నైరాశ్యపు శిశిరం – ఆశాన్విత వసంతం

उम्मीदों का उदास पतझड़ साल का आखिरी महीना है

హిందీ మూలం – శ్రీమతి అంజూ శర్మ

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          ఆటోలో నుంచి దిగి అతను కుడివైపుకి చూశాడు. ఆమె ముందునుంచే బస్ స్టాప్ దగ్గర కూర్చుని అతని కోసం ఎదురుచూస్తోంది. అతని చూపులో మనస్తాపం స్పష్టంగా తెలుస్తోంది. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నెమ్మదిగా అడుగులు వేస్తూ అతను గార్డెన్ గేటు వైపు ముందుకి నడిచాడు. అతని మౌన ఆహ్వానాన్ని గ్రహించి ఆమె అలసట చెందిన అడుగులతో అతన్ని అనుసరించింది. వారిద్దరూ వ్యాకులత అనే ఒక అదృశ్యసూత్రంతో బంధితులై కలిసి నడుస్తున్నారు.

          ఆ రోజు కూడా మిగిలిన రోజుల్లాగే ఎరుపు-పచ్చదనం కలిసిన నారింజరంగుతో కూడిన అందాన్ని సంతరించుకుని తెల్లని పూలతో అలరారుతున్న పారిజాతాలు ఒక కొద్దిపాటి చిరుగాలికి కూడా కదులుతూ సంతోష తరంగాలతో ఊగుతున్నాయి. వాటికింద పరిచిన తెల్లని తివాసీ ప్రేమికుల హృదయంలో వెలుగుతున్న కొద్దిపాటి జ్వలనాన్ని శాంతింపజేయటానికి బదులు ఇంకా ప్రజ్వరిల్లజేస్తోంది. ఒకవైపు సూర్యుడి తాపం కాస్త మందగించింది. గాలి తన ఇష్టం వచ్చినట్లు వీస్తోంది. ఆరోజు వీకెండ్ కావడంవల్ల గార్డెన్ లో జనం బాగా ఉన్నారు. నగరంలోని జనసమ్మర్దంతోనూ, కోలాహలంతోనూ విసుగెత్తి ఏకాంతాన్ని అణ్వేషించుకుంటున్న జంటలు ఆరోజు కూడా తమకి తగ్గ చోటు వెతుక్కున్నారు. ఆ రోజు అతని నడకలో ఎప్పుడూ ఉండే వేగం లేదు. కలుసుకునేందుకు వచ్చే ప్రతిసారి ఉండే ఎప్పటి ఉత్సాహం లేదు.

          అలిసిపోయి, భారంగాఉన్నా ఇంచుమించు ఆ దారికి అలవాటు పడిన అడుగు లతో వాళ్ళు మొత్తం గార్డెన్ ని దాటుకుంటూ చివరివరకూ చేరుకున్నారు. అక్కడ రెండు రోడ్డులకి మధ్య రెండు అంతస్తులతో నిర్మించిన రెండు అష్టభుజాకారంలో ఉన్న, గుమ్మటంలాంటి శిఖరాలతో కూడిన పురాతన భవనం ఉంది. ఆ మొత్తం భవనం ఎంత ప్రాచీనమైనదో శతాబ్దాల తరబడి వస్తున్న దాని పగుళ్ళ ప్రభావంతో స్పష్టంగా కనబడుతోంది. దాని ప్రతి పగుల్లో, ప్రతి బీటలో గడిచిపోయిన కాలం నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టిన ప్రతిచ్ఛాయ గోచరిస్తోంది. దానికి సమీపంలోనే పన్నెండు ప్రవేశద్వారాలున్న ఒక కట్టడం శిథిలమైన స్థితిలో తన స్తంభాలతోనూ, వైభవంగా నిర్మించిన ధనురాకారంలోని కమానులతో తల ఎత్తుకొని తన స్థాపత్యకళకి చెందిన అద్భుతమైన ఉదాహరణ ప్రదర్శిస్తోంది. కాని ఈనాడు తన భగ్నావస్థలో గతానికి చెందిన గాథలను చెబుతున్నట్లుగా అనిపిస్తోంది.

          ఈ గడిచిన సంవత్సరాల్లో ఎన్నిసార్లు వాళ్ళిద్దరూ కలిసి ఆ కథలు నిశ్శబ్దంగా విన్నారో, ఆ మూగ రాళ్ళు చెప్పే వ్యథలని అనుభూతి చెందారో, వాటిలో ఉన్న బాధని పంచుకున్నారో తెలియదు. ఆ చోటుతో వాళ్ళ ఇద్దరికీ సంబంధం ఉంది. వాళ్ళు కూడా ఒకరి బాహువుల్లో మరొకరు లేదా ఒకరి భుజంమీద మరొకరు తల ఆనించుకొని తమ సుఖమయంగా ఉండే భవిష్యత్తుని ఊహించుకుంటూ ఎన్ని కలలు కన్నారో తెలియదు. వాళ్ళు చెప్పే ప్రతిమాటకి ఈ శిథిలాలు, ఈ గోడలు ఊఁ కొట్టి ఉంటాయి. వాళ్ళ ప్రేమాలాపాలకి వెచ్చని నిశ్వాస వదిలి ఉంటాయి. వాళ్ళ వేళాకోళాలకి అవి ఎప్పుడైనా ఉలికిపడి ఉండవచ్చు. ఎప్పుడైనా వాళ్ళు కలహించుకుని ఆ తరువాత బతిమాలుకున్నప్పుడు ముగ్ధులైపోయి వాళ్ళకి ఏదయినా దిష్టి తీసిపోసి ఉండవచ్చు కూడా. వాళ్ళు అక్కడి వాతావరణంలో ఒక భాగమైపోయారు. అక్కడ ఎదురుగా గోడ మీద వ్యాపించిన బోగన్వేలియా పొదల సమీపంలో గంతులు వేస్తున్నకొంటె కోణంగి ఉడుతల్లాగా, మధుమాలతీ లతలపైన సంచరిస్తున్న రంగురంగుల సీతాకోకచిలుక ల్లాగా, లేదా దగ్గరలోనే ఉన్న జామచెట్టు చిటారుకొమ్మపైన తమ మధురమైన పలుకు లతో నిప్పుల్లా ఎర్రగావున్న ముక్కులతో కోలాహలం చేస్తున్న చిలుకల్లాగా, నిర్భయంగా తమ కూతలతో కలరవం చేస్తున్న నైటింగేల్ లేదా బుల్ బుల్ అనబడే పికిలిపిట్టల్లాగా, దూరంగా ఎక్కడో నేపథ్యంలో దాగివున్నా“కే…కే…” అనే తమ అభిక్రందాలతో మేముకూడా ఉన్నామని తెలుపుకుంటున్న నెమళ్ళలాగా… వాళ్ళు కూడా అక్కడి పర్యావరణంలో ఒక అవిభాజ్యమైన అంశమైపోయి ఉన్నారు.

          అంతా ఎప్పటిలాగే ఉంది. ఎదురుగా శ్రమజీవి అయిన ఒక సాలెపురుగు ఆరోజు కూడా మెట్లదగ్గర మూలగా గోడమీద నుండి వేలాడుతూ తన గూడు అల్లుకోవడంలో నిమగ్నమైవుంది. తలబిరుసుతనం వున్న ఒక గర్విష్టిగోరింక కాకుల గుంపుతో తిండి కోసం జగడం చేస్తోంది. ఎప్పటిలాగానే ఒక పారదర్శకంగా ఉన్న దుశ్శాలువలాంటి ఎండ డోములు అనబడే బురుజుల నుంచి కిందకి దిగుతూ చెట్లు, విరిగిన పిట్టగోడ, పొదలమీదుగా కింద నేల వరకు వ్యాపించింది. కాశ్మీరు కళాకారుడు తన ధ్యానం అంతా కేంద్రీకరించి సూదితో ఎంబ్రాయిడరీ పని చేస్తున్నట్లుగా బంగారువన్నె ఎండ కొంగులో కొన్ని పిచ్చుకలు అక్కడక్కడా గంతులు వేస్తున్నాయి. నిజంగా అంతా ఎప్పుడూ జరుగుతున్నట్లే ఉంది. వాళ్ళకి అది అలవాటైన చోటే. అది కూడా వాళ్ళతో అంతే సుపరిచితమైనది. అంతేకాక ఇది మా స్వంతం అని అనుకునేంతగా అలవాట యినది. 

          శాంతంగా, నిశ్శబ్దంగా సంచరిస్తున్న వాళ్ళ మనస్సులో ఇంతకుముందు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కలుసుకుని తిరిగిన జ్ఞాపకాలు వాళ్ళని ఉద్వేలితులను చేస్తున్నాయి.  అలిసిన కాళ్ళతో అతడు మౌనంగా ఎడమవైపున ఉన్న రెండస్తుల మండపం వైపుకి నడిచాడు. ఆమె కూడా మౌనంగానే అతని వెనుకగా నడుస్తూ అటు వైపుకే ముందుకి సాగుతోంది. ఆ వితానానికి మొదటి అంతస్తు వైపు వెడుతున్న మెట్లు ఎక్కుతూ అతను అలవాటు ప్రకారం తన చెయ్యి ముందుకి సాచాడు. అలవాటు ప్రకారం ఆమెకూడా దాన్ని పట్టుకుంది. అలవాటు ప్రకారమే కాని, ఎప్పటిలాగా తన కొంటెతనం చూపిస్తున్నట్లుగా అతని భుజంమీదకి వాలలేదు. అతడు ఈ తేడాని ఒక బాధలాగా అనుభూతి చెందాడు. ఒకసారి నిశ్వసించి మెట్లు ఎక్కసాగాడు. రాతితో చేసిన ఆ ప్రాచీనమైన ఎత్తుపల్లాలుగా ఉన్న మెట్లు ఎక్కే క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తతో పైకి చేరుకున్నాక ఆమె నెమ్మదిగా చెయ్యి విడిపించుకుని తన దుపట్టా సవరించుకోసాగింది.

          పసుపుపచ్చని అంచు ఉన్న ప్యూర్ షిఫాన్ గులాబీ దుపట్టాలో ఆమె చామన చాయ కొట్టవచ్చినట్టు బయటపడుతూ ఉంటే అతడు తన చూపులు మరల్చుకోలేక పోయేవాడు. అప్రయత్నంగా జరిగిందో లేక కావాలనో తెలియదుకాని ఆమె ఎప్పుడూ అతనికి నచ్చే సూట్ నే ధరించి వచ్చింది. చిన్న-చిన్న పసుపుపచ్చని గులాబీ పూలతో నిండిన ఈ సూట్ అతనికి ఎంతో ఇష్టమైనదని ఆమెకి తెలుసు. దాని క్షణదర్శనం కూడా అతడిని పిచ్చివాడిగా చేసేది. నెమ్మదిగా ఒక కన్నుగీటుతూ  అదే నిష్కపటమైన  రొమాంటిక్ స్టైలులో అతను అనేవాడు –మళ్ళీ ఇవాళ ఇదే వేసుకు వచ్చావా నువ్వు? ఇంతకీ ఏమిటినీ ఆలోచన?”

          అతను అడిగినదానికి ఆమె కిలకిలా నవ్వేది.  ఆమెకి అర్ధం అయ్యేది తన సౌందర్యం అంతా ఒక్కచోటికి ఆ కళ్ళలో వచ్చి నిలిచిందని. అందుకే అతని చూపు ఆమె ముఖంమీద నుండి అసలు తప్పుకోవడంలేదని. కాని ఆ రోజు ఆ వేళాకోళం ఎక్కడుంది, పగలబడి నవ్వడం ఎక్కడుంది, ఆరోజు అక్కడ కేవలం మౌనం రాజ్యం చేస్తోంది. ఎటువంటి భావప్రకటన లేదు, ప్రశంసకాని, తెచ్చుకున్న కోపం కాని ఏదీ లేదు, అనునయించడం అంతకన్నా లేదు. ఆ సమయంలో అక్కడ ఉన్నది కేవలం అలుముకున్నబాధకి చెందిన ఒక అదృశ్య ఆచ్ఛాదనం, మంచులాగా చల్లగా ఉన్న నిశ్శబ్దం మాత్రమే.

          ఆ రెండు స్తంభాలకి మధ్య పిట్టగోడలాగా ఉన్న ఖాళీ స్థలంలో ఇద్దరూ కూర్చు న్నారు. ఒకరి చూపుల నుంచి మరొకరు తప్పించుకుంటూ, సాధ్యమయినంత దూరంలో… ఒక తెలియని, అంతకు ముందెన్నడూ లేని దూరంలో. వాళ్ళ కాళ్ళు ఆ గుండ్రని బురుజుకి ఎదురుగా ఉన్న, గోడలాగాకట్టని పిట్టగోడ మీద ఉన్నాయి. సహజంగానే ఆమె ధ్యాస తన కాళ్ళదగ్గర పిట్టగోడ మీద ఉన్న చిన్నచిన్న రాళ్ళమీదకి మళ్ళింది. ఏమీ తోచని స్థితిలో తను మౌనంగా తన కుడిచేతితో వాటిని దగ్గరికి జరపసాగింది. ఈలోగా అతను తన అశాంతి నుంచి విముక్తి పొందేందుకు ఒక సిగరెట్ వెలిగించాడు. అత్యధికంగా ఉన్న అన్యమనస్కతతో ఆమెకి పోగుచేసిన రాళ్ళు ఇబ్బందికరంగా అనిపించాయి. ఒక విచిత్రమైన అనుభూతితో ఆమె వాటిని మళ్ళీ నెమ్మదిగా వేరుచేసింది. మరోపక్క అతను కొన్ని దమ్ములు పీల్చుకున్న తరువాత ఏదో పెద్ద తప్పు చేసిన భావంతో సిగరెట్టుని కాలితో తొక్కేశాడు. తను సిగరెట్ కాల్చడం ఆమెకి నచ్చదని, ఇద్దరూ ఒక్కచోట ఉన్నప్పుడు అసలు ఏమాత్రం ఇష్టం ఉండదని అతనికి తెలుసు. ఆరోజు అప్పుడు మాత్రం ఇద్దరూ ఒక్కచోట ఉన్నప్పటికీ వాళ్ళు ఒకచోట లేరు. ఇంతకుముందు అయితే వాళ్ళు దూరంగాఉన్నా ఎప్పుడూ దూరంగా లేరు.

          నలిపేసిన సిగరెట్ ముక్కని తీసి కొన్ని క్షణాలు తదేకంగా చూసిన తరువాత అతను దాన్నితీసి  దూరంగా పారవేశాక అడిగాడు- “అయితే కార్డులు ప్రింట్ చేయించారా?” భారంగా ఉన్న ఆ ప్రశ్న అతని పెదవులనుంచి వస్తున్న పదాలని గట్టి ఇనుపసంకెళ్ళతో బంధించి లాగుతున్నట్లుగా అనిపిస్తోంది.

          “ఇంకా లేదు.”అతను అడిగిన ప్రశ్న ఆశించనిది కాదు. కాని జవాబుగా తను ఆమాత్రమే చెప్పగలిగింది.  ఆశతో కూడిన ఒక ప్రవాహం ఆమె కళ్ళలో సహజంగానే మిలమిలా మెరిసి మౌనంగా జాలువారింది.

          “వచ్చే నెలలో నాకు ఇంక్రిమెంటు దొరుకుతుంది.” ఈమాత్రం సమాధానం చెప్పడానికి ఆమెకి కొంచెం సమయం పట్టింది. కాని ఆమె చెప్పిన ఈ పదాలు ఒక లక్ష్యం లేకుండా చెదిరిపోయాయి. ఇప్పుడు వీటికి ఏమన్నా అర్ధం ఉందో లేదో తెలియదు. బహుశా అవి అంత నిరుద్దేశ్యమైనవి కూడా కావు. ఇంతకీ ఆమె ఏం చెప్పదలుచుకుంది.

          ఈసారి అతను కళ్ళారా ఆమెని చూశాడు. ఆమెని ఇలా బారెడు దూరం నుంచి చూడటం ఎంత కష్టమో కదా. ప్రత్యేకించి ఇక్కడ… ఈ చోట… కొద్ది క్షణాల్లోనే ఆమెని తన బాహువుల్లో బంధించాలని అతనికి అనిపించింది. మనస్సుదేముంది, దానికి అధికారమూ తెలియదు, పరిస్థితిలోని గాంభీర్యమూ తెలియదు. చామనచాయతో ఉన్న ఆమె ముఖంమీద కొన్ని చెమటచుక్కలు మెరుస్తున్నాయి. ఆమె వ్యాకులతని సహించుకోలేని అక్కడవున్న మరికొన్ని తెల్లని బిందువులు ఆమె కణతల నుంచి వెలువడుతూ ఒక ధారగా ఆమె మెడమీదకి ప్రవహిస్తున్నాయి. వీటన్నిటినీ లెక్కచెయ్యకుండా ఆమె స్వేదబిందువుల మందాకిని ప్రవహించినచోట ఆమెని చుంబించాలని అతనికి అనిపించింది. అతను ఆమెవైపుకి జరిగాడుకూడా. కాని అప్పుడే ఆమె అతనివైపుకి తిరిగింది. ఆమె పెద్దపెద్ద కళ్ళలో ఇప్పుడు నిరుత్సాహం బదులు, ఒక వ్యథాసముద్రం మిలమిలా మెరుస్తోంది. అతని పెదవులు ఏదో చెప్పాలని ప్రయత్నించాయి. కాని నీరవస్థితి వారిద్దరినీ చుట్టుముట్టింది. ఆమె కూడా ఈ ఆలింగనం కోసం ఎదురుచూస్తోందా? ఆ నిరీక్షణ ఆమెశరీరం నుంచి వెలువడుతున్న సౌరభంలో మిశ్రితమైపోయిన కారణంగా అతడు ఏమీ నిశ్చయించు కోలేకపోయాడు. అతని అభిలాషల ఉప్పెన నెమ్మదిగా సమతలానికి వచ్చిసర్దుకుంది.

          ఒక్క క్షణం అతనికి తనకి వచ్చిన ఆలోచనకి పరితాపం కలిగింది. పరితాపం అతనికి ఈ గడిచిన సంవత్సరాలలో ఏమీ సాధించలేకపోయాననే విషయంలో కూడా ఉంది. పెళ్ళిపత్రికలు అచ్చయినా కూడా ఏమీకాదని సాధికారంగా ఆమె అధరాలని చుంబిస్తూ ధైర్యం చెప్పగలగడానికి ఒక్క ఉద్యోగం కూడా సంపాదించుకోలేక పోయానన్న దిగులు అతని మనస్సునిండా ఉంది. ఏ ఆహ్వానమూ, ఏ కథనమూ ఆమెని తన నుంచి వేరుచేయలేదు. ఇంకా ఆశ అనేది ఇప్పుడుకూడా కొంచెం దూరంలో ఆగి నిలబడివుంది. కాని అభిలాష అంచుని పట్టుకునేందుకు సాహసించ గలిగే దూరంలో తను లేడు.  ఆమె మళ్ళీ చిన్న-చిన్న రాళ్ళని కొంచెం దూరంగా జరుపుతూ, తిరిగి మళ్ళీ దగ్గరికి కలుపుతూ వుంది. చెయ్యడానికి ఇంకేమీ పని లేదన్నట్లుగా అతను మళ్ళీ ఒక సిగరెట్ వెలిగించుకున్నాడు. ఆమె ఆ చిన్న-చిన్న రాళ్ళతోకాక తన గతస్మృతులతో ఆడుకుంటోందని అతనికి అనిపించింది. వాటిని అక్కడే విడిచిపెట్టేయాలా లేక ఎప్పటికీ తనతో కూడా ఉంచుకునేందుకు పోగుచేసు కుని తనతో తీసుకువెళ్ళాలా అన్నది ఆమెకి తెలియడంలేదని అనిపిస్తోంది. తన వైఫల్యాలతో, గత్యంతరంలేని పరిస్థితులతోపాటు సిగరెట్ కి రెండోవైపు నెమ్మదిగా తను స్వయంగా కాలుతున్నట్లు అతను అనుభూతి చెందుతున్నాడు. సమయం అలసటతో తూగుతున్నట్లు అనిపిస్తోంది. కొంచెంసేపు తరువాత ఆమె తన దుపట్టా అంచుని వేలికి చుట్టబెట్టుకుంది. అతను నికోటిన్ రుచితో పొగబట్టిన పెదవులమీద నాలుక కదుపుతూ, దూరంగా పిట్టగోడమీద కూర్చుని కర్కశంగా అరుస్తున్న కాకిని చూస్తున్నాడు. అతని ప్రతి ఇబ్బందికి అదే కారణమయినట్లుగా ఒక రాయి తీసి అతను అటువైపుగా విసిరాడు. కాకి గట్టిగా అరుస్తూ ఎగిరిపోయింది. హృదయంలో గుచ్చుకునే శూలంలాగా దాని అరుపు ఇంకా ఆ శాంతంగా ఉన్న వాతావరణంలో ప్రకంపిస్తోంది.

          “మనం ఇక్కడికి మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చామో నీకు జ్ఞాపకం ఉందా?” అతను బహుశా ఇదే అడగాలని అనుకున్నాడు.

          “ఆఁ… ఇంచుమించు మూడేళ్ళ క్రిందట… ఆరోజు నువ్వు కాలేజీకి వెళ్ళకుండా… నన్ను ఆపుజేసినప్పుడు… మళ్ళీ ఇవ్వాళ… బహుశా… ఆఖరిసారి…” కొన్ని అస్ఫుట మైన పదాలు వెలువడి మందమైన వేగంతో గాలిలో కలిసిపోయాయి. అయినా వెలి బుచ్చని అర్థంనీడని తమవెనుక విడిచిపెట్టి వెళ్ళిపోయాయి.

          అతనికి గతంలో ఎన్నోసార్లు కలుసుకున్న తరువాత ఆ క్రమంలో జరిగిన పరిణామం గుర్తు వస్తోంది. ఇక్కడ ఇదేచోట అతను మొదటిసారి ఆమెని స్పృశించాడు. అప్పుడు తామిద్దరూ మొదటిసారి కలుసుకుంటున్నట్లు అనుభూతి కలిగింది. ఆ స్పర్శ విలక్షణమైనది. అతని పెదవుల స్పర్శ ఆమెని కాక, ఆమె ఆత్మని స్పృశించినట్లు అనిపించింది. అది ఆమె మనస్సుని అలరిస్తూ నిమిరింది. ఆమె మృదువైన చేతులలో అతను కొన్ని కలలని కానుకగా అందజేసినట్లు అనిపించింది. ఆ బంగారుకలలు ఏదయినా కుసుమం కన్నా కోమలమైనవి. వజ్రంకన్నా దృఢ మైనవి. ఈరోజున ఆకలలు పారిజాతాలలాగా రాలిపోతున్నాయి. ఇది కాలంలోని క్రూరత్వమో, లేక అతని గత్యంతరంలేని పరిస్థితో తెలియదుకాని, ఆ కలలలోని మార్దవం వాటిలోని దృఢత్వాన్ని లుప్తంచేసింది. అతను వ్యాకులచిత్తుడై చూస్తూ వుండిపోయాడు. అంతకన్నా ఇంకేం చెయ్యగలడు.

          గడిచిన సంవత్సరాల్లో వారిద్దరూ ఎంత దగ్గరగా వచ్చారంటే వాళ్ళు కలుసుకో వడం అనేది అవసరంకన్నా ఎక్కువగా వాళ్ళకి ఒక అలవాటుగా రూపొందింది. ఈ సంవత్సరాల సాంగత్యం అనేది ఇద్దరి ఉనికిలో పాలు-నీళ్ళు కలిసిపోయినట్లుగా ఒకరి జీవితాన్ని మరొకరు జీవించసాగారు. ఆ ఇద్దరి బంధమే ఇప్పుడు చిక్కుపడిన పట్టుదారాలపోగుల్లాగా వారి సంబంధం చిక్కువిడటానికి బదులుగా ఇంకా ఎక్కువగా చిక్కుపడి జటిలమైపోయింది. వాళ్లే కాకుండా ఎన్నో ఉదయాలు, ఎన్నో సాయంత్రా లు కూడా ఆ చిక్కు వీడడానికి ఆశతో ఎదురుచూస్తున్నాయి. కాలం సెగలో మరిగి-మరిగి  వాళ్ళ బంధం మీద జ్ఞాపకాల చిక్కని పొర ఏర్పడింది. దాని అసలు స్వరూపం విలుప్తమైపోయి, వాళ్ళ ఆలోచనల ప్రతిబింబంలా ఒక వికృతమైన రూపం ఎదురుగా గోచరిస్తోంది.

          పోయిన సంవత్సరం వరకు అంతా బాగానే నడుస్తోంది. భావిజీవితపు ప్రణాళికల గురించి వాళ్ళు ఎప్పుడూ కలిసే ఆలోచించుకున్నారు. ఉద్యోగం, పెళ్ళి, చిన్న ఇల్లు, కుటుంబం, ఇంకా తమ… అంతా నిర్ణయించుకుని ఉన్నారు. ఇప్పుడు అతను తన కలలని నిజం చేసుకునే ప్రయత్నంలో ఆఖరి ప్రయత్నం మొదలుపెట్టి తన భగ్నమైపోతున్న ఆత్మవిశ్వాసంతో సంఘర్షణ చేస్తున్నాడు. మరొక వైఫల్యాన్ని సహించుకునే స్థితిలో లేడు. గత కొన్ని పరాజయాలతో అతని ఆత్మస్ధైర్యం దెబ్బతిన సాగింది. ఉద్యోగం దొరుకుతుందన్న అతని ఆశలు అడుగంటిపోసాగాయి. ఆతరువాత పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. జరుగుతున్నదానికీ వాళ్ళు ఊహించుకున్న భవిష్యత్తుకీ, కన్న కలలకీ ఎక్కడా పొంతన కుదరడంలేదు. గత సంవత్సరం తండ్రిగారు కాలంచెయ్యడం అతనికి అనూహ్య సంఘటన. అలాగే చెల్లెలి పెళ్ళి ఆగిపోవడం కూడా. అకాలంగా వృద్ధురాలైపోతున్న తల్లి వ్యథాసముద్రంలో మౌనంగా మునకలు వెయ్యడం కూడా. ఒక నిస్సహాయుడైన కొడుకుగా, అన్నగా అతని కలల మీద పిడుగు పాటులా పడిన ఆఘాతం మొట్టమొదటగా వాళ్ళ ప్రేమమీద పడింది. దురదృష్టపు చక్రవాతం వాళ్ళని చుట్టుముట్టింది. కలలపైన ఉన్న పట్టు సడలిపో సాగింది.

          “కలలు అనేవి అద్దం కన్నా సున్నితమైనవి. వీటిని పగిలిపోకుండా కాపాడు కోవాలి…” కలలు భగ్నమైపోయాయి, అంతేకాక ఖండఖండాలుగా చెదిరిపోయాయి. అతను దిగ్భ్రమచెంది, ముక్కచెక్కలైపోయిన ఆ కలల శకలాలని లెక్కపెట్టు కునేందుకు ఒంటరిగా మిగిలిపోవడానికి శాపగ్రస్తుడయ్యాడు. ఇప్పుడింక ఈ చివరి ఆశకూడా చేజారిపోయే పరిస్థితి ఎదురుగా ఉంది. ఆమె ఇంట్లోవాళ్ళని మాత్రం అతను ఏమనగలడు. అతను ఐఏఎస్ అయివుంటే వాళ్ళు స్టేటస్ లో ఉన్న తేడాని కూడా ఎలాగో సర్దుబాటు చేసుకునేవారు. కాని, ఖరీదైన మఖమల్ వస్త్రానికి గోనెసంచి ముక్కని అతుకువేసే పరిస్థితి రాలేదు. అలా రావాలని అతను ఆశించలేదుకూడా. మరి అతను ఎవరిని తప్పు పట్టగలడు? అర్థం లేని తన డిగ్రీల పోగునా, సమాజవ్యవస్థ లోని లోపాలనా లేక నిరంతరం నిరుద్యోగులైన యువతని ఉత్పన్నం చేస్తున్న యంత్రంలాంటి విద్యావిధానాన్నా లేక భగ్నమవుతున్న తన ఆశలనా.

          “నా దురదృష్టభారాన్ని నీ కోమలస్కంధాల మీద ఎలా వుంచగలను నేను?” అతను చెప్పింది విని ఆమె తల్లడిల్లింది. వాళ్ళమధ్య `నా’, `నీ’ లాంటి అపరిచిత పదాలు ఈమధ్య తరచు చోటుచేసుకోసాగాయి. ఇప్పటివరకూ ఎన్నో కష్టసుఖాలని వాళ్ళు పంచుకున్నారు. ఆమె ఏమాత్రం అలిసిపోకుండా, ఎప్పుడూ అతని బంగారు కలలని అల్లుతూ అతనితో నవ్వులు పంచుకుంది. అతని చిన్న-చిన్న సంతోషాలకి, పెద్ద-పెద్ద ఇబ్బందులకి మధ్య బాలెన్స్ నిలుపుకుంటూ వ్యాకులపడింది. అడుగడు గునా అతని వైఫల్యాలలో అతనికి తోడుగా, నీడగా నిలబడింది. కాని అతనే అలిసి పోయినట్లుగా ఉన్నాడు. గడిచిపోతున్న ప్రతిక్షణంతో జీవితాన్ని సానుకూలంగా చేసుకునే తన ప్రయత్నం చివరికి నిస్సహాయస్థితిలోకి నెట్టివేస్తున్నట్లు అతనికి అనిపిస్తోంది. సమరం రెట్టింపు అవుతున్నట్లు, తను కాలంతో కాక తనతోనే సంఘర్షణ చేస్తున్నట్లుగా అతను అనుభూతి చెందుతున్నాడు. ఆమె కూడా అమ్మ వేస్తున్న ప్రశ్నలతోనూ, అప్రయత్నంగా అతిజాగ్రత్తగా పరిశీలిస్తున్న తండ్రిచూపులతోనూ పోరాటం చేస్తోంది. తనుగనక స్కూల్లో ఉద్యోగం చేస్తూ ఉండకపోతే బహుశా వాళ్ళ రక్షణవలయంలో బందీ అయిపోయివుండేది. ప్రస్తుతపరిస్థితుల్లో ఇంట్లోంచి బయటికి వెళ్ళడం కూడా కష్టమైపోయింది. 

          “మరి మన ప్రేమ?” జరుగుతూ ఆమె అతనికి దగ్గరగా వచ్చింది. ఆమె అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అడిగింది. అతనికి దగ్గరగా, బాగా దగ్గరగా, కేవలం అతని ముఖం తప్ప మరేమీ కనిపించనంత దగ్గరగా. తను ఎక్కడో చదివింది ఎవరి ముఖమైనా జీవితంలో దానికన్నా మరేమీ కనిపించనంత దగ్గరగా వచ్చిందంటే దాన్ని మరిచిపోవడం అనేది అసంభవం అని. ఇక్కడ ముఖమే కాదు, దాని గురించిన ఆలోచన కూడా ఎంత దగ్గరగా వచ్చిందంటే అది లేకుండా జీవించడమనేది ఊహకి కూడా అందని విషయం.

          “ప్రేమ తప్పకుండా ఉంటుంది. మనం జీవితంముందు ఓడిపోయాం. ప్రేమముందు కాదు. ప్రేమ కేవలం కలిసి ఉండటానికి ఒక పేరు మాత్రమేనా. మనం పరస్పరం ఒకరికొకరు తోడుగా నిలిచాం. మన ఇద్దరికీ ఇది ముఖ్యం కాదా. ప్రేమకి అస్తిత్వం అనేది ఉంటుంది జీవితంలో, కలల్లో, జ్ఞాపకాల్లో, మనస్సులో,… ఇంకా…

          “ఇంకా… దేహంలో, సాన్నిధ్యంలో, భవిష్యత్తులో…? నేను నిన్ను స్పష్టంగా, పూర్తిగా అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని  నీలో విలీనమైపోయాను. నేను నా అస్తిత్వంలోని అణువణువూ అర్పించుకుంటే నువ్వు నాకు లభించావు. ఇప్పుడు నేను నీనుంచి ఎలా వేరు కాగలను?నువ్వూనేనూ వేరు కాదు. నన్ను వెళ్ళనీయకు.” అసహనీయమైన ఆమెపదాల సందోహంలో అతని  అశక్తతతో కూడిన అసంపూర్ణ సమాధానం నిలబడలేకుండా ఉంది. సారంలేని అతని పదాలు తమ వివశత్వంతో సిగ్గుపడి మూగవైపోయాయి. అతని భుజంమీద తల ఆనించి ఇప్పుడు ఆమె అతని చేతులతో ఆడుకుంటోంది. అంతకన్నా చెయ్యడానికి ఇంకేమీ మిగల్లేదు.

          “జీవితంలో శిశిరం కూడా ఒక ఋతువే. వసంతాగమనం కావాలంటే శిశిరం కూడా తప్పకుండా ఉండాలి. అది తప్పకుండా రావాల్సిందే.”

          “వసంతం వెళ్ళిపోయినంతమాత్రాన ఏమయింది. నాకు శిశిరం అంటే భయం లేదు. నేను ఈ శిశిరాన్ని రాబోయే ఆమని ఆగమనాన్ని కోరుకుంటూ గడపాలని అనుకుంటున్నాను.”

          “చూడు. పోయినసారి నువ్వు చెప్పిన కవిత…`నువ్వు వెళ్ళిపోతావు’..అది చెప్పవూ…”ఆమె మందస్వరం ఆ ఎత్తయిన గుట్ట మీద అవిరామంగా ప్రతిధ్వనిస్తున్న పక్షుల కలరవంలో కలిసిపోయింది.

“నువ్వు వెళ్ళిపోతావు

అయినా కాస్త ఇక్కడ కూడా ఉండిపోతావు

తొలి వర్షం కురిసిన తరువాత

గాలిలో తేలియాడే హృద్యమైన

తడిసిన నేల పరిమళంలా

వేకువజాము వెలుగులో

కొద్దిగా మిగిలిన చంద్రుడిలా

శిథిలమైపోతున్న ఆలయంలో

అశ్రుత ప్రాక్తన నూపురధ్వనిలా…”

          ఈ అశోక్ వాజ్ పేయీ కవితని అతను తరచు చెబుతూవుంటే ఆమె వింటూ వుండేది. కాని ఆరోజు అతను ఆ కవితని పూర్తిగా చెప్పలేకపోయాడు. ఆ ఎత్తయిన గుట్ట నుంచి కిందకి చూపుమేర దూరంలో ఎదురుగా అనురాగం తన ప్రతి రూపంలోనూ గోచరిస్తోంది. అందమైన పక్షులజంటలు…తమ దర్పం చూపిస్తూ గర్విస్తున్న ఆడ పక్షులు, వాటిని తమ కూతలతో, గెంతుతూ, జరుగుతూ, రకరకాలుగా తమవైపు ఆకర్షిస్తున్న మగపక్షులు… సమూహంలో తమ ఉనికిని మిశ్రితంచేసిన చుంబనరత పుష్పశ్రేణులు స్నేహపూర్వకమైన మృదుస్పర్శను పరస్పరం పంచుకోవడానికి త్వరపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అక్కడే చేతుల్లో చేతులు కలిపి ఒకరితోమరొకరు అతుక్కుపోయినట్లుగా స్కూలు యూనిఫారంలో ఉండి తిరుగుతున్న ఒక టీనేజ్ కిశోరప్రాయపు జంట కూడా ఉంది. వారిలో అబ్బాయి భుజంమీద తల ఆనించుకుని అమ్మాయి హిజాబ్ లాంటి వస్త్రంతో తనముఖాన్ని కనిపించకుండా కప్పుకుని ఉంది. లోకం చూడకుండా తన గుర్తింపుని దాచుకోవడంలో కృతకృత్యురాలయినప్పటికీ, ఆమె మెరుస్తున్న కళ్ళు, ఉన్ముక్తంగా ఉన్న ఉత్సాహంతో చిందుతున్నఅగాధమైన ప్రేమ ఎంత దాచినా దాగడంలేదు. అబ్బాయి ఆమె చేతిని ముద్దు పెట్టుకోవాలని అనుకుంటూ మాటిమాటికీ దాన్ని తన పెదవులకి దగ్గరగా తీసుకుంటున్నాడు. కాని చుట్టుపక్కల ఉన్న జనాన్ని దృష్టిలో ఉంచుకుని ఆగిపోతున్నాడు. ఆఖరికి తన భయాన్ని, సంకోచాన్ని జయించి ప్రపంచవిజేతలాగా గర్వోన్మత్తుడిగా అనుభూతి చెందుతున్నాడు. ప్రపంచంలో ఏదో పెద్ద విజయాన్ని సాధించిన సంతోషం అతని ముఖంలో ప్రస్ఫుటితమవుతోంది.

          కొంచెం దూరంలో ఒకమూలగా వృక్షాల సమూహం చాటుగా చెట్లకీ, పొదలకీ వెనకాల ఒకరిలో మరొకరు తన్మయత్వం చెందుతూ, `రెండు తనువులు, ఒక ప్రాణం’ అనే సార్థకతని జయించిన కొన్ని జంటలు ఉన్నాయి. అక్కడే బెంచీమీద సరిగా వారికి ఎదురుగా జీవనసంధ్యాసమయంలో కూడా ప్రేమపూరితమైన జీవితాన్ని ఉత్సవం లాగా ఆనందమయం చేసుకుంటూ పక్షులకి గింజలు వేస్తున్న ఒక వయోవృద్ధుల జంట కనిపిస్తోంది. ప్రతి దిక్కునా అనురక్తిని దృశ్యమానం చేసే ఆ క్షణాలలో వాళ్ళు ఆ ఆఖరిసారి కలుసుకుంటున్న తరుణంలో నిరుత్సాహభరితమైన నిరాశల శిశిరాన్ని తమ మనస్సులోని వసంతంపైన ప్రబలమైపోతుండగా చూస్తూ తాము కేవలం మూగ సాక్షులుగా ఉండిపోయామనే అతను ఆలోచిస్తున్నాడు.

          వ్యాకులపరుస్తున్న శిశిరం పూర్తిగా వాళ్ళ మనస్థితి మీద ప్రసరిస్తోంది. ప్రభావితం చేస్తోంది. వృక్షాల నీడలు పొడుగు కాసాగాయి. బంగారు శాలువలాంటి ఎండ రంగుకూడా వెలిసిపోసాగింది. దుశ్శాలువ లాంటి ఎండ గుట్టమీద నుండి దిగుతూ గాలిలోని తేమతో కలిసిపోతోంది. దాని బంగారురంగు క్షితిజరేఖలాగా దృగ్గోచరమవుతోంది. గాలి వేగం పెరుగుతోంది. దానితోబాటుగా చెట్లకింద ఎండుటాకుల పోగులు ఎక్కువవుతున్నాయి. 

          వాళ్ళ మధ్య నెలకొన్న మౌనం ఇంక సహించరానిదిగా ఉంది. కాని వాళ్ళలో పదాలసూత్రాన్ని పట్టుకునే సాహసం లేదు. పదాలు వాళ్ళకి సహాయపడటం ఎప్పుడో మానేశాయి. అవి స్ఫురించాలని కూడా అతను అనుకోవడంలేదు. ఇప్పుడు వీడ్కోలు తీసుకునే సమయంలో కూడా అవి బహుశా ప్రస్ఫుటితం కావడానికి తిరస్కరిస్తాయే మోని అతనికి భయంగా ఉంది. అది విడిపోయే సమయం. “అప్పుడే, అదే సమయంలో కడపటి సెలవు తీసుకునే వేళ…రావలసింది… సరిగా… వీడ్కోలులాగా…” అతను ఏదో స్వగతభాషణం చేస్తున్నాడు. అతను నెమ్మదిగా ఆమె చేతిని విడిచి పెట్టాడు. ఇంక పక్షులు కలరవం ఆపుజేస్తాయని, ప్రేమికుల జంటలు తాము ఒక్క సారిగా మక్కువనుండి  బయటికి వచ్చినట్లుగా అనుభూతిచెందుతారని, పూలు గాలిస్పర్శని తిరస్కరిస్తూ శాంతిస్తాయని అతను అనుకున్నాడు. కాని అటువంటిది ఏదీ జరగలేదు. అతనికి తన చెలిమిలో సమస్త చరాచర జగత్తు నిండివుందని తీవ్రమైన అనుభూతి కలిగింది. కాని విడిపోతున్న ఆ సమయంలో అతను పూర్తిగా ఒంటరిగానూ, అసహాయంగానూ ఉన్నాడు.

          గుట్టమీద నుండి దిగుతున్న సమయంలో సమతలంగా లేని రాతి మెట్లమీద ఈసారి పరధ్యానం వల్ల అతను పడిపోబోయాడు. కాని ఆమె ముందుకి వచ్చి అతన్ని పట్టుకుంది. ఆమె చేతుల స్పర్శలో వీడ్కోలుకి చెందిన చల్లదనం లేదు… ప్రేమని తెలుపుతున్న వెచ్చదనం ఉంది.

          “కార్డులు ఇంకా వేయించలేదు. రెండోది… ఈ ఇంక్రిమెంటు తర్వాత నా శాలరీ ముఫ్ఫైవేలు అవుతుంది. దీనితో ఇల్లు నడుస్తుంది కదా? నువ్వు ఐ.ఏ.ఎస్. అయే వరకు.” ఆమె గుసగుసలతో ఇద్దరూ పకపకా నవ్వారు. ఆమె ఒక్కసారి కళ్ళారా చూసింది- ఆశ అనేది చిగురిస్తోంది. అభిలాష పల్లవిస్తోంది. ఆకాంక్ష సఫలీకృతం కాబోతోంది.

          “నువ్వు వెళ్ళిపోతావు

          అయినా, కాస్త ఇక్కడే ఉండిపోతావు.”అతను నెమ్మదిగా అన్నాడు.

          కవిత మాత్రమే పూర్తి కాలేదు, వాళ్ళ ప్రేమ కూడా పరిపూర్ణమైనట్లు అతనికి అనిపించింది.

          ఈసారి వేరు-వేరుగా కాక, ఇద్దరూ ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని, మళ్ళీ మౌనంగా ఆ పొడవైన దారి దాటుకుని గార్డెన్ గేటు దాకా చేరుకున్నారు. అక్కడినుంచి వాళ్ళు విడిపోవాలి. కొన్ని క్షణాలపాటు… లేదా ఆరోజు సాయంత్రం వరకు… లేకపోతే ప్రస్తుత ఋతువు గడిచేవరకు… కాని ఎప్పటికీ…శాశ్వతంగా మాత్రంకాదు. ఒకరివద్ద మరొకరిని పూర్తిగా వదిలి వాళ్ళు వేరు-వేరు మార్గాల మీద నడుచుకుంటూ వెళ్ళారు.

          రాబోయే రమ్యమైన వసంతం కోసం ఇద్దరూ ఎదురు చూస్తున్నారు.

          అది నిరాశకు నెలవైనశిశిరం ముగియబోతున్న సంవత్సరంలోని ఆఖరి మాసం.

***

శ్రీమతి అంజూ శర్మ – పరిచయం

రాజస్థాన్ మూలానికి చెందిన శ్రీమతి అంజూ శర్మ 26 డిసెంబరు 1970న ఢిల్లీలో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బి.కామ్., పి.జి. స్థాయిలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రసిద్ధ పత్రికలలోనూ, బ్లాగుల్లోనూ వీరి కవితలు, కథలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వీరి మూడు కవితాసంకలనాలు, అయిదు కథాసంకలనాలు, మూడు నవలలు వెలువడ్డాయి. ఆంగ్లంతోపాటు కొన్ని దేశభాషల్లో వీరి కవితలు, కథలు అనువదించబడ్డాయి. వీరి కవిత `చాలీస్ సాలా ఔరతేఁ’ (నలభై యేళ్ళ మహిళలు) జాతీయస్థాయిలో ఎన్నో కార్యక్రమాలలో చర్చించబడటమే కాక, వివిధ అకాడమీలలో, రేడియోలో, చాలా ప్రముఖవేదికలలో పఠనం చేయబడింది. `బేటీ కే లియే’ (కూతురికోసం) అనే వీరి కవిత చైనాలోని `క్వాంగ్ చో హిందీ యూనివర్సిటీ, క్వాంగ్ చో, చైనా’ లో గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులో చేర్చబడింది. తన సాహిత్యసేవలో శ్రీమతి శర్మగారు ఎన్నో బహుమానాలు, సన్మానాలు పొందారు. వీటిలో చెప్పుకోదగ్గవి ఇలా త్రివేణీ సమ్మాన్ 2012, రాజీవ్ గాంధీ ఎక్సెలెన్స్ అవార్డు 2013, స్త్రీశక్తి సమ్మాన్ 2014, మేరఠ్ లిటరేచర్ ఫెస్టివల్ లో సాహిత్యశ్రీ పురస్కార్ 2018.`ఓ రీ కఠ్ పుతలీ’ (ఒసే కొయ్యబొమ్మా) నవల సేతు ప్రకాశన్, నోవెడా వారి మ్యాన్యుస్క్రిప్ట్ పురస్కార్ యోజన 2022 లో ఎంపిక కాబడి పబ్లిష్ చేయబడింది. దీనిపైన పరిశోధనావ్యాసం (డిసర్టేషన్) కూడా వ్రాయబడింది. వీరి కొన్ని కథలకి ప్రతిష్ఠాత్మక బహుమానాలు లభించాయి. కథాసంకలనం `దర్పణ్, జుగ్నూ ఔర్ రాత్’(అద్దం, మిణుగురుపురుగు, రాత్రి) కి 2023లో కమలేశ్వర్ స్మృతి కహానీ పురస్కార్ బహూకరింపబడింది. శ్రీమతి శర్మగారు ప్రపంచసాహిత్యంలోని 9 క్లాసిక్ నవలల కామిక్ ఎడిషన్లకి ఆంగ్లంనుండి అనువాదం చేశారు. ప్రస్తుతం ఒక ప్రసిద్ధ వెబ్ సైట్ లో క్రియెటివ్ అసోసియేట్ గా పని చేస్తున్నారు. శ్రీమతి అంజూ శర్మ ఢిల్లీ వాస్తవ్యులు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.