
అపోహలూ– నిజాలూ
(శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం & నెచ్చెలి-2025 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)
-యశోదాకైలాస్ పులుగుర్త
“రేపటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ని ప్రకటించింది మా మేనేజ్ మెంట్!” ఆఫీస్ నుండి వస్తూనే ఇంట్లో అందరికీ వినబడేటట్లుగా చెప్పింది వైష్ణవి.
“ఓ, నైస్వైషూ!” ఇకనుండి పొద్దుట పొద్దుటే ఆఫీస్ వేన్ ఎక్కడ మిస్ అవుతానో అనుకుంటూ పరుగులు పెట్టనక్కర్లేదు. ఎంత మంచి వార్త చెప్పావంటూ,” భర్త పవన్, వైష్ణవి వైపు మెచ్చుకోలుగాచూసాడు.
“హమ్మయ్య, అయితే రోజూలాగ పొద్దుటే లేవనవసరం లేదన్న మాట మెటికలు విరిచింది అత్తగారు. అసలుకే రాత్రి నిద్రపట్టి చావదు నాకు. ఏ తెల్లవారుఝామునో కునుకుపట్టే సమయానికి నీవు వంటింట్లో చేసే శబ్దాలకు మెలుకువ వచ్చేస్తుంది వైష్ణవీ. నిత్య జడలేయమంటూ హడావిడి పెడుతుంది. నందూకి పాలుపట్టాలి. నీకివేమీ అర్ధం కావుకదా. పొద్దుటే ఏడున్నరకల్లా కంపెనీ వేన్ వచ్చేస్తుంది, వెళ్లి పోతావు. ఇంక ఆ తరువాత నా పాట్లు చూడాలి. ఇంక రేపటినుండి ఈ హాడావిడి ఉండదంటూ,” సంబర పడింది శాంతమ్మగారు.
“సరేలేవే, ఎప్పుడూ నీ గోలేనా? ఏరోజూ కాఫీ వేడిగా తాగడం లేదు నేను. కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదవి ఎన్నాళైంది?” కాఫీ తాగే సమయానికి, “ఏమండీ, కాస్త ఈ పాలపేకట్లు ఫ్రిజ్ లో పెట్టమనో, లేకపోతే ఆకుకూరలబ్బాయి వచ్చినట్టున్నాడు, వెళ్లి తోటకూర తీసుకోమనో ఏదో పని అంటగడతావు. ఈలోగా కాఫీ చల్లగా అయిపోతుంది. వేడిచేసివ్వమంటే చికాకు పడతావు.” భర్త మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుతూ,” రేపటి నుండి నా బాధ ఉండదు లెండి మీకు. మీ కోడలు అన్నీ వేళకు అందిస్తులెండంటూ” అక్కడ నుండి వెళ్లిపోయిందావిడ.
అందరూ ఎవరి బాధలు వాళ్లు చెప్పుకుంటున్నారు. ఈ కొత్త విధానాన్ని అమలు పరచడంలో ఏ సాధకబాధలను ఫేస్ చేయవలసి ఉంటుందోననుకుంటూ వైష్ణవి బట్టలు మార్చుకోడానికి తన రూమ్ లోకి వెళ్లిపోయింది.
వైష్షవి పెళ్లికి ముందునుండే ఒక మంచి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది, పవన్ ఒక ప్రభుత్వరంగ బేంక్ లో ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. వారికి అయిదు సంవత్సరాల అమ్మాయి నిత్య, మూడు సంవత్సరాల అబ్బాయి నందకిశోర్. అత్తగారూ, మామగారూ వీరితోనే ఉంటారు. పవన్ కి జాబ్ చేస్తున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలన్న అభిప్రాయం ఉండడంతో వైష్ణవి సంబంధం వచ్చిన వెంటనే ఒప్పేసుకున్నాడు.
వైష్ణవి పొద్దుటే ఏడున్నరకే బయలదేరి వెళ్లిపోవాలి. ట్రాఫిక్ లేకపోతే ఆఫీస్ కి ఒక గంటలో చేరుకుంటుంది. ఉదయం ఫరవాలేదు కానీ, సాయంత్రం వేళ ట్రాఫిక్ జామ్ అయి ఇంటికి వచ్చేసరికి ఏడుగంటలు అయిపోతుంది. పొద్దుట బ్రేక్ ఫాస్ట్ తనే తయారు చేస్తుంది. కాఫీకి ఫిల్టర్ డికాషన్ తీసి, పాలు కాచి రెడీ చేస్తుంది. ఇంతకంటే తనకు చేయడానికి సమయం ఉండదు. తను తయారయి, కాస్త టిఫిన్తినేసరికి కంపెనీ వేన్ వచ్చేస్తుంది. ఒక్కోసారి టైమ్ లేక టిఫిన్ కూడా తినడానికి వీలవదు.
అత్తగారు వంటచేయడం, మనవరాలు నిత్యని తయారు చేసి స్కూల్ కి పంపడం, నందూని చూసుకోవడం అవీ చేస్తారు. పవన్ బేంక్ కి వెళ్లేంతవరకు తల్లికి ఏదో సాయం చేస్తూనే ఉంటాడు. మామగారు కూడా సాయంత్రం వేళ పిల్లలను ఎంగేజ్ చేస్తారు.
రాత్రి వచ్చాకా, అత్తగారికీ మామగారికీ, ఏ రొట్టెలో, టిఫినో తనే చేస్తుంది. మిగతా అందరూ అన్నాలు తింటారు.
ఆ రోజు వైష్ణవి తన గదిలో తలుపులు వేసుకుని ఆఫీస్ పని చేసుకుంటోంది. సింగపూర్ నుండి పెద్ద ప్రాజెక్ట్ ఆర్డర్ వచ్చిందని, మరో పదినిమిషాలలో టీమ్ అంతటినీ జూమ్ లో హాజర్కావలసిందిగా మేనేజర్ మెయిల్ పంపించాడు. అది వరకు ఇవే తరహా ప్రాజెక్టులు చాలా చేసినమూలాన, వైష్ణవికున్న అనుభవాన్ని పరిగణలోనికి తీసుకుంటూ వైష్ణవిని టీమ్ లీడ్ ని చేసారు ఈ ప్రాజెక్ట్ కు. అదీగాకా వైష్ణవికి ప్రమోషన్ ఇవ్వడానికి మేనేజ్ మెంట్ జాప్యం చేస్తోంది. ఎప్పటినుండో తను ప్రోషన్ కోసం ఎదురుచూస్తోంది. అందుకే ఎంతటి బాధ్యతను ఇచ్చినా ‘నో’ అనకుండా ఏక్సెప్ట్ చేస్తోంది.
ఇప్పుడు ఈ ప్రాజక్ట్ ను అనుకున్న టైమ్ లో విజయవంతంగా పూర్తి చేసి క్లైంట్ కి డెలివరీ చేయాలి. ఏ మాత్రం సమస్య వచ్చినా కంపెనీ ఇమేజ్ పోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ప్రాజక్ట్ మీద ఎక్కువ శ్రధ్ద చూపెట్టి వర్క్ పూర్తి చేయచ్చని బాస్ అన్నారు. అందుకనే టీమ్ ను సమావేశ పరచి ప్రాజెక్ట్ డెలివరీ ప్లేన్ ని అందరితో చర్చించాలని, అందరూ సమైక్యంగా పనిచేస్తూ, టీమ్ లీడ్ కు సహకరించాలని ఇప్పుడు పెట్టబోయే మీటింగ్ యొక్క అభిమతం.
జూమ్ మీటింగ్ మొదలైంది. ఇంతలో ఎవరో దబదబా బయట నుండి తలుపు లు కొడుతున్నారు. “వైష్ణవీ, వైష్ణవీ అంటూ.” జూమ్ లో నున్న మేనేజర్, “వాటీజ్దట్ సౌండ్ వైష్ణవీ, ప్లీజ్ గో అండ్ సీ అండ్ స్టాప్ దట్ సౌండ్” అనగానే గమ్మున తలుపు తెరిచేసరికి అత్తగారు నిలబడి ఉన్నారు. “ఏమైందత్తయ్యాయ మీటింగ్ లో ఉన్నాను. మీకు చెప్పాను కదా డిస్టర్బ్ చేయద్దని అనేసరికి,” “చాకలబ్బాయి ఇస్త్రీ బట్టలు తెచ్చాడు, డబ్బులివ్వమంటున్నాడనేసరికి,” వైష్ణవికి కోపం వచ్చేసింది ఒక్కసారిగా. “అత్తయ్యా, మామయ్యగారికి చెప్పండంటూ” తలుపులు వేసేసుకుంది.
మీటింగ్ పూర్తి అయ్యేసరికి గంట సమయం తీసుకుంది.
కాస్త కాఫీ కలుపుకుందామని కిచెన్ లోకి వచ్చేసరికి వంట చేసిన స ఛాయలేమీ కనపడలేదు. హాల్ లో టి.వి. శబ్దం వస్తోంది. సోఫాలో కూర్చుని అత్తగారూ, మామగారూ టీ.వీ. సీరియల్ ఏదో చూస్తున్నారు. నందూ వారికి కాస్త దూరంలో ఏవో బొమ్మలతో ఆడుకుంటున్నాడు. వాడికి స్నానం చేయించలేదు ఇంకా. కాఫీ కప్పుతో హాల్ లోకి వచ్చింది.
వైష్ణవిని చూస్తూనే శాంతమ్మగారు, “పని అయిపోయిందేమిటి?” ఇందాక చాకలికి మీ మామయ్యగారు ఇచ్చేసారులే.”
“పని అవలేదు అత్తయ్యా, పదినిమిషాలు బ్రేక్ఉంటే కాఫీతాగుదామని వచ్చాను. వెళ్లిపోవాలంటూ,”నందూని ఎత్తుకుని గబగబా స్నానం చేయించడానికి తీసుకుపోయి, వాడికి స్నానంచేయించి డ్రెస్మార్చింది. రేపటి నుండి మరికాస్త పెందరాళే లేచి నందూకి స్నానం చేయించాలని నిర్ణయించుకుంది. వాడు పొద్దుటేలేవడు. ఏడున్నరదాటాకా లేస్తాడు. ఏదిఏమైనా వాడిని లేపి స్నానంచేయించాలని అను కుంది. “ఇంక నేను వెళ్లాలత్తయ్యా” అని చెప్పేసరికి ఇంతవరకూ ఆ కంప్యూటర్ దగ్గరే అతుక్కుపోయి ఉన్నావు. కాస్త వంట చేసేసి వెళ్లకూడదూ, ఏం ఆ మాత్రం మీ ఆఫీస్ వాళ్లు అర్ధం చేసుకోరా?” పిల్లా, జెల్లా ఉంటారు, వాళ్లకు వంటచేసి పెట్టాలని?”
“వాళ్లకివన్నీ అనవసరం అత్తయ్యా, పని అయిపోవాలి వాళ్లకంటూ,” ఇంక తర్కించలేక అక్కడనుండి వెళ్లిపోయింది.
శాంతమ్మగారికి ఇంకలేవక తప్పలేదు. పదకొండు అయింది. వైష్ణవి ఇంట్లోనే ఉందికదా, వంట తనే చేస్తుందనుకుంటూ టి.వి చూస్తూ ఉండిపోయింది.
వైష్ణవి అదివరకటిలాగే ఎంత పెందరాళే లేచినా, లాగిన్అవడం లేట్అయిపోతోంది. ఇంట్లో అందరూ ఉదయంలేవగానే కాఫీ, కాఫీ అంటూ అడిగేసరికి వాళ్లు ఉన్నచోటుకి వెళ్లి అందిచాల్సి వస్తోంది. అలాగే టిఫిన్కూడా. డైనింగ్టేబిల్మీద అన్నీ సర్ది పెట్టినా, అదిలేదా, ఇదిలేదా అంటూ పదిసార్లు తిప్పిస్తారు. పవన్, మామగారు అయితే తిన్నప్లేట్ని కూడా అలాగే వదిలేస్తారు. అత్తగారు అప్పటికే స్నానంచేసి పూజముందు కూర్చుంటారేమో ఆవిడ ఎంగిలిప్లేట్లు, తాగేసిన కాఫీకప్పులూ ముట్టుకోరు.
తను హడావిడిగా అన్నీ సర్దేసి లాగిన్అయ్సేసరికే బోల్డన్ని మెయిల్స్ తన రిప్లై కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. తన టీమ్మేట్స్నుండి బోల్డన్ని మెసేజ్లు, “మేమ్, ఈ ప్రోగ్రామింగ్ కి ఆ కోడింగ్ వర్క్ ఔట్కావడం లేదంటూ,” ఏదైనా సొల్యూషన్చెప్పమని. అవన్నీ ఓపికగా చూడాలి, రిప్లైచేయాలి. లేకపోతే ప్రాజెక్ట్ఆగిపోతుంది. డేటైమ్లో వర్క్ సరిగా పూర్తిచేయలేక పోతోంది. అందుకే రాత్రి ఒంటిగంట వరకూ కూర్చుని పని చేయాలసివస్తోంది. పగలు తను రూమ్లో ఉన్నానని తెలిసి నందూ బయట నుండి “అమ్మా, తలుపుతీయంటూ ఒకటే ఏడుపు.” అత్తగారుగానీ, మామగారు గానీ వాడిని సముదాయించడానికి ప్రయత్నించరు. “తల్లి ఇంట్లోనే ఉంది కదా, చూసుకుంటుంది లే అన్న ఒకలాంటి ధీమా. వాడి ఏడుపుని మాన్పి సముదాయించి, వాడి ముందు ఆటవస్తువులు పెట్టి, నెమ్మదిగా ఆఫీస్ రూమ్ లోకి జారుకుంటుంది. తలుపులు మూస్తే ఊరుకోడు, మూయక పోతే అత్తగారి మామగారి మాటలు, మిక్సీ సౌండ్, కుక్కర్ల సౌండ్ తో పని చేసుకోడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంతకీ అత్తగారితో మీటింగ్స్ ఉన్నప్పుడు చెబుతూనే ఉంటుంది. “అత్తయ్యగారూ, ఒక గంట సేపు ఏ శబ్దాలు రానీయకుండా చూసుకోరూ, నందూని నా రూమ్ లోకి రానివ్వకండంటూ!” “ఆ, అంటూనే”, ఆవిడ తన పని తాను చేసుకుపోతారు. పైగా మామగారితో, “బాగుంది, ఇంట్లో నుండి ఆఫీస్ పని చేస్తున్న ఆడవాళ్లు వంట చేసుకోరా, పిల్లలను చూసుకోరా”, అనడం తాను ఎన్నోసార్లువింది.
రెండు రోజులు పనిమనిషి రాననిచెప్పింది. ఆ పనంతా వైష్ణవి మీదే పడింది. పొద్దుటే గిన్నెలు తోముకుని, గదులు ఊడ్చి, ఆ తరువాత టిఫిన్ లు, కాఫీలు, నిత్యను తయారు చేసి స్కూల్ కి పంపడం, నందూని లేపి బ్రష్ చేసి వాడికి స్నానం చేయించే సరికి తొమ్మిది అయిపోతుంది. భర్త అదివరకు తను ఆఫీస్ కు వెళ్లినపుడు తల్లికి ఏదో సాయం చేస్తూ ఉండేవాడు. అలాగే మామగారు కూడా. తను ఇంట్లోనుండి పని మొదలు పెట్టినప్పటి నుండి తనకి ఎవరి సహకారమూ లేదు. వంట ఒక్కటీ అత్తగారు చేస్తున్నారు. అదీ ఇంక తప్పదు అనుకుంటూ. “అదీ నీవే చేయి వైష్ణవీ” అంటే అదికూడా తనే చేయాలి.
ఆ రోజు బుధవారం. వైష్ణవి ఏదో కాన్ ఫరెన్స్ కాల్ లో ఉంది. తలుపులు వేసేసు కుంది. నందూగాడు బయట నుండి ఏడుస్తూ దడ దడా తలుపులు బాదేస్తున్నాడు. ఇంక లాభం లేదనుకుని కాల్ కట్ చేసింది క్షమార్పణచెపుతూ. తలుపులు తెరిచి చూస్తే, నందూ, ముఖం అంతా కన్నీళ్లతో తడిసిపోయి ఉంది. ఏమిటి ఎవరెవరి మాటలో వినబడుతున్నాయనుకుంటూ వాడిని ఎత్తుకుని హాల్ లోకి వస్తే, అత్తగారి చెల్లెలూ, ఆవిడ భర్తా, ఆవిడ మనవడు పదిసంవత్సరాల అబ్బాయి అక్కడ సోఫాలో కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. వీడిని వదిలేసారు. వైష్ణవి వాళ్లని పలకరిం చింది.
వెంటనే అత్తగారు “చూడు వైష్ణవీ, భోజనం చేసి వెళ్లమంటే వెళ్ళిపోతా మంటున్నారు. నేను నిన్న ఫోన్ చేసి ఈ రోజు రమ్మనమన్నాను. వచ్చినపుడు భోజనం చేసి వెళ్లడం సంప్రదాయం కదా!” మా వైష్ణవి ఇంట్లోనే ఉంది, మాకేమీ ఇబ్బంది లేదని చెప్పినా మా చెల్లెలికి ఒకటే మొహమాటం. భోజనాలు చేస్తేగానీ పంపనంటే పంపనని అత్తగారు బలనంతం చేసేసరికి వాళ్లు సరేనన్నారు.
“ఓ గాడ్, ఇప్పుడైతే అందరికీ వంట చేయాలా?!” తనకు అస్సలు కుదరదు. ముఖ్యమైన కాల్ ని మధ్యలో కట్ చేసి మరీ వచ్చింది. తన టీమ్ లో పనిచేస్తున్న నిరూషకి తను చేసిన ప్రోగ్రామింగ్ లో ఏదో హర్డిల్ వచ్చి ముందుకు సాగడం లేదని, అదేమిటో కాస్త చెక్ చేయండి మేడమ్ అంటూ మెసేజ్ చేసింది. దాన్నిలోతుగా స్టడీ చేసి, మూలకారణం ఏమిటో కనుక్కోవాలి. ఒక వేళ ఏమైనా ఎర్రర్స్ గానీ బగ్స్ గానీ వచ్చేయేమో చూసి పట్టుకుని రెక్టిఫై చేస్తేనే ఆ అమ్మాయి తన వర్క్ ని ముందుకు తీసుకువెడుతుంది. ఇదంతా టీమ్ వర్క్. ఒక చెయిన్ లాగ నడుస్తుంది. ఎక్కడైనా ఒకచోట ఆగిపోతే మొత్తం పని ఆగిపోతుంది.
“ఏమైనా అనుకోనీ!”, అని మనసులో అనుకుంటూ, “అవునండీ అత్తయ్యగారు చెప్పినట్లు భోజనం చేసి వెళ్లండి, నాకు ఒక గంట పని ఉంది, పూర్తి చేసి వస్తానంటూ”, నందూని మామగారి పక్కనే కూర్చోపెట్టి, వాడిని వదలద్దని చెప్పి తన గదిలోకి వచ్చేసింది.
నిజానికి ఒక గంట సీరియస్ గా పని చేసి అత్తగారికి సహాయం చేద్దామనుకుంది. కాని చేస్తున్న పని మధ్యలో ఆపడానికి వీలు లేకుండా అయిపోయింది. బాస్ కి తన వర్క్ ఫీడ్ బేక్ ఒక వారం నుండీ పంపడం లేదు. తన ఫీడ్ బేక్ బాస్ కి చాలా ముఖ్యం. తను ఏం చేస్తోందో, పని ఎంతవరకు ప్రొగ్రెస్ లో ఉందో తెలుసుకోడానికి. బాస్ కూడా ఆయన బాస్ కి జవాబుదారీ కదా. అప్పటికే మధ్యాహ్నం మూడైంది. “అయ్యో అనుకుంటూ గబగబా బయటకొచ్చి చూసింది. ఎవరూ కనబడడం లేదు. కానీ బాల్కనీలో నుండి నెమ్మదిగా మాటలు వినిపిస్తున్నాయి. “ఏమిటే అక్కా, రోజూ ఇంతేనా, నీకీ చాకిరీ తప్పడం లేదా?” ఈ వయస్సులో అన్ని బాధ్యతలనూ వదిలేసి చక్కగా ఏ యాత్రలకో వెళ్లాలి అసలు. అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్లని చాలా మందిని చూస్తున్నాను. చక్కగా ఆడుతూ పాడుతూ, ఏ కాసేపో కంప్యూటర్ ముందు కూర్చొంటారు. ఇంట్లో అన్ని పనులూ చేసుకుంటున్నారు. కొందరు బయటకు వెళ్లి షాపింగ్ కూడా చేసుకుంటారు. మీ కోడలేమిటీ, తలుపులు బిడాయించుకుని కూర్చొంటుంది?” “పని చేస్తోందా, లేక ఫోన్ చూసుకుంటూనో, లేక స్నేహితులతో సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తోందా?” ఇంట్లో పని ఎగ్గొట్టడానికి ఇవోసాకులేమో చూడంటూ” చెప్పడం తన చెవిని పడ్డాయి.
“ఛీ ఏమి మనుషులు!” సంస్కారం లేకుండా మాట్లాడుతోంది. ప్రాణాలు పెట్టి రాత్రి పగలూ పనిచేస్తూ లక్షలు సంపాదించి ఇంట్లో అవసరాలు తీరుస్తుంటే, కనీసం ఆవిడకు అర్థం కాకపోయినా, అత్తగారైనా ఆవిడను మందలించవద్దా?” మా వైష్ణవి అలాంటిది కాదని!”
అత్తగారి మౌనం ఆవిడ చెల్లెలికి మరింత ప్రోత్సాహకరంగా ఉండదా? అయినా అతిధులను ఏ వారాంతరంలోనో పిలవాలిగానీ, ఇలా ఆఫీసులు, పనులున్న రోజుల్లో పిలవడం ఏమిటి? అత్తగారికి ఆ మాత్రం తెలియకపోతే ఎలా అనుకుంటూ గిర్రున వెనక్కితిరిగి వచ్చేసింది. తనకు కోపం వస్తే అన్నం మీద అలగదు, మరింత ఇష్టంగా మరింత ఎక్కువ తినేస్తుంది. అదే పనిచేసి తన గదిలోకి వెళ్లి తలుపులు మూసు కుంది.
మరునాడు వైష్ణవి తన గదిలో పనిచేసుకుంటోంది. ఇంకో వారం రోజుల్లో ప్రాజెక్ట్ సబ్మిషన్ అయిపోవాలి. టీమ్ అంతా ఏకాగ్రతతో పనిచేస్తోంది. ఒక్కొక్కరి సందేహా లనూ తీరుస్తూ, వారికి అందుబాటులో ఎప్పుడూ సిస్టమ్ దగ్గరే ఉంటోంది. మేనేజర్ కూడా తరచుగా కాంటేక్ట్ లోకి వస్తూ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. అప్పుడే టీమ్ మెంబర్స్ తో జూమ్ మీటింగ్ పూర్తి అయింది. శృతి ఏదో జోక్ వేసేసరికి అందరూ ఫక్కున నవ్వేరు. తను కూడా నవ్వేస్తూ ఎందుకో వెనక్కి తిరిగిచూసేసరికి అత్తగారు నిలబడి ఉన్నారు. ఆవిడ ఎప్పుడొచ్చారో గమనించనే లేదు. ముఖం సీరియస్ గా ఉంది. నిన్న ఆవిడ చెల్లెలు చెప్పినట్లు, స్నేహితులతో ఫోన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు అనుకోవడం లేదుగా అనుకుంటూ, “ఏమిటత్త్తయ్యా, ఇలా వచ్చారనేసరికి, “వంట చేయలేదా వైష్ణవీ”, అని అడిగేసరికి తను తెల్లబోయింది. టైమ్ పదకొండున్నర దాటింది.
“ఏం అలా అడుగుతున్నారు అత్తయ్యా, మీరు చేయ లేదా?” అంటూ తిరిగి ప్రశ్నించింది.
“నేను చేస్తే మళ్లీ ఇక్కడకొచ్చి నిన్నెందుకు అడుగుతాను?” మేము గుడికెళ్లి ఇప్పుడే వచ్చాం. నందూని కూడా తీసుకెళ్లాం. ఆంజనేయస్వామికి ఆకుపూజ చేయించి వచ్చేసరికి ఇంత టైమ్ పట్టింది. వంటింట్లో వంట చేసిన ఛాయలు ఏమీ కనపడలేదు. మీ మామగారు ఆకలంటున్నారు.
“మీరు గుడికెళ్లారని నాకు తెలియదు. అయినా నేను పొద్దుట నుండి ఇక్కడే పనిలో ఉండిపోయాను. కదిలే పరిస్థితిలో లేను. ఒకటే మీటింగ్లు, ఫోన్ కాల్స్. “సారీ అత్తయ్యా!”
ఆవిడ విసవిసా ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వచ్చి వంట ప్రయత్నం చేసుకుంటోంది ఏదో గొణుక్కుంటూ.
నిన్న చిన్నత్తగారు వచ్చినప్పటి నుండి ఆవిడలో ఏదో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. “వంట చేయలేదా అంటే, వంట తనే చేయాలని అర్థం కదా!”
తను ఇంట్లో పనికి భయపడే రకం కాదు. ఇంట్లో నుండి వర్క్ చేసేటప్పుడు తనకు ఇంట్లో వారికి అన్నీ అమర్చడం కుదరడం లేదు. తనేమి చేయగలదు? అంటే అత్తగారి ఉద్దేశ్యంలో ఇంటి పనంతా చేసిన తరువాతే ఆఫీస్ పని చేయాలన్నమాట.
ఈలోగా తను చేయాలసిన పని గుర్తొచ్చి, మౌనంగా మళ్లీ పనిలో మునిగి పోయింది.
ఆ రోజు రాత్రి. పిల్లలిద్దరూ తాత, బామ్మ దగ్గర పడుకుంటామని వారితోనే పడుకుండిపోయారు.
ఎందుకో వైష్ణవికి నిద్రరావడం లేదు. దుఖంపొంగుకొస్తోంది. ఆపుకోడం తన తరం కావడం లేదు. వెక్కివెక్కి ఏడుస్తున్న శబ్దానికి పక్కనే పడుకున్న పవన్ లేచి, “ఏమైంది వైషూ, ఎందుకేడుస్తున్నావ్?” ఆరోగ్యం బాగుంది కదా?”
భర్తకు ఏమీ సమాధానం చెప్పలేకపోతోంది. “ఏమైంది, ఏదైనా వర్క్ ప్రాబ్లమా?”
“నేను జాబ్ మానేయాలనుకుంటున్నాను పవన్. నాకు చాతకావడంలేదు.”
“ఏమైంది వైషూ!?
“నా ప్రోజక్ట్ డెడ్ లైన్ సమీపిస్తోంది. నాకు ఏకాగ్రత కుదరడం లేదు. ఆఫీస్ పనేచేయాలా, లేక ఇంటి పని చేయాలా? ఏదో ఒక్కటే చేయగలను. చెప్పు పవన్.”
“అదేమిటీ, ఇంట్లో అమ్మా నాన్నా అన్నీ చూసుకుంటున్నప్పుడు నీ కేమి కష్టం?” చెప్పు వైషూ!”
‘నేను ఆఫీస్ కి వెళ్లి పని చేసినప్పటికీ, ఇప్పుడు ఇంట్లో నుండి ఆఫీస్ పని చేయడానికి చాలా తేడా ఉంది పవన్. బైదిబై, నాకు ఇంట్లో వాళ్లమీద కంప్లైంట్స్ చేయడం అంటే ఇష్టం లేదని మీకు తెలుసు. కానీ, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనువైన పరిస్థితులు, వాతావరణం లేవని మాత్రం చెపుతాను. ఈ ప్రాజెక్ట్ ఎలాగోలాగ పూర్తి చేసి నేను జాబ్ రిజైన్ చేస్తాను.’
“సరే వైషూ, ఉద్యోగం చేయాలో, మానాలో అన్నది పూర్తిగా నీ ఇష్టం. నిన్ను నేనేమీ ఫోర్స్ చేయను. అయితే నీ మాటల్లో కొన్ని విషయాలను నేను అర్థం చేసుకున్నాను. సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. రేపటి నుండి వారం రోజులు శెలవు పెడుతున్నాను. నేను అన్నీ చూసుకుంటాను. నీవు హాయిగా వర్క్ చేసుకో అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. భర్త పరిష్వంగంలో వైష్ణవి అన్నీ మరచిపోయి హాయిగా నిద్రపోయింది.
***
“ఏరా పవన్, ఆఫీస్ కు తయారవడం లేదేమిటీ, నిత్యకు నీవు స్నానం చేయించడం ఏమిటీ, వైష్ణవి చేయిస్తుందిగా?” అనేసరికి, నేను ఖాళీగా ఉన్నప్పుడు చేయిస్తే ఏమైందమ్మా, తనే చేయించాలని లేదుగా?”
అలాగే వైష్ణవి ఇడ్లీ కుక్కర్ స్టౌమీద పెట్టి తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్లింది. ఇడ్లీలు అయిపోగానే పవన్ వాటిని బయటకు తీసి ప్లేట్లలో పెట్టి పచ్చడి, కారప్పొడి వేసి అందరినీ టిఫిన్ కి పిలిచాడు. నాలుగు ఇడ్లీలు ఒక ప్లేట్ లో పెట్టి వైష్ణవి గదిలోకి తీసుకెళ్లాడు. ఇవన్నీ గమనిస్తున్న శాంతమ్మగారికి విచిత్రంగా ఉంది. “నేను చేస్తానులేరా పవన్” అన్న మాట ఆవిడ అనడం లేదు.
“ఎన్నిరోజులు లీవ్ పెట్టావ్ పవన్?”, అని తండ్రి అడిగిన దానికి “వారం రోజులంటూ సమాధాన మిచ్చాడు.”
“వారం రోజులా!” ముందరే చెప్పి ఉంటే, పిన్నీ, బాబాయ్ మరికొందరు కాశీ యాత్రకు వెడుతున్నారుటరా పవన్. మేమూ వాళ్లతో వెళ్లే వాళ్లం అనేసరికి, “అమ్మా మనం అందరం కలసివెడదాములే, నేను శెలవు పెట్టింది వైష్ణవి కోసం. నేను లీవ్ తీసుకుని మిమ్మల్ని యాత్రలకు పంపించే పరిస్థితి కాదు ఇప్పుడు.”
ఆవిడ ముఖం చిన్నబోయింది.
పదకొండైనా వంట ప్రయత్నం ఏమీ లేకపోయేసరికి, “అమ్మా, కూరగాయలు ఏమి కట్ చేయాలో చెప్పు కట్ చేసి ఇస్తాను, వంట చేయవా మరి?”అనేసరికి టి.వి. సీరియల్ చూస్తున్న ఆవిడ బలవంతంగా వంటగదిలోకి వచ్చింది. పవన్ మధ్యలో కాఫీ కలిపి వైష్ణవి రూమ్ లోకి తీసుకెళ్లడం అదీ చూస్తూనే ఉందావిడ.
పవన్ కూరగాయలు కట్ చేసి ఇచ్చాడు. నందూ తల్లి ఉన్న రూమ్ తలుపులు కొడుతూ ఉంటే పవన్ వెళ్లి నందూని ఎత్తుకున్నాడు. ఎవరూ కూడా నందూని తలుపులు కొట్టద్దని అనడంలేదు.
వంట పూర్తి అయింది. వైష్ణవి కి బ్రేక్ వచ్చినట్లుంది. డైనింగ్టేబిల్ మీద కంచాలు సర్ది భోజనాలు వడ్డించి అందరినీ పిలిచింది.
చాలారోజుల తరువాత అందరూ ఆ టైమ్ లో లంచ్ చేయడం గమ్మత్తుగా ఉంది. తలొంచుకుని తింటున్న పవన్ నెమ్మదిగా మాటలు మొదలు పెట్టాడు. “అమ్మా, నాన్నగారూ వినండి, వచ్చే నెల ఫస్ట్ నుండి వైష్ణవి ఉద్యోగం మానేస్తుందిట. ఇంటి పట్టునే ఉంటాను, ఉద్యోగం చేయలేకపోతున్నానంటోంది. ఇంట్లో పనో లేక ఆఫీస్ పనో ఏదో ఒక్కటి మాత్రమే చేయగలనంటోంది. మీకు తెలుసునో, తెలియదోగానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నది ఇంటి పని చూసుకుంటూ, మధ్యలో అప్పుడప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చోడం కాదు. ఆఫీస్ టైమ్ కే తను లేప్ టాప్ ఆన్ చేసి పని మొదలు పెట్టాలి. వాళ్ల మేనేజర్ కి ఎప్పుడూ పనిలో అందుబాటులో ఉండాలి. సడన్ గా మీటింగ్ లు, వీడియో కాన్ఫరెన్సులూ పెడితే తను అన్నీ రెడీ చేసుకుని వాటికి అటెండ్అవ్వాలి. టీమ్ మెంబర్సకి సూచనలిస్తూ ఉండాలి. పూర్తిగా ఆఫీస్ కి వెళ్లి నప్పుడు ఎలా పనిచేస్తుందో ఇప్పుడూ అలాగే చేయాలి.
మధ్య మధ్యలో వచ్చి, వంట చేయడం, పప్పురుబ్బడం లాంటివి చేయ వీలుండదు. ఇంట్లో నుండే కదా పనిచేసేది, మెల్లిగా చేసుకోవచ్చు కదా అని అందరూ అనుకోవచ్చు. మెల్లిగా మనకిష్టమైనపుడు చేసే పనికాదు వైష్ణవిది. అది వరకు వైష్ణవి ఆఫీస్ కు పొద్దుటే వెళ్లిపోయినపుడు, వంటపని, నందూని చూసుకోవడం అదీ నీవే చేసేదానివి కదమ్మా. అయ్యో అమ్మ కష్టపడుతోందనుకుంటూ నేను కూడా నీకు ఉదయాన్నే హెల్పె చేసేవాడిని. ఏమిటో నేను కూడా పొద్దుటే ఏమీ హెల్పె చేయడం లేదు. పొద్దుట టిఫిన్లు, కాఫీలూ, నిత్యను తయారు చేయడం, నందూకి స్నానం, తినిపించడం లాంటివి వైష్ణవే చేస్తున్నపుడు, వంటపని, నందూని ఎంగేజ్ చేయడం నీవు నాన్నా చేయలేరా అమ్మా?” ఆ టి.వి సీరియల్స్ చూస్తూ, వైష్ణవే వంట చేసి పనులన్నీ చూసుకోవాలని అనుకోడం న్యాయం కాదమ్మా. అలా అని మీ చేత ఇంటి చాకిరీ చేయిస్తున్నామని భావంచవద్దు. ఇది మన కుటుంబం. సమిష్టిగా అందరూ కలిసి మెలిసి తమకు చేతనైన పని చేసుకుంటే ఒకే వ్యక్తి మీద భారం పడదు.
ఆ మధ్య పనిమనిషి నాలుగు రోజులు రానప్పుడు, వైష్ణవి చాలా టెన్షన్ పడిందిట. పని భారమంతా తనమీదే పడింది. అప్పుడే మేనేజర్ ఏదో ముఖ్యమైన డేటాను సబ్‌మిట్ చేయమన్నాడుట. ఏకాగ్రత కుదరక ఏవో తప్పులు చేసిందిట. మేనేజర్ బాగా చివాట్లు వేసాడుట. ఇంట్లో పని ఒకవైపు, ఆఫీస్ పని మరోవైపు. నాన్న అదివరలో నందూని, నిత్యను చూసుకునేవారు. నిత్య స్కూల్ నుండి రాగానే దానికి బట్టలు మార్పించి, పాలు తాగించేవారు. ఇప్పుడు వైష్ణవి వచ్చి చేస్తేగానీ అది అలాగే ఉంటోంది. ఇప్పుడేమైందమ్మా మీకు? అదివరకు చేసిన పనులు ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? వైష్ణవే చేయాలని ఎందుకనుకుంటున్నావు? నందూ అమ్మ కావాలని ఏడుస్తున్నా వాడిని ఎందుకు అలా వదిలేస్తున్నారు? ఎవరు చేయాలసిన పనులు వాళ్లు సక్రమంగా చేసుకుంటూ పోతే వైష్ణవి మీద ఇంత భారం పడేది కాదు కదా. పగలు పని పూర్తవక రాత్రిళ్లు రెండు గంటలవరకు కూర్చుని పనిచేసి అప్పుడు నిద్రపోతుంది. మళ్లీ అయిదింటికే లేవవలసి వస్తోంది. నాకు మీ ఆరోగ్యంతో బాటూ తనది కూడా ముఖ్యమే కదా అమ్మా.
వైష్ణవి ఉద్యోగం మానేస్తే నా ఒక్క సంపాదనతో ఇల్లు మేనేజ్ చేయడం చాలా కష్టం. “ఇంటి లోన్, కార్ లోన్, నిత్య స్కూల్ ఫీజులూ, చెల్లాయి పెళ్లికని చేసిన అప్పూ నా ఒక్కడి జీతంలో కట్టలేను. నిజానికి నా జీతం కంటే వైష్ణవి జీతమే ఎక్కువ.ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకుంటే నా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించాను. మీరు అందరూ కూడా బాధ్యతల్లో సహకరిస్తారనుకున్నాను. ఇప్పుడు వైష్ణవి ఉద్యోగం మానేస్తే ఎలాగా అనిచూస్తున్నాను.
“నేనెక్కడ ఉద్యోగం చేస్తున్నాను పవన్?” తలుపులు మూసుకుని స్నేహితులతో మాటలాడుతూ, వీడియోలూ, సినిమాలూ చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను, ఇంటి పని ఎగ్గొట్టాలని.”
వైష్ణవి మాటలకు శాంతమ్మ గారి ముఖం మాడిపోయింది.
కొడుకు మాటలు ఆవిడ మనస్సు మీద బాగా ప్రభావం చూపాయి.
వైష్ణవి ఎంత కష్టపడుతుందో తెలిసీ కూడా వైష్ణవిని సరిగా అర్థం చేసుకోలేక పోయింది. కిందటి దసరా పండక్కి చెన్నైలో ఉంటున్న కూతురినీ అల్లుడిని రమ్మన మని పిలిస్తే అల్లుడికి వీలుకాక రాలేమన్నారు. పండక్కి ఏమైనా విలువైనది కొనుక్కో మని వైష్ణవి రెండు లక్షల రూపాయలు తన కూతురు పూజకి పంపించింది. తమకే అవసరం వచ్చినా ముందుండి అన్నీ చేస్తుంది. అటువంటి కోడలు ఇంటి నుండి ఆఫీస్ పని చేసుకుంటుంటే ఏమీ సహకరించకపోయి, ఆమే తమకు చేసిపెట్టాలని ఆశించారు. ఒక విధంగా పరోక్షంగా ఆమెను ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఉదయం వైష్ణవి ఆఫీస్ పని చేసుకుంటుంటే తన కొడుకు మధ్య మధ్యలో వెళ్లి, కాఫీలూ, ఫలహారాలు అందిస్తే విచిత్రంగా చూసిందే తప్ప, వైష్ణవి పగలూ రాత్రీ కష్టపడుతోం దని, ఆమెకు చిన్నపాటి సాయమైనా చేయాలన్న కొడుకు ఆరాటాన్ని అర్ధం చేసుకోలేక పోయింది. పాపం పనిలో ఉండి భోజనం చేసిందోలేదోనని కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు తాను. ఎంత పాపిస్టిది. అదే విధంగా భాస్కర్రావు గారు కూడా అను కుంటున్నారు, “అవును నిజమే!” తను అదివరలో సాయంత్రాలు నిత్యనూ, నందూని దగ్గరలోనున్న పార్క్ కి తీసుకువెళ్లి ఆడించేవాడు. కోడలు ఆఫీస్ పని ఇంట్లోనుండి చేయడం మొదలు పెట్టాకా అవన్నీ మానేసాడు. భార్యతోపాటూ కూర్చుని టి.వీ సీరియల్స్ చూస్తున్నాడు.
శాంతమ్మగారు తలెత్తి కొడుకువైపు చూస్తూ, “నీవన్నది నిజమే పవన్. నీ బాధను అర్ధం చేసుకున్నాను. నేను చేస్తున్నది ఎంత తప్పో అర్థం అయింది. “అమ్మా వైష్ణవీ, ఇంత చేసినా మమ్మలని పల్లెత్తు మాట అనకుండా ఎంతో సహనంగా అన్ని పనులూ చేసుకుంటూ వస్తున్నావు. ఇదిగో చెపుతున్నాను, నీవు ఇంట్లో పనులుగానీ పిల్లల పనులుగానీ ఏమీ పట్టించుకోవద్దు. అన్నీ నేనూ, మీ మామయ్యగారూ చూసుకుంటాం. నీకేదైనా అసౌకర్యం కలిగితే మాకు చెప్పమ్మా వైష్ణవీ, మేము తప్పకుండా నీకు సాయం చేస్తాం. అంతేకానీ, టెన్షన్ పడుతూ, హైరానా పడకు. నీవు ఆఫీస్ పని ప్రశాంతంగా చేసుకునే వెసులుబాటు మేము కలిగిస్తాం.
వెంటనే మామగారు కూడా కోడలివైపే చూస్తూ, చూడమ్మా, మా చేత ఏ పనైనా చెప్పి చేయించుకునే అధికారం నీకుంది. అంతేకానీ చక్కని ఉద్యోగాన్ని వదులుకోకమ్మా అంటూ ఆయన అర్థించారు.
“అత్తయ్యా, మామయ్యా, నాకు వీలైనంతవరకు నేనూ చేస్తాను. శని, ఆదివారాలు మీకు పూర్తి విశ్రాంతి. ఆ రోజుల్లో మీరెక్కడికైనా వెళ్లిరండంటూ చెప్పింది.
రోజులు ప్రశాంతంగా గడచిపోతున్నాయి. ఇంట్లో అందరూ సమిష్టిగా బాధ్యత లను పంచుకోవడం వలన వైష్ణవి తన ప్రాజెక్ట్ ని సకాలంలో క్లైంట్ కి సబిమిట్ చేసి ‘హమ్మయ్య’ అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది. అది తాత్కాలికమే. మరోరోజు మరో ప్రాజెక్ట్ వస్తుంది, చేయక తప్పదనుకుంది మనస్సులో.
మరో రెండు వారాల కాలం ముందుకు సాగింది. తాను చేసిన ప్రాజెక్ట్ కు క్లైంట్ నుండి ఎప్రిసియేషన్ సర్టిఫికెట్ వచ్చిందని మేనేజర్ చెపుతూ తన హర్షాన్ని వెలి బుచ్చాడు. తనకి చాలా ఆనందం అనిపించింది.
ఆ రోజు పదకొండు గంటలకు తనకొచ్చిన మెయిల్ చదవిన వైష్ణవి ఆనందం వర్ణనా తీతం. ఆ శుభవార్త ఏమిటో భర్త ఆఫీస్ నుండి రాగానే చెప్పాలని ఆత్రుత పడుతోంది. సాయంత్రం వేడి వేడి మిర్చీ బజ్జీలకు అన్నీ రెడీ చేసింది. హల్వా చేసింది. నేతి వాసనతో ఇల్లు ఘుమాయిస్తోంది.
పవన్ ఆఫీస్ నుండి వచ్చేసాడు. అందరూ హాల్ లో కూర్చొన్నారు. అందరికీ వేడి వేడి బజ్జీలు అప్పటికప్పుడు వేయించి ప్లేట్లలో సర్ది నిత్యను పిలిచీ అందరికీ ఇమ్మనమని చెప్పింది.
“ఏమిటి విశేషం అటూ”, వైష్ణవి వైపు చూసాడు పవన్. వైషూ ఎందుకో ఈరోజు చాలా అందంగా, మొహం అంతా వెలుగులుతో నిండినట్లు కనబడుతోంది. “ఈరోజేమీ తన పుట్టినరోజు కాదే అనుకున్నాడు మనస్సులో!” తనదే కాదు, ఎవ్వరి పుట్టిన రోజూ కాదు. “మరి?”
“నాకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిందండీ, పొద్దుట పదకొండుగంటలకు మా హెచ్.ఆర్ మేనేజర్ నాకు ప్రమోషన్ ఆర్డర్స్ ని మెయిల్ చేసారు. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న ప్రమోషన్ అనగానే,” పవన్ మెచ్చికోలుగా వైష్ణవి వైపే చూస్తూ, “కంగ్రాట్సే వైషూ” అంటూ అభినందించాడు. అత్తగారూ, మామగారూ కూడా ఆనందపడుతూ, నీ కష్టానికి తగిన ప్రతిఫలమమ్మా, ఎంతో కష్టపడ్డావంటూ మెచ్చుకున్నారు. “ఇదంతా మీ సహాయ సహకారల మీద నేను తెచ్చుకున్న ప్రమోషన్ అత్తయ్యా, మామయ్యా, మీరే ఇంటి బాధ్యతలను చూసుకోకపోతే, నాకీ ప్రమోషన్ వచ్చేదే కాదంటూ,”వారిరువురి పాదాలకు నమస్కరించింది. నందూ తల్లి వైపు చేతులు చాస్తూ ఎత్తుకోమన్నట్లు చూసాడు. పిల్లిద్దరినీ మురిపెంగా దగ్గరకు తీసుకుంది.
మరో వారం తరువాత అత్తగారిని, మామగారిని ఫ్లైట్ లో కాశీకి పంపిస్తూ, జాగ్రత్తగా అన్నీ పుణ్యక్షేత్రాలు చూసి రండత్తయ్యా” అంటూ వీడ్కోలిచ్చింది. కొత్త పదవీ బాధ్యత లను చేబట్టేముందు రెండు వారాలు లీవ్ అడిగి తీసుకుంది. అత్తమామలకు వాళ్లు ఎప్పటి నుండో చూడాలనుకున్న కాశీ యాత్ర కలను నెరవేర్చింది.
*****

యశోదాకైలాస్ పులుగుర్త నివాసం హైద్రాబాద్. విద్యార్హతలు : M.A ( Pub. Admn.) & M.B.A ., ప్రభుత్వ రంగ సంస్త అయిన ECIL HYDERABAD. లో సీనియర్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యాను..
సాహిత్యం, కధలు, రచనల పట్ల ఆసక్తి ఉంది.. ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో దాదాపు పన్నెండు కధలవరకూ ప్రచురింపబడినాయి..
అలాగే మన తెలుగుకధలు.కామ్ అనే వెబ్ సైట్ కి దాదాపు డభై కధలు, రెండు ధారావాహిక సీరియల్స్ ను వ్రాసాను. వారు రవీంద్ర భారతి వేదికపై నాకు సన్మానం చేసి ‘ఉత్తమ రచయిత్రిగా’ బిరుదుని ప్రదానం చేసారు. నా కధలకు ఎన్నో ప్రశంసా పత్రాలను ఇచ్చారు. సుమతి సాహితీ మాస పత్రికలో నేను వ్రాసిన “పన్నీటి జల్లు” సీరియల్, ” ప్రేమించడం నేర్చుకో”, “అపర్ణ” కథలు కేష్ ప్రైజ్ లను గెలుచుకున్నాయి.
నా కధలు ‘పచ్చాజెండా, నాణానికి మరోవైపు’ కధలు పుస్తక రూపంలో ప్రచురణ అయ్యాయి. అలాగే కిందటి నవంబర్ నెల 12 న వంశీ ఇంటర్నేషనల్ ఇండియా ఆధ్వర్యంలో, ప్రజానటి, కళాభారతి, పార్లమెంట్ మాజీ సభ్యురాలు డా. జమునారమణారావు స్మరణలో 52 మంది రచయితలు/ రచయిత్రులు రచించిన కొత్తకథలు-6 కథాసంపుటిలో నేను వ్రాసిన కథ ఒంటరిపోరాటం చోటు దక్కించుకోవడం నా అదృష్టం. ఈ కథా సంపుటి ఆవిష్కరణోత్సవం శ్రీ త్యాగరాయ గానసభలో డా.వంశీ రామరాజు, డా.ఓలేటి పార్వతీశం, డా.ఆళ్ల శ్రీనివాస రెడ్డి, శ్రీ రేలంగి నరసంహారావు తదితర ప్రముఖుల సమక్షంలో జరగడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఈ సంవత్సరం విజయవాడలో ఉగాది పండుగరోజున సుమతీ మాసపత్రిక (ఆన్ లైన్) వారు తొమ్మిదవ కథా రచయిత్రి విజేతగా ‘సాహితీ సామ్రాట్’ పురస్కారాన్ని ఇస్తూ సత్కరించారు.
ఫేస్ బుక్ లోని రెండు గ్రూప్ లకు కధలు వ్రాస్తూ పోటీలలో పాల్గొంటూ ఎన్నో ప్రశంసా పత్రాలను అందుకున్నాను.