
అనుసృజన
మొగవాళ్ళ వాస్తు శాస్త్రం
మూలం: రంజనా జాయస్వాల్
అనుసృజన: ఆర్ శాంతసుందరి
ఒక ఇల్లు
దానికి కిటికీలు మాత్రమే ఉండాలి
ఒక్క తలుపు కూడా ఉండకూడదు
ఎంత విచిత్రం
అలాంటి ఇంటి గురించి ఊహించడం!
ఎవరు ఆలోచించగలరు –
అలాoటి వంకర టింకర ఊహలు ఎవరికుంటాయి?
మొగవాళ్ళ ఊహల్లోకి రాగలదా
ఎప్పుడైనా ఇలాంటి ఇల్లు?
మొగవాళ్ళు తలుపుల శిల్పులు
వాళ్ళ వాస్తు శాస్త్రంలో
కిటికీలు ఉండటం అశుభం!
గాలులు బైటినుంచి లోపలకి రావడం
అశుభం
గాలులూ, కోరికలూ ఆడవాళ్ళ గదుల్లోకి రావడం అశుభం
వాళ్ళ వాస్తు శాస్త్రంలో
చీకటికి అలవాటుపడి పాలిపోయిన మొహాలతో
వెలుతురు కావాలని కోరుకోవడం కూడా తెలియని
ఆడవాళ్ళు ఉంటారు ఆ ఇళ్లలో
వాళ్ళ వాస్తు శాస్త్రంలో
ఆడవాళ్ళ ప్రసక్తి ఉంటుంది
కానీ వాళ్ళు
గాలీ, ఎండా, ప్రపంచం గురించి
ఆలోచించటం నిషిద్ధమని
గాఢమైన కోరికలూ
తేమ నిండిన గాలి
రంగు రంగుల మబ్బులూ
వాన చినుకులకి
పులకించే ఆడవాళ్ళు
వాళ్ళ వాస్తుశాస్త్రంలో అశుభానికి ఆనవాళ్ళు.
తమ కలల్లో జీవించే స్త్రీలు
తమ కళ్ళల్లోని శూన్యం వెనక దాక్కున్నారు
వాళ్ళ కలల శిలీంద్రాలు చచ్చిపోలేదు
మొగాళ్ళు భయపడుతున్నారు
ఇంకా చావకుండా ఉండి పోయిన ఆ కలల శిలీంద్రాలు చూసి
రాయి కింద అణిగిపోయి రంగు కోల్పోయిన పచ్చగడ్డిని చూసి
ఋతువులు మళ్ళీ చిగురిస్తాయన్న భయంతో ..
కిటికీలకి శత్రువులు
మొగవాడిని
తలుపు దగ్గర గొప్పగా పెట్టుకున్న
తన నేమ్ ప్లేట్ దగ్గరే ఆపేస్తాయి
ఋతువుల పరిమళాన్ని లోపలకి రావద్దని బెదిరిస్తాయి.
తలుపుల్ని ఎదిరిస్తూ
స్త్రీలు చేసిన ఊహాసృష్టి
కిటికీలు
తలుపు ‘
కేవలం ప్రవేశం కోసమే
అందులోంచి ఆడది సజీవంగా లోపలకి ప్రవేశిస్తుంది
ఒకేసారి బైటికి వెళ్ళగలదు
చచ్చి పోయాక.
ఇదే మన మనుస్మృతి ఆజ్ఞ
మనుస్మృతి ప్రతిబంధకాలలో
బందీ స్త్రీ
తమ ఊహల్లో విడుదల పొందుతున్నారు
కిటికీల వాస్తు శిల్పాన్ని నేర్చుకుంటున్నారు
గుమ్మాలూ, గోడలూ లేని ఇల్లు కోసం కాంక్షిస్తూ
గాలిబ్ దగ్గర నేర్చుకుంటున్నారు
కర్పూరంలా గాలిలో కలిసి పోవడం
అదృశ్యమవడం
మూసిన తలుపుల్ని దాటి వెళ్లి పోవడం
తమ కోరికల గారడీతో
ఆడవాళ్లే ఆలోచించగలరు
ఇంటి గురించి
కిటికీల గురించి
స్వేచ్చ గురించి
మనువు గురించి
ఇల్లు నిర్మించే వాస్తుకళని
నేరుస్తున్నారు స్త్రీలు
మనువుకీ, మొగవాళ్ళకీ
ఇష్టం లేకపోయినా
వాళ్ళని ఎదిరిస్తూ!
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
