
31 రోజుల నెల
31 का महीना
హిందీ మూలం – డా. లతా అగ్రవాల్
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
కాంత తన కష్టసుఖాలు నాతో చెప్పుకుంటూ ఉంటుంది. నేను కూడా వీలయినంత వరకు నా సఖీధర్మాన్ని నిజాయితీతో నిర్వహిస్తున్నాను. కాని ఇవాళ ఎందుకో ఏదో విషయాన్ని కాంత దాచటానికి ప్రయత్నిస్తోందని నాకనిపించింది. ఆమె ముఖంలో ఒక మొహమాటంలాంటిది కనిపించింది. తను మాటిమాటికీ పైకి మెట్లవైపు ఏకాగ్రంగా చూస్తోంది. అప్పుడే మనుమరాలు పింకీ కంచంలో అన్నం తీసుకుని క్రిందికి వస్తూ కనిపించింది.
“నాయనమ్మా! నాయనమ్మా! అమ్మ నీకోసం అన్నం పంపించింది. తిను.”
రింకూ కాంత చిన్నకొడుకు ఏకైక కుమార్తె. వాళ్లు పై అంతస్తులో ఉంటారు. నా స్నేహితురాలైనకాంత రామేశ్వర్ గారి భార్య. ఆయన ఒకప్పుడు కిరాణా షాపు నడిపేవారు. సుఖశాంతులతో నడుస్తున్న సమయం బహుశా దేవుడికి నచ్చలేదేమో. బాగా ఉన్న పచ్చని సంసారంలో పెనుతుఫాను వచ్చింది. రామేశ్వర్ గారు కుటుంబాన్ని విడిచిపెట్టి వైకుంఠమార్గాన్ని అనుసరించారు. భర్త లేకపోయాక ఆడదాని పరిస్థితి ఎవరికీ తెలియ నిది కాదు. కాలం మారింది. కాని ఎంతయినా… ఇతరుల నిర్లక్ష్యానికి గురికాక తప్పటం లేదు. నేను కాంత ముఖంలో తొంగిచూస్తున్న దిగులురేఖలని బాగా చూడగలుగుతున్నా ను. అసలువిషయాన్ని పట్టించుకోకుండా తను అంది- “రమా! కొన్నిరోజుల నుంచి మోకాళ్ళలో నొప్పి బాగా ఎక్కువగా ఉంది. అందువల్ల పైకి వెళ్ళి రావడానికి ధైర్యం చాలటంలేదు. అన్నంకంచం ఇక్కడికే తెప్పించుకుంటే బాగుంటుందనుకున్నాను. ఈ వయస్సులో మాటిమాటికీ పైకివెళ్ళి రాలేను. ఇప్పుడింక ఒకచోట కూర్చుని దేవుడిని తలుచుకుంటూ ఉండటం తప్ప నాకింకేం కావాలి.”కాంత చెప్పడానికి ఏదో చెప్పేసింది. కాని నాకెందుకో తను స్పష్టంగా కనిపిస్తున్న ఒక విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంద ని అనిపిస్తోంది.
“పదిహేను రోజులు రాజు ఇంటి నుంచి, పదిహేను రోజులు మన్నూ ఇంటి నుంచి అన్నం వస్తోంది….ఏదో బాగానే కాలక్షేపం అవుతోంది.”
“మరి 31 రోజుల నెల అయితేనో…” నేను నవ్వుతూనే ఈమాట అనేశాను. కాని అప్పుడే రింకూ చెప్పింది- “అయితే నాయనమ్మ ఉపవాసం ఉంటుంది.”
నేను రింకీ ముఖంవంక చూస్తూ ఉండిపోయాను. కాంత అయితే… ఏదో నేరం చేస్తూ పట్టుబడిపోయినట్లు, కత్తివాటుకి నెత్తురుచుక్క లేనట్లు, ఎవరో తనను పదిమందిలో అగౌరవపరచినట్లు… సంవత్సరాల తరబడి తను సంపాదించుకున్న ధనాన్ని ఎవరో దొంగిలించి తనను కటిక పేదరాలిగా చేసినట్లు కనిపించింది. నిజమే కదా… ఈనాటి వరకు కాంత ఎప్పుడూ తన ఇంటి గురించి, కుటుంబం గురించి ఏమయినా తన అదృష్టానికి ఇంట్లోవారి అశ్రద్ధకు లోనవుతూ ఉపేక్షించబడే పరిస్థితి వచ్చిందన్న రహస్యం తెలిసేలా ఎవరికీ ఏమీ చెప్పలేదు.
కాని ఈనాడు అమాయకురాలైన ఈ చిన్నపిల్ల ఒక్క క్షణంలో అన్ని రహస్యాలని విప్పి చెప్పేసింది.
కాంత కుటుంబంతో మా అనుబంధం ఆమె పెళ్ళి చేసుకుని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఉంది. మా యిద్దరి పెళ్ళిళ్ళు కేవలం నాలుగు నెలల ఎడంలోనే అయ్యాయి. మా ఇద్దరి భర్తలు మంచి స్నేహితులు కావడం వల్లనూ, మేమిద్దరం కూడా సమవయస్కులం కావడం మూలంగానూ మేము మంచి స్నేహితులమయ్యాం. కాని పెళ్ళి అయిన అయిదేళ్ళకే కాంత జీవితంలో తను ఎప్పుడూ ఊహించని ప్రభంజనం వచ్చింది. అప్పటి నుంచే తను తన అభిలాషలనూ, సంతోషాలను అన్నిటినీ కుటుంబం కోసం త్యజించింది. తన బాధలను తనలోనే దాచుకొని తన పిల్లలసంతోషాన్ని అన్వేషించ సాగింది. క్రమంగా ఆమె కాలాన్ని తనకు అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నిం చింది. ఆ ప్రయత్నంలో చాలావరకు కృతకృత్యురాలయింది కూడా. అది తపస్సు చేసే సమయం. భర్త లేకుండా రోజురోజుకీ పెరిగిపోతున్న ధరలను ఎదుర్కొంటూ ఇద్దరు పిల్లల బాధ్యతని నెరవేర్చింది. తన పిల్లలు రాజు-మన్నూల పెంపకమే తన తపస్సుగా భావించింది.
తండ్రి నీడని కోల్పోయిన కొడుకులు తగిన సమయానికి ముందే పెద్దవాళ్ళయి పోతారు. కాంత కొడుకులు కూడా తొందరగానే పరిస్థితులను అర్ధం చేసుకుని తల్లి బాధ్యతల్లో పాలుపంచుకోసాగారు. ఇప్పుడు కాంత కేవలం సాయంత్రం కిరాణా దుకాణం లో కూర్చుంటుంది. లేకపోతే రోజంతా ఇల్లు చక్కబెట్టుకోవడంలో నిమగ్నమై ఉంటుంది. కొడుకులు పెద్దవాళ్ళవడంతో కాంత కలలు కూడా పెద్దవి కాసాగాయి. ఇప్పుడింక తన కుటుంబం కూడా పెద్దది కావాలని తనకి అనిపించింది. తన ఇల్లు కూడా మనవళ్ళతో, మనవరాళ్ళతో పచ్చగా, నిండుగా ఉండాలి. ఆమె ఇంతవరకు తన కళ్ళలో చెదిరిపోయిన కలలని తన కొడుకుల కళ్ళలోనే నిలుపుకుంది.
కాలం కాస్త కలిసిరాగానే సంబంధాలు వాటంతట అవే రాసాగాయి. కాంత కొడుకులు కూడా ప్రయోజకులై జీవితంలోపైకి రాసాగారు. యుక్తవయస్సు వచ్చినవారు, సంపాదన పరులు కూడా అయ్యారు. అప్పటివరకు కాంతని, ఆమె కొడుకులని నిర్లక్ష్యంగా చూసిన వారి దృష్టి ఇప్పుడు వాళ్ళమీద కేంద్రీకృతమయింది. వీటన్నిటిపట్ల నిర్లిప్తంగా ఉన్న కాంత దృష్టి తన యింటి గౌరవమర్యాదలని కాపాడుతూ కులదీపాన్ని వెలిగించగలిగిన కోడళ్ళను అన్వేషిస్తోంది. పిల్లలు ఇప్పటివరకూ తల్లి చెప్పుచేతల్లో ఉండటంవల్ల ఏరోజు సంపాదన ఆరోజు కాంత చేతుల్లోకి వస్తోంది. ఒక్కొక్క రూపాయిని కూడబెట్టి, రాబోయే కోడళ్ళకోసం తను నగలు చేయించడానికి ప్రయత్నిస్తోంది. తన రంగుల ప్రపంచాన్ని ఆమె తన భర్త రామేశ్వర్ గతించినప్పుడే విడిచిపెట్టింది. ఇప్పుడింక తన ప్రపంచానికి చెందిన రంగులన్నీ తన ఇద్దరు కొడుకుల ప్రపంచంలో నిండిపోవాలన్నదే ఆమె కోరిక.
ఎంతో తీవ్రమైన అభిలాషతో, ఆసక్తితో కాంత ఒకరి తరువాత ఒకరిగా తన ఇద్దరు కొడుకులకి పెళ్ళి చేసేసింది. ఇద్దరు కోడళ్ళు వచ్చాక ఇంటి స్వరూపం మారిపోసాగింది. ఒకప్పుడు సంపదకి, సమృద్ధికి ప్రతీకగా ఉండే ఇల్లు ఇప్పుడు ఒక్కొక్కసారి మౌనంగా పోరాటం చేసే రణస్థలంగా మారింది. ఒక్కొక్కసారి ఇరుగు-పొరుగువారి కాలక్షేపానికి కారణంగా మారింది. వంట చేసుకునే విషయం నుంచి ఒక్కొక్కసారి చిన్నచిన్న విషయా లకి ఎప్పుడూ వాగ్వాదం నడుస్తూనే ఉండేది. ఇప్పుడింక కాంత ఏం చెయ్యగలుగుతుంది. ఎవరిపక్షాన మాట్లాడినా లేదా ఎవరిది తప్పు అని చెప్పినా వాళ్ళకే తను చెడ్డదైపోతుంది. చిన్న-చిన్న తగువులు రాజు-మన్నూల మధ్య అవుతూనేఉంటాయి. వాళ్ళిద్దరినీ తను అధికారపూర్వకంగా కోప్పడుతూనే ఉండేది…ఏది ఏమయినా వాళ్ళు తన కొడుకులు… ప్రేమతోబాటు కొట్టడానికి, చివాట్లు పెట్టడానికి కూడా తనకి అధికారం ఉండేది. కాని కోడళ్ళు పరాయి ఇంటి నుంచి వచ్చినవాళ్ళు. కాంత వాళ్ళని మనసారా స్వీకరించింది. కాని సంజన, వర్ష కళ్ళలో ఆమెకి ఎప్పుడూ తనపట్ల ఆత్మీయత కనిపించలేదు. తను కూడా వాళ్ళకి అధికారపూర్వకంగా ఏమయినా చెప్పడానికి జంకేది.
ఎంతో కష్టంతో కుటుంబవాహనం గాడిమీదకి వచ్చింది. కాని మరొకసారి మళ్ళీ గతుకుల దారుల్లో ఎగిరెగిరిపడసాగింది. రామేశ్వర్ గారు దివంగతులైన తరువాత కూడా ఇంట్లో ఇప్పుడున్నంత అశాంతి నెలకొనలేదు… దీనికి కారణం ఆ సమయంలో సద్బుద్ధి అనేది విడిచిపెట్టకుండా తోడుగా ఉంది. కొడుకులు తల్లి చెప్పిన ప్రతిమాటని వినేవారు, ఆచరించేవారు. ఇప్పుడు ఆ పిల్లలే పెళ్ళిచేసుకుని గృహస్థులయ్యారు. అందువల్ల కాంత తన కొడుకులతో కూడా ఏమైనా చెప్పాలంటే భయపడుతోంది. బహుశా ఇప్పుడు ఆమెకి పిల్లల కళ్ళలో తనపట్ల వెనుకటి ఆ గౌరవభావం కనిపించడం లేదు. తనుమాత్రం విడువకుండా బంధుత్వాలలో ఆర్ద్రత ఉండేలా జాగ్రత్తపడుతోంది. కాని కొడుకులూ, కోడళ్ళ వ్యవహారంతో ఇంటి వాతావరణంలో వచ్చిన శుష్కతని, ప్రేమరాహిత్యాన్ని తను అరికట్టలేకపోయింది. చూస్తూ ఉండగానే ఇల్లు ఒక యుద్ధరంగంగా మారింది. తిరుగు బాటు ధోరణితో ఉన్న ముళ్ళమొక్కలు ఎన్నో అక్కడ మొలిచాయి. ఇప్పుడు శరీరాలు మాత్రమే కాక మనస్సుల మధ్య కూడా దూరం పెరిగిపోతోంది. ఇదొక్కటే మిగిలింద న్నట్లు ఇద్దరు కొడుకుల అత్తవారిళ్ళవారి జోక్యం పెరిగిపోసాగింది. ఆ కురుక్షేత్రంలో ఇప్పుడు కాంత మనస్సు కూడా లగ్నం కావడంలేదు. కాని తను మాత్రం ఏం చెయ్యగలదు..? తను వేరే ప్రపంచం ఏదీ ఏర్పరుచుకోలేదు. తన దేవాలయం… తీర్థ స్థలం… సంఘం… అన్నీ ఈ ఇద్దరు కొడుకుల చెంతనే ఉంది.
ఆమె కుటుంబానికి ఎవరి దిష్టి తగిలివుంటుందా అని అనుకుంటాను…. ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా తను ఏర్పరుచుకున్న ఈ పూలతోటలో ఎలాగో కలుపుమొక్కలు మొలిచాయి. మానసికంగా ఏర్పడిన ఈ దూరాలని తొలగించడానికి కాంత తనవైపు నుంచి పూర్తిగా ప్రయత్నించింది. కాని చేరువకావడానికి కావలసిన సాధ్యపడే అవకాశాలు అన్నీ ముగిసిపోయాయి. అవకాశాలకోసం, అనుకూల పరిస్థితుల కోసం మనస్ఫూర్తిగా ప్రయత్నించినప్పుడే అవికూడా వృద్ధి చెందుతాయి. ఇప్పుడింక తన యింట్లో బంధుత్వాల గోడలకి చెదలుపట్టేశాయని కాంత కూడా నిస్పృహచెంది అంగీకరించింది. తను లోలోపలే శూన్యతతో నిండిపోయింది. ఏదయినా వస్తువు అయితే దాన్ని ఎండలో ఎండబెట్టి చెదలని పోగొట్టడానికి ఏమయినా కొంత ప్రయత్నం చేసేది. కాని ఇది మనస్సులో ఏర్పడిన ఒక కందకం. దీన్ని నింపడం ఇంక తన వశం కాదు. గుండెల మీద బండరాయి పెట్టుకుని తను వాళ్ళిద్దరికీ వంటావార్పులకి వేరువేరుగా ఏర్పాటు చేసింది. సంజనకి, వర్షకి వాళ్ళ మనోరథం నెరవేరినట్లయింది. కాని ఇప్పుడు తను ఏం చెయ్యాలో కాంతకి అర్థం కావడంలేదు. అప్పుడే ఆమె ఇద్దరు కొడుకులూ అన్నారు- “నువ్వెందుకు బాధ పడతావమ్మా? నువ్వు విశ్రాంతిగా కూర్చుని భగవన్నామస్మరణ చేసుకో. నీకేం కావాలో ఏర్పాటు చేయడానికి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కదా…. ”
కాంత ఏం చెబుతుంది… తినడానికి ఆకలి అనేది ఎక్కడ మిగిలింది… ఇప్పుడింక ఈ శరీరాన్ని సజీవంగా ఉంచడానికే తినాలి. అప్పుడే వర్ష వెంటనే అంది- “అవును అత్తయ్యగారూ! ఆయన అంటున్నది నిజమే… మీరెందుకు దిగులు పడతారు? పదిహేను రోజులు బావగారి యింట్లోనూ, పదిహేను రోజులు మా యింట్లోనూ మీ భోజనానికి ఏర్పాటు చేసుకోవచ్చును. మీరు ఇప్పుడింక పైకి రావడానికి కూడా ఇబ్బంది పడక్కరలేదు…. నేను మీకు అన్నంకంచం పంపిస్తూ వుంటాను.”
ఇది వినగానే కాంతకి తను ఏ స్థితిలో ఉన్నానన్న వాస్తవం తెలిసిపోయింది. ఎదురుగా వున్న కొడుకులు అమ్మ పంపకాన్ని చూస్తూ నిలబడిపోయివున్నారు. ఒక తల్లికి ఇంతకన్నా దౌర్భాగ్యపు పరిస్థితి మరొకటి ఏముంటుంది…? తనవంతు తిండికూడా పిల్లలకి తినిపించిన తమ తల్లి తిండికోసం ఆ పిల్లలే వాటాలు వేసుకుంటున్నారు.
అవసరాలు, ఆనవాయితీలు కాలంతోపాటే ఏర్పడుతూ వుంటాయి, నడుస్తూ వుంటాయి. ఈ యింట్లోకూడా ఇప్పుడు నవతరం తన కొత్త పద్ధతులని అమలులోకి తీసుకువచ్చింది. పదిహేను రోజులు కాంత రాజు ఇంటి నుంచి అన్నంపళ్ళెం కోసం ఎదురుచూస్తుంది, పదిహేను రోజులు మన్నూయింటి నుంచి ఎదురుచూస్తుంది… తన భర్త తనను అర్ధంతరంగా విడిచి వెళ్ళిపోయాడు. కొడుకులు తనని కోడళ్ళ దయా దాక్షిణ్యాల మీద విడిచిపెట్టేశారు. కాని కాంత తన ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు. కోడళ్ళ వంటిళ్ళలోకి తను ఎప్పుడూ తొంగికూడా చూడలేదు.
ఇంక ముఫ్పైఒకటి రోజుల నెల వచ్చేసింది… ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం కూడా అయింది. కాని అంతవరకూ సంజనకాని, వర్ష కాని అన్నంకంచం పంపించలేదు… బహుశా మరిచిపోయి ఉండవచ్చు. కాంత మనవడిని, మనవరాలిని పిలిచింది.
“ఏమిటి నాయనమ్మా?” విజయ్ కొడుకు రజత్, సంజయ్ కూతురు రింకూ వెంటనే అక్కడికి వచ్చారు.
కాంత అడిగింది, “ఏమర్రా పిల్లలూ, మీరు అన్నాలు తిన్నారా?”
“తినేశాం నాయనమ్మా! ఎప్పుడో… మరి నువ్వు…? ఇవాళ వర్ష పిన్ని పరమాన్నం చేసింది.” రజత్ చెప్పాడు-“పరమాన్నం చాలా బాగుంటుంది కదా నాయనమ్మా…?”
మళ్లీ రజత్ అన్నాడు, “అరే! ఇవాళ వర్ష పిన్ని పంపించాలి కదూ నాయనమ్మకి అన్నం…?”
కాంత ఆ పిల్లలిద్దరి ముఖాలనూ చూస్తూ ఉండిపోయింది. తనకి తాను ఏదో అవమానం జరిగినట్లు అనుభూతి చెందుతోంది… పిల్లలని తిన్నగా చూస్తూ మాట్లాడటా నికి ధైర్యం చాలటంలేదు. ఏదో తప్పు తనే చేసినట్లుగా ఉంది. వెంటనే తను అంది- “పిల్లలూ, ఇవాళ నేను అన్నం తినను.”
“ఎందుకని నాయనమ్మా…?”
“ఎందుకంటే ఇవాళ నేను ఉపవాసం ఉన్నాను.”
అమాయకులైన ఆ పిల్లలకి ఆ మాటల్లోని గూఢమైన అర్థం ఎలా తెలుస్తుంది. వాళ్ళు నవ్వుకుంటూ, ఆడుకుంటూ అక్కడనుంచి వెళ్ళిపోయారు.
కాంతకి తను మరోసారి నిరాశ్రితురాలినయినట్లుగా అనిపించింది. ఆ రోజులా తను ఇంత తలవంపును అంతకుముందు ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈనాడు…తను ఇద్దరు కొడుకులకి తల్లి అయివుండి కూడా రెండుపూట్లకి తిండికి లెక్క చూసుకుంటున్నారు. కోడళ్ళని తను ఏమనగలదు, వాళ్ళు పరాయి ఇంటి నుండి వచ్చారు… కాని కొడుకులు తనవాళ్ళే కదా… వాళ్ళు ఎప్పుడూ తల్లి ఎదురుగా లేకపోతే తిండి తినేవాళ్ళు కాదు. తల్లి అన్నం తిన్నదా లేదా అనికూడా ఈరోజున వాళ్ళకి అసలు ఏమాత్రం చింత లేదు.
క్రమంగా కాంతకి ప్రతి 31వ రోజున ఉపవాసం చేయటం అలవాటయిపోయింది.
ఈనాడు ఆ కాంతకే పన్నెండో రోజు. ఇంట్లో నుంచి వంటకాల ఘుమఘుమలు వస్తున్నాయి. ఇద్దరు అన్నదమ్ములూ పురోహితులు చెప్పినవన్నీ అందిస్తున్నారు. లోకం ఏర్పరిచిన సంస్కారాలను నెరవేరుస్తున్నారు. అంతకన్నా చాలా ఆశ్చర్యం కలిగించే సంగతి ఏమిటంటే ఇద్దరు కోడళ్ళు ఇవాళ ప్రతివిషయంలోనూ ఏకాభిప్రాయంతో తగువు లు, జగడాలు అన్నీ మరిచిపోయి పనిలో నిమగ్నమై వున్నారు. కాంత పేరుతో ఒక బ్రాహ్మణ స్త్రీకి భోజనం తినిపిస్తున్నారు. వాళ్ళ ఇటువంటి ఐకమత్యాన్ని చూడటానికే కాంత కళ్ళు తపించాయి. నిజంగా! ఇది ఒక జడమైన, నిర్జీవమైన భావాలు కలదేశం. ఇక్కడ బ్రతికివున్న మనిషిని బ్రతకనీయకుండా జీవన్మృతుడిగా చేస్తారు. ఆ వ్యక్తి మరణించిన తరువాత ఆ మనిషి పేరుతో లేనివన్నీ ఉన్నట్లుగా చూపిస్తారు. ప్రాణం వున్నన్నాళ్ళూ భయపడుతూ బతకాలి. కాని, నిర్జీవమైపోయాక ప్రేమని చూపిస్తూ ప్రత్యేకమైన వంటకాలు చేస్తారు. ఈ సామెతని ఎవరో జీవితంలోని లోతైన అనుభవంతో చెప్పివుంటారు.
పురోహితులు చెప్పిన విధంగా ఇద్దరు కోడళ్ళు గోగ్రాసం, కాకి గ్రాసం ఆకుల్లో పెట్టి అందించారు. నన్ను కాంతకి అందరికన్నా ప్రగాఢమైన స్నేహితురాలిగా భావిస్తారు కనుక కోడళ్లూ, కొడుకులూ, ఎప్పుడూ నన్ను కంటిలోని నలుసులా చూసేవారు. కాని ఇవాళ అంటున్నారు- “అమ్మగారూ, ఏమయినా లోపం ఉంటే చెప్పండి…మా అత్తగారికి ఇష్టమైనవన్నీ చేయించాము. మా వైపు నుంచి మేము పూర్తిగా ఏలోటూ లేకుండా ఉండాలని ప్రయత్నించాం.”
రాజు-మన్నూ కూడా “పిన్నిగారూ! ఏమయినా లోటు ఉంటే చెప్పండి.”… నేను మాత్రం ఏం చెబుతాను…నాయనా, ఉన్న లోటును మీరు ఎప్పటికీ తీర్చలేరు. ఏ ఆడది మీకు తన కొంగులో నీడని ఇచ్చిందో, తన వంతు నిద్రని ఇచ్చిందో, తన సుఖసంతోషా లని త్యాగం చేసి తనకి ఉన్నవన్నీ మీకు సమర్పించిందో.. వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఈ లోకంలో మీరు తండ్రి లేకపోయినా మీకాళ్ళ మీద మీరు నిలబడగలిగారు… ఈ రోజున ఎవరికి మీరు బ్రతికి ఉండగానే రెండుపూట్ల భోజనానికి పంపకం పెట్టారో ఆ ఆడదాని కారణంగానే మీరు ఈ స్థాయిలో ఉన్నారు. కాని ఇలా చెబుదామనుకున్నా నేను ఏమీ చెప్పలేకపోయాను. కేవలం ఇదే అనగలిగాను- “రాజూ-మన్నూ! మీరిద్దరు
అన్నదమ్ములూ కలిసి ఈ విస్తరాకు పైకి తీసుకువెళ్ళి కాకులని పిలిచి తినిపించండి. కాకులు ఎంగిలి చెయ్యడం చాలా అవసరం. అంతేకాక సంజనా-వర్షా! మీరు ఈ గోగ్రాసాన్ని బయటికి తీసుకువెళ్ళి ఆవుకి తినిపించి రండి. దీనివల్ల దివంగత వ్యక్తికి తృప్తి కలుగుతుందని నమ్మకం ఉంది. తనకి పరలోకంలో భోజనం దొరుకుతుంది.”
సంజన, వర్ష ఆ వీధి అంతా తిరిగి వచ్చారు…
“అమ్మగారూ! వీధిలో ఎంతదూరం చూసినా ఆవు కనిపించలేదు.” అప్పుడే కొడుకు లిద్దరూ కూడా పైనించి కిందికి దిగి వచ్చారు. “చాలాసేపు కావ్ కావ్ అని పిలిచాం… కాని ఒక్క కాకికూడా కనిపించలేదు.” అని చెప్పారు.
పంతులుగారు అన్నారు- “ఆవుకూడా తినకపోవడం, కాకికూడా తినకపోవడం ఏమీ మంచి శకునం కాదు.”
అంటే దాని అర్థం మరణించిన వ్యక్తి భోజనాన్ని స్వీకరించలేదన్నమాట.
చాలా సేపు నుంచి అందరి మాటలు వింటున్న రింకూ-రజత్ లు అన్నారు- “అరే! అదికాదు పంతులుగారూ, ఇవాళ 31 తారీకు కదా! …ఈ రోజున నాయనమ్మకి ఉపవాసం… అందుకని…”
***
డా. లతా అగ్రవాల్ – పరిచయం
26 నవంబరు 1966 న షోలాపూర్, మహారాష్ట్రలో జన్మించిన డా. లతా అగ్రవాల్ `తులజ’ ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, విద్యావేత్త. ఎన్సిఇఆర్టీ, భోపాల్ లో లెక్చరర్ గా, వైష్ణవ యూనివర్సిటీ, ఇండోర్ లో బోర్డు మెంబరుగా, భోపాల్ యూనివర్సిటీకి అనుబంధసంస్థ అయిన మిత్తల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, భోపాల్ కి ప్రిన్సిపాల్ గా, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో కౌన్సెలర్ గా సేవలందించారు. వీరి రచనలు ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రసారితమయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వీరి పుస్తకాలు 16 విద్యకి సంబంధించినవి, 7 కవితాసంకలనాలు, 12 బాలసాహిత్యం, 5 కథాసంకలనాలు, 7 మినీకథాసంకలనాలు, 3 నవలలు, 4 సమీక్షాగ్రంథాలు, 20 నాటికలు, 1 ఇంటర్ వ్యూల సంకలనం ప్రచురితమయ్యాయి. హిందీ కల్చరల్ ఆర్గనైజేషన్, టోక్యో, జపాన్ నుంచి `కళాశ్రీ’ సన్మానం, మారిషస్ హిందీ సాహిత్య అకాడమీ నుంచి `హిందీ సాహిత్యరత్న’ సన్మానం తో సహా అంతర్జాతీయ స్థాయిలో 4 సన్మానాలు పొందారు. 2 సార్లు కమలేశ్వర్ స్మృతి పురస్కారంతోబాటు జాతీయస్థాయిలో ఇంచుమించు 60 కన్నా ఎక్కువగా పురస్కారాలతో సన్మానింపబడ్డారు. ఉత్తమసాహిత్యసృజనకు 14 రాష్ట్రాలనుంచి సత్కారం పొందారు. డా. లతా అగ్రవాల్ భోపాల్ వాస్తవ్యులు.
*****

బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.