
అనుసృజన
అన్నిటికన్నా ప్రమాదకరం …
మూలం: అవతార్ సింగ్ సంధూ “పాశ్”
అనుసృజన: ఆర్ శాంతసుందరి
అన్నిటికన్నా ప్రమాదకరం
శ్రమ దోపిడీ కాదు
పోలీసుల లాఠీ దెబ్బలు కావు
దేశద్రోహం లంచగొండితనం కావు
నేరం చేయకుండా పట్టుబడడం విషాదమే
భయంతో నోరు మూసుకోవడం తప్పే
కానీ అవేవీ అన్నిటికన్నా ప్రమాదకరం కావు
మోసాల హోరులో
నిజాయితీ గొంతు అణిగిపోవడం అన్యాయమే
మిణుగురుల వెలుతురులో చదువుకోవడం తప్పే
పిడికిళ్ళు బిగించి కాలం గడిపేయడం సరికాదు
కానీ అన్నిటికన్నా ప్రమాదకరం మాత్రం కాదు
అన్నిటికన్నా ప్రమాదకరం
జీవచ్ఛవంలా ఉండిపోవడం
దేనికీ తల్లడిల్లకుండా అన్నీ భరించడం
ఏమీ జరగనట్టు
ఇల్లు వదిలి పనిలోకి వెళ్ళడం
పని ముగించుకుని మళ్ళీ ఇల్లు చేరడం
అన్నిటికన్నా ప్రమాదకరం
మన కలలు మరణించడం
అన్నిటికన్నా ప్రమాదకరం
మీ చేతికున్న గడియారం పని చేస్తున్నా
మీ దృష్టికి అది ఆగిపోయినట్టు కనిపించడం
అన్నిటికన్నా ప్రమాదకరం
అన్నీ చూస్తూ కూడా నిశ్చలంగా ఉన్నట్టుండి కన్ను
ప్రపంచాన్ని ప్రేమగా చుంబించడం మర్చిపోయిన ఆ చూపు
వస్తువుల నుంచి వెలువడే ఆవిరిమీద జారిపోయే ఆ చూపు
రోజువారీ పనులలో మునిగిపోయి
ఏ లక్ష్యం లేని ఒక అయోమయంలో దారి తప్పుతుంది
ప్రతి మారణకాండ తర్వాత
శూన్యమైన ఆవరణ మీది ఆకాశంలో ఉదయించి
మీ కళ్ళని కారంలా మండించని
ఆ చందమామ చాలా ప్రమాదకరమైనది
మృతుల గురించి శోక గీతంగా మారి
మీ చెవులకు సోకే పాట
భయకంపితులైన వారి గుమ్మాలలో
గూండాలా విర్రవీగే పాట
అన్నిటికన్నా ప్రమాదకరం
బతికున్న ఆత్మల ఆకాశంలో
పొద్దువాలే రాత్రి
శాశ్వతంగా మూసుకున్న
చీకటి తలుపులకీ గడపలకీ అతుక్కునే
గుడ్లగూబలూ నక్కలూ అరిచే ఆ రాత్రి
అతి ప్రమాదకరమైనది
ఆత్మ సూర్యుడిలా అస్తమించే ఆ దిక్కు
వేడి కోల్పోయిన ఆ ఎండలోని ఒక ముక్క
మీ ఒంటి తూర్పు దిక్కున గుచ్చుకోవడం
అన్నిటికన్నా ప్రమాదకరం
అంతేగాని
అన్నిటికన్నా ప్రమాదకరం
శ్రమ దోపిడీ కాదు
పోలీసుల లాఠీ దెబ్బలు కావు
దేశద్రోహం లంచగొండితనం కావు
* * *
‘పాశ్’ (9 సెప్టెంబరు 1950-23 మార్చి 1988). అతని 37వ ఏట ఖలీస్తాన్ ఉద్యమ తీవ్రవాదులు అతన్ని హత్య చేశారు
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
