పరువు

(నెచ్చెలి-2025 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

-చిట్టత్తూరు మునిగోపాల్

          అడవి కలివిపండు మాదిరి నల్లగా నిగనిగలాడే బుగ్గలు లోతుకు వెళ్లిపోయాయి. చిన్న పిల్లోళ్లు కాగితం మింద బరబరా తీసిన పెన్సిలు గీతల్లా కళ్ళకింద చారలుతేలాయి. ఒత్తుగా రింగులు తిరిగి తుమ్మెదల గుంపులా మాటిమాటికీ మొగం మీదవచ్చి పడే జుట్టు పలచబడి నుదురును ఖాళీ చేసి వెనక్కి వెళ్ళింది. నల్ల కలువలాగా ఎప్పుడూ నవ్వుతో విరబూసి కనిపించే మొగం వాడి వేలాడిపోతోంది. ఆ కళ్ళనిండా ఏమిటవి.. ఎడారులా? లేక నడిచి వచ్చిన దారుల వెంట బతుకు నిండా అంటిన పల్లేరుగాయలా?

          ఆ పిల్ల ఈ పక్కే వస్తోంది. అంతటి ఎడారి ముఖంలోనూ ఏదో సంభ్రమం. కాలంలో తప్పిపోయిన మనిషి దొరికిన ఉద్వేగం.

          ఆ సంభ్రమం, ఉద్వేగం.. నన్ను చూసినందుకేనా?

          భయం వేసింది.. మామూలు భయం కాదది. సంఘ భయం.

          ఆ పిల్ల పలకరించి ఊరుకునే రకం కాదు. చాలా దగ్గరగా దాదాపు మీద పడిపోయి నట్లుగా నిలబడుతుంది. నా రెండు చేతులనూ తన రెండు చేతులతో పట్టుకుని ఊపేస్తుంది. అన్నింటికీ మించి అయినదానికీ కానిదానికీ పకపకా నవ్వేస్తుంది. అంతేనా, ఎవరి గురించి చెప్పాలన్నా ఎదురుగా మనలనే ఆ మనిషిగా భావించి డైరెక్ట్ స్పీచ్ ఇస్తుంది. అంటే ఆ చెప్పదలచుకున్న మనిషిమీద ఉండే కోపం, తాపం, నిష్టూరం, కష్టం, ఇష్టం.. అన్నీ మనమీదనే చూపించేస్తుంది.

          అమ్మో.. ఇంకేమన్నా ఉందా? ఈ పిల్లతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా చూస్తే? చూసి మా ఆవిడకు చెప్పేస్తే…

          అదికూడా కాదు… ఆవిడకు చెప్పినా, చెప్పకున్నా ఈ పిల్లతో నేను మాట్లాడడం చూసినవాళ్ళ దగ్గర ఎంత చులకన అయిపోతాను!

          గబగబా రెండు అడుగులు మిట్టమీది నుంచి ముందుకు వేసి, మసీదు సందులోకి తిరిగేశాను.

          “గోపన్నా.. ఓ గోపన్నా..” పిలవనే పిలిచింది. కానీ నేను అప్పటికే సందు మలుపు తిరిగేశాను. బైక్ ఎక్కి స్టార్ట్ చేశాను కూడా.

          “సార్, మిమ్మలని ఎవరో అమ్మాయి పిలుస్తోంది.” దారిన పోతున్న దానయ్య ఎవడో భుజం తట్టి మరీ చెప్పాడు.

          అయినా పట్టించుకోకుండా ముందుకు కదిలే వాడినే కానీ, అప్పటికే ఆపిల్ల సుడి గాలిలా దూసుకొచ్చి బైక్ ఎదురుగా అడ్డం నిలబడింది.

          “గోపన్నా పిలస్తా వుంటే ఆమాదిరిగా ఎల్లబారి వొచ్చేస్తావేంది? ఎన్నాళ్ళయిందినా నిన్ను జూసి, నాదబావ ఎట్టా ఉండాడునా? రామక్క బాగుండాదా? ఏందినా.. నువ్వీ మాదిర్తో ఎంకలు తేలి బక్కపీనుగ మాదిర్తో అయిపొయ్యినావు?” నేనెక్కడ సందుగొందుల్లో దూరి కనిపించకుండా మాయమైపోతానేమో అని చాలా స్పీడుగా పరుగెత్తి వచ్చిందేమో.. బాగా వగరుస్తోంది. వగురుస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది. రెండు మోకాళ్ళ మీదా చేతులు ఆనించుకుని నడుం విల్లులా వంచి గస తీర్చుకుంది.

          జంకుగా అటుఇటు చూశాను. నా అదృష్టం, ఆ చిన్న సందులో పెద్దగా జన సంచారం లేరు. అన్నింటికంటే మించి, నాకు పరిచయస్తులెవరూ ఇటుగా వచ్చే ఛాన్స్ లేదు. ఈ పిల్లను వదిలించుకోవాలి ఎలాగైనా. బలంగా గాలి పీల్చుకున్నాను.

          “ఎవరమ్మా నువ్వు? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో. పక్కకు తప్పుకో నేను వెళ్ళాలి, అర్జెంట్ గా.” గేరు మార్చి బండి ముందుకు కదిలించాను.

          “నేను నా, ఇడ్లీ అంగిడి కైలాసమ్మ కడగొట్టు కూతురు బుజ్జమ్మను. నాదబావతో గూడా మా అంగిడికి నువ్వు వొచ్చినప్పుడు, నీకు దొంగతనంగా వడ తెచ్చి ఇచ్చేదాన్ని, పిప్పరమెంట్లు పెట్టేదాన్ని… ఆ బుజ్జమ్మను నా.” మోకాళ్లను పట్టుకున్న చేతులు వదిలేసి, మరింత దగ్గరగా వొచ్చేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అంది ఆ పిల్ల.

          “చూడమ్మా, ఇది బజారు. ఇట్లా తెలియని మనుషులను పట్టుకుని వేధించడం మర్యాద కాదు. ఇదిగో.. కావాలంటే ఇది ఉంచుకో.” షర్ట్ జేబులోంచి పది రూపాయల నోటు తీసి ఆ పిల్ల మీదికి విసిరేసి, బండిని ముందుకు దూకించాను.

          హేండిల్ పట్టుకున్న ఆ పిల్ల అది ఊహించకపోవడంతో తూలి కిందపడబోయి నిలదొక్కుకుంది. వెనుక, అసలే అక్కడక్కడా తెల్లటి మచ్చలతో ఉన్న ఆమె ముఖం మరింత పాలిపోయి ఉంటుందని నాకు తెలుసు.

***

          ఎండ ప్రచండంగా కాస్తోంది. రచ్చబండ వేపమాను మీద కాకులు దాహంతో కాబోలు ఒకటే అరుస్తున్నాయి. బస్సు దిగి వాటి అరుపులు వింటూనే నాకు కూడా పిడచకట్టుకు పోయిన నాలుక గుర్తుకొచ్చింది. ఆయాసంగా అనిపించి, మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి, రోడ్డు వారగా ఉన్న రచ్చబండ మీద కూలబడ్డాను.

          అప్పటికే అక్కడ కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్న ఇద్దరుముగ్గురు మనుషులు తలలు తిప్పి నావంక ఒకసారి చూసి, తిరిగి మాటల్లో పడ్డారు. ఒకనాటి పల్లెటూరు కాదు ఇది. మనుషులు, మనుషులను పట్టించుకోవడం మానేశారు ఎప్పుడో, అనిపించింది.

          “పాప ఎదిగి మూడు రోజులవుతోంది. ఎంత వద్దనుకున్నా- దాని అత్తలు, మామలు, మా అమ్మావాళ్ల తరపు, మీ అమ్మావాళ్ళ తరఫు వాళ్ళను కనీసం యాభై, వంద మందినైనా పిలవాలి కదా ఫంక్షన్ కు. బోడి మెడతో ఎక్కడ కూర్చోబెట్టేది పిల్లను. కుదవబెట్టిన నగల్లో ఒక ఛైను, ఉంగరమైనా వెనక్కు తీసుకోవాలి. ఫంక్షన్ అయ్యేదాకా ఇంట్లో కనీసం పదీ పదిహేను విస్తర్లు లేస్తాయి. వీటన్నింటికీ దుడ్లు కావాలి కదా. ఏం చేయాలనుకుంటు న్నారు?” నా భార్య మాటలు మరోసారి మననం చేసుకున్నాను.

          అవడానికి స్వంత ఊరే అయినా నాయన చనిపోయాక ఇటుపక్క వొచ్చి సుమారు పదేళ్లపైగా అయిపోయింది. చిన్నప్పుడు కూడా పక్కనే ఉన్న పట్నంలో అత్తావాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోవడం వల్ల ఊరి జనాలకు చాలామందికి నా రూపురేఖలు తెలియవు. అందుకనే నన్ను ఆ రచ్చబండ మీదున్న వాళ్ళు గుర్తుపట్టలేదు.

          “అనా, ఇక్కడ రమణారెడ్డి ఇల్లు ఎక్కడనా?” అడిగాను కొంచెం సేపు చూసి.

          “ఎవురబ్బా నువ్వు? ఈపక్క ఎక్కడా సూడలేదే నిన్ను?” ఆ మనుషుల్లో ఒకాయన ఇటు తిరిగి అడిగాడు.

          “అవునబ్బా, నువ్వు నాదముని కొడుకువి గదా?” ఒక పెద్దాయన రెండు కనుబొమల మీదుగా నుదుటి మీద అరచేయి ఉంచుకుని, కళ్ళు చిట్లించి దీక్షగా చూస్తూ అన్నాడు.

          కనీసం ఒక్క మనిషి అయినా గుర్తించాడు. నా ప్రాణం లేచివచ్చినట్లు అయింది.

          “అవున్నా, నేను నాదముని కొడుకునే.” చెప్పాను.

          “అదీ, ఆ మాదిరిగా చెప్పు. నేను నిన్ను చూసినపుడే అనుకున్నా. ఆ సూటి ముక్కు, ఎగలాగినట్టుండే చెక్కులు, నడినెత్తిన జుట్టు పల్సన అయిందికానీ క్రాఫు గూడా అచ్చం నాదమామ పోలికే.” నాయన రూపురేఖలతో నా రూపురేఖలను పోలుస్తూ చిన్న వర్ణన చేసేశాడు ఆయన్న. శ్రీనాథుడు, పోతనలకు ఏం తక్కువ, ఈ పల్లె జనం అనుకున్నా.

          “అమ్మా, నాయినా బాగుండారా? మ్మేయ్ శశీ, చెంబుడు నీళ్ళు తెచ్చి ఈయబ్బ య్యకు ఇయ్యి మే. దాహంతో ఉండాడు.” క్షేమసమాచారాలు ఆరాతీస్తూనే, ఎండిపోయిన పెదవులు తడుపుకుంటున్న నన్ను చూసి ఒక పుణ్యాత్ముడు పక్కనే ఉండే ఇంటి ముంగిటికి వెళ్ళి కేకవేశాడు.

          “అవున్నాయనా, అప్పుడెప్పుడో నిన్ను బూమి అడిగింది నిజిమే. అప్పుడు నువ్వు కాదన్నావు. ఇప్పుడు జూడు, మీ నాయిన రెక్కల కస్టింతో సంపార్చిన  బూమి, పక్కనుండే ఎర్రబ్బ బూమిలో కలిసిపోయింది. ఈ సంగతే చెప్పి ఎచ్చరిద్దామని నీకు రొండు మూడు తూర్లు ఫోన్ జేస్తే నువ్వు తియ్యలా.” చావు కబురు చల్లగా చెప్పిన రమణారెడ్డి వంక చూడలేక తల వంచేసుకున్నాను.

          రచ్చబండ దగ్గరనుంచీ నేరుగా ఈయన దగ్గరికే వస్తే ఇదీ కథ. అది పక్కా పట్టా భూమి. రీ సర్వేలో గోల్మాల్ జరిగిందో ఏమో, తెలియదు. మా నాయన మిగిల్చి పోయిన ఆ మూడు గుంటల భూమి మీది ఆశలు కూడా ఆవిరి అయ్యాయి. పైకి అర్జీ పెట్టి, నా దగ్గరున్న సెటిల్మెంట్ పట్టా ఆధారంగా చూపించి భూమి స్వాధీనానికి ప్రయత్నించ వచ్చు కానీ, అదిప్పట్లో జరిగే పని కాదు.

          నాకళ్ళ ముందు ఎదిగిన కూతురు ముఖం దీనంగా కనిపించింది. వెళ్ళి విషయం చెబితే, భార్య కంటికి కడివెడు కార్చే కన్నీళ్లలో కొట్టుకుపోతున్నాను.

          ఇక చేసేదేమీ లేదు. లేచి కాళ్ళు ఈడ్చుకుంటూ రోడ్డు మీదికి బయలుదేరాను. “కాపీ తాగేసి పోదువు ఉండబయా..” అంటానే ఉండాడు వెనుకనుంచీ రమణారెడ్డి. ఆగలేదు నేను. తిరిగి చూడకుండా నడుస్తున్నాను.

          రామమందిరం దగ్గరకు వచ్చేసరికి నాలుగు వీధుల కూడలిలో సీతలాంబ రాయి కనిపించింది. ఊరి అమ్మవారు. పసుపు పూసి, కుంకమ బొట్లు పెట్టి, సాంబ్రాణి ఒత్తులు వెలిగించి ఉండారు. నా కాళ్ళు అక్కడ ఆగిపోయాయి. ఎన్నడూ లేంది, అప్రయత్నంగా నా చేతులు రెండూ పైకి లేచి ఆయమ్మకు మొక్కాయి. కళ్ళు రెండూ ఎన్నడూ లేని భక్తి నింపుకుని మూతలు పడ్డాయి. రెండుమూడు క్షణాలు అలా ఉండిపోయి కళ్ళు తెరిచి చూద్దును కదా, ఎదురుగా అల్లంత దూరంలో కనిపించింది లీలగా ఒక మొగం. అది ఎవరిదో పోల్చుకుని అదిరిపడ్డాను. ఆమె నిలిచిన వాకిలి ఇడ్లీ అంగడి కైలాసమ్మది. వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఊరు విడిచి వెళ్లారని విన్నానే. మొగం తిప్పేసుకును చకచకా నడవసాగాను. అల్లంత దూరంలో కనిపించే రోడ్డుమీదికి చేరాలంటే ఆ ముంగిలి దాటుకునే వెళ్ళాలి.

          “గోపన్నా, ఇంతదూరం వచ్చి, ఇంటికి రాకండానే ఎక్కడికినా అట్టా పరుగులు పెడతా ఉండావు? అమ్మ పిలస్తా ఉండాది రానా.” చూడనట్లుగా వాకిలి దాటుకుని వెళ్తున్న నన్ను చెయ్యిపట్టి ఆపేసింది ఆపిల్ల. మొన్న టౌన్లో అయితే తప్పించుకోగలిగాను కానీ, ఇక్కడ వీలుకాదు.

          “బాగుండావా బుజ్జమ్మా!” ఇబ్బందిగా నవ్వి అప్పుడే చూసినట్లు పలుకరించాను.

          “బాగుండానా. రా లోపలికి. కాపీ తాగేసి ఎల్దువు గానీ.” చేతిని విడవకుండా అడవి కంపలతో కట్టిన హద్దు దాటించి పందిలి కిందకు తీసుకుని వెళ్ళింది.

          “బాగుండావా అబయా? ఎన్నాళ్ళయింది నిన్ను జూసి. నాయిన పోయినప్పుడు గూడా చెప్పకపోతివి. అనాక తెలిసి ఎంత బాదపడ్డానో. రా వొచ్చి ఇట్టా కూకో.” ఆప్యాయం గా పలుకరించిన ఆవిడకేసి బాగా పరీక్షగా చూస్తేగానీ గుర్తుపట్టలేకపోయాను. అవును ఆయమ్మే, అంగడి కైలాసమ్మ. సన్నటి శలాకలా ఉండే కైలాసమ్మ, నడుం వంగి. చేతికర్రతో ముడుతలుపడ్డ దేహంతో సన్నగా వణుకుతోంది.

          “బాగుండానకా? మీరు బాగుండారా? ఎంగటయ్య ఏం జేస్తా ఉండాడు ఇప్పుడు?” ఏదోఒకటి మాట్లాడాలి కాబట్టి అడిగాను.

          “వోడి కత ఏం జెప్పేదిలే నాయినా. పెళ్లి కావాల్సిన చెల్లిని, ఈ ముసిలిదాన్ని ఇడసిపెట్టి, పెళ్ళాం కొంగుబట్టుకోని దేశాలు పట్టి పొయ్యాడు. ఇదిగో, దీని బతుకు బండలైతేగానీ నోట్లోకి నాలుగు వేళ్ళు ఎల్లడం ల్యా.” అప్పుడే పెద్ద స్టీలు గ్లాసుతో కాఫీ తీసుకునివచ్చిన బుజ్జమ్మను చూస్తూ గుడ్లలో నీళ్ళు కుక్కుకుంది.

***

          సింహాసనంలాంటి కుర్చీలో యువరాణిలా ఠీవిగా కూర్చున్న తుషారనే చూస్తున్నాను. పేరంటాళ్లు ఒక్కరొక్కరే వచ్చి చెంపలకు పసుపురాసి, కుంకుమ పెట్టి, వాయినాలు పుచ్చుకుంటున్నారు. ఒకసారి అప్రయత్నంగా నావంక చూసి నవ్వింది నా బంగారు తల్లి. అదిగో అప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు కూడా బుజ్జమ్మ ఇలానే నవ్వింది.

          “తీసుకోనా. మొన్ననే అమ్మినాను నా. నేను సొంతగా సంపార్చిన దుడ్లుబెట్టి కొనుక్కున్న బూమి అది. మేము ఇంగా నెల్లాళ్లు ఈ గుడిసిలోనే ఉంటాం. అనాకనే టౌన్లో ఇల్లు జూసుకుని చేరేది. నాదబావ మా  కుటుంబారానికి జేసిన సాయం గురిచ్చి నీకు తెలీదు. మాయమ్మ జెప్పింది. మా నాయిన తాగుబోతు అయి, ఆస్తిపాస్తులను తాగుడుకు, చీట్లపేకకూ దారబోస్తే, ఇడ్లీ అంగిడి బెట్టిచ్చి ఆదుకునింది నాదబావేనంట. కులం తక్కవని జూల్లా. ఎవురో ఏదో అనుకుంటారని ఎనకాడలా బావ.” బుజ్జమ్మ అప్పుడు చేతిలో పెట్టిన డబ్బుల కట్టతోపాటు ఆయమ్మి కల్మషంలేని నవ్వు కళ్ళలో మెదిలి, నా బంగారుతల్లి పెదవులపై మెరిసింది.

***

          “ఆయమ్మి చెడిపొయ్యింది నా.” అన్నాడు ఎంగటయ్య.

          మళ్ళీ నా నోట్లో మాటలు రాలా. అప్పటిదాకా ఊళ్ళో అందరు మనుసుల గురించీ పటాపటా అడిగేస్తూ ఆరాలు తీస్తూవున్న నోటికి తాళం పడిపోయింది. అసలు వాడు ఏమంటున్నాడో ఉన్నాడో అర్థంకాలేదు. ఒక ఆడది చెడిపోయింది అంటే, మా ఊళ్ళో ఏమని అర్థమో తెలుసు నాకు. నేనడిగింది వాడి చెల్లెలు బుజ్జమ్మ గురించి. ఏమని చెబుతున్నాడో అర్థం అవుతున్నదా వాడికి అసలు.

          “నేను అడుగుతున్నది, నీ చెల్లెలు బుజ్జమ్మ గురించిరా.” అన్నాను సైకిల్ కు స్టాండ్ ఏసి నిలబెట్టి. వెనక క్యారియర్ మింద బియ్యం మూట ఉంది. సాయిబు అంగడి దగ్గరనుంచీ వేసుకుని వస్తున్నాను ఈ మూటను. మేము మా ఊళ్ళో ఉండేకాలం నుంచీ పాత బస్టాండు మిట్ట కింద రోడ్డుకు ఆవార ఉండే సాయిబు అంగడిలోనే నాయినసామాన్లు కొనేది. తర్వాత టౌనుకు వొచ్చేసి, నాయిన వెళ్ళిపోయినా కూడా సాయిబు అంగడిని నేను వొదల్లేదు.

          “చెడిపోయిన దాని గురిచ్చి ఏం మాట్లాడేదినా? వొదిలేయ్. పరువు తీసేసింది లండీముండ ఊళ్ళో… ” పట్టలేని కసి, ఆగ్రహం, అసహ్యం వాడి గొంతులో.

          లోపల జరుగుతున్న వోణి ఫంక్షన్ నుంచి బయటకు వచ్చి, ఇంటి ముందు ఉన్న చెట్టు కింద కూర్చుంటే ఏడాది క్రితం టౌన్లో కనిపించిన ఎంగటయ్యతో జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది.

          “అదిగో, అక్కడ ఎవరో అమ్మాయి నీ గురించే అడుగుతున్నట్టు ఉంది చూడు గోపీ.” పక్కనే కూర్చున్న మావయ్య అన్నాడు చేత్తో భుజంమీద తట్టి.

          ఆలోచనల నుంచి బయటకు వచ్చి చూసి గతుక్కుమన్నాను. ఆ అడుగుతున్నది బుజ్జమ్మ.

          నాడు డబ్బు తీసుకుని వచ్చేస్తూ ఏదో మాటవరసకు పిలిచాడు ఫంక్షన్ కు రమ్మని. ఇప్పుడు నిజంగానే వచ్చేసింది.

          అటుఇటు చూశాను. అక్కడున్నవాళ్ళల్లో చాలామంది బుజ్జమ్మనే చూస్తున్నారు ఆసక్తిగా.

          ఖర్మ, ఇప్పుడు వీళ్ళకు ఏమని చెప్పాలి? నా పరువు ఎలా కాపాడుకోవాలి?

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.