నిశ్శబ్ద నిష్క్రమణం

-డా.సి.భవానీదేవి

ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి తెలుస్తుంది
నేను వెళ్ళిపోయానని
గుండెలనిండా దేశప్రేమ నింపుకున్న బాల్యం
ఎదిగినకొద్దీ వీరరక్తమై ఎగిసిపడింది
నా జీవితంలో గాయాలు, విజయాలు, ఓటములు
అన్నీ మాతృభూమి కోసమే అయినప్పుడు
ఏ గడ్డమీద అడుగుపెట్టినా
నా కాళ్లకుండే నేల తడిమాత్రం ఇగిరిపోదు కదా
విదేశంలో మారువేషంలో మనుగడ సాగించినా
అక్కడిభాషా, వేషాలను అనుసరించినా
అక్కడే నా సహచరిని ఎదజేర్చుకున్నా
నడిచిన దారిలో ఎన్ని మందుపాతరలున్నా
ఆగిందిలేదు అలిసిందిలేదు
పట్టుపడతాననే భయం అసలులేదు
నాదేశ రక్షణ కోసం శత్రువుల రహస్యాలు
నావారికి చేరవేస్తూ వైరులకు చిక్కినప్పుడు
హిమశిలలపై నగ్నంగా పడుకోబెట్టినా
గోళ్ళు పీకేసినా, నిద్ర దూరంచేసినా
ఎన్నెన్ని యాతనలు పెట్టినా
దేశరక్షణ కవచాన్ని కప్పుకునే నవ్వాను
బద్దలయిన నిర్దయతీరాలకు
కాలం అనామకంగా విసిరేసినప్పుడు
మరుగునపడ్డ నా అసలు పేరు కూడా
ఆ దేశం మట్టిలోనే కలిసిపోయింది
చివరియాత్ర లేకపోయినా
త్రివర్ణాన్ని కప్పుకునే అదృష్టానికి
దూరంగా
నా ఙ్ఞాపకాల్లోని జన్మభూమికి
మనసారా వందనం చేస్తూ
మీ నిట్టూర్పుల నివాళులు అందుకుంటూ
నిశ్శబ్దంగా వీడ్కోలు చెప్తున్నాను
ఈ మట్టిలోనే ప్రయాణిస్తూ
నాతల్లి మట్టిని చేరుకుంటాను

( భారత రహస్యగూడచారులకు అంకితంగా)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.