
వ్యాధితో పోరాటం-34
–కనకదుర్గ
సర్జరీకి కావాల్సిన పరీక్షలు చేస్తున్నారు, రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వున్నాయా, లేవా అని చూస్తున్నారు. కానీ ప్రతి సారి అంతా బాగానే వుంది, స్టోన్స్ లేవు అనే చూపిస్తుంది. డాక్టర్స్ కి అనుమానం ఇంత జరుగుతున్నా గాల్ బ్లాడర్లో ఒక్క స్టోన్ కూడా లేకుండా ఎలా వుంటుంది అని. నా పరిస్థితిలో మార్పు లేదు. నా నొప్పి, డయేరియా, అప్పుడపుడు వాంతులు అవుతూనే వున్నాయి. నాలో ఒకరకమైన భయం, ఒకరకమైన ఉత్సాహం ….. భయమెందుకంటే సర్జరీ ఎలా జరుగుతుందోనని, ఉత్సాహం, త్వరగా సర్జరీ అయిపోతే ఇంటికెళ్ళి పిల్లలతో కల్సి ఉండొచ్చు. నాకు మా అమ్మ గుర్తొచ్చింది, మేము తెనాలిలో ఉన్నపుడు అమ్మకి గర్భసంచి తీసేసే సర్జరీ చేసారు, మేము తెనాలిలో అమ్మ హైద్రాబాద్లో. నాన్న ప్రతి కొన్ని వారాలకి లేదా నెలకోసారి ఒకొక్కళ్ళని తీసుకొచ్చి చూపించేవారు, అది నెల కాస్తా ఆర్నెల్లకి పైగా అవ్వడంవల్ల అమ్మకి ఓపిక నశించడం మొదలుపెట్టింది. ఇన్ఫెక్షన్ వచ్చి పెద్ద పుండయ్యి అంత సమయం పట్టసాగింది. అందుకని నాన్న తెనాలి నుండి హైద్రాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చేసారు. అమ్మా, నాన్న ఎంత కష్టపడ్డారో కదానిపించింది. ఒకటే దేశంలో కాబట్టి మా అత్తయ్యలు వచ్చి మమ్మల్ని చూసుకున్నారు. ఇక్కడ ఎవరున్నారు? పాపం శ్రీనివాసే అన్ని పాత్రలు పోషిస్తున్నాడు. నేను కొంచెం రికవర్ అయ్యాక తనని రెస్ట్ తీసుకోమ్మని చెప్పాలి.
సర్జరీ రెండ్రోజుల ముందు శ్రీని ఫోన్ చేసి అమ్మకి ఫోన్ చేయమన్నదని చెప్పాడు. నేను ఫోన్ చేసాను.
“చిన్నీ ఎట్లా వున్నావమ్మా?” గద్గదస్వరంతో అడిగిందమ్మ!
“నేను హాస్పిటల్లోనే వున్నానమ్మా! రెండ్రోజుల్లో సర్జరీ చేస్తామన్నారు.”
“రెండ్రోజుల్లోనేనా? నేనొద్దామనుకుంటున్నాను మరి, అప్పటిదాక ఆగరా?”
” ఇప్పటికే లేటయిందటమ్మా! నేనేమో పిల్లలతో కొన్నిరోజులుండి వచ్చి చేయించుకుందామనుకున్నాను, కానీ నొప్పి తగ్గటం లేదస్సలు. ఇంకా లేటయితే ప్రమాదం అంటున్నారు. నువ్వొస్తున్నావా? ఎట్లా? ఎప్పుడు? నీతో ఎవరన్నా వస్తున్నా రా?” అని ఆత్రంగా అడిగాను.
మా అక్కను, వదినను అడిగాను కానీ అమ్మని అడగలేదు ఎందుకంటే చలికాలం ఆమెకి ఆస్త్మా ఎక్కువొస్తుంది. ఇక్కడ చలికామె తట్టుకోలేదని అడగలేదు.
“పాస్పోర్ట్ కి అప్లై చేస్తున్నాం! నీ సర్జరీ రెండ్రోజుల్లోనే అయితే అక్కడ ఎవరన్నా ఉన్నారా మీకు సాయం చేయడానికి మరి?”
” కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారులేమ్మా! మరి నువ్వొక్కదానివే రాగలవా?”
” నేను వచ్చేటపుడు ఎయిర్పోర్ట్ లో అక్కడికి వచ్చే తెలుగువారెవరైన ఉంటారేమో చూద్దాం!”
” శ్రీనివాస్ పాస్పోర్ట్ కి అప్లై చేయడానికి కొంత సమాచారం కావాలన్నాడు, రాసు కుంటావా? నీ దగ్గర కాగితం, పెన్ ఉందా?” అని అడిగింది.
“ఒక్క నిమిషం.” అని నా బెడ్ పైన ఉన్న ఒక నోట్బుక్, పెన్ తీసుకున్నా, “సరే చెప్పమ్మా! రాసుకుంటాను.”
“నువ్వేం భయపడకమ్మా! నీకు తెల్సు కదా, నాకెన్ని ఆపరేషన్స్ అయ్యాయో! ఆపరేషన్ అయ్యింతర్వాత కొన్నిరోజులు కష్టంగా వుంటుంది. ఇంటికెళ్ళింతర్వాత రెస్ట్ తీసుకుంటే కోలుకుంటావమ్మా! భయపడకు తల్లీ. ఆ కనకదుర్గా దేవిని తల్చుకో అంతా మంచే జరుగుతుంది. జాగ్రత్త తల్లీ! పాప బాగుందా? చైతన్య ఎట్లా వున్నాడు? పిల్లలు జాగ్రత్త!” అంది అమ్మ.
“పిల్లలు బాగున్నారమ్మా! నాన్నని అడిగానని చెప్పు. నాకు చాలా సంతోషంగా వుందమ్మ నువ్వొస్తానంటే! కానీ సమయం పడ్తుంది, తొందరేం లేదు నిదానంగా రామ్మా!”
“శ్రీనివాస్ బాగున్నాడా? పాపం ఆయన ఒక్కడే అన్నీ ఎట్లా చేసుకుంటున్నాడో ఏమో? దేవుడిలా కాపాడుతున్నాడమ్మా మీ అందరినీ, చేతులెత్తి దండం పెట్టాలమ్మా ఆయనకు. సరే అమ్మా ఉంటాను. జాగ్రత్త తల్లీ.” అన్నది.
“సరే అమ్మా! డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిన తర్వాత ఫోన్ చేస్తాను.” అని ఫోన్ పెట్టేసాను.
అమ్మ వస్తుందంటేనే ఎంత సంతోషంగా ఉందో!
ఆ రోజు సాయంత్రం శ్రీని ఒక్కడు వచ్చాడు పిల్లల్ని జోన్ దగ్గర వదిలిపెట్టి. సర్జరీ గురించి కొంచెం భయంగా ఉన్నా అమ్మ వస్తుందన్న విషయమే నన్ను నిలవనీయడం లేదు.
“అమ్మ వస్తే ఎంత బాగుంటుంది కదా! నీకు కొంచెం బ్రేక్ దొరుకుతుంది. పిల్లలకు కూడా సంతోషంగా ఉంటుంది. అమ్మ ఉంటే ఎంతో ధైర్యంగా వుంటుంది. చిన్నపుడు మాకు జ్వరం వస్తే అమ్మని మా పక్కనే కూర్చోమనేవాళ్ళం. అమ్మ వంట పని, పూజ త్వరగా ముగించుకుని వచ్చి మా దగ్గరే కూర్చునేది. భోజనం కూడా మేము పడుకున్న రూమ్ లోనే కూర్చుని తినేది పాపం. అమ్మ నా వీపు పైన రాస్తుంటేనే పడుకునేదాన్ని. మా అక్కకి తలపై రాయాలి, మా తమ్ముడికి జో కొడితేనే పడుకునేవాడు. రెండ్రోజులకంటే ఎక్కువ రోజులు జ్వరం వుంటే నాన్న బ్యాంక్ కి సెలవు పెట్టి ఇంట్లో ఉండేవాడు. నాన్న ఎవరికి జ్వరమొస్తే వారి దగ్గర కూర్చొని తడి బట్టతో తుడవడం, మందులు వేయడం, పాలల్లో బ్రెడ్ వేసి బ్రతిమాలి తినిపించేవాడు. చైతన్యకి సంతోషంగా ఉంటుంది, స్ఫూర్తికి కొన్నిరోజులు టైం పడుతుంది అమ్మకి అలవాటవ్వడానికి……” అని శ్రీని వైపు చూసాను.
చిన్నగా నవ్వుకుంటున్నాడు.
“ఏమయ్యింది? ఎందుకు నవ్వుతున్నావు?”
“అమ్మ వస్తుందన్న ఆలోచనకే ఇంత ఆనందపడుతున్నావు, అమ్మ నిజంగా వస్తే…”
“అంటే అమ్మ రావట్లేదా?”
“మొట్ట మొదట పాస్పోర్ట్ రావాలి, ఆ తర్వాత వీసా కోసం వెళ్ళాలి. ఇవన్నీ అంత త్వరగా అయ్యే పనులు కావు కదా! మనం మాత్రం సీరియస్ గా ప్రయత్నం చేద్దాం. తప్పకుండా అన్నీ త్వరగానే రావొచ్చు. అమ్మ వస్తే అది చాలా పెద్ద సాయమవుతుంది మనందరికీ.” అన్నాడు శ్రీని.
“నాకు సర్జరీ గురించి తల్చుకుంటే భయంగా వుంది కానీ అమ్మ వస్తుందంటే ఎంత ఆనందంగా వుందో. సర్జరీ ఆలోచన కాసేపు రాకుండా కాసేపు వేరే ఏదైనా మాట్లాడు కుందామా?”
“అంటే ఎలాంటి విషయాలు?”
“అమ్మ వస్తే మనం కొన్ని ప్రదేశాలు చూడడానికి వెళ్దామా? అందరి ఇంటికి వాళ్ళ అమ్మలు వస్తే అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి తీసుకెళ్ళాం అని చెబ్తారు కదా! అలా మనం కూడా వెళ్దామా?”
శ్రీని ఏం మాట్లాడలేదు. టీ.వి చూస్తున్నాడు. “నేనింత సంతోషంగా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేమిటి?”
“ఏం మాట్లాడాలి?”
“అమ్మ వస్తే కొన్ని ప్రదేశాలు చూడడానికెళ్దామా? అన్నాను.”
“వెళ్దాం. పాప చిన్నది కదా! ముందు దగ్గర ప్రదేశాలకి వెళ్ళి పాపకి కార్ అలవాట య్యాక కొంచెం దూరం ప్రదేశాలకి వెళ్దాం!”
“నిజంగా! చాలా బావుంటుంది అమ్మతో బైటికి వెళితే.” అన్నాను. నా మనసులో ముందు అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళాలి? అమ్మకి గుళ్ళంటే ఇష్టం. అక్కడికి కూడా తీసుకెళొచ్చు! ఇలా అమ్మ కబుర్లతోనే కాలం గడిచిపోయింది శ్రీని వెళ్ళేవరకు.
నాతో స్నేహంగా మాట్లాడిన రెసిడెన్సీ చేస్తున్న డాక్టర్ అమ్మాయి వచ్చి చెప్పింది, ” ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సర్జరీ మిస్ డుర్గా! నేనొచ్చి చూస్తాను మీ సర్జరీ అయ్యాక…”
” సర్జరీ అయ్యాక ఇక్కడికే వస్తానా?”
” నో, నో. సర్జరీ అయ్యాక రికవరీ వార్డ్ వుంటుంది. అక్కడ వుంచుతారు, కొంత రికవర్ అయ్యాక సర్జరీ వార్డ్ లో రూంకి షిఫ్ట్ చేసేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. ఐ హోప్ ఎవ్విరిథింగ్ గోస్ వెల్!” అని చిరునవ్వుతో నా చెయ్యి స్నేహంగా నొక్కి వెళ్ళింది.
సర్జరీ రోజు రానే వచ్చింది. శ్రీని సర్జరీ అయ్యేదాక ఉంటానన్నాడు, అందుకని జోన్ కూడా శ్రీని వాళ్ళతో వచ్చింది. పిల్లల్ని చూడాలని అన్నాను నేను సర్జరీకి వెళ్ళేపుడు.
సర్జరీ సాయంత్రం ఎనిమిది గంటలకు. నేను సర్జరీ తర్వాత ఒక్కదాన్ని ఉండ లేనంటే జూలియా, పాన్క్రియాస్ నుండి స్టోన్స్ తీసినపుడు నాతో ఉన్న స్నేహితురాలు తను వచ్చి ఉంటానన్నది.
సర్జరీకి రెడీ చేసి స్ట్రెచర్ పైన ఆపరేషన్ ధియేటర్ కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళే దారిలో శ్రీని పిల్లలతో, జోన్, జూలియా అందరు నిల్చున్నారు. నేను లేచి కూర్చొని పాపని ఎత్తుకుని ముద్దుపెట్టుకుని గట్టిగా హత్తుకున్నాను. చైతుని దగ్గరికి తీసుకున్నాను, “ఆల్ ది బెస్ట్ అమ్మా,” అన్నాడు. నాకు కళ్ళల్లో నీళ్ళొచ్చాయి, చైతు నా చెయ్యి పట్టుకుని, ” ఏం కాదమ్మా! ఇదయిపోగానే ఇంటికి వచ్చేస్తావు.” అన్నాడు కానీ వాడి కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతున్నాయి. జోన్ వచ్చి నన్ను హత్తుకుని, “డోంట్ వర్రీ డియర్, ఎవ్విరిథింగ్ గోస్ ఓకే! కిడ్స్ విల్ బి ఓకే! ఆల్ ది బెస్ట్,” అని చెప్పింది. జూలియా కూడా నన్ను హత్తుకుని, ” డోంట్ వర్రీ హనీ! ఐ విల్ బి హియర్ వెన్ యు కం బ్యాక్,” అని బుగ్గల మీద ముద్దు పెట్టింది.
ట్రెయిన్ టైం అవుతుందని జోన్ పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి రెడీగా వుంది. “చిన్నీ, భయపడకు, అంతా బాగానే అవుతుంది.” అన్నాడు శ్రీని. కానీ తన మొహంలో కంగారు కన్పిస్తుంది.
నాకు ఏడుపొచ్చింది. ఇంత వరకు ధైర్యంగా వున్న నాకు సడన్ గా భయమేసింది. నేను మళ్ళీ వీళ్ళని చూస్తానా? శ్రీని పాపం ఒక్కడే ఎన్నిరోజుల నుండి కష్టపడుతున్నాడో. ఒకవేళ నాకేమన్నా అయితే… ఆ ఆలోచన రాగానే శ్రీని మెడలో చేతులేసి ఏడ్చాను. నర్స్ వచ్చి, “ఇట్స్ టైం టు గో ఇన్ సైడ్ మిస్ దుర్గా! హి విల్ బి హియర్ అన్టిల్ ది సర్జరీ ఈజ్ ఓవర్.
” అవును చిన్నీ భయపడకు. నీకు సర్జరీ చేసేవాళ్ళు మంచి సర్జన్స్. వాళ్ళు అంతా బాగానే జరుగుతుందని చెప్పారు కదా! ఏం కాదు. నేనిక్కడే ఉంటాను సర్జరీ అయ్యే వరకు. నిన్ను బయటకు వచ్చాక నేనొచ్చి చూస్తాను. సరేనా!” అని మెల్లిగా నా చేతులు తన మెడలో నుండి తీసాడు.
కొంచెం భయం, కొంచెం ధైర్యంతో మనసులో నాకు నేనే చెప్పుకుంటూ, ’పిల్లల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చింది నేను వాళ్ళ కోసం నేను బాగయ్యి వారి పెంపకంలో నేను పాలు పంచుకోవాలి.’ అని చెప్పుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళా.
సర్జన్లు డా. బార్బరా, డా. రిసాటో మరో ఇద్దరు అసిస్టెంట్ సర్జన్స్ ఉన్నారు.
డా. బార్బరా, “హాయ్ మిస్ డింగరి, హౌ ఆర్ యూ?”
“ఐ యామ్ స్కేర్డ్, డు యూ థింక్ ఐ యామ్ గోయింగ్ టు బి ఆల్రైట్?” కూడదీసు కుంటున్న ధైర్యం జారిపోసాగింది.
“అఫ్కోర్స్ డియర్! యువర్ గ్లాడ్ బ్లాడర్ ఈజ్ గుడ్, డా. కోవాల్స్కి చాలా స్టోన్స్ తీసేసారు, ఏవైనా చిన్న, చిన్నవి మిగిలి వుంటే అవి తీసేసి పాన్క్రియాటిక్ డక్ట్ ని ఓపెన్ చేసి దాన్ని చిన్న ప్రేగులకు కుట్టేస్తాం. ఇదంతా చేయడానికి నాలుగ్గంటలు పడుతుంది, ఒకవేళ ఏవైనా చిన్న కాంప్లికేషన్స్ వస్తే కాస్త లేట్ అవుతుంది అంతే! ఎనీ డౌట్స్, ఆర్ క్వశ్చన్స్?” డా. బార్బరా అడిగింది.
“నేను బ్రతుకుతానా?” అన్నాను.
“నువ్వు ఇంకా లేట్ డిసిషన్ తీసుకుని వుంటే అపుడు కొంచెం కష్టమయ్యేది కానీ ఇది పర్ఫెక్ట్ టైం ఫర్ ది సర్జరీ. డోంట్ వర్రీ వియ్ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ డియర్!”
అనస్థీషియాలజిస్ట్ వచ్చి నన్ను కొన్ని ప్రశ్నలు వేస్తూ నేను జవాబులు చెబ్తుండగా నన్ను ఒకటి నుండి యాభై వరకు నంబర్స్ లెక్కపెట్టమన్నాడు. సర్జన్స్ పొజిషన్స్ లోకి వచ్చి రెడీగా ఉన్నారు. అసిస్టెంట్ సర్జన్స్, నర్సులు రెడీగా ఉన్నారు. లెక్క పెడ్తుండగానే నా కళ్ళు మూసుకుపోయాయి.
నాకు కలలోలా గుర్తుంది డా. బార్బరా నాకు, శ్రీనికి చెప్పింది, “నేను ఓపెన్ చేయగానే మొదట కనిపించింది గాల్ బ్లాడర్ పూర్తిగా పాడయిపోయింది అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ స్టోన్స్. సో ఐ హాడ్ టు రిమూవ్ ఇట్ ఫస్ట్ దెన్ దేర్ వాజ్ ఏ బిగ్ స్టోన్ అబ్స్ట్రక్టింగ్ ది డక్ట్ సో వియ్ రిమూవ్డ్ ది స్టోన్ అండ్ సమ్ స్మాల్ స్టోన్స్అండ్ స్టిచ్డ్ ఇట్ టు ది స్మాల్ ఇంటెస్టయిన్స్. దట్స్ వై ఇట్ గాట్ డిలేడ్!” నేను మత్తులో ఉన్నాను. ఇదంతా తర్వాత శ్రీని మళ్ళీ చెప్పాడు.
నేను షార్ట్ రికవరీ వార్డ్ లో ఉన్నాను. నాకు తెలివి వస్తూ, పోతూ వుంది, అనస్థిషియా మత్తులోనే వున్నాను. గొంతులో ట్యూబ్ గుచ్చుకుంటుంది. కాసేపు మెలుకువ వచ్చి నపుడు, “నేనెక్కడ వున్నాను? గొంతులో ఇది గుచ్చుకుంటుంది, రిమూవ్ దిస్ ప్లీజ్!’’ అని అరుస్తున్నాను.
“యువార్ ఇన్ షార్ట్ రికవరీ రూం, యు విల్ గో టు సర్జరీ వార్డ్ ఇన్ ఫ్యూ హవర్స్….”
“ప్లీజ్ రిమూవ్ దిస్ … ” మాట్లాడితే నొప్పి లేస్తుంది. అరిచిన తర్వాత ఎందుకు అరిచానా అనుకుంటూ మత్తులోకి జారుకోవడం.
నర్స్ ఏదో స్ప్రే తీసుకొచ్చి నోరు తెరిచి స్ప్రే చేసింది గొంతులోకి. అది చేదుగా వుంది. నొప్పి తెలియకుండా మొద్దుబారడానికి స్ప్రే చేస్తారు. ఆ ట్యూబ్ డైరెక్ట్ గా నా గొంతులోనే వుందనుకున్నాను. కానీ ముక్కులో సన్న ట్యూబులు గుచ్చుకోవడం మొదలుపెట్టాయి. చాలా అసౌకర్యంగా వుంది. కడుపు దగ్గర కోసిన చోట నొప్పి తెలియడం మొదలుపెట్టింది. ఒక చెయ్యికి ఐ.వి, యాంటిబయాటిక్స్ , బ్లడ్ ఎక్కుతు న్నాయి. ఇవి అన్నీ మెలుకువ వచ్చినప్పుడు చూస్తున్నాను. ఇవన్నీ చూసి నాకు దీంట్లో నుండి భయపడతానని అనిపించలేదు. దాంతో ఒక రకమైన డిప్రెషన్ కి లోనయ్యాను. అదేదో చీకటి లోకంలో ఉన్నాను, దానిలో నుండి బయటపడ్తానని నమ్మకం పోయింది. ఆ వార్డ్ లో చాలా మంది నాలాంటి పేషంట్స్ ఉన్నారు. నర్సులు అందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒక్కసారిగా ఒంటరితనం నన్ను పూర్తిగా చుట్టేసినట్టయ్యింది. అక్కడెంతసేపున్నానో నాకు తెలియదు. మళ్ళీ కళ్ళు తెరిచేవరకు సర్జరీ వార్డ్ లో ఒక రూంలో ఉన్నాను.
సర్జరీ నొప్పి తెలియకుండా ఎపిడ్యురల్ పాచ్ వెన్నెముకలో పెడ్తారు. డెలివరీ అపుడు ఇచ్చారు పని చేసింది, ఇది రెండోసారి ఇలా చేయడం. ఇది మేజర్ సర్జరీ కాబట్టి నొప్పి తెలియకుండా ఎక్కువ డోసే ఇచ్చి వుంటారు. దానివల్ల సర్జరీ చేస్తే చాలా నొప్పి వుంటుంది అది కాకుండా వాళ్ళు అనుకున్నదానికంటే ఎక్కువ చేయాల్సి రావడం, ఎక్కువ సమయం పట్టడం వల్ల నొప్పి చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ రూంలోకి వచ్చినప్పటి నుండి సర్జరీ చేసిన చోట నొప్పి విపరీతంగా వుంది. నేను మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసాను. నా ఎడమ వైపు జూలియా నిల్చుని నన్ను చూస్తుంది. “హాయ్ డియర్, హౌ ఆర్ యూ ఫీలింగ్?” అని తల పై చెయ్యి వేస్తూ అడిగింది.
నాకు దు:ఖం ముంచుకొచ్చింది. ఎడమ చేతితో జూలియా చెయ్యి పట్టుకుని ఏడ్చేసాను.
“ఇట్స్ ఓకే డియర్! ప్రతి రోజు కొద్ది కొద్దిగా తేడా వుంటుంది. కొన్ని గంటలే కదా అయ్యింది సర్జరీ అయ్యి. కంగారు పడకు! నాకు తెల్సు కదా! రెండేళ్ళకోసారి స్మాల్ ఇన్టెన్ స్టయిన్స్ లో వచ్చే హెరిడెటరీ ఫైబ్రాయిడ్స్ తీసేయడానికి సర్జరీలు చేస్తునే వున్నారు గత ఎనిమిదేళ్ళుగా. తీసేస్తారు, మళ్ళీ వచ్చినపుడల్లా చేస్తారు. ఇపుడు నాకు తెల్సు కాబట్టి ఒకోరోజు గడవడానికి వేయిట్ చేస్తాను. టుమారో యూ విల్ ఫీల్ లిటిల్ బెటర్ దాన్ టుడే,” అని ప్రేమగా తల పై రాసింది.
నొప్పి భయంకరంగా ఉంది. ఎపిడ్యురల్ తో నొప్పి తెలియదు కాబట్టి నేను ధైర్యం గా ఉంటాననుకున్నాను. కానీ ఈ నొప్పి భరించలేకపోతున్నాను.
“జూలియా, ఇట్ హర్ట్స్ ఎ లాట్, ఐ కాంట్ టాలరేట్ దిస్ పేయిన్…” కన్నీళ్ళు కారిపోతున్నాయి. “కాన్ యూ ప్లీజ్ కాల్ ది నర్స్?”
” ష్యూర్ డియర్!” అని నర్స్ బటన్ నొక్కింది. ఐదు నిమిషాల్లో నర్స్ వచ్చింది.
” హాయ్ మిస్ డింగరి, వాట్ కాన్ ఐ డూ ఫర్ యూ?”
“ఇట్ హర్ట్స్ ఎ లాట్ నర్స్. హారబుల్ …. పేయిన్ ఇన్ ది బ్యాక్ ….అండ్ సర్జరీ సైట్…” అనస్థిషియా వల్లనో, గొంతులో ఉన్న ట్యూబుల వల్లనో మాట మెల్లగా, నిదానంగా వస్తుంది.
“ఎపిడ్యూరల్ పెట్టారు కదా! నొప్పి అంత ఎక్కువ ఉండకూడదు, చాలా మందికి నొప్పి తెలియదు బాగా నిద్ర పోతారు మొదటిరోజు అనస్థిషియా వల్ల.” అని బెడ్ కి ఎడమ వైపు వచ్చి, “నేను బెడ్ ని పైకి చేస్తాను…” అంటూ బెడ్ ని పైకి లేపే బటన్ని నొక్కింది. “ఇపుడు మీరు ఇటు వస్తారా?” అని జూలియాని ముందుకి రమ్మని, “నేను నెమ్మదిగా భుజాలు పట్టుకుని ముందుకి కొద్దిగా వంచుతాను. మీరు,” జూలియాతో, “తను ముందుకి తూలకుండా పట్టుకొండి, నేను ఎపిడ్యూరల్ సరిగ్గా ఉందో, లేదో చూస్తాను.” అని చెప్పి తను చెప్పినట్టుగానే చేసింది. నాకు ఆ కొంచెం కదలికకే గట్టిగా అరవాలన్నంత నొప్పి లేచింది.
“ఐ యామ్ సో సారీ డియర్! ఐ యామ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్….. హో హో… హు అందుకే అంత నొప్పిగా ఉంది…”
“వాట్ హాపెన్డ్.” అని అడిగింది జూలియా.
“ఎపిడ్యూరల్ కరెక్ట్ ప్లేస్ లో లేదు. కదిలినట్టుంది.” అని నన్ను జూలియా సాయం తో నిదానంగా మళ్ళీ పడుకోబెట్టింది.
“నేను అనస్థిషియా డిపార్ట్మెంట్ నుండి ఒకరిని వచ్చి చూడమంటాను…”
“మళ్ళీ ఇంకోటి పెడ్తారా… అది ఎంత సేపవుతుంది? ఐ యామ్ నాటెబుల్ టు టాలరేట్ దిస్ పేయిన్ ప్లీజ్…” మళ్ళీ దు:ఖం ముంచుకొచ్చింది.
” ఐ నో డియర్. నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి త్వరగా వచ్చి ఫిక్స్ చేయమని చెబుతాను….”
“ప్లీజ్ టెల్ దెమ్ అబౌట్ మై….”
“పేయిన్, అఫ్ కోర్స్..” అంటూ బయటికి పరిగెత్తింది.
“ఏంటి ఇలా అయ్యింది జూలియా?”
“సరిగ్గా పెట్టలేదో, సర్జరీ ఎక్కువ సేపు అయ్యింది కదా… అయినా ఇవి కొన్ని గంటల నుండి రోజులవరకు పనిచేస్తాయి. ఏం జరిగిందో వాళ్ళొచ్చి చూసి చెప్పేవరకు మనకు తెలియదు. ట్రై టు స్లీప్ లిటిల్ బిట్ డియర్,” అంది జూలియా.
మత్తుగానే ఉంది కానీ నొప్పి ఎక్కువయి నిద్ర పోనివ్వడం లేదు. ముక్కులో, గొంతులో ట్యూబ్ రబ్బర్ వాసనతో చాలా చికాకు కలిగిస్తున్నాయి. ఇంత అసౌకర్యంగా ఉంటుందని అనుకోలేదు. నాలుగు గంటలన్న సర్జరీ ఆరుగంటలైంది.
జూలియా పడుకోకుండా కూర్చొని ఉంది. నేను తనని పడుకోమన్నాను.
“వాళ్ళొచ్చి ఏం చెప్తారో చూసి పడుకుంటాను,” అంది.
అమ్మ గుర్తొచ్చింది. నాకు ఏ చిన్న జబ్బు చేసినా దగ్గరే కూర్చొని జాగ్రత్తగా చూసు కునేది. నాన్న కూడా అంతే. ఒకోసారి ముగ్గురికి ఒకేసారి జ్వరాలొచ్చేవి. అపుడు నాన్న బ్యాంక్ కి సెలవు పెట్టి ఇద్దరు కల్సి చూసుకునేవారు. అమ్మ దగ్గర ఉంటే ఎంత బాగుండేది. అసలు ఇంత దూరం ఎందుకొచ్చి పడ్డాము. కళ్ళు మూతలు పడ్తున్నాయి, కానీ ఏ పొజిషన్లో పడుకున్నా అసౌకర్యంగానే ఉంది. కాళ్ళు విపరీతంగా లాగేస్తున్నాయి. పీరియడ్ వచ్చే ముందర కాళ్ళు లాగుతాయి కదా! అలా లాగేస్తున్నాయి. లేచి నడవా లన్పిస్తుంది.
అసలు ఈ దరిద్రపు జబ్బు నాకెందుకొచ్చింది?
అరగంటయ్యాక కానీ అనస్థీషియా డిపార్ట్మెంట్ నుండి ఎవ్వరు రాలేదు. ఆ అరగంటలోపల నాలుగుసార్లు నర్స్ ని పిలిచాను. నాకు ఎవరు ఎపిడ్యూరల్ పెట్టారో తనే వచ్చింది. ఆమె వెనక చూసి, “ఓహ్ గాడ్! సారీ డియర్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్….”
“ఫిక్స్ చేయడానికి రాదా?” అన్నాను.
“నో, బయటకు వచ్చేసింది. అందుకే నీకు అంత నొప్పిగా ఉంది. సో సారీ! మేము పెషంట్స్ కి పేయిన్ తెలియకుండా ఇవి చేస్తాము. ఎప్పుడో ఒక్కసారి ఇలా అవుతుంది.”
నర్స్ వచ్చింది ఈవిడ ఏం చెప్తుందోనని.
” ఇది పని చేయదు, తీసేస్తాను. మార్ఫిన్ ఇంజెక్షన్ ట్రై చేయండి. లెట్స్ హోప్ ఇట్ వర్క్స్,” అంటూ బయటకు వెళ్ళి ఎపిడ్యూరల్ తీసేయడానికి కావాల్సిన సామాగ్రి తెచ్చుకుంది.
నర్స్ వచ్చి నన్ను బెడ్ పైకి చేసి కూర్చోబెట్టి నేను పడిపోకుండా పట్టుకుంటే అనస్థిటిస్ట్ ఎపిడ్యూరల్ మెల్లిగా తీయడానికి ప్రయత్నిస్తున్నది. నేను నొప్పి తట్టుకోలేక అరుస్తున్నాను. నర్స్, ” ఐ నో హనీ! వియ్ ఆర్ సో సారీ.”అని నన్ను కామ్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది.
పది నిమిషాల్లో తీయడం పూర్తయ్యింది.
బెడ్ మెల్లిగా క్రిందకి చేసి, “నేను మార్ఫిన్ ఇంజెక్షన్ తీసుకొస్తాను,” అని నర్స్ పరిగెత్తింది.
అనస్థీటిస్ట్ నాకు మరో పది సార్లు, “సారీ,” చెప్పి వెళ్ళింది.
నర్స్ మార్ఫిన్ ఇంజెక్షన్ ఐ.విలో ఇచ్చింది. “ఎంతసేపవుతుంది పని చేయడానికి,” అని అడిగా.
“ఐ.విలో ఇచ్చా కదా చాలా క్విక్ గా పని చేస్తుంది. ట్రై టు గెట్ సమ్ స్లీప్ డియర్.” అని జూలియాతో, ” తను పడుకుంటుంది, మీరు కూడా పడుకోండి కాసేపు. తెల్లవారి పోతుంది ఇంకొన్ని గంటలయితే,” అని చెప్పింది.
ఆమె బయటకు వెళ్ళి పది నిమిషాలయ్యిందో లేదో తల బద్దలయ్యేలా నొప్పి మొదలయ్యింది. నేను కళ్ళు గట్టిగా మూసుకొని పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
జూలియా నైట్ డ్రెస్ వేసుకుని పడుకోవడానికి రెడీ అవుతుంది.
నేను పడుతున్న బాధ సరిపోదన్నట్టుగా తలనొప్పి ఎక్కువవుతూ ఉంది నిమిష నిమిషానికి. నాకు తెలియకుండానే గట్టిగా అరిచేసాను, నా అరుపుకి నర్స్ వెంటనే పరిగెత్తుకొచ్చింది. “వాట్ హాపెన్డ్ డియర్?”
నేను ఏడుస్తున్నాను, ఆ ఏడుపుకి సర్జరీ నొప్పి, గొంతులో ట్యూబ్లు కదిలి వాంతికొ చ్చేలా ఉంది. అసలు నేను బాగవుతానా? అనే ఆలోచన వచ్చినపుడల్లా భయంతో వణుకొస్తుంది.
ఈ రాత్రి త్వరగా గడిచిపోతే బాగుండుననిపిస్తుంది. జూలియా నా గోలకి కంగారు పడిపోయుంటుంది.
నా తల పట్టుకుని, ” పగిలిపోతుంది, నాకు వాంతొస్తుంది. ట్యూబ్స్ ఆర్ హర్టింగ్,” అని చెప్పాను.
నర్స్ పల్స్ చూసింది. “గివ్ మి వన్ మినిట్, ఐ విల్ బి బ్యాక్,” అని బయటికి వెళ్ళింది.
పది నిమిషాల్లోపలే నైట్ డ్యూటి సర్జన్ తో వచ్చింది. ఆయన స్టెతస్కోప్ తో అంతా చెక్ చేసి, “ఒకటి నుండి పది వరకు మీ తలనొప్పి ఏ నెంబర్లో ఉంది?”
“పది కంటే ఎక్కువ,” అన్నాను.
“ఇది మార్ఫిన్ కి రియాక్షన్. తనకి పడలేదు ఆపేయండి….”
“మరి నా నొప్పి….” తల తిరిగిపోతుంది.
“నర్స్ తనకి నొప్పికి ఏ పేయిన్ మెడిసన్ ఇచ్చారు సర్జరీ కాకముందు అది ఫైల్లో చూసి చెప్పండి….”
“డెమొరాల్ ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్…” అంది నర్స్.
” ఓ ఓకే, అయితే అది మొదలు పెట్టండి…”
“ఇంత నొప్పికి అది పని చేస్తుందా?” అడిగాను.
“పని చేస్తుంది… ముందు నాజియాకి (వికారానికి) ఇంజెక్షన్ ఇవ్వండి, సో సారీ! యూ ఆర్ గోయింగ్ త్రూ సచ్ ఏ బాడ్ టైం.. బట్ యు విల్ ఫీల్ బెటర్ సూన్.” అని షేక్ హ్యాండిచ్చి వెళ్ళాడు డాక్టర్.
జూలియాకి నా బెడ్ పక్కన కిటికీ పక్కన ఒక చిన్న బెడ్ ఇచ్చారు. పాపం చాలా అలసిపోయుంటుంది.
నర్స్ వచ్చి మొదలు వికారానికి మందిచ్చి, కాసేపయ్యాక నొప్పికి మందిచ్చింది. గొంతులో ట్యూబ్ గుచ్చుకుంటుందన్న ప్రతిసారి, స్ప్రే చేసేవారు, అది చేదుగా ఉంటుంది కానీ కొన్ని నిమిషాలు మొద్దుబారుతుంది.
తెలతెలవారుతుండగా కళ్ళు మూతలు పడ్డాయి. మధ్యలో మెలుకువ వచ్చినపు డల్లా జూలియాని, “జూలియా, కొంచెం నా వీపు పైన మెల్లిగా రాయవా?” అని అడిగేదాన్ని.
నాకు అమ్మ గుర్తొచ్చేది తను మెల్లిగా వీపు పై రాస్తుంటే.
“యూ ఆర్ లైక్ మై మామ్ జూలియా,” అని అన్నానని ఆ రోజు మధ్యాహ్నం తన భర్త పాల్ కి చెప్తుంటే విన్నాను.
*****
(సశేషం)

నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.