సరస్సు-అమ్మాయి

झील-सी लड़की

హిందీ మూలం – డా. నీతా కొఠారీ

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          గట్టిగా వస్తున్న గాలివిసురుకి కిటికీ అద్దాలలో ప్రకంపన మొదలయింది. కర్టెన్లు అటూ-ఇటూ ఊగసాగాయి. మంచినీళ్ళకుండ మీద పెట్టిన గ్లాసు మూతతోసహా ఎగిరి కిందపడింది. సంజన ఉలికిపాటుతో లేచి మంచంమీద కూర్చుండిపోయింది. నిద్ర కళ్ళతో ఆమెకి ఏమీ అర్ధం కాలేదు. తరువాత ఆమె కిటికీ దగ్గరికి వెళ్ళింది. బయట గాలిదుమారం ఉధృతంగా ఉంది. తను వరండాలో ఆరేసిన బట్టలని తీసుకుంది. ఇంతలోనే ఉన్నట్టుండి గట్టిగా ఉరుములతోబాటు కారుమబ్బులు వర్షించసాగాయి. సంజన కిటికీ మూసివేసి వచ్చి మళ్ళీ మంచం మీద కూర్చుంది.

          ఆమె బట్టలు జాగ్రత్తగా సర్దుకుని చాయ్ పెట్టింది. ఒక అరగంట సేపు కుండపోతగా కురిసిన తరువాత వాన కాస్త తగ్గింది. వర్షం కారణంగా ఉక్కపోత మరింత పెరిగింది. ఆమె బాల్కనీలోనే నిలబడి ఉండి చాయ్ సిప్ చేస్తూ అక్కడి వృక్షాలనీ, ఆకులనీ వాటి పచ్చదనాన్నీ వీక్షించసాగింది. చెట్ల కొమ్మలు ఒకదానితో ఒకటి కొట్టుకుంటూ, పరస్పరం కలుసుకునే ఆనందాన్ని తెలియపరుస్తున్నాయి. ఎండిపోయిన ఆకుల్లో నవచైతన్యం తొణికిసలాడింది. ఆమె మనస్సులో కూడా ఉత్సాహం జనించింది. తను ఉండబట్టలేక ఔత్సుక్యంతో వాతావరణంలోని ఆనందాన్ని అవలోకించడానికి ఇంటికి అనతి దూరం లోనే సరస్సు తీరంలో ఉన్న గార్డెన్ కి చేరుకుంది.

          అక్కడ ఎంతోమంది ప్రకృతి అందిస్తున్న ఆనందాన్ని అనుభూతి చెందు తున్నారు. అందంగా, సంతోషప్రదంగా ఉన్న వాతావరణం ప్రతి ఒక్కరినీ ప్రేమ భరితులిగా చేస్తోంది. ఒకరు తన సహచరులతో సంగీత మధురధ్వనులను వీనుల విందుగా ఆస్వాదిస్తున్నారు. మరొకరు వేడివేడిగా ఉన్న మొక్కజొన్న పొత్తులు తినడంలో లీనమైపోయి ఉన్నారు. మరొకరు వేఫర్స్, పాప్ కార్న్, మొరమొరాల రుచులను చూస్తున్నారు. వేరొకరు ఘుమఘుమలాడుతున్న పకోడీలను చవిచూడటంలో నిమగ్నమై ఉన్నారు. మరికొందరు పానీపూరీలను ఆసక్తిగా ఆరగిస్తున్నారు. కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు యువత హృదయస్పందనలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఎవరిదగ్గరా, మరొకరిగురించి ఆలోచించడానికి సమయంలేదు.

          ఇతరుల గురించి ఎవరైనా కేవలం తాము ఒంటరిగా ఉన్నప్పుడే ఆలోచిస్తారు. అక్కడ ఇంచుమించు అందరూ తమ స్నేహితులతో, సహచరులతో కలిసి సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఒంటరిగా ఉన్నది కేవలం ఆ సరస్సులో నిశ్చలంగా నిలిచివున్న నీళ్ళు, వాటిని అవలోకిస్తున్న సంజన మాత్రమే.

          సంజనని ఆ తరుణం సరస్సుతీరానికి తీసుకువచ్చింది కాని, ఆమె మనస్సుకి అక్కడ కూడా శాంతి లభించడం లేదు. అక్కడ ఆమె మనస్సులో ఆగివున్న ఆలోచనా తరంగాలలో మరింత అలజడి మొదలయింది. కొన్ని క్షణాలు ఆమెకి వెనక్కి తన గదికి తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది. కాని పరిస్థితులని ఎదుర్కోకుండా పలాయనం చిత్తగించడం ఆమెకి అసలు మనస్కరించదు. ఆమె ప్రగాఢనమ్మకం పరిస్థితులతో పోరాటం చెయ్యడంలోనే ఉంది. అందువల్లనే ఆమె జీవితంలో వచ్చిన ఎన్నో ఒడిదుడుకులను సహజంగానే ఎదుర్కొని ఇంతవరకూ ముందుకి సాగిపోతూ వచ్చింది.

          సరస్సుని చూసి ఆమెకి తన జీవితం సరస్సుతో సమానంగా ఉన్నట్లు అనిపించ సాగింది. జనం తినేసిన మొక్కజొన్నపొత్తుల కండెలనీ, కూల్ డ్రింకులు తాగిన ఖాళీ డబ్బాలనీ, అట్టపెట్టెలనీ, వేఫర్స్, మొరమొరాలు తినేసిన సంచులనీ సరస్సులోకి విసిరేస్తున్నారు. సరస్సులోని నీటిలో అలజడి అంతకంతకీ తీవ్రమవుతోంది. తన దగ్గరికి వచ్చి తన కెరటాల అందంతో ఆనందాన్ని పొందడానికి, ఆ తరంగాల సంగీతాన్ని ఆస్వాదించడానికి వచ్చిన జనం తనకి కానుకగా సమర్పిస్తూ, తనలో విసిరేస్తున్న ప్రతి వస్తువుని సరస్సు మౌనంగా స్వీకరిస్తోంది.

          సరస్సులోనూ, ఒక అమ్మాయిలోనూ ఎంత సమానత్వం ఉందని సంజనకి అనిపించింది. ఆడపిల్ల ప్రతి అఘాతాన్ని, గాయాన్ని తన కొంగులో దాచుకుని బతుకుతుంది. ఇతరుల సంతోషం కోసం మౌనం వహిస్తుంది. ఎవరిపట్లనూ ఎటువంటి దోషారోపణకాని, నిందకాని చేయకుండా కేవలం త్యాగం మాత్రమే చేస్తుంది. బాల్యం నుండి ఇదే నేర్పుతారు తనకి. సరస్సుకి శైశవం నుండి ఎదుగుతూ మార్పు చెందిన రూపం గుంట, చెరువు, కోనేరు, కాసారం, తటాకం, సరస్సు, ఏరు, నది, సముద్రం కాగా, ఆడపిల్లకి బాల్యం నుండి పెరుగుతూ మారిన స్వరూపం పాప, చిట్టితల్లి, చెల్లెలు, అక్క, భార్య, కోడలు, అమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ, బామ్మ, మామ్మ, అవ్వ, మహిళగా ఉంటుంది. ఆడపిల్ల వయస్సు ఒక హద్దు, కట్టుబాటుతో ఒక నదిలాగా ఉంటుంది. తన హద్దులను అధిగమించి పొంగి పొరలే నది వేగం వరదకి దారితీస్తుంది. అది మురికితోనూ, జుగుప్సాకరమైన బురదతోనూ నిండి ఉంటుంది. అదేవిధంగా తన పరిమితిని, సీమను దాటినప్పుడు అమ్మాయి వ్యక్తిత్వం కూడా సంఘంలో గౌరవప్రదంగా ఉండటానికి నోచుకోదు.

          నది తన ఔద్ధత్యంలోనూ, అతిశయంలోనూ విరామం వచ్చినప్పుడు సరస్సు రూపాన్ని ధరిస్తుంది. ఆడపిల్ల జీవితంలో కూడా వివాహం అయిన తరువాత స్వతంత్రంగా, స్వచ్ఛందంగా ఉండటానికి హద్దు ఏర్పడినప్పుడు తనుకూడా సరస్సు లాగా గాంభీర్యాన్ని సంతరించుకుంటుంది. నిజానికి ఇద్దరి జీవితం కూడా ఒక యుద్ధంతో సమానమైనదిగా అనిపిస్తుంది. ఆ కారణంగా పలాయనం చెయ్యడంకన్నా వీరోచితంగా నిలిచి ఆ పరిస్థితిని ఎదుర్కొని సంఘర్షణ చేస్తూ అధిగమించవలసి వస్తుంది. అడుగడుక్కీ అగ్నిపరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంది.

          సంజన జీవితం కూడా ఇప్పుడు సరస్సుతో పోలిన అమ్మాయితో సమానంగా ఉంది. అది తన బాల్యోచితమైన అల్లరితనాన్ని, అతిశయాన్ని విడిచిపెట్టి గంభీరస్వభావాన్ని స్వీకరించింది. సరస్సుయొక్క దుస్థితిని చూసి తను గతస్మృతులను నెమరువేసుకో సాగింది. తను జీవితంలో ఎన్ని మజిలీలను దాటుకుని రావలసి వచ్చిందో, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందో తనకు తెలుసు. సంఘం తనను వేలెత్తికూడా చూపింది. తను కూడా అడుగడుక్కీ అగ్నిపరీక్షలను ఇచ్చింది. వ్యక్తులు ఒక్క క్షణంలో ఎంతగా మారిపోతారన్నది తలుచుకుంటే అది తనను లోలోపలే దహించేస్తోంది, మారుతున్న మనుషుల స్వరూపాన్ని తనకన్నా ఎక్కువగా ఎవరు అర్ధం చేసుకోగలరు. అమ్మా-నాన్నా ఎంత నచ్చజెప్పినా, తనకి కావలసింది సాధించడానికి,  తన లక్ష్యాన్ని చేరుకోవడానికి తను సంఘాన్ని ప్రతిఘటించి ఎదుర్కొంది. ప్రేమ గుడ్డిదన్న సంగతి తనకి కమలేష్ తనకూ, తన జీవితానికీ వీడ్కోలు చెప్పినప్పుడు తెలిసింది. సంఘం తోడు అంటే ఏమిటో, పెద్దవాళ్ళ ఆశీస్సులు  జీవితంలో ఎంత విలువైనవో తనకి ఇప్పుడు బాగా అర్థమయింది.   

          తను కమలేష్ ని హద్దులన్నీ మించి ప్రేమించింది. కమలేష్ కూడా ఆమెతో జీవితయాత్రని కలిసి చెయ్యడానికి ప్రమాణాలు చేశాడు. ఇంట్లోవాళ్ళు ఈ సంబంధానికి ఇష్టపడలేదు. అందువల్లనే ఇద్దరూ తమ ప్రేమగమ్యాన్ని చేరుకునేందుకు తమ-తమ కుటుంబాలతో తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఒక సంవత్సరం వరకూ ప్రేమాంబుధిలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. ఆ తరువాత ఒక్కసారిగా వచ్చిన తుఫానుకి జీవిత వృక్షానికి చెందిన పర్ణాలు, శాఖలు ఇటూ-అటూ చెదిరిపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తన గోడు చెప్పుకుందామన్నా ఎవరితోనూ చెప్పుకునే పరిస్థితి కాదు. ఆమెకి తన జీవితంలో కమలేష్ తప్ప ఇంకెవరూ లేరు. కమలేష్ కోసమే తను తల్లిదండ్రులనూ, అన్నచెల్లెళ్ళనూ అందరినీ విడిచిపెట్టేసింది. అత్తవారింట్లోకాని, పుట్టింట్లోకాని తన వాళ్ళంటూ తనకెవరూ లేకుండాపోయారు. విశాలమైన ఈ నిండు ప్రపంచంలోని జన సందోహంలో తను ఒంటరిగా మిగిలిపోయింది.

          ఆమెకి అర్థంకాని విషయం ఇంతకీ తను అంతగా ఏం పొరపాటు చేసిందని ఇంత పెద్ద శిక్ష అనుభవించవలసి వస్తోందని. సరే… ఈనాడు కమలేష్ ఆమె జీవితం నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. సంజన ఇదంతా తన దురదృష్టం అని భావించి, తరువాత అనుసరించవలసిన మార్గాన్ని నిర్ణయించుకోవడం ప్రారంభించింది. మనస్సులో సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు. వాటికి జవాబులు ఎవరిదగ్గరా లేవు. స్వయంగా సంజన కూడా వాటిముందు నిరుత్తరంగా నిలబడివుంది.

          కమలేష్ సంజనలాగానే,  తన సహోద్యోగి అయిన ఊర్మిళని పెళ్ళి చేసుకున్నాడు. తను ఊర్మిళని ఎంతగానో ప్రేమిస్తున్నానని, సంజనలో ఇప్పుడింక తనకి నవ్యత లేకుండా పోయిందని, తన మనస్సులో ఆమెకి ఇప్పుడు ఎటువంటి స్థానం లేదని అతను అంటాడు. ఊర్మిళలో చూడటానికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కాని తన ఏ నయగారాల కళాపటిమతో ఆమె కమలేష్ ని తన మోహపాశంలో బంధించిందో తెలియదు. దానితోబాటు ఆమె ముందు లెక్కలేనన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి—

          మనిషిలోని మానవత్వం ఎక్కడ దారితప్పింది? ప్రేమ అనేది ఎందుకు ఇంత పరాయితనంతోనూ, స్వార్థంతోనూ నిండిపోయింది? వన్నెలు మారుస్తున్న ఈ లోకంలో రంగులమాలిన్యం ఇంత ప్రగాఢంగా ఎందుకు రూపొందింది? మనిషిలోని పాశవికత ఇంత ఉన్నతంగా ఎందుకు ఎదిగిపోయింది?

          మనిషి మళ్ళీ తోటిమనిషి నుంచి తనకోసం సానుభూతిని ఆశించేలా, మనిషి హృదయం సత్యభరితమై ఉండేలా, అతని ప్రతి పనిలో నిజాయితీ తొణికిసలాడేలా, అతడి ప్రతిమార్గంలోనూ మంచితనం పరిడవిల్లేలా, మానవత్వం అతని గమ్యం అయేలా ఉండే రోజులు మళ్ళీ వస్తాయా?

అలా జరిగితే ఎంత బాగుంటుంది….!

***

డా. నీతా కొఠారీ – పరిచయం

24 సెప్టెంబరు 1971 న ఉదయపుర్, రాజస్థాన్ లో జన్మించిన డా. నీతా కొఠారీ పి-హెచ్.డి., ఎం.ఏ. (హిందీ, చరిత్ర, రాజస్థానీ), ఐ.టి.ఐ. (ఎలక్ట్రానిక్స్), పి.జి. డి.సి.ఎ. (కంప్యూటర్ సైన్స్) చేశారు. వీరి సాహిత్యంలో చెప్పుకోదగ్గవి- ధమాల్ చౌకడీ (వ్యంగ్య కవితా సంకలనం),  గాంవ్ కీ మిట్టీ (కథా సంకలనం), మౌన్ కా అంతర్నాద్ (కవితా సంకలనం), విజ్ఞాన్ సంచయన్ ఏవం సీఖ్ సమఝ్ కీ బాత్ (బాలకవితా సంకలనం).  చాలా ప్రసిద్ధ పత్రికలలోనూ, సంకలనాలలోనూ వీరి రచనలు ప్రచురితం. వీరి సంపాదకత్వంలో వెలువడినవి- యుగనాద్ (సమకాలిక కవుల కవితా సంకలనం), జుగజాజమ్ (రాజస్థానీ సాహిత్యవేత్తల పరిచయ నిఘంటువు), మేవాడ్ స్పీక్స్ (రోటరీ క్లబ్, ఉదయపుర్ వారి మాసపత్రిక). కొన్ని టి.వి. చానెళ్ళలోనూ, ఆకాశవాణి కేంద్రాల నుంచి రచనలు ప్రసారితం. ఎన్నో సంస్థల ద్వారా వీరు సన్మానాలు, బహుమానాలు పొందారు. మచ్చుకి రోటరీ క్లబ్ మీరా సాహిత్యసమ్మాన్, 2008, లైన్స్ క్లబ్ అంతర్జాతీయ సాహిత్యసృజన సమ్మాన్, 2014, కావ్యశిరోమణి సమ్మాన్ మొ. యుగధారా సాహిత్యసంస్థకి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు. ప్రస్తుతం స్వతంత్ర రచనావ్యాసంగం, అధ్యాపనం చేస్తున్న వీరు ఉదయపుర్, రాజస్థాన్ వాస్తవ్యులు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.