ఆమె దేవత

 (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– సురేష్ బాబు

ఆమె దేవత…!
ఆమె నింగిని ముద్దాడిన చోటే
వెన్నెల పుట్టింది
ఆమె చూపుల అమ్ము తగిలి
నేల గుండె నిలువునా
పులకలు పొడిచే పచ్చని కోరిక పుట్టుకొచ్చింది

ఆమె నీలికళ్ళ నీడ
నేల అద్దంలో సంద్రమై పొంగింది
ఆమె నవ్వుకు చీకటి తెర తూట్లుపడి
చుక్కల జననం జరిగింది

గాలి కెరటాలపై తొలి పాట పల్లవి
మోసుకొచ్చిన ఆనవాలు
ఆమె గొంతు లోనిదే
ఆమె అడుగుల కదలికల అల్లికే లాస్యం
మహికి కళను అద్దిన మహిళ
ఆమె దేహమైన సందోహం

ఋజువు కావాలా
పసిపాప పాదాల కింద
గంధమై మురిసిననేలనడుగు
ఆడపిల్ల పరికిణీ అద్దమై
అమరిన నింగినడుగు
యువతి సిగలో కలల కర్పూరం
పూలుగా పరిమళించిన కాంక్షనడుగు

నేల చుట్టుకున్న పచ్చనాకు కన్నా
నింగి కప్పుకున్న ఉదయ సంధ్యల కన్నా
పాపలను పాలించి మహిళగా గర్వపడే
చీర గుండె చప్పుళ్ళనడుగు
మీసాల మోసాలకు ఓడిపోయినా
మమకారపు వానగా కురిసి
గొంతు తడిపే ముసలి అమ్మనడుగు
ఆమె దేవత..

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.