
నడక దారిలో-57
-శీలా సుభద్రా దేవి
జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగి వచ్చేసి ఉద్యోగంలో చేరింది. నేను హెచ్చెమ్ కావటం,రిటైర్ కావటం, పెద్దక్క మరణం, ప్రత్యేకతెలంగాణా ఉద్యమం, వీర్రాజు గారు తన ఏకాగ్రత అంతా పెయింటింగ్స్ వేయటంపై పెట్టారు. పల్లవి కొన్న సరూర్ నగర్ లో అపార్ట్మెంట్ గృహప్రవేశం అయ్యాక, మిత్రులు బంధువులకు విందు ఇచ్చాం. డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటం మొదలుపెట్టాను. తర్వాత— )
***
కాకినాడ నుంచి వచ్చాక విశేషాలన్నీ వీర్రాజు గారికి చెప్పి శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటానికి ఏ నిర్ణయించుకున్నట్లు చెప్పాను. కాత్యాయని విద్మహే తన దగ్గర వున్న ఉరుములూ- మెరుపులు సంపుటి జిరాక్స్ కాపీ, కొంత సమాచారం పంపించారు.
ఈ విషయం రామడుగు రాధాకృష్ణ మూర్తి గారికి చెప్పాను. శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయంలో తెలిసిన అతను వున్నాడు అక్కడకు వెళ్ళి చూద్దాం అన్నారు. సరేనని శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయంకి వెళ్ళాను. రాధాకృష్ణమూర్తిగారు కూడా వచ్చారు. అక్కడ తెలుగు స్వతంత్రలు ఎక్కడ వుంటాయో తెలుసుకుని పాత పత్రికల అల్మారాలు చూపించారు. అక్కడ అంతా దుమ్ము కొట్టుకుని వున్నాయి. ఆ అల్మారాలు వెతుకుతుంటే పది పన్నెండు తెలుగు స్వతంత్రపత్రికలు కలిపిన బౌండు పుస్తకాలు వున్నాయి. అటువంటి బౌండ్లు ఒకపదిపదిహేను వరకూ వున్నాయి. అయితే అప్పట్లో కెమేరా ఫోన్లు లేవు. అవి జిరాక్స్ చేయించడానికి వీలుగానూ లేవు. వాటిని ఇంటికి ఇవ్వటానికి కుదరదు అన్నారు. నాకు ఏంచెయ్యాలో తోచలేదు. దిగులుగా రాధాకృష్ణ మూర్తి గారి వైపు చూసాను. ఆయన అర్థం చేసుకుని భాషానిలయం ఇంఛార్జి ఎమ్.వి.ఎల్. నరసింహామూర్తిగారితో మాట్లాడి పూచీకత్తు మీద సాధ్యమైనంత త్వరగా అవి తిరిగి జాగ్రత్తగా అప్పగించేలా ఉత్తరం రాసి నేనూ, అయనా సంతకాలు పెట్టి ఇచ్చాము. నా అదృష్టం కొద్దీ పుస్తకాలు బౌండ్లు ఇచ్చారు. అవన్నీ సంచులలొ వేసుకొని ఆటోలో ఇంటికి వచ్చాను. అవి చూసి వీర్రాజు గారు ఆశ్చర్యపోయారు.
ఆ పుస్తకాలను తొందరగా ఇచ్చేయవలసి వుంది కనుక వాటిలోని శ్రీదేవి రచనలు ఎన్ని వున్నాయో నోట్ చేసుకున్నాను. ఒక్కొక్క బౌండులో శ్రీదేవి కథ, వ్యాసం చదివి కథాంశం, కథలోని విశేషాంశాలు, పాత్రలు వీటి గురించి వివరంగా నోట్స్ రాసుకు న్నాను.
తెలుగు స్వతంత్రలలో ధారావాహికంగా వచ్చిన శ్రీదేవి రాసిన మధుకలశమ్ దీర్ఘ కావ్యం నన్ను అబ్బుర పరచింది. ఆమె రాసిన కాలాతీత వ్యక్తులు నవల తప్ప ఇంకే రచనా గురించీ ఎవరూ చెప్పలేదు.
వీర్రాజుగారి సంపాదకత్వంలో అరవైలలో ఏరినపూలు పేరుతో ఒక సంకలనం తీసుకువచ్చారు. అందులో ఒక కథ దొరికింది. నేను వందమంది కవయిత్రుల సంకలనం” ముద్ర” తీసుకు వచ్చినప్పుడు శ్రీదేవి కవితలను అక్కయ్య పంపింది. అవి తెలుసు. ఇప్పుడు ఈ పుస్తకాలు వెతుకుతుంటే 20 కథలు, 20కవితలు , వ్యాసాలూ కూడా దొరికాయి. నాకు భలే ఉత్సాహం కలిగింది. పరీక్షలకీ ప్రిపేరయ్యే విద్యార్ధినిలా పూర్తి సమయాన్ని ఈ నోట్స్ తయారు చేయటంలో కేటాయించాను.
ఆ సమయంలోనే మధుకలశమ్ ని పుస్తకంగా వేయాలనే ఆలోచన మాకు వచ్చి జిరాక్స్ చేయటం కుదరదు కనుక దానిని కాపీ చెయ్యమని వీర్రాజుగారిని కోరగా ఆయన అదంతా ఒక పుస్తకంలో కాపీ చేసి ఇచ్చారు. కవితా ఖండికలు నేనే కాపీ చేసాను. అందుకని కవిత్వం నోట్స్ తర్వాత రాసుకోవచ్చని ఊరుకున్నాను.
ముందుగా కథలన్నింటికీ, సాహిత్య వ్యాసాలకు మాత్రమే నోట్స్ రాసాను. ఇవేకాక గోరాశాస్త్రి రాసిన నడుస్తున్న చరిత్ర పేరిట రాజకీయ వ్యాసాల్ని ఆసక్తి కొద్దీ చదివాను. అవీ బాగున్నాయి. మరొక విశేషం తెలుగు స్వతంత్రల్లో అక్కయ్య కథలు కూడా చాలా దొరికాయి. వాటిని కూడా కాపీ రాసుకున్నాను. అంతకుముందు అక్కయ్యవి అంతకు ముందు రెండు కథలు సంపుటాలు వచ్చాయి. వాటిలో చేర్చని కథలు కూడా పుస్తకం గా వేయాలనే ఆలోచన వచ్చింది. ఆ విధంగానే ఆ కథలను తర్వాత ” నాకు గాదులు లేవు” పేరిట అక్కయ్యకు నివాళిగా సంపుటిని ప్రచురించాము.
ఆ సందర్భంలోనే నాకు బాగా నచ్చిన శ్రీదేవి పెద్దకథ వాళ్ళు పాడిన భూపాల రాగం కథమీదే ప్రత్యేకంగా ఒక వ్యాసం రాసాను. ఆ వ్యాసం సారంగపత్రికలో ప్రచురిత మైంది.
శ్రీదేవి జీవితం గురించి ఏ వివరాలు తెలియవు. అక్కయ్య వున్నట్లైతే కొంత రాయగలిగేదాన్ని. మామయ్యని అడిగాను కానీ పెద్ద వయసు వల్ల ఏమి గుర్తు లేదన్నాడు. శ్రీదేవికి స్నేహితురాలైన నాయని కృష్ణకుమారిగారు కూడా లేరు. కె.రామలక్ష్మికూడా మద్రాసులో తెలుగు స్వతంత్రకు కొంతకాలం ఉపసంపాదకత్వం వహించారు కనుక ఏమైనా చెప్పగలరేమో అని ఆమె దగ్గరకు ఒకసారి వెళ్ళి అడిగాను.” నన్ను అడుగుతే నెగిటివ్ గానే చెప్తాను. మరి చెప్పమంటావా”అన్నారు. వద్దులెండి అని మాట మార్చేసాను.
ఇక ఆ తర్వాత నాకు తెలిసినంత వరకూ శ్రీదేవి జీవితం గురించి రాసి తర్వాత ఆమె రచనల ఆధారంగా ఆమె స్వభావం, వ్యక్తిత్వాన్ని చిత్రించాలని నిర్ణయించు కున్నాను.
వీర్రాజుగారు తాను వేసిన చిత్రాలను ఎక్కడైనా ప్రదర్శనకు పెట్టాలని అభిలషించారు. ముందు మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో అనుకున్నారు కానీ అంతదూరం రోజూ వెళ్ళటం కష్టం అనుకున్నారు. ఆఖరుకు రవీంద్రభారతి ఆవరణలోనే వున్న కళాభవన్ లో నిర్ణయించారు. జనవరి 24 ( 2013)న బి.ఎ.రెడ్డి గారితో శీలా వీర్రాజు చిత్రకళా ప్రదర్శన ప్రారంభోత్సవం చేయించారు. జనసాహితి మిత్రులు ఈ కార్యక్రమంలో చాలా సహకారం అందించారు. జనసాహితి మిత్రుడు రాజూ ముందుగా వచ్చి అక్కడ కూర్చునేవారు. నాలుగింటికి మేమంతా వెళ్ళి తొమ్మిది వరకూ వుండే వాళ్ళం. అయిదు రోజుల పాటూ జరిగిన చిత్రప్రదర్శనకు చాలా మంచి స్పందన వచ్చింది. ఆ సందర్భంలో వీర్రాజుగారి పెయింటింగ్స్ పుస్తకాలు కూడా కొన్ని అమ్మకం కావటం సంతోషం కలిగించింది. వీర్రాజుగారికి తాను వేసిన చిత్రాలకు వచ్చిన స్పందన చాలా సంతృప్తి కలిగించింది.
ఆ సమయంలోనే ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు ఒకేసారి రెండు సంవత్సరాలకు ప్రకటించి, అవార్డు సభ కూడా జరిగింది. నేను అప్పుడే కొత్తగా ఫేస్బుక్ అకౌంట్ తెరిచాను. ఒకరోజు ఫేస్బుక్ లో ఒక కవి పెట్టిన పోస్ట్ కనిపించింది.
“ఫ్రీవర్స్ ఫ్రంట్ కి ఆంధ్రా ఫ్రీవర్స్ ఫ్రంట్ అని పేరు మార్చుకుంటే సరి పోతుంది.” అని రాసి ఒక ఏడెనిమిది మంది తెలంగాణా కవుల పేర్లు రాసి వీళ్ళకు అవార్డు తీసుకునే అర్హత లేదా అని ప్రశ్నసంధించాడు.
అది చదివేసరికి చాలా చికాకు వచ్చింది. అతను రాసిన పేర్లలో ఒకరిద్దరికి ముఫ్ఫైనలభైఏళ్ళక్రితమే ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చింది. ఆయన రాసిన జాబితాలో ఇంచుమించుగా అందరూ ఫ్రీవర్స్ ఫ్రంట్ అందుకున్నవారే. ఒకరికి మాత్రమే అను కుంటాను ఈ అవార్డు రాలేదు. తెలిసీ తెలియకుండా నిందమోపుతూ రాయటం మాకు కోపం వచ్చింది.
వీర్రాజు గారు చెప్పిన వివరాలతో ఆయన గోడమీదే ఘాటుగా స్పందించాను. దాంతో ఆ పోస్ట్ ను తీసివేసాడు ఆయన. నిజానికి ఒక ఆంధ్రాకవి కవిత్వం మీద ఆయనే పుస్తకాలు రాసాడు.
ఈ రకమైన విద్వేషాల వలన సాహిత్యం సార్వజనీనం అనేది పొరపాటేమో అనే సందేహం నాకు కలిగింది. ఎక్కడో విదేశీ కవులను, ఇతర భారతీయ సాహితీవేత్తలను గూర్చి గొప్పగా మాట్లాడేవాళ్ళు మరో ప్రాంతం తెలుగు కవిని ద్వేషించటంలో అర్థం లేదనిపిస్తుంది.
ఆ రోజు ఫిబ్రవరి 21(2013)వ తేదీ పల్లవి ఆఫీసు నుండి బయలుదేరి గంట దాటింది. ఇంకా రాలేదు. ఆ సమయంలో కోణార్క్ థియేటర్ ఎదురుగా ఉన్న ఆనంద్ టిఫిన్స్ ప్రాంతంలో ఒకటి రెండవ బాంబు వెంకటాద్రి థియేటర్ , దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలో మరొకటి బాంబు పేలుళ్ళు జరిగాయని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. మాకు భయం వేసింది. పల్లవికి వెంటనే ఫోన్ చేసాను. సరిగ్గా ప్రేలుడు జరిగిన పది పదిహేను నిముషాలకే పల్లవి ఎక్కిన బస్ ఆ ప్రాంతాన్ని దాటిందట. ఏమిటొ అంతా గందరగోళంగా వుంది బస్ ఆపకుండా దాటేసాడు అని అంది. మరో అరగంటకి ఇంటికి చేరింది. మేము గాఢంగా వూపిరి తీసుకున్నాము.పెద్ద ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ పోలీసుల చెప్పినదాని ప్రకారం , బాంబులను సైకిళ్లపై ఉంచారనీ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్ (IEDలు) ఉపయోగించారని అన్నారు. ఈ ప్రమాదంలో 18 మంది పైగా మరణించగా అందులో నలుగురు వరకూ విద్యార్థులే నట. ఆ ప్రాంతంలో చాలా స్టూడెంట్ హాస్టల్స్ వున్నాయి. చాలామంది గాయపడ్డారని తెలిసింది. కొంతకాలం వరకూ హైదరాబాద్ అంతా భయంతో వణికి పోయింది. చాలా కాలం వరకూ ఆ ప్రభావం జన జీవనంలో కనిపించింది.
వీర్రాజుగారు కుందుర్తి సత్యమూర్తికి అంకితంగా ” ఒక అసంబద్ధనిజం “అనే కవితా సంపుటి ప్రచురించుకొన్నారు. వీర్రాజుగా రి డెబ్భై అయిదవ పుట్టినరోజు పురస్కరించుకుని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసారు. వేదికమీద సాహితి వేత్తలు లేకుండా ప్రత్యేకంగా జరిగింది. కవితాసంపుటిని చిన్ననాటి స్నేహితుడు కుందుం ప్రకాశరావుగారితో ఆవిష్కరింపజేసారు. చెక్కుచెదరని అరవై ఏళ్ళ స్నేహాన్ని ప్రకటించుకుంటూ మిత్రులు రామడుగు రాధాకృష్ణ మూర్తిగారికి, మల్లేష్ కు, బాలాజీ ప్రెస్ బాల ప్రసాద్ కు పదిహేను వేల నగదు , వస్త్రాలతో గౌరవించారు. కవితా సంపుటి అంకితం కుందుర్తి సత్యమూర్తిగారి శ్రీమతి కుందుర్తి శాంతకు అందజేసారు. తర్వాత ఆవిష్కృతసంపుటిలో నుండి కొన్ని కవితలు వీర్రాజు గారు చదివారు. వినూత్నంగా జరిగిన ఆ సమావేశానికి చాలామంది కవులు, రచయితలూ హాజరయ్యారు. ఆ విధంగా వీర్రాజు గారి డెబ్భై అయిదవ పుట్టినరోజు , యాభై ఎనిమిదేళ్ళ సాహిత్య జీవన సందర్భం విజయవంతంగా జరిగింది.
దశాబ్దాల తెలంగాణా పోరాటం సాకారమైంది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా, లోక్సభలో ఎన్నో నాటకీయ పరిణామాలు అనంతరం 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణా రాష్ట్రం నూతనంగా అవతరించింది. రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. దేశ స్వాతంత్రంవచ్చిన నాటికి నేను పుట్టలేదు. ఆంధ్రరాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి చిన్నదాన్ని. సుదీర్ఘ పోరాట ఫలితంగా రాష్ట్రం సాధించుకోవటాన్ని ఈ నాడు చూసాను. పోనీలే తెలంగాణ వారు కోరుకుంటున్నట్లు రాష్ట్రం ఏర్పడింది. ఇంక వైషమ్యాలు , ద్వేషాలు తగ్గుతాయి. ఎవరి రాష్ట్రం వాళ్ళకు వచ్చింది. అనుకున్నాం .
జనరల్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో గెలిచినవి రెండే పార్టీలు. విభజన ప్రక్రియలో భాగస్వామ్యం వున్న కాంగ్రెస్ , బీజేపీలను మట్టిగరిపించారు. దాంతో కాంగ్రెస్ పెద్దలు కండువాలు మార్చేసారు.
తెలంగాణాలో 119 సీట్లకు63 సీట్లవిజయం సాధించి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రతిపక్షపార్టీగా కాంగ్రెస్ నిలిచింది. టిడీపీ15 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. బీజేపి, వైకాపా, కమ్యూనిస్టు పార్టీల నుండి కూడా బాగానే గెలిచారు. కానీ తర్వాత్తర్వాత ఒకరొకరే ఆపరేషన్ ఆకర్ష్ లో సమిధలై అధికార పార్టీలోకి దూకేసారు.
15వ లోక్‌సభ ఎన్నికలు 2014 మే 31న పూర్తి చేసి మే 16న ఫలితాలు ప్రకటిం చారు. భారతీయ జనతా పార్టీ (BJP) 282 సీట్లను గెలుచుకోగా, (NDA) మొత్తం 336 సీట్లను గెలుచుకుంది. 1984 తర్వాత ఒక పార్టీ ఇతర పార్టీల మద్దతు లేకుండా పరిపాలించడానికి తగినంత సీట్లు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్ కేవలం 44 సీట్లను మాత్రమే గెలుచుకుంది, ఆ విధంగా మిగులు ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు, తెలంగాణా రాష్ట్రానికి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ తొలిసారి ప్రమాణస్వీకారం జరిగింది.
ఒకరోజు హైమవతీ భీమన్న గారి నుండి వీర్రాజు గారికి ఫోను వచ్చింది.
” పద్మభూషణ్ బోయి భీమన్న సాహితీ పురస్కారానికి వీర్రాజుగారిని ఎంపిక చేసినట్లు చెప్పారు. సెప్టెంబర్ 19వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని బోయి భీమన్న సాహితీ పీఠం ఆధ్వర్యంలో జరిగే భీమన్న 104వ జయంతి ఉత్సవంలో డాక్టర్ సి.నారాయణరెడ్డికి బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం క్రింద రెండు లక్షలూ, పద్య కవితా పురస్కారానికి రసరాజు, గేయ కవితకు గూడ అంజయ్య, వచన కవితకు శీలా వీర్రాజు, నాటకానికి పాటిబండ్ల ఆనందరావు, కథ, నవలకు కేశవరెడ్డి, అనువాదా నికి నలిమెల భాస్కర్, ఉత్తమ రచయిత్రి పురస్కారానికి పి. సత్యవతిలకు లక్ష రూపాయలు చొప్పున అందజేసారు. వీర్రాజుగారి సంతోషానికి అవధులు లేవు. తొలిసారి బహుమతిగా లక్ష అందుకోవటం అంటే మాటలు కాదు కదా.
తర్వాత దగ్గరలోనే చలసాని వసుమతిగారి అవార్డు కూడా వీర్రాజు గారికి వచ్చింది. కారులో అందరం బయలుదేరాం. మంచిహొటల్లో మా కోసం రెండు రూములు బుక్ చేసారు. ఆ రోజు సాయంత్రమే సభ. వీర్రాజుగారితో పాటూ విహారిగారికి కూడా మరో ఏడాదికి ఇచ్చారు. పురస్కార సమావేశం, భోజనా లు పూర్తై వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. వచ్చి పడుకున్నాం. మర్నాడు విజయవాడ పరిసరాలు చూసేం దుకు బయలుదేరాం. దుర్గగుడికి ముందు వెళ్ళాం. చాలా రెష్ గా వుంది. నేనూ, పిల్లలూ లోపలికి వెళ్ళాం. వీర్రాజుగారు లోపలికి రాలేదు. దారిలో భోంచేసి మంగళగిరి, అమరావతి వెళ్ళాము. దారిలో తుళ్ళూరు, తాడేపల్లి మొదలైన తోవలలో చేలల్లో నిలువెత్తు కంకులతో పైర్లను చూసి కారును ఆపించి ఫొటోలు తీసుకున్నాము. ఎప్పుడూ అలా చేలూ, పైర్లు చూడలేదేమో ఆ పచ్చదనానికి సరదాపడి మైమరచి పోయాము. ఇక ఆ మర్నాడు వసుమతి గారి ఇంటికి వెళ్ళి అక్కడే భోజనం చేసి హైదరాబాద్ కి తిరుగుముఖం పట్టాము.
ఇంటికి చేరిన మరురోజు వార్తలు వింటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తుళ్ళూరు, అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించినట్లు చెప్పేసరికి నిన్న ఆ ప్రాంతాల్లోనే తిరిగాము కదా అని థ్రిల్లింగ్ గా అనుకున్నాము.
మళ్ళా అనుకోకుండా దగ్గరలోనే ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్ గారు తమ సంస్థ ద్వారా బాపురమణల పురస్కారం వీర్రాజుగారికి ఇవ్వాలనుకుంటున్నామని ఆహ్వానించారు. ఈ సారి నేనూ, వీర్రాజు గారు విజయవాడ వరకూ ట్రైన్లో వెళ్ళాము. స్టేషనుకు గుత్తికొండ సుబ్బారావుగారు వచ్చి కారులో మచిలిపట్నం వాళ్ళింటికి తీసుకు వెళ్ళారు. సాయంత్రం ఉయ్యూరు సభా సమావేశానికి తీసుకు వెళ్ళారు. దుర్గా ప్రసాద్ గారు చాలా ఆత్మీయంగా సత్కరించారు. దుర్గాప్రసాద్ గారికి మా పుస్తకాలు ఇచ్చాము. ఆశ్చర్యకరంగా కొన్ని రోజులకే దుర్గాప్రసాద్ గారు మా పుస్తకాలపై సుదీర్ఘ విశ్లేషణలు రాసి వారి బ్లాగ్ లో పోస్ట్ చేసారు.
మర్నాడు సుబ్బారావు గారు మమ్మల్ని పరిసర ప్రాంతాలైన ఘంటశాల, శ్రీకాకుళం తీసుకు వెళ్ళి అన్ని చూపించారు. అనంతరం సాయంత్రం ట్రైనుకు మమ్మల్ని తిరుగు ప్రయాణానికి స్టేషన్లో బండి ఎక్కించారు.
*****

జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద మంది కవయిత్రుల కవితల సంకలనం ” ముద్ర” కు డా.పి.భార్గవీరావు తో కలిసి సహసంపాదకత్వం వహించారు.ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసారు.