నా జీవన యానంలో- రెండవభాగం- 57
-కె.వరలక్ష్మి
‘‘లోకులు తొందరగా నిందిస్తారు లేదా, తొందరగా అభినందిస్తారు. అందుచేత ఇతరులు నిన్నుగురించి అనుకునే మాటలకు పెద్దగా విలువ ఇవ్వవద్దు.’’
‘‘ఇవ్వడం నేర్చుకో – తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో – పెత్తనం కాదు.’’ అంటారు రామకృష్ణ పరమహంస.
2014 జనవరి 14 న సీనియర్ నటి, తెలుగువారి సీతాదేవి అంజలీదేవి మద్రాసు లో కాలం చేసారు. జనవరి 22న సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వర్రావు కాలం చేసారు. ఇద్దరు ఒకే కాలం నటీనటులు. 90 ఏళ్లుపైగా జీవించారు.
నా అవార్డు విషయం హైదరాబాద్ పత్రికల్లో ప్రముఖంగా వేసారు. మావూరు ప్రతికా విళేఖరులు ఆ వార్తలోకల్ టాబ్లాయిడ్స్ లో వేస్తామని, డబ్బులు ఇమ్మని అడిగేరు. వద్దని చెప్పేను. ఫిబ్రవరిలో జొన్నవిత్తుల శ్రీరామ చంద్రమూర్తి విహంగవెబ్ మేగజైన్ లో ఇంటర్వ్యూకోసం కొన్ని ప్రశ్నలు పంపేడు. నేను ఆన్సర్స్ పంపించేను.
భూమికి ఎడిటర్ కె. సత్యవతిగారు ఫిబ్రవరి నెల భూమిక పత్రిక పైన సుశీలా నారాయణ రెడ్డి అవార్డు అందుకున్న నాది, లోక్ నాయక్ అవార్డ్ అందుకున్న ఓల్గాది, సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న కాత్యాయనీ విద్మహేది ఫోటోలు వరసగా వేసి జనవరిలో తెలుగు సాహిత్యంలో ముగ్గురు ప్రముఖ మహిళల్ని వరించిన అవార్డులు అంటూ వివరాలు రాసి, మా ఇంటర్వ్యూలు ప్రచురించారు.
ఫిబ్రవరి 18న లోక్ సభలో రాష్ట్రవిభజన బిల్లు పాసైపోయింది. నా చిన్ననాటి స్నేహితురాలు (ఒకటి నుంచి 11 వ తరగతి వరకూ కలిసి చదువుకున్న) లీలావతి 2013 చివర్లో చాలా దీనస్థితిలో మరణించిందట. దిగువ మధ్య తరగతి నుంచి బాగా డబ్బున్న కుటుంబంలోకి కోడలుగా వెల్లి అక్కడి నుంచి కిందికి అతిదీన స్థితిలోకి జారిపోయిన కథ తనది. శృంగవరపు కోట తన అత్తవారిది. తన పరిస్థితి తెలిసి, వచ్చి నాతో ఉండమని ఎన్నోసార్లు ఉత్తరాలు రాసేను. ఫోన్లు చేసేను. కాని, తను రాలేక పోయింది. చాన్నాళ్లు ఆ బాధ వెంటాడింది నన్ను.
విశాఖ రేడియో వారు అడిగిన కవితల్ని చదవడానికి రమ్మని పిలిచేరు. జనవరి 18న వెళ్లి రికార్డింగ్ కి అటెండయ్యాను. గుంటూరు నుంచి పెనుగొండ లక్ష్మీ నారాయణ గారు చెప్పగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ఎప్పుడో పంపిన నా కథలు ‘క్షతగాత్ర’ పైకి తీసేరు. మేనేజరు ఏటుకూరి ప్రసాద్ గారు ఫోన్ చేసి త్వరలో బుక్ ప్రింటింగ్ కి వెళ్తుందని చెప్పేరు. రాష్ట్ర విభజన వల్ల ఆలస్యమైందట. వాళ్ల ప్రెస్ నుంచి పేరు తెలీని ఒకతను ఫోన్ చేసి, బహుశా తెలంగాణా వ్యక్తి కాబోలు –‘‘ఇప్పుడిది విశాలాంధ్ర కాదు. ఆంధ్ర నుంచి మేం విడిపోయాం. మీ ఆంధ్రావాళ్ల పుస్తకాన్ని మేం ఎందుకు అచ్చువెయ్యాలి?’’ అని గొంతుపెంచి అడిగి ఫోన్ పెట్టేసాడు. నేనిచ్చిన ముఖచిత్రాన్ని కూడా మార్చేసారు. ఏమైనా థేంక్స్ టు విశాలాంధ్ర అనుకున్నాను. ఏటుకూరి ప్రసాద్ గారికి, అరసంలో పెనుగొండ, వల్లూరులకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సొంతంగా పుస్తకాలు వేసినా, వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే కెపాసిటీ లేదు నాకు.
2014 లో జరిగిన ఎన్నికల ఫలితాలు ఆ సంవత్సరం మే 16 న వచ్చాయి. రాష్ట్రంలో తెలుగుదేశం గెలిచింది, కేంద్రంలో ఎన్.డి.ఏ. కి అత్యధిక మెజార్టీ వచ్చి మోడీ గారు ప్రధాని అయ్యాడు. ఆ ప్రమాణ స్వీకారాన్ని ఆంధ్రాలో విద్యుత్ సమ్మె మూలంగా ఎవరం చూడలేకపోయాం. తెలంగాణా శాసన సభ మే 2 నుంచి ఆంధ్రా శాసనసభ జూన్ 8 నుంచి ప్రారంభమయ్యాయి. 1942 లో బెంగాల్ లోని ఉత్తరపరాలో ప్రారంభమైన అంబాసిడర్ కార్లకంపెనీ, 1970-80 లలో ఏడాదికి 75% అమ్మకాలతో ప్రథమస్థానంలో నిలిచిన కంపెనీ క్రమంగా పోటీలో నిలవలేక 2014 మే లో ఆగిపోయింది.
ఆగష్టు 31న ప్రఖ్యాత చిత్రకారులు, సినీ దర్శకులు బాపు మద్రాసులో కాలం చేసారు.
సెప్టెంబరు 22న శాంత సుందరిగారు ఫోన్ చేసి, ఆవిడ హిందీలోకి అనువదిం చిన నా కవిత ‘నేను’ ను కేరళ కాలికట్ యూనివర్సిటీ బి.ఏ. పాఠ్యాంశంలో చేర్చిందని చెప్పేరు.
అక్టోబరు 11 రాత్రి నుంచీ శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి ప్రారంభ మైన హుద్ హుద్ తుఫాను 12 మధ్యాహ్నానికి తూర్పుగోదావరిని తాకింది. విపరీతమైన గాలుల్తో చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయి, కరెంటు, రైళ్లు, బస్సులు అన్నీఆగిపోయి అల్లకల్లోలం అయిపోయింది. నవంబర్ లో ఒకరోజు డైరెక్టర్, రచయిత వంశీ ఫోన్ చేసి వేమూరి సత్యం గారు ‘ఆనాటి వాన చినుకులు’ శీర్షికతో ఒక కథా సంకలనం తెస్తున్నా రని, ఆయన దగ్గర నా ఫోన్ నెంబర్ లేక తనని చెప్పమన్నారని, అర్జెంటుగా ఒక కథ రాసి పంపమని చెప్పేడు. నేను ‘సరే’ అని వెంటనే రాసి పంపేను. అలా ఆ సంకల నంలో నా కథ కూడా చేరింది.
ఒక్కొక్క రచన మనల్ని ఒక్కోలా ప్రభావితం చేస్తుంది. ఒకరోజు ఆంధ్రజ్యోతి వేసిన కథ-నేపథ్యం పుస్తకంలోని అల్లం రాజయ్యగారి ‘మనిషి లోపలి విధ్వంసం’ కథ చదివినప్పుడు చాలా చలించిపోయాను, ‘‘విధ్వంసం గాని, నిర్మాణం గాని, చావు పుట్టుకలుగాని వ్యక్తిగతమైనవి కావు. వ్యవస్థాగతమైనవి. ఏకకాలంలో కొనసాగేవి కావు. జీవితకాలమంతా నిరంతరంగా కొనసాగేవి’’ అంటాడు రచయిత. అప్పటికి ఒక ఒంటరితనంతో, మితిమీరిన సెన్సిటివిటీతో నన్ను నేనే విధ్వంసించుకుంటూ, లోలోపల పేరుకుంటున్న అంతులేని దుఃఖంలోకి కూరుకుపోతున్న నాకొక సమాధానం దొరికినట్లైంది. బహుశా ఈ ఒంటరి జీవితం మీద ఒక కథ రాస్తాను. విశాఖపట్నం ఆలిండియా రేడియో నుంచి మధుగారు ఫోన్ చేసి కథ ఉంటే పంప మన్నారు. ఆనాటి వాన చినుకులు పుస్తకం రావడం ఎలాగూ ఆలస్యమౌతుంది కాబట్టి, వాళ్లకు పంపిన ‘అఘాడీ’ కథనే రేడియోకి పంపేను.
2015 వ సంవత్సర వచ్చేసింది, జనవరి 5న గుంటూరు నుంచి రచయిత్రి లలితాశేఖర్ ఫోన్ చేసి ‘‘సంక్రాంతి వెళ్లేక ఒక గెట్ టుగెదర్ లాగా మా ఇంట్లో కలుసు కుందాం. మీరు తప్పక రావాలి’’ అన్నారు. ‘సరే’ అన్నాను. 23న గెట్ టుగదర్. 21 మధ్యాహ్నం నిద్రపోయి లేచేసరికి కడుపులో ఏదో అనీజీ. ఆ ఉదయం మా మాస్టారు నూజిళ్ల లక్ష్మీ నరసింహంగారి వర్థంతి జరిపి ఆయన పేరున నాకొక అవార్డు, జ్ఞాపిక ఇచ్చారు మాస్టారి పిల్లలు, హరే రామ మందిరంలో. అక్కడ భోజనం చేసి వచ్చాను. పొద్దు పోయేసరికి వామిట్స్, మోషన్స్ పట్టుకున్నాయి. ఇక ఆ రాత్రంతా నిద్రలేదు. 22 తెల్లవారే సరికి చాలా నీరసించిపోయాను. వీరలక్ష్మిగారు కాకినాడ నుంచి బయలుదే రితే నేను సామర్లకోట బస్టాండ్ దగ్గర కలుస్తానని చెప్పేను. కాని, వెళ్లలేననిపించింది. టేబ్లెట్స్ వేసుకుని పడుకున్నాను, లలితగారు ఫోన్ చేస్తే అదే చెప్పేను –‘‘సారీఅండి. ఈ సారికి ఏమీ అనుకోవద్దు’’ అని. మధ్యాహ్నం 1.30 కి వీరలక్ష్మిగారు అటు రంగం పేట మీంచి వెళ్లిపోకుండా జగ్గంపేట వచ్చి నన్ను తన కారులో ఎక్కించుకున్నారు.
ముందుగా రాజమండ్రిలోని ధూళిపాళ అన్నపూర్ణగారింటికెళ్లి, అక్కడినుంచి మల్లంపల్లి వారింటికి వెళ్లి, బొమ్మూరు తెలుగు యూనివర్సిటీ ముందునుంచి హైవేలో గుంటూరు చేరేసరికి రాత్రి 10 అయ్యింది, లలితగారు నిన్నటి నుంచి ఫోన్లు చేసి నా గురించి కనుక్కుంటూనే ఉన్నారు. నన్ను చూసేక స్థిమితపడ్డారు. అక్కడికెళ్లేక నాకు అర్థమైంది నేను కాలిఫోర్నియాలో గీత ఇంట్లో తరచుగా కలిసిన లలితగారి పిన్ని రేణుకగారు వచ్చి ఉన్నారని, ఆవిడ నన్ను కలవాలని అన్నారని. లలితగారు కూడా నా కథలు చదివి నా మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పరచుకున్నారు. రేణుక గారిది లలితగారి పక్క ఇల్లే. ఒకే కాంపౌండ్ లో. రాత్రి మా బస రేణుకగారింట్లోనే. 23 ఉదయం లలితగారి పెద్ద కోడలు కమ్మగా చేసిపెట్టిన టిఫిన్స్ తిని 10 కి కింద హాల్లోకి వచ్చాం. రచయితలు మిత్రుల్తో ఒక చిన్న సమావేశం లాంటిది జరిగింది. పెనుగొండ లక్ష్మీనారాయణగారు, వల్లూరు శివప్రసాద్, పెనుమాక నాగేశ్వర్రావు, ఎస్.వి.ఎస్. లక్ష్మీ నారాయణ, డాక్టర్ రామ్మూర్తి గార్లు శ్రీమతుల్తో కలిసి వచ్చారు. తెనాలి నుంచి సి. సుజాత వచ్చింది. అందరికీ గులాబీలు గుత్తులు ఇచ్చి, హారతుల్తో, మగవారికి బట్టలు, ఆడవాళ్లకి చీరలు ఇచ్చి సన్మానించేరు లలితగారు. ఆవిడకు అది గొప్ప ఆనందం. మధ్యాహ్నం చక్కెర పొంగలి, వడలు, పుల్హార వంటి పదార్థాలతో రుచికరమైన భోజనాలు, సభలో నా కథల గురించి పెనుగొండ, లలితగారు చాలా బాగా చెప్పేరు. అరసం చేస్తున్న పదేసి కథల పుస్తకాల ప్రోజెక్ట్ కి నా కథలు ఇమ్మని అడిగేడు వల్లూరి. మరొక రచయిత ఎవరైనా కథలు ఎంపిక చెయ్యాలట. అలా వచ్చిందే అరసం వారి కథా స్రవంతిలో నా పది కథల పుస్తకం. సాయంకాలం వరకూ మళ్లీ రేణుక గారింట్లో పాటలు, కబుర్లు. పూనా నుంచి వచ్చిన అమరేంద్ర ఉదయం నుంచి సభా కార్యక్రమా లకు సంధానకర్త. వైష్ణవి ఒక్కొక్కరి మీదా ఒక్కొక్క ప్రత్యేకమైన పాట పాడి అలరిం చింది. అమరేంద్ర, రేణుకగారు అందరూ చక్కని పాటల్తో వీనుల విందు చేసారు. సాయంత్రం 6. గంటలకి తిరిగి కారెక్కి రాత్రి 12 కి కాకినాడ లో వీరలక్ష్మి గారింటికి చేరుకున్నాం. నేను ఉదయం ఇంటికెళ్లేను.
*****