జీవిత చక్రం

-చిలుకూరి ఉషారాణి

          పండితుల వేదమంత్రోచ్ఛారణలతో, పచ్చని అరటి ఆకుల మధ్య రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పెళ్ళి మండపం, పెళ్ళికి విచ్చేసిన అతిధులతో ఆ కళ్యాణ ప్రాంగణం వైభోగంగా ఉంది. వధూవరుల జీలకర్ర బెల్లం తంతు పూర్తవ్వగానే తలంబ్రాల బట్టలు మార్చుకోవడానికి ఎవరికి కేటాయించిన గదులలో వారు తయారవుతున్నారు.

          “ఎంత బాగుందిరా మన అమ్మాయి, ఏదైనా మన పిల్ల అదృష్టవంతురాలు రా” నారాయణ, అని ఒకరూ, “ఆ పిల్లోడోల్ల మర్యాదలూ, ఆ వినయమూ, అస్సలు ఉన్నోళ్లన్న గర్వం కించింతైనా లేదురా” అంటూ తన కన్నా వయసులో పెద్దగా ఉన్న ఒక ఆవిడ నారాయణతో అంటుంటే,

          అవునక్కా! పెళ్లి ఖర్చు అంతా అబ్బాయి వాళ్ళే పెట్టుకున్నారు, అని కంట తడిని తువ్వాలతో తుడుచుకుంటూ చెప్పాడు నారాయణ.

          ఎందుకురా ఆ కన్నీళ్లు ఇంత మంచి సంబంధం కుదిరితే, అని అంటుండగానే, ఇంతలో పెళ్ళికొడుకు, తయారయ్యి తెల్లని పట్టు వస్త్రాలను ధరించి వేదికపైకి
వచ్చాడు. కెమెరా వాళ్ళు రకరకాల భంగిమలతో ఫోటోలు తీస్తున్నారు.

          పెళ్లికూతురుని తీసుకురండి అన్నారు పంతులుగారు. అది వినగానే, జానకీ అంటూ తన భార్యను కేకేసి, ‘వెళ్లి అమ్మాయిని తీసుకురా’ అంటూ బంధువులను కూడా పురమాయించాడు నారాయణ.

          జానకి గబగబా వధువు గదికి వచ్చి, మీనా! పంతులుగారు పిలుస్తున్నారు ఇంకా
తయారవ్వలేదా అంటూ రెడీ చేసే బ్యూటీ పార్లర్ అమ్మాయిని అడిగింది. అయిపో యింది అక్క అంటూ కుందనపు బొమ్మలాగా తయారైన మీనాని చూపించింది.

          అబ్బా! అప్సరలా ఉంది, నా తల్లే, నా దిష్టే తగిలేలా ఉంది అంటూ తన చేతి వేళ్ళను మీనా తల చుట్టూ తిప్పి, దిష్టి తీసి, వేళ్ళను తన తలకు ఆన్చి, ఇక పదండి అంటూ నడవబోయేంతలో వారికి ఎదురుగా వచ్చింది మీనా నాయనమ్మ అనసూ యమ్మ.

          నాయనమ్మ ఎలా ఉంది, అంటూ చిలిపిగా నాయనమ్మను చూస్తూ తన అలంకరణను చూపించింది మీనా. నీకేమే, నువ్వు మహారాణివే అంటూ  మురిసి పోతూ… కొంచెం తడబడుతూ.. మీనాని దగ్గరగా తీసుకొని ఆప్యాయంగా హత్తుకుంది.

          అత్తయ్య! పంతులుగారు పిలుస్తున్నారు ముహూర్త సమయం అవుతుంది.  మనం తర్వాత మాట్లాడుకుందాం, అంటూ అనసూయమ్మను పక్కకు తీయబోయింది జానకి.

          అనసూయ మీనా భుజాల మీద నుంచి జారీ స్పృహ తప్పి క్రింద పడిపోయింది.
అత్తయ్య అనీ జానకి,  నాయనమ్మ అంటూ మీనా… ఎంతగా పిలిచినా ఉలుకు పలుకు లేదు అనసూయమ్మలో. కొంతసేపటికి విషయం తెలిసి, బంధువులందరూ  గుమి గూడారు.

          పెళ్లికొచ్చిన అతిథుల్లో ఒక డాక్టర్, పరీక్షించి, తను చనిపోయిందని నిర్ధారించారు.

          ఇంకొద్ది సేపట్లో పెళ్లి తంతు ముగుస్తుందని అనుకున్నంతలో, ఆ పెళ్లి, పెళ్లి
పీటల మీద అర్ధాంతరంగా ఆగిపోయింది. జీలకర్ర బెల్లం అయిపోయింది కాబట్టి మీరు భార్యాభర్తలే అని కొందరు, తాళిపడనిదే భార్యాభర్తల బంధం రాదు అని మరి కొందరు, కొంతసేపు జరిగిన చర్చల అనంతరం “చావు జరిగిన చోట మంగళసూత్ర ధారణ వద్దనీ, వాయిదా వేద్దాం, కర్మకాండ తంతు పూర్తయిన తర్వాత మంచి రోజు చూసి సూధకం అయిపోయిన తర్వాత వివాహం జరిపిద్దామని” చివరకు తేల్చారు.

          ఏమిటమ్మా ఇలా జరిగిందని వాళ్ళ అమ్మని పట్టుకుని ఏచ్చాడు నారాయణ.
ఇదేమిటి ఈ విడ్డూరం అనే గుసగుసల నడుమ వచ్చిన వారందరూ భోజనం చేసి
అసంతృప్తిగానే వెనుతిరిగారు.

          అప్పటివరకు “మీనా అదృష్టవంతురాలు, కానీ కట్నం లేకుండా, గొప్పింటి అల్లుడు దొరికాడు నారాయణకు అని అన్నోళ్లే,  జాతకం సరిగ్గా చూసుకున్నారో లేదో,
ముహూర్తం పెట్టించే ముందు ఒకటికి రెండుసార్లు చూసుకోవక్కర్లేదా, ఇలా మధ్యలో ఆగిపోతే ఎంత అరిష్టం” అని అంటుంటే అనే వాళ్ళని ఏమనలేక మీనా ఇలా
జరిగిందేమిటీ అంటూ జానకి మీనాను పట్టుకుని ఏడ్చింది. ఒకపక్క అత్తగారు
పోయారన్న బాధ, పోతూ పోతూ కూతురు పెళ్లినీ మధ్యలోనే ఆపిందన్న ఇంకాస్త
బాధ.

          అనుకోని ఆ ఘటనకు మాటలు రాక మౌనంగా నాయనమ్మ వైపే చూస్తోంది మీనా. పసుపు బట్టలతో కొంగుముడితో అత్తారింట్లో అడుగుపెట్టవలసిన మీన అర్ధాంతరంగా ఆగిన పెళ్లితో, సగం తంతుతో మిగిలిపోయి, మళ్లీ ఇంటి బాటే పట్టింది. పూలతో అలంకరించిన పడవలాంటి కారు తనని చూస్తూ పరిహాసిస్తున్నట్లుగా అనిపించింది మీనాకు.

          వియ్యాల వారు కూడా చేసేదేం లేదు ఇంక అంటూ వారి దారిన వారు వెళ్లిపోయారు.

          నారాయణ  శాస్త్రోక్తంగా కర్మకాండలన్ని జరిపించాడు. ఆ తర్వాత ఒకరోజు మధ్యవర్తి వచ్చాడు. ఇలా జరిగిన్నందుకు చాలా బాధగా ఉంది. నేనేం చేయగలను చెప్పండి, మధ్యవర్తిత్వం తప్ప. అబ్బాయి వాళ్ళు ఆలోచించుకోవడానికి సమయం కావాలంటున్నారు. ఆ మాటకి కంగుతిన్నాడు నారాయణ. అదేమిటి? అంటే…  అనుమానాన్ని వ్యక్తపరిచాడు.

          జాతకాలు ఇంకోసారి చూపించుకోవాలనుకుంటున్నారు అబ్బాయి తరుపు వాళ్ళు. అబ్బాయి వాళ్ళు మన అమ్మాయికి ఇచ్చిన నగలు కొన్ని మీ దగ్గరే ఉన్నాయి, అవి కనుక ఇస్తే .. నేను వాళ్లకి అందజేస్తాను అని వచ్చిన ఉద్దేశం వారికి  తెలియ పరిచాడు మధ్యవర్తి.

          ఆ మాటలు విన్న మీనా, గబగబా లోపలికి వెళ్ళి నగల్ని తీసుకొచ్చి మధ్యవర్తి
చేతిలో పెట్టింది ఇంక మీరు వెళ్ళొచ్చు ఇక మాట్లాడేది ఏమీ లేదు అన్నట్లుగా.

          మీనా, ఒకసారి అబ్బాయితో మాట్లాడి చూడరాదు అన్నాడు తండ్రి. వద్దు నాన్న,
నెల క్రితం వాళ్లెవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. పెళ్లి చూపులు, పెళ్లి అన్ని ఒక నెల రోజుల్లోనే కుదిరాయి. వాళ్లే చేసుకుంటామని వచ్చారు,
ఇప్పుడు వాళ్లే వద్దనుకుంటున్నారు.

          “నేనేమీ బొమ్మను కాదు, ఎలా ఆడమంటే అలా ఆడడానికి” అంటూ తన నిర్ణయాన్ని గట్టిగా చెప్పేసింది.

***

          కొన్ని సంవత్సరాల తర్వాత..

          అధునాతనమైన ఆరంతస్తుల భవంతి. అందులో నాలుగో అంతస్తులో  అనసూయ సొల్యూషన్స్ అని నేమ్ ప్లేటులో అందంగా గోడమీద రాసి ఉంది.
లోపల లాయర్ కోట్ ధరించి హుందాగా తన చాంబర్లో కూర్చొని ఉంది మీనాక్షి.
మేడం కొత్తగా వచ్చిన కేసు ఫైలు అంటూ జూనియర్ లాయర్, మీనాక్షి చేతికి
అందించాడు.

          ఈ కేస్ ని మీరే డీల్ చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు మేడం అన్నాడు.
మీనాక్షి అది అందుకుని ఆ కేసును పరిశీలిస్తూ ఉంది. ఇంతలోనే లోపలికి వచ్చాడు
రవీంద్ర.

          “దురదృష్ట జాతకురాలిని వెతుక్కుంటూ మరీ వచ్చారే” అన్న మాటలను వినగానే ఎదురుగా ఉన్నది కొన్ని సంవత్సరాల క్రితం తను వద్దనుకున్న మీనా అని గుర్తించాడు.

          మీనా అని పిలిచాడు రవీంద్ర.

          సారీ మిస్టర్ రవీంద్ర, ఐయాం సీనియర్ లాయర్, మీనాక్షి శ్రీనివాస్ అన్నది హుందాగా.

          సారీ అప్పుడు అలా జరిగిపోయింది అని గతాన్ని గుర్తు చేయబోయాడు రవీంద్ర.
మధ్యలోనే ఆపేసింది మీనా.

          ఏం జరిగినా మన మంచికే అని మా నానమ్మ చెబుతూ ఉండేది. మా నాయనమ్మ
చిన్నప్పుడే తన భర్తను కోల్పోయి తన పిల్లల్ని ఒంటరిగానే పెంచి పెద్ద చేసింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు నిలిచి తన జీవితాన్ని పాఠంగా మాకు నేర్పించింది.
ఆవిడ స్ఫూర్తితోనే ఈ అనసూయ సొల్యూషన్స్ ప్రారంభించాను.

          చూసారా! విధి ఎంత విచిత్రమైనదో “అప్పుడు మీరు దురదృష్టం అని నన్ను దూరం పెట్టారు, ఇప్పుడు అదృష్టం అని వెతుక్కుంటూ వచ్చారు”. అన్నది సూటిగా మీనా.

          మాటలు రాక బిక్క చచ్చిపోయాడు రవీంద్ర. మీరేమీ భయపడకండి. మీ కేసులో న్యాయం ఉంటే నేను తప్పకుండా మీకు న్యాయం జరిగేలాగా చేస్తాను. అని హామీ ఇచ్చింది మీనాక్షి.

          ఒకప్పుడు తను చేసిన తప్పుకు పశ్చాప్త భారంతో మౌనంగానే ఉండిపోయాడు రవీంద్ర.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.