నా జీవన యానంలో- రెండవభాగం- 56

-కె.వరలక్ష్మి

          2013 జనవరి 20న మా గీత మూడవ కవితా సంపుటి శతాబ్ది వెన్నెల సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఎన్. గోపి, శివారెడ్డి, కొండేపూడి నిర్మల, శిఖామణి గీత పొయెట్రీ గురించి చాలా బాగా మాట్లాడేరు. చివర్లో గీత ప్రతిస్పందన అందర్నీ ఇంప్రెస్ చేసింది. గీత వాళ్లూ 31న తిరిగి వెళ్లేరు. బయలుదేరే ముందు గీతకు వీడ్కోలు చెప్తూ హగ్ చేసుకుంటే ఇద్దరికీ కన్నీళ్లు ఆగలేదు. మనుషులకివన్నీ ఉత్త ఎమోషన్సే నా? అవి లేకపోతే మట్టిబొమ్మలకీ, మనకీ తేడా ఉంటుందా?

          ఆ సంవత్సరం ఫిబ్రవరి 4న మా అత్తగారు కనకమ్మగారు సింహాచలంలో మా ఆడపడుచు ఇంట్లో కాలం చేసారు. హైదరాబాద్ నుండి నేను, మా రవి, కోడలు వైజాగ్ చేరే సరికి తెల్లవారి 5వ తేదీ వచ్చేసింది. ఆవిడ క్రిస్టియానిటీలో ఉండడం వల్ల ఆ పద్ధతుల ప్రకారమే కర్మకాండ చేసారు. వైజాగ్ రామ్ నగర్ సిమెట్రీకి ఆడవాళ్లం కూడా వెళ్లేం. ఆ చిన్న సిమెంటు ఎడ్జ్ లోపల నిన్నటి వరకూ యాక్టివ్ గా తిరిగిన ఆవిడ దేహం ఉందని తల్చుకుంటే దుఃఖం ఆగలేదు.

          నేనింకా అక్కడుండగానే 7వ తేదీన పేపరు చదువుతూ సడెన్ గా షాకయ్యాను. గుంటూరు లాయర్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ బి. చంద్రశేఖర్ జనవరి 22న కేన్సర్ తో కాలం చేసాడనీ, ఆ రోజు ఒంగోలులో స్మారక సభ అనీ. తట్టుకోలేకపోయాను. భోరున ఏడుపొచ్చేసింది. మానవ హక్కుల మీద తను వ్రాసిన వ్యాసాలు, పుస్తకాలు పంపుతూ నా అభిప్రాయం అడిగేవాడు. నా కథల్ని ఎంతగానో అభిమానించేవాడు. చక్కగా విశ్లేషించేవాడు. నాకన్నా చిన్నవాడు, కాని, ‘ఏరా వరాలూ’ అని పలకరించేవాడు ఫోన్లో, గంభీరమైన, మధురమైన ఆ పిలుపు ఇక విన్పించదని తల్చుకుంటే దుఃఖం ఇంకా ఎక్కువైంది. అతన్ని సభల్లో చూసింది ఒకట్రెండుసార్లే. తరచుగా ఫోన్లో పలకరించి నవ్వించేవాడు, జనవరిలో తను ఫోన్ చేస్తే నేనే ఏదో సభలో ఉండి కట్ చేసాను. ఆ తర్వాత నేనైనా ఫోన్ చెయ్యలేదు. నాలుగు నెలలుగా బాధపడుతున్నాడట. ఏం చెప్పాలని ఫోన్ చేసాడో! ఒక పశ్చాత్తాపం ఏదో నన్ను దహించసాగింది, ఆ రాత్రంతా నిద్రపట్టని ఒకటే ఆలాపన. పాతపేపర్లు తీసి, తన గురించి కె. శ్రీనివాస్ రాసిన ‘అందమైన అసమాపక వాక్యం’ వ్యాసం చదివేను, చుట్టాల మధ్యలో ఏకాంతాన్ని వెతుక్కుని నీరవ నిశ్శబ్దాన్నయ్యాను. అసలేమిటీ జీవితాలు? రైలు ప్రయాణాల్లాగా ముగియాల్సిందేనా?

          మా పుట్టింట్లో అద్దెకుండి, మా అమ్మానాన్నలకి సొంతకోడలులాగా నడుచు కున్న, నన్నెంతో అభిమానించిన వేణమ్మ వదిన గారికి కేన్సర్ అని తెలిసి చూడ్డానికి వెళ్లి 37 రేడియేషన్ల తర్వాత కీమోలు స్టార్ట్ చెయ్యగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆమెను చూసీ, ఆ బాధలన్నీ వినీ భరించలేకపోయాను.

          2013 ఫిబ్రవరి 22న హైద్రాబాద్ దిల్ షుక్ నగర్ బస్టాండులో ఎవరో 2 బాంబులు పేల్చారు. 22 మంది మరణించగా వంద మందికి పైగా గాయపడ్డారు. కొన్ని మనిషికి ప్రకృతి ప్రసాదించిన కష్టాలు. కొన్ని మనిషికి మనిషే చేసే గాయాలు. ఇలాంటివి చూసేనా సిద్ధార్థుడు బుద్ధుడిగా మారింది!?

          హఠాత్తుగా ప్రఖ్యాత రచయితలు కొందరి నుంచి ఫోన్లు రావడం మొదలైంది. నా కథల్ని అభిమానిస్తున్నామంటూ మంచిగా మాట్లాడ్డం మొదలు పెట్టి ఆ సంభాషణని ఎక్కడెక్కడికో తీసుకెళ్లడం. ఒకడు నా పుస్తకం మీది ఫోటోకి వంద ముద్దులు పెట్టేడట. రాత్రికి ఎన్ని ముద్దులు పెడతాడో తెలీదట, అనుగ్రహిస్తే నా ఊరికొచ్చి నాలుగు రోజులు పాదసేవ చేసుకుంటాడట. అతడికి అందరు ఆడవాళ్లతో ‘పాదాలమీద పడతాను’ అవడం అలవాటు. ఇంకోడు నర్మగర్భంగా ‘బ్లూ’ చూడొచ్చా అని ఫోన్. మరో చెత్తగాడు ఏం వాగుతాడో వాడికే తెలీదు. వాళ్లతో సమంగానో, ఇంకాస్త ఎక్కువగానో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నా, ఆడవాళ్లంటే ఎంత చులకన! ఆ నెంబర్ల నుంచి ఫోన్లు వస్తే పలకడం మానేసాను. ఈ విషయం మా గీతకి చెప్తే ‘‘ఒంటరిగా ఉన్న ఆడ వాళ్లందరూ దీన్ని ఫేస్ చెయ్యాల్సిందే. ఎవాయిడ్ చెయ్యి. ధైర్యంగా ఉండు’’ అంటూ ధైర్యం చెప్పింది. మా గీత నాకు కూతురుగానే కాదు, తల్లిగా, ఫ్రెండుగా కూడా నడుచు కుంటుంది. వాళ్లెవరూ నాకు దగ్గర్లో ఉన్న ఊళ్లవాళ్లు కాక వాళ్ల వేధింపులు ఫోన్లకే పరిమితమయ్యాయి. అంతవరకూ అదృష్టం. మన రూపమే మనకు శత్రువు –

          ఆ ఏప్రిల్ 14 న ప్రఖ్యాత సినీగాయకుడు పి.బి. శ్రీనివాస్ తన 82వ ఏట మద్రాసు లో కాలం చేసారు. అంతకు కొన్నాళ్ల ముందే హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో ఏదో కార్యక్రమంలో అతిసింపుల్ గా  ఉన్న ఆయన్ని చూసాను.

          ఒకరోజు ఎండ్లూరి సుధాకర్ ఫోన్ చేసి నా జీవనయానం చాలా బావుంటోందని ఎప్రీషియేట్ చేసాడు.

          మా ఇంట్లో వంట గేస్ కార్డు మా మోహన్ పేరుతో ఉంది. ఆ సంవత్సరం కాలం చేసిన వ్యక్తుల పేరుతో నడవదనీ, నా పేరుకు మార్పించుకోవాలనీ ఒక మెసేజ్ వచ్చింది. దానికి నోటరీ అవసరం అనీ, అది లాయర్ ద్వారా చేయించుకోవాలనీ చెప్పేరు. నా స్టూడెంట్ దారా శ్రీనివాస్ జగ్గంపేటలో లాయర్ గా పేరుగడించాడు. తనకి ఫోన్ చేస్తే వెంటనే వచ్చి అదంతా చేసిపెట్టేడు. ఎంతైందో ఫీజు ఇచ్చేద్దా మనుకుంటే అస్సలు తీసుకోలేదు, పైగా ‘‘ఈ చదువు మీరు పెట్టిన భిక్షే కదా మేడమ్’’ అన్నాడు. నేను జగ్గంపేటలో ఒక్కదాన్నీ ధైర్యంగా జీవించగలిగేనంటే కారణం అలాంటి నా విద్యార్థులే. ఆ సంవత్సరం నా మనవరాళ్లు వైష్ణవి, ప్రవల్లిక ఇంటర్మీడి యేట్ లో 96% తో గ్రేడ్ వన్ వచ్చిందని ఫోన్ చేసి చెప్పేరు. అదో ఆనందం. అంతకు ముందు జనవరిలో వెల్లినప్పుడు మా అబ్బాయి అత్తగారు ఒక పంచాయతీ లాగా పెట్టి ‘‘మీ ఆయనెలాగాలేరు. ఆడ పిల్లలు వాటాలు అడగకముందే మీ ఆస్తులేమున్నాయో మా అల్లుడి పేరున రాయండి, వాళ్ల పెళ్లికి మీకేం ఖర్చులు కాలేదు కదా!’’ అంది. ఆవిడా వాళ్లాయనా వచ్చి కూతురింట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో ఉండడానికి నేను పనికిరాను. కాని ఉన్నదేదో రాసెయ్యాలి. ఆనందాన్నిచ్చే పూలతో బాటు గిచ్చి బాధించే ఇలాంటి ముళ్లూ ఉంటాయి జీవితంలో.

          1994-95 టెన్త్ క్లాస్ బేచ్ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నవాళ్లూ తిరిగి జగ్గంపేటలో కలుసుకుని నాతో సహా వాళ్లకి చిన్నప్పటి నుంచీ చదువు చెప్పిన టీచ్లందరినీ సన్మానించేరు ఏప్రెల్ నెలలో. అప్పటి చిన్నపిల్లలందర్నీ పెద్దవాళ్లుగా చూడడం బలే అన్పించింది.

          2013 మే 24న రచయిత త్రిపురగారు వైజాగ్ లో కాలంచేసారు. పెరట్లో పెంచు కున్న చెట్లతో కూడా గొప్ప అనుబంధం నాకు. మామిడి చెట్లకు పూత రాలిపోయినా, కరివేపకు చీడపట్టినా, ఉసిరికొమ్మలు విరిగిపోయినా, అన్నీ వేదనలే. ఒక రోజు ఎలక్ట్రిసిటీ వాళ్లొచ్చి గోడబైటికి ఉన్నాయని కొబ్బరి చెట్లు లేత గెలల్తో అందాలొలుకు తుంటే వాటినీ, చాలా ఆకుల్నీ నిర్దయగా నరికి పడేసారు. చెప్పలేనంత బాధకలిగింది. అవునుమరి. అవి మనుషుల్లాగా మాటల్తో, చేతల్తో బాధించవు. మనకి నీడనిస్తూ ఫలాల నిచ్చే పరోపకారులు. ఆ జూలైలో నా కథ ‘క్షతగాత్ర’‘ఘా‘ పేరుతో గుజరాతీ పత్రిక మమతలో వచ్చింది. అనువాదకుల పేరులేదు. పత్రిక ఎడిటర్ ఠక్కర్ ఫోన్ చేసి మాట్లాడి, పత్రికతో బాటు 251/- రూ. చెక్కుపంపేరు. సర్ ప్రైజ్ ఏమీ కాదుకాని, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణాగా విడగొట్టబడిందని జూలై 30న మొదటి వార్త వచ్చింది. ఆగష్టు 21 న ప్రమదావనంతో స్త్రీల మనసుల్ని దోచుకున్నమాలతీ చందూర్ గారు మద్రాస్ లో కాలం చేసారు.

          ఆగష్టులో నెల అంతా సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతూనే ఉన్నా ఢిల్లీలో అధిష్టానం మాత్రం రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికి ఒప్పుకోలేదు. దాని ఫలితం ఏమిటో తర్వాత ఎన్నికల్లో తెలిసింది. సెప్టెంబర్ లో విశాఖపట్నం ఆలిండియా రేడియో నుంచి రమణమూర్తిగారు వచ్చే రిపబ్లిక్ డే కి కవితలు చదవాల్సిన వాళ్లలో దేవీప్రియ, భాగ్యలక్ష్మి గార్లతో బాటు నా పేరు కూడా ఉందని,  10 రోజుల్లో 5 కవితలు రాసి పంపమని అడిగేరు. అలాగే పంపేను. నేను డిటిపి చేయించి రెడీగా ఉంచిన నా కథల పుస్తకం ‘క్షతగాత్ర’ పబ్లిషింగ్ కి విశాలాంధ్ర వాళ్లు తీసుకున్నారని వల్లూరు శివప్రసాద్ గారు ఫోన్ చేసి చెప్పేరు. అది నా నాలుగవ కథల పుస్తకం. నవంబర్ 8న శాంత సుందరి గారు ఫోన్ చేసి ఆవిడ హిందీలోకి అనువదించిన నా పోయెమ్ ‘నేను’సాహిత్య అకాడమీ తరఫున మలయాళంలోకి అనువదించబడి అకాడమీ వేస్తున్న పుస్తకంలో వస్తుంది. అని చెప్పేరు.

          ఆ నవంబర్ 27న కొద్దికాలంలోనే స్నేహితురాలిగా అభిమానాన్ని, ఆప్యాయతను కురిపించిన పుష్పాంజలి కాలం చేసింది. 2012 మొదట్లో తనకి డెంగ్యూ జ్వరం వచ్చి చాలా నీరసంగా ఉంటోంది అని చెప్పింది. వాళ్ల అబ్బాయి దగ్గర బెంగుళూరులో ఉండి ఖరీదైన వైద్యం చేయించుకుంటూనే ఉంది. హాస్పిటల్లో డాక్టర్స్ మాట్లాడవద్దు అన్నప్పుడు కూడా ఎవరూ చూడకుండా నాకు ఫోన్ చేస్తూనే ఉండేది. నీతో మాట్లాడు తుంటే నాకేదో సాంత్వన దొరకుతుంది అనేది. తను లెక్చరర్ గా రిటైరై ఎంతో కాలం కానేలేదు. ఓ మంచి స్నేహపుష్పం అలా నేలరాలిపోయింది. రైలు ప్రయాణం లాంటి ఈజీవితంలో ఎన్నెన్ని కలయికలు – ఎన్నెన్ని వీడ్కోలులు! 2013 డిశంబర్ 21 న సి. నారాయణరెడ్డి గారమ్మాయి గంగగారు ఫోన్ చేసి ఆ సంవత్సరం సుశీలా నారాయణ రెడ్డి అవార్డు జనవరిలో జరగబోయే సభలో నాకు ఇవ్వాలనుకుంటున్నామని చెప్పేరు. తెలుగు యూనివర్సిటీ నుంచి జె. చెన్నయ్యగారు ఫోన్ చేసి ఆ సెలక్షన్ కమిటీ డైరెక్టర్ తనేనని ఆ కబురు మళ్లీ చెప్పి, అభినందనలు తెలియజేసేరు. ఒకప్పటి గృహలక్ష్మి స్వర్ణకంకణం లాగ ఇప్పుడు సుశీలా నారాయణరెడ్డి అవార్డు ప్రతిష్టాత్మకమైనది. రచయిత్రులంతా కోరుకునేది, నాకు గొప్ప ఆనందంగా అన్పించింది. ఆ సంవత్సరం మార్చి ‘రచన’లో ‘ప్రహేళిక’ కథ మే ‘రచన’ లో ‘ప్రవాహం’ కథ వచ్చాయి. 2014 జనవరి 17 న రవీంద్ర భారతి మెయిన్ స్టేజి మీద సుశీలా నారాయణ రెడ్డి అవార్డు ఫంక్షన్. అప్పటికి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయాన్తో బాటు వరప్రసాద రెడ్డి గారు లాంటి మహా మహులంతా ఉన్నారు స్టేజీమీద. మేం కారు దిగగానే గంగగారు వచ్చి సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్లేరు. నా గురించి కొండేపూడి నిర్మల మాట్లాడింది. నారాయణ రెడ్డిగారికి అప్పటికే హెల్త్ బాగాలేదు. అందుకని నేను నా సంభాషణను క్లుప్తంగా ఇలా ముగించేను.

          ‘‘వేదికమీది ప్రముఖులకూ, సభలోని పెద్దలకూ నమస్సులు. పిన్నలకు ఆశీస్సులు. అన్ని ఇజాలకన్నా మానవత్వమే గొప్ప ఇజమని నేను నమ్ముతాను. మహా సముద్రమంతటి సాహితీ ప్రపంచంలో నేను, నా రచనలు నీటిబొట్టులాంటివాళ్లం. అలాంటి నాకు ఇంత గొప్ప పురస్కారాన్ని ఇచ్చినందుకు సినారె గారికి, ట్రస్ట్ వారికి, జడ్జెస్ కి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను’’ షీల్డు, సన్మాన పత్రం, శాలువా, 50 వేల చెక్కు, పెద్దపూలమాల, పెద్ద పూల బొకేల్తో సన్మానించేరు. నా చిన్ననాటి క్లాస్ మేట్ పోలీస్ ఆఫీసర్ బి.వి.బి. స్టేజిపైకి వచ్చి షాల్ కప్పి, పెద్ద గులాబీలబొకే ఇచ్చి అభినందనలు తెలియజేసేడు.

          మర్నాడు కొండాపూర్ చండ్ర రాజేశ్వర్రావు హోమ్ లో ఉంటున్న అబ్బూరి ఛాయాదేవిగారితో కొంతసేపు గడిపి వచ్చాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.