
అనుసృజన
హరీశ్ చంద్ర పాండే
అనుసృజన: ఆర్ శాంతసుందరి
(హిందీ కవి హరీష్ చంద్ర పాండే ఎన్నో కథా సంపుటాలూ , కవితా సంపుటాలూ , బాలసాహిత్యం రాసారు. 1952 లో ఉత్తరాఖండ్ లో పుట్టారు . సాహితీ పురస్కారాలు అందుకున్నారు . అలహాబాద్ లో సీనియర్ మోస్ట్ అకౌంటెంట్ గా పదవీ విరమణ చేసారు.)
ప్రతిభ
హంతకుణ్ణి కోర్టువారు సగౌరవంగా విడిపింపజేసేట్టు
వాదించగల వకీలుదే ప్రతిభ
రోగికి ఏమాత్రం తెలియనీయకుండా
అతని శరీరం నుంచి మూత్రపిండాన్ని తొలగించగలగటమే ప్రతిభ అంటే
ప్రతిభ ఉన్నచోట ఉంటాయి రకరకాల ఆటలు
పలాయనం అనే ఆట ఒకటుంది దాని బరిలో
ఒకరు బైటికి పరిగెత్తితే మరొకరు లోపలికి పరిగెత్తుతారు
కాళ్లు టకటకలాడిస్తూ నడిచొచ్చే యోగ అనే ప్రతిభ
భోగం రెక్కలమీదెక్కి ఎగిరి పొతోంది
ఆటల్లో కూడా ఒక ఆట ఎలాంటిదంటే
మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో గెలిచిన ప్రతిభ
పురుషుల సింగిల్స్ లో ఓడిన ప్రతిభ కన్నా
తక్కువగా అంచనా వెయ్యబడుతుంది
ప్రతిభల జాబితాలో చేరని తొమ్మిదో క్లాస్ ఫెయిలైన జవాను ఒకడు
అతనున్నాడని తెలిసేది ఆతను లేకుండా పోయాకే
అతని త్యాగాన్ని ప్రశంసిస్తూ కేంద్రంలో ఎలుగెత్తిన గొంతు
సరిహద్దుల్లో మారుమోగుతుంది
నెమ్మదిగా మెట్లు ఎక్కుతోంది
అతన్ని కోల్పోయిన అతని భార్య
ఆమె నుదుట
బొట్టుకి బదులు మెరిసిపోతోంది అశోకచక్రం … !
***
సీతాకోకచిలుకకేం ?
సీతాకోకచిలుకకేం
ఎక్కడైనా వాలుతుంది అది
అగ్ని పర్వతాలూ, ఆటుపోట్లూ, కఠినమైన వజ్రాలూ
దానికి పనికొచ్చే పదాలు కావు
దానికోసమేనేమో అన్నట్లుంటాయి
పువ్వులూ , పరాగమూ , చిగురాకులూ లాంటి పదాలు
అది విహరించేది కూడా భూమికి జానెడు ఎత్తునే
ఇప్పుడే వచ్చి వాలింది ధ్యానంలో ఉన్న ఒక యోగి జడలమీద
అక్కడినుంచి ఎగిరి వెళ్లి ఆరవేసి ఉన్న ఒక చీర అంచుల మధ్య వయ్యారాలు పోయింది
తరవాత వెళ్లి కూర్చుంది ఒక ఎద్దు వీపుమీద
అది వీపు విదిలించేసరికి
వెళ్లి వాలింది నిద్రపోతున్న ఒక పిల్లవాడి చెవి మీద
పారిపోయింది మళ్ళీ వాడి వేలు తాకే లోపల
సీతాకోకచిలుకకేం ఎక్కడైనా వాలుతుంది
మళ్ళీ ఒకసారి వెళ్లి యోగి తలమీద వాలింది
గిరిధరుడి తలమీది నెమలి పింఛమా అన్నట్లుంది
బూడిద మీద ఎంత అందమైన రంగుల వర్షమో !
వైరాగ్యం మీద అనురాగం ఎంతగా శోభిల్లుతోందో !!
యోగి పరలోకం ధ్యాసలో ఉన్నాడు పరధ్యాన్నంగా !
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
