నడక దారిలో-56

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగి ఉద్యోగంలో చేరింది. నేను హెచ్చెమ్ గా అనుభవాలు, పదవీవిరమణ, పెద్దక్క మరణం, ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ప్రారంభమైంది. ఇంటికి మిత్రులు రావటం తగ్గిపోవడం, వీర్రాజు గారు తన ఏకాగ్రత అంతా పెయింటింగ్స్ వేయటంపై పెట్టారు. పల్లవి కొన్న సరూర్ నగర్ లో అపార్ట్మెంట్ గృహప్రవేశం జరిగింది. తర్వాత–)

***

 
          కొత్త ఇంట్లో ఫర్నిచర్ కోసం కార్పెంటరీ వర్క్ ప్రారంభించాడు చారి. రోజూ నేను గానీ , వీర్రాజుగారు గానీ ఆషీ స్కూలుకీ, పల్లవి ఆఫీసుకీ వెళ్ళాక పదింటికి బయలు దేరి వెళ్ళేవాళ్ళం. పదింటికి భోజనం చేసేసి, బాక్స్ లో టిఫిన్ తీసుకొని వెళ్ళి తిరిగి సాయంత్రం నాలుగింటికి తిరిగి వచ్చేవాళ్ళం.
 
          వీర్రాజుగారు తాను ముచ్చటపడి కొనుక్కున్న కళాకృతులకు సరిగ్గా అమరిక వుండేలా పదేపదే డిజైన్లు తయారు చేసుకొంటూ దగ్గరుండి మరీ హాల్ లోని షెల్పులు ఎలా చేయాలో తన కోరిక మేరకు చేయించారు. వార్డరోబ్ లను మాత్రం మా ఇష్టానికి వదిలేసారు.
 
          వీర్రాజుగారు 1961 లో హైదరాబాద్ వచ్చిన దగ్గర్నుంచి ఉన్న మిత్రులలో శ్రీ రామారావు గారు ఒకరు. ఆయన ఇల్లు మా కొత్త ఇంటికి పదినిముషాల నడక దూరం లోనే ఉంటుంది. వీర్రాజుగారు అక్కడకు వెళ్ళినప్పుడు శ్రీ రామారావుగారిని కలిసి ఆయనకి మా కొత్తింటిని చూపించారు. ఇక్కడకు షిఫ్ట్ అయ్యాక మనం తరుచూ కలుసుకోవచ్చని ఇద్దరూ సంబరపడ్డారు.
 
          అయితే మేము షిఫ్ట్ కాకముందే అనుకోకుండా మాసివ్ హార్ట్ ఎటాక్ తో శ్రీ రామా రావుగారు అనంతలోకాలకు షిఫ్ట్ కావటం వీర్రాజుగారిని దుఃఖంలో ముంచెత్తింది. వీరిద్దరి పాత స్నేహితులైన రామడుగు రాధాకృష్ణ మూర్తి గారు, శ్రీపతిగారూ అందరూ శ్రీరామారావువాళ్ళింటికి వచ్చి శోకతప్తులయ్యారు.
 
          కొత్త ఇంటికి వచ్చాక వీర్రాజుగారికి మంచి కాలక్షేపం అనుకున్నాం పల్లవీ, నేనూ. కానీ ఇలా జరగటం బాధ కలిగింది.
 
          పల్లవికి ప్రోజెక్ట్ మేనేజర్ గా ప్రమోషన్ రావటంతో చాలా బిజీగా అయిపోయింది. ఇంట్లో జరుగుతోన్న పనిని సూపర్వైజ్ చెయ్యటానికి కూడా కుదరలేదు.
 
          అక్కడ పని జరుగుతోన్న రోజుల్లోనే బిల్డర్ ఇస్తానన్న ఏసీలు,ఫేన్లూ ఇంట్లో ఫిక్సింగ్ జరిగాయి.
 
          ఒకరోజు నేను అక్కడికి వెళ్ళి కార్పెంటర్ పని చేస్తుంటే ఏదో పుస్తకం పట్టుకొని కూర్చునే దాన్ని. ఒకరోజు ఇంటి నుండి వీర్రాజుగారు అక్బరుద్దీన్ ఒవైసీ పై హత్యా యత్నం జరిగిందంట గొడవలు జరుగుతాయేమో వచ్చేయమని ఫోన్ చేసారు. నేను వెళ్ళే దారి అటువంటిది. అందుకని సాయంత్రం వరకు వుండకుండానే ఇంటికి వచ్చేసాను. కానీ అది రెండు మతాల మధ్య జరిగిన సంఘటన కాదు కనుక సమసి పోయింది.
 
          అప్పట్లోనే జరిగిన మరో సంచలన సంఘటన పుట్టపర్తి సాయిబాబా చాలా కాలం అనారోగ్యంగా వుండి మరణించటం. ఆ నెలంతా దీనిపై అనేకానేక వూహలూ, పుకారులూ వ్యాపించటమే కాక పుట్టపర్తిలో వరుసగా జరిగిన అనూహ్య పరిణామాలు అవి కేవలం పుకార్లేకాదనిపించింది. ప్రపంచదేశాలన్నింటా సాయిబాబా భక్తులు వున్నారు. ఆ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలు నిగ్గు తీసే వారెవ్వరు.
 
          అయిదారేళ్ళ క్రితం వీర్రాజు గారి బాల్య మిత్రుడు సత్యనారాయణ కొడుకు పెళ్ళి అక్కడే జరిగినప్పుడు వీర్రాజుగారూ నేనూ పుట్టపర్తి వెళ్ళాము. వీర్రాజుగారు రూము లోనే వుండిపోతానన్నారు. నేను కుతూహలం కొద్దీ పెళ్ళి వారితో ప్రార్థనా మందిరం లోనికి వెళ్ళాను. అక్కడ సాయిబాబాని అతి దగ్గరగా చూసాను. అక్కడున్న మ్యూజియం చూసాము. ఎందుకో అక్కడంతా ఏదో అసహజంగా వుండి నాకు వూపిరాడ నట్లుగా అనిపించింది. ఇప్పుడు సాయిబాబా మరణం ఎన్నో ప్రశ్నలకు తెరతీసింది.
 
          మొత్తంమీద మూడు నెలలకు పైగా సమయంలో కార్పెంటర్ ఈ వర్క్ చాలా వరకు పూర్తి చేసాడు. ఏప్రెల్ లో ఆషీకి నాలుగో తరగతి సంవత్సరాంత పరీక్షలు పూర్తి అయ్యాయి. మే నెలలో కొత్తంటికి షిఫ్ట్ కావాలనుకున్నాము. సామాన్లు కొంచెంకొంచెంగా సర్దటం మొదలుపెట్టాం.
 
          కళ్యాణ్ వచ్చి షిప్టింగ్ కి సహాయం చేస్తానన్నాడు. మా మరిదికి కారు వుంది. అది తీసుకొచ్చి విలువైన వస్తువులనూ, జాగ్రత్తగా షిఫ్ట్ చెయ్యాల్సిన వాటినీ కారులో అయిదారు ట్రిప్పులు వేసి కొత్తంట్లోకి చేర్చాడు. పేకింగ్ & మువర్స్ వాళ్ళని మాట్లాడా ము. మూడు ట్రిప్పులలో సామాన్యంగా షిఫ్ట్ చేయొచ్చు అనుకున్నాము. కానీ అయిదారు ట్రిప్పులు వేస్తే గానీ పూర్తికాలేదు. అప్పటికీ నాలుగైదు ట్రంక్ పెట్టెలూ, టీవీ స్టాండు లాంటివి వాళ్ళకే ఇచ్చెసాము డైనింగు టేబుల్ కొత్త ఇంట్లో బిల్డర్స్ ఇస్తారు కదా అనీ అదీ వదిలేసాము.షెల్ఫ్ లు ఓ రెండింటిని వదిలేసాము. కేవలం పుస్తకాలకే మూడు ట్రిప్పులు అయ్యాయి. తీసుకోచ్చి ప్రతీ గదిలో దుప్పటిలో మూట కట్టిన పుస్తకాలని కుప్పపోసారు.
 
          ” అర్జంటుగా సర్దేయకండి. తాపీగా సర్దుకోవచ్చు ” అన్నాసరే వినకుండా వీర్రాజు గారు ఆఘమేఘాల మీద సర్దేసారు. మొత్తం మీద సరూర్ నగర్ ఇంటికి వచ్చేసాము. ఈ ఏడాది వేరే స్కూల్ లో చేర్చాలనుకుంటే ఆషీ ఒప్పుకోలేదు. అదేస్కూల్ లో చదువు తానని అంది. ఇంక రానూ, పోనూ స్కూల్ బస్ నే కుదిర్చాము.
 
          ఇంతకాలం అమ్మానాన్నల ఇంట్లో వున్నాననే భావం పల్లవికి వుండేవుంటుంది. ఇప్పుడు తనదైన ఇంట్లో వుండటం అనేది తనకి తృప్తినిస్తుందని నేను భావించాను. అంతకు ముందు ఆఫీసుకు మాట్లాడుకొని సలీం ఆటోలోనే పల్లవి ఆఫీస్ కు వెళ్ళేది.
 
          ఈ ఇంటికి వచ్చేక పల్లవిగానీ, ఆషీగానీ అక్కడ నలుగురి ప్రశ్నలూ ఎదుర్కొనే పరిస్థితి ఉండకూడదని భావించి నేనూ , వీర్రాజుగారూ ఒకరోజు ఆషీని పక్కన కూర్చో బెట్టుకుని తన తండ్రి ఎలా పోయాడో, ఆ పరిస్థితులేమిటో అన్నీ వివరంగా చెప్పాము. ఇంత వరకూ ఆషీకూడా అందరు పిల్లలూ తల్లిదండ్రులతో తిరుగుతారు కదా తన తండ్రి ఎవరూ అని ఎప్పుడూ అడగకపోవటం కూడా మాకు ఆశ్చర్యమే. చిన్నప్పుడు ఒకరిద్దరు మీ నాన్న పేరేమిటి అని అడుగుతుంటే వీర్రాజు అనే చెప్పేది. మేము చెప్పిన విషయమంతా విని ఏమీ కామెంటు చేయకుండా ముఖం కూడా అభావంగా పెట్టి నిశ్శబ్దంగా వూరుకుంది ఆషీ. అంత చిన్న వయస్సులోనే అంత గుంభనంగా వుండటం ఆశ్చర్యం కలిగించింది. తర్వాత కూడా ఆ పిల్ల ఎప్పుడూ ఆ ప్రసక్తే తీసుకుని రాలేదు.
 
          మేము ఇంట్లో అన్ని సర్దుకున్న తర్వాత బంధువులకూ, మిత్రులకూ, పల్లవి సహోద్యోగులకూ ఒక ఆదివారం విందుకు పిలిచాము. అందరూ వచ్చి ఇల్లు చాలా బాగుందని అభినందనలు తెలియజేశారు.    
 
          మరొక రోజు లేఖిని మిత్రుల్ని ఆహ్వానించాను. వాసాప్రభావతి, డి.కామేశ్వరి, అబ్బూరి ఛాయాదేవి, తురగా జానకీరాణి, ఇంద్రగంటి జానకీ బాల, శారదా అశోకవర్థన్, తమరిశ జానకి మొదలైన రచయిత్రులు ఒక పాతికమంది వరకూ మా ఇంట్లో విందుకు హాజరయ్యారు.
 
          మెల్లమెల్లగా కొత్త ఇంటికి అలవాటు పడ్డాం. బ్రహ్మానందనగర్ ఇంటికి కలర్స్ వేయించాము. ఆ పనిమీద ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కొంత దిగులు వేసింది. కష్టార్జి తాన్ని కూడబెట్టి కొన్ని ఇల్లది. ముప్ఫై ఏళ్ళు ఎన్నో కష్టసుఖాలను అనుభవించిన ఇల్లు. అవన్నీ గుర్తొచ్చి ‘ కొత్త మజిలీ’ అనే కవిత రాసాను. ఆ ఇంటిని అద్దెకు ఇచ్చాము.
 
          ఒక రోజు అనుకోని ఫోన్ వచ్చింది. ఫోన్ చేసినవారు ఆవంత్స సోమసుందర్ గారు నాకు దీర్ఘ కవిత్వ విభాగంలో దేవులపల్లి రాజహంసా కృష్ణశాస్త్రి పురస్కారం ఆయన జన్మదినం అయిన నవంబర్ పదిహేడున పిఠాపురంలో ఇస్తానని తెలియజేసేరు. నాకు పట్టలేనంత సంతోషంతో నోట మాట రాలేదు. ఆయనే తిరిగి కవిత్వం విభాగంలో మహెజబీన్ కి ఇస్తున్నట్లు తెలియజేసి కలిసి రమ్మని సలహా కూడా ఇచ్చారు. చాలా ఏళ్ళ క్రితం వీర్రాజుగారికి కూడా దీర్ఘ కవిత్వ విభాగంలోనే ఇదే పురస్కారం వచ్చిన ప్పుడు పిఠాపురం వెళ్ళాను. మళ్ళా నేను అందుకోవటం చేత పురస్కారం ఇప్పటికీ నాకు అపురూపమైనది.
 
          మహెజబీన్ తో సంప్రదిస్తే తాను ట్రైన్ టికెట్లను బుక్ చేస్తానని తర్వాత డబ్బు తనకు ఇమ్మనటంతో సరేనన్నాను. అనుకున్నట్లుగా ఆమెతో కలిసి బయలుదేరాను. సామర్లకోట జంక్షన్ లో దిగేసరికి అక్కడకు ట్రస్ట్ సభ్యులు మన్మధ రావుగారూ, మరొక ఆయనా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ముందుగా హొటల్ లో టిఫిన్ ఇప్పించి కారులో పిఠాపురంలో మాకు కేటాయించిన రూమ్ కు తీసుకు వెళ్ళారు. మేము స్నానపానా దులు పూర్తి చేసుకొని పురస్కార సమావేశం జరిగే గ్రంథాలయానికి తీసుకువెళ్ళాము. మాతోపాటు కథలకు వి.ప్రతిమ, విమర్శకు విజయలక్ష్మీ బక్ష్ అందుకున్నారు.
 
          తర్వాత మరికొన్ని రోజులకే కడప కవితా సాంస్కృతిక సంస్థ వారిచ్చే గురజాడ పురస్కారం నా రెక్కల చూపు కథలసంపుటికి రావటం మరింత సంతోషకరం. ఈ పురస్కారసమావేశానికి యువభారతి మిత్రురాలు కె.బి.లక్ష్మితో కలిసి ప్రయాణించాను. కొత్త ఇంట్లో దిగగానే రెండు పురస్కారాలు అందుకోవటం చాలా సంతోషం కలిగింది.
 
          బిల్డింగ్ లో ఇంకా అన్ని ఇళ్ళల్లోకీ కుటుంబాలు లేదు. ఎక్కువగా కబుర్లు చెప్పే అలవాటు లేనందున నాకు పెద్దగా స్నేహాలు పెరగలేదు. పల్లవికి ఆఫీసుకు వెళ్ళి రావటం వలన , సమయం కుదరకపోవటం చేత బిల్డింగ్ లో ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఏ కార్యక్రమాలు జరిగినా నేనే వెళ్ళక తప్పేది కాదు. నేను పూజలూ, వ్రతాలూ చేయక పోయినా పిలిచినప్పుడు వెళ్ళకపోవటం, వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళ మనోభావాలను గాయపరచటం ఇష్టం లేదు. ఇది ఒక కమ్యూనిటీ బిల్డింగ్. అందుచేత ఎవరైనా పిలుస్తుంటే కాస్త ఆలస్యంగా వెళ్ళి వాళ్ళు ఇచ్చినదేదో పుచ్చుకొని వస్తే పోయేదే ముంది. ఇక్కడే కలకాలం వుండే పల్లవీ, ఆషీలను అందరికీ దూరంచేసి ఉలిపి కట్టెలుగా చేసే అధికారం నాకు లేదుకదా.
 
          ఇదిలావుండగా తెలంగాణా ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. 2011 సెప్టెంబరు 13 నుండి ప్రారంభమై 42 రోజులపాటు జరిగిన సమ్మెలో తెలంగాణాలోని ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మీకులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. ప తెలంగాణ ప్రాంతంలో ప్రజాజీవనం స్థంభించకపోయింది.               
          అయితే ముందుగా రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె విరమించగా ఇతర సంఘాలు కూడా సమ్మె విరమించాయి. ఉద్యమనాయకులు మాత్రం ఈ సమ్మె ఫలితంగా కేంద్రం ఆలోచన మార్చగలిగిందనీ, కానీ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.
 
          న్యాయమూర్తి శ్రీకృష్ణ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల సమితి ఆంధ్రప్రదేశ్ విభజన వలన కలిగే లాభనష్టాలు గురించి అధ్యయనం చేసి ఇరుప్రాంతాల నాయకులూ, మేధావులతో చర్చించి నివేదిక 2011 జనవరి 6న విడుదల చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచి తెలంగాణా అభివృద్ధికి తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలనేది ఒకటి అయితే తెలంగాణ, సీమాంధ్రలను వేరుచేయడం రెండవ పరిష్కారంగా సిఫారస్ చేసింది. కానీ ఇవి వ్యతిరేకించబడ్డాయి. ఉద్యమం కొనసాగుతూనే వుంది.
 
          దసరాల్లో చిన్నక్క కుటుంబం వచ్చారు. ఇక్కడ నుండి షిర్డీ వెళ్ళి తిరిగి హైదరాబాద్ వచ్చి విజయనగరం వెళ్ళటానికి ప్రోగ్రాం వేసారు. వాళ్ళతో బాటూ నన్నూ, ఆషీనీ కూడా ప్రయాణం కట్టించారు. అప్పుడే కళ్యాణ్ సహాయంతో పల్లవి కారు కొనింది.
 
          ఒకరోజు నాకు వచ్చిన ఉత్తరం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. కేంద్రసాహిత్య అకాడమీ నుండి భారతీయసాహిత్య నిర్మాతలు పేరిట డా.పి శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ గురించి రాయమని ఆ వుత్తరం వచ్చింది. అప్పుడు కన్వీనర్ గా అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ)గారు ఉన్నారు.
 
          వీర్రాజుగారికి ఆ వుత్తరం చూపిస్తే ” పరిశోధకులు రాయగలరు కానీ నువ్వు రాయలేవు ” అని నిరుత్సాహ పరిచారు. కేంద్రసాహిత్య అకాడమీ ప్రాజెక్టు కదా ఏం చేయాలో అర్థం కాలేదు. ఏవో కొన్ని వ్యాసాలు రాసాను కానీ పూర్తిగా ఒక రచయిత్రి సాహిత్యాన్ని పుస్తకానికి సరిపడేంత రాయగలనా అని నేను కూడా దానికి ఏమీ సమాధానం చెప్పకుండా వెనుకంజ వేసాను. రెండునెలల తర్వాత మళ్ళా మరో ఉత్తరం వచ్చింది.
 
          అంతలో వాసా ప్రభావతి గారూ, డా.ఆలూరు విజయలక్ష్మి గారు కలిసి కాకినాడలో కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహణలో రచయిత్రుల ఒకరోజు సదస్సు ఏర్పాటు చేసారు. కవిత్వసదస్సుకు నేను అధ్యక్షురాలిగా నిర్ణయించారు. హైదరాబాద్ నుండి వాసా ప్రభావతి, ఇంద్రగంటి జానకీ బాల, గంటి భానుమతి, నేను ఇలా కొంతమంది కలిసి ట్రైన్ కి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము.
 
          ఎట్లాగూ కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళదే కావటాన అక్కడ మంజుశ్రీగారిని కలుస్తాను కనుక పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ నేను రాయలేనని ఉత్తరం రాసి ఇచ్చేద్దామని నిర్ణయించుకొని ఉత్తరం తయారుచేసుకొని కవర్లో పెట్టుకొని బయలుదేరాను.
 
          కాకినాడ స్టేషన్లో దిగి మాకోసం బుక్ చేసిన హొటల్ లో రిఫ్రెష్ అయిన తర్వాత హొటల్ కిందనే వున్న రెస్టారెంట్ లో బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్ళాం. అక్కడ కుప్పిలి పద్మ, పి.సత్యవతి, కాత్యాయిని విద్మహే తదితరులు కలిసారు. ఏదో సందర్భంలో కాత్యాయనీతో శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయమని వుత్తరం వచ్చిన విషయం చెప్పి , నేను రాయలేనని వుత్తరం రాస్తున్నానని చెప్పాను.
 
          కాత్యాయని “మీరు రాయలేకపోవటమేంటండి. తప్పక రాయగలరు. నేను శ్రీదేవి గురించి పి.హెచ్డీ చేయించాలనుకుంటే ఎవరూ ముందుకు రావటం లేదు. నా దగ్గర శ్రీదేవి రాసిన ‘ ఉరుములు- మెరుపులు’ కథలపుస్తకం వుంది. దానినీ, నా దగ్గర వున్న కొంత మెటీరియల్ ఇస్తాను” అని కాత్యాయని ప్రోత్సహించటంతో కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్ మంజుశ్రీ గారికి నేను తీసుకు వెళ్ళిన ఉత్తరం అందజేయకుండా వూరుకున్నాను.
 
          ఆ రోజు మధ్యాహ్నం కవిత్వం సదస్సులో నేను ఆనాటి నుండి ఇప్పటివరకూ కవిత్వంలో మార్పు చేర్పులు గురించి చేసిన అధ్యక్షోపన్యాసాన్ని తదనంతరం “సాహిత్య ప్రాంగణంలో కవయిత్రులు” అనే వ్యాసంగా ప్రచురించాను. ఆ సదస్సులో మందరపు హైమవతి, శరత్ జ్యోత్స్నారాణి పాత్ర సమర్పణ చేసారు. శరత్ జ్యోత్స్నారాణి ఎప్పుడో ఇరవై ఏళ్ళక్రితం రాసిన వ్యాసాన్నే అప్డేట్ చేసుకోకుండానే ప్రసంగించింది. ఎందుకంటే ఆమె ప్రసంగంలో నా మొదటి పుస్తకంలో కవితనే ఉటంకించింది. దాని తర్వాత ఏడు సంపుటాలు వచ్చిన విషయం ఆమెకు తెలియదు. హైమవతి కూడా కేవలం నీలిమేఘాలులోని కవితలలోని స్త్రీవాదం గురించి ప్రసంగిం చింది.
 
          మొత్తంమీద ఒక్కరోజు సదస్సులు విజయవంతంగా జరిగాయి.
 
          ఆ రాత్రి అందరం హొటల్ లో చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం. మర్నాడు కారు ఏర్పాటు చేసి సామర్లకోటలో వున్న ఒక ప్రాచీనదేవాలయం,మొదలగు ప్రాంతాలు చూపించారు. అనంతరం ఆలూరు విజయలక్ష్మి గారి ఇంట్లో కాసేపు అందరం సరదాగా గడిపాము. తర్వాత రోజు ఇంద్రగంటి జానకీ బాలకు, ప్రభావతి గారికీ మరో సభలో పాల్గొనాల్సి వుందని కాకినాడలో ఆగిపోయారు. మిగిలిన వాళ్ళం తిరిగి హైదరాబాద్ ట్రైన్ ఎక్కాము.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.