కూడా అలాగే అనిపిస్తున్నది. అటోలో కూర్చున్న కోళ్ళను నేను గమనించాను. అవి ఎంత సంతోషంగా ఉన్నాయో కదా చింకీ కూడా నిట్టూరుస్తూ అన్నది.
ఈ మాటలు విన్న పింకీ “చింకీ మనం పుట్టాక ఎప్పుడైనా ఈ ఫారం దాటి చూశామా! ఈ ఇనుప తీగల లోపల నుంచి చూడటమే గానీ బయటి నుంచి ఆకాశం కూడా చూడలేదు!” అని అన్నది.
ఈ మాటలకు సమాధానంగా చింకీ “మనకిందులో నుండి రోడ్డు ఆ మలుపు మాత్రమే కనిపిస్తుంది. ఆ మలుపు తర్వాత ఏముంటుందో ఏమో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. పచ్చని చెట్లు, వాగులు ఉంటాయేమో! మన పక్క రూము వాళ్ళు చెప్పుకోగా విన్నాను” మనసులో ఏదో ఉహించుకుంటూ అన్నది.
“అవును చింకీ! దూరంగా మనకు కన్పించే గుట్టలు ఎక్కాలని కూడా అనిపిస్తుంది. ఏమిటో మనం సహజంగా చెయ్యాల్సిన వేవీ చెయ్యలేకపోతున్నాం. మనకు దాణా వెయ్యటానికి వచ్చే శీను ఉన్నాడు గదా! వాడి దగ్గర సెల్ ఫోన్ లో వీడియోలు చూశాను. కోళ్ళు వాటి పిల్లలు చక్కగా ఇల్లిల్లూ తిరుగుతూ మేత తింటున్నాయి. ఆ దృశ్యం నా మనసుకు ఎంత నచ్చిందో” తన్మయత్వంతో ఉగిపోతూ అన్నది.
“అది సరే గానీ! ఆ శీనూ గాడి దగ్గరున్న ఫోన్ లో నువ్వెట్లా వీడియోలు చూశావే! నాకు చిత్రంగా అనిపిస్తున్నది. నేనెప్పుడూ చూడలే” ఆశ్చర్యంగా అడిగింది చింకీ!
పింకీ! “మనకు దాణా వెయ్యడానికి వచ్చాడు కదా! అప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసి ఇక్కడే కూర్చుని వీడియోలు చూస్తూ నవ్వుకుంటున్నాడు. అప్పుడు నేను కూడా తొంగి చూశాను. కుక్కలు, కోళ్ళు, పిల్లల వీడియోలు చాలా బాగున్నాయి అవి ఎంత స్వేచ్ఛగా తిరుగుతు న్నాయో! వాటిని చూసి నా క్కూడా అలా ఉండాలని అనిపించింది.” ఉత్సాహంగా చెప్పుకు పోతూ ఉన్నది చింకీ!
వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మరో కోడి వచ్చింది. చింకీ, పింకీలు రెండూ కలిసి ఒకే మాట అడిగాయి “ఆ కోళ్ళను ఎక్కడకు తీసుకు వెళ్తున్నారు? కొన్నింటినే ఎందుకు తీసుకెళ్తున్నారు ఎప్పుడు తీసుకు వెళ్తారు.”
వచ్చిన కోడి ఇలా చెప్పింది “ఆ వివరాలన్నీ నాకు తెలియదు గానీ బాగా పుష్టిగా ఉన్న కోళ్ళను తీసుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఆ కోళ్ళను తూకం వేయటం చూశాను నేను.”
చింకీ, పింకీలు వెంటనే “మనమిద్దరం కూడా బాగా తిని లావుగా అవుదామా” అని ఉత్సాహంగా ఒకరి నొకరు చూసుకుంటూ ఉన్నాయి.
ఆ రోజు మొదలు ఈ రెండు కోళ్ళు దాణా మాత్రమే గాకుండా నీళ్ళు కూడా బాగా తాగుతున్నాయి. పొట్ట బాగా కనపడాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నములుతూనే ఉన్నాయి.
కొన్ని రోజుల తర్వాత కోళ్ళ గంపలు తీసుకుని ఆటో వాడు వచ్చాడు. కోళ్ళను తీసుకుపోవటానికి వచ్చాడు.. అని తెలిసి చింకీ, పింకీలు ఎగిరి గంతేశాయి. ఈసారి మనల్ని ఖచ్చితంగా తీసుకు వెళతాడు అని మనసులో అనుకున్నాయి. తమను గుర్తించాలని ముందుకు ముందుకు వెళ్ళి నిలబడ్డాయి. కానీ వాళ్ళ గోలలో వాళ్ళున్నారు.
ఇదంతా గమనిస్తున్న ఒక పెద్ద కోడి ఈ రెండింటినీ వెనక్కు లాగింది! “ఎంటీ అంత హుషారుగా ముందుకు వెలుతున్నారు. వాళ్ళ కంట పడితే అంతే సంగతులు. వెనక్కు రండి” అంటూ వీళ్ళను దూరంగా లాక్కొచ్చింది.
చింకీ పింకీలకు బాగా కోపం వచ్చింది. ఎందుకు మమ్మల్ని వెనక్కి లాగావు అంటూ కోపంగా అడిగారు.
“ఎందుకా! మీరు చచ్చిపోతారని వెనక్కు లాగాను. ఆ కోళ్ళను చికెన్ దుకాణానికి తీసుకు వెళుతున్నారు. కోళ్ళను చంపేసి చికెన్ అమ్ముకుంటారు. అందుకే మిమ్మల్ని జాగ్రత్త కోసం వెనక్కి తీసుకొచ్చాను”! అన్నదా పెద్ద కోడి.
చింకీ పింకీలకు కళ్ళు తిరిగిపోయాయి పైపై భ్రమలకు ఆకర్షణ పడితే ఇలాగే ఉంటుందేమో? వీటిని విహార యాత్రకు తీసుకు వెళుతున్నారని భ్రమపడ్డాం. ఇక నుంచీ జాగ్రత్తగా ఉంటాం. అని చింకీ, పింకీ పెద్ద కోడికి నమస్కరించాయి.:
*****

నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.